ఫిన్‌సెన్ ఫైల్స్: ఖనానీ.. దావూద్ ఇబ్రహీం నుంచి అల్ ఖైదా, జైషే మహమ్మద్‌ వరకు అందరి లావాదేవీలు నడిపిన పాకిస్తానీ

దావూద్ ఇబ్రహీం

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, దావూద్ ఇబ్రహీం

భారత్ నుంచి పరారైన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అల్ ఖైదా, జైషే మహహ్మద్ లాంటి మిలిటెంట్ సంస్థల లావాదేవీలన్నీ నడిపించిన అల్తాఫ్ ఖనానీ మనీ లాండరింగ్ నెట్‌వర్క్ గుట్టు తాజాగా వెల్లడైన ‘ఫిన్‌సెన్ ఫైల్స్’లో బట్టబయలైంది.

మనీ లాండరింగ్‌ కార్యకలాపాలపై విచారణలు జరిపే అమెరికా సంస్థ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (ఫిన్‌సెన్) పరిశీలించిన అనుమానాస్పద కార్యకలాపాల నివేదికలు (ఎస్‌ఏఆర్) తాజాగా లీక్ అయ్యాయి. వీటిని 'ఫిన్‌సెన్ ఫైల్స్' అని పిలుస్తున్నారు.

ఫిన్‌సెన్‌కు చెందిన వేల ఎస్ఏఆర్‌లను ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ బయటపెట్టింది. ఐసీఐజేతో బీబీసీ కూడా కలిసి పనిచేస్తోంది.

ఫిన్‌సెన్ ఫైల్స్ ద్వారా అనేక రహస్య పత్రాలు బయటకు వచ్చాయి. నేరస్థులను పెద్ద బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలను ఎలా చేసుకోనిచ్చాయన్న విషయాలు వీటిలో వెలుగుచూశాయి.

పాకిస్తాన్ నుంచి దుబయి, అమెరికా వరకూ వ్యాపించిన ఖనానీ నెట్‌వర్క్‌ వివరాలు ఈ ఫైల్స్‌లో వెల్లడయ్యాయి.

అల్తాఫ్ ఖనానీ పాకిస్తాన్ పౌరుడు. ఆయనే ఈ నెట్‌వర్క్‌ను నడిపించారు. దావూద్ ఇబ్రహీంకు మనీ లాండరింగ్ చేసినవారిలో ప్రధాన వ్యక్తిగా ఖనానీని భావిస్తారు.

న్యూయార్క్‌కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు తరఫున దాఖలైన ఎస్ఏఆర్‌ను ఐసీఐజేలో భాగమైన భారత దినపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' విశ్లేషించింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన ఎస్ఏఆర్‌... డ్రగ్స్ మాఫియా ముఠాలతోపాటు తాలిబన్, అల్‌ఖైదా లాంటి మిలిటెంట్ సంస్థల కోసం ఖనానీ దశాబ్దాలపాటు 14 నుంచి 16 ట్రిలియన్ డాలర్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. ఖనానీ నడిపిన ఈ నెట్‌వర్క్‌కు అమెరికా అధికారులు 'మనీ లాండరింగ్ ఆర్గనైజేషన్' (ఎంఎల్‌ఓ) అని పేరు పెట్టారు.

అంతర్జాతీయంగా సాగిన విచారణ తర్వాత 2015 సెప్టెంబర్ 11న పనామా ఎయిర్‌పోర్టులో ఖనానీ అరెస్టయ్యారు. ఆయన్ను అమెరికాలోని మయామీ జైల్లో వేశారు. నిర్బంధం ముగిశాక, 2020 జులైలో ఆయన విడుదలయ్యారు.

ఖనానీని అరెస్టు చేసిన తర్వాత ఆయనపై ఆంక్షలు విధించినప్పుడు, దావూద్ ఇబ్రహీంతో ఖనానీకి సంబంధాలున్నాయంటూ అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) కొన్ని పత్రాలు వెల్లడించింది.

''ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్లు, నేరస్థుల ముఠాలకు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ నిధులు సమకూర్చేందుకు వివిధ ఆర్థిక సంస్థలతో తమకున్న సంబంధాలను ఖనానీ నడిపిన ఎంఎల్‌ఓ వాడుకుంది. ఎంఎల్ఓ, అల్ జురానీ ఎక్చేంజ్‌ల హెడ్ అల్తాఫ్ ఖనానీ తాలిబన్ల వరకూ నిధులను చేర్చారు. లష్కర్ ఏ తొయిబా, దావూద్ ఇబ్రహీం, అల్ ఖైదా, జైషే మహమ్మద్‌లతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి'' అని ఓ నోటీసులో పేర్కొంది.

ఖనానీ అరెస్టును భారత దర్యాప్తు సంస్థలు అప్పట్లో పెద్ద విజయంగా చూశాయి. దావూద్ ఇబ్రహీంతోపాటు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి మిలిటెంట్ సంస్థలతోనూ నేరుగా అల్తాఫ్ ఖనానీకి సంబంధాలున్నట్లు అమెరికా ప్రకటించడమే దీనికి కారణం.

ఫిన్‌సెన్

ఖనానీపై ఆంక్షలు ప్రకటిస్తూ ఆ నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత, 2016 అక్టోబర్ 10న ఖనానీ గురించి, ఖనానీ ఎంఎల్‌ఓతో సంబంధాలున్న ఇంకొందరు వ్యక్తుల జాబితా గురించి ఓఎఫ్‌ఏసీ వివరాలు వెల్లడించింది. ఆ జాబితాలో ఖనానీ కుటుంబ సభ్యుల్లో కొందరు, కొన్ని 'సంస్థల' పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఉంటూ వీళ్లు ఖనానీ మనీ లాండరింగ్ నెట్‌వర్క్ నడిపేందుకు తోడ్పడ్డారని ఓఎఫ్‌ఏసీ పేర్కొంది.

ఇక సంస్థల పేర్లలో ప్రధానంగా దుబయిలో ఉన్న మజాకా జనరల్ ట్రేడింగ్ లిమిటెడ్ సంస్థ పేరు ఉంది.

ఫిన్‌సెన్ ఫైల్స్‌లో ఖనానీ ఎంఎల్‌ఓ ప్రస్తావన వచ్చింది. 'మాస్కో మిర్రర్ నెట్‌వర్క్‌'లో ఎంఎల్ఓ ఆర్థిక మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ ఫైల్స్ వివరించాయి.

మనీ లాండరింగ్‌కు 'మిర్రర్ ట్రేడింగ్'‌ను ఉపయోగించుకున్నారు. ఇది ఓ అనధికార వ్యాపార పద్ధతి. ఇందులో ఓ వ్యక్తి గానీ, సంస్థ గానీ వాటాలు కొనుగోలు చేసి, ఏ ఆర్థిక లాభం లేకుండా మరో చోట అమ్ముతారు. ఇందులో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, చివరికి ఎక్కడికి చేరింది అన్న విషయాలు గోప్యంగా ఉంటాయి.

ఫిన్‌సెన్ ఫైల్స్‌లో 54 డొల్ల సంస్థల పేర్లతో ఓ నిఘా రిపోర్ట్ కూడా ఉంది. వాస్తవంగా వ్యాపారమేదీ లేకున్నా, కేవలంపై కాగితాలపైనే వ్యాపారం జరుగుతున్నట్లు చూపిస్తూ ఏర్పాటు చేసే సంస్థలనే డొల్ల సంస్థలు అంటారు.

2011 నుంచి ఈ 54 డొల్ల సంస్థల ద్వారా రష్యా, యూరప్ మార్కెట్లలో ఏటా ట్రిలియన్ల డాలర్లు చేతులు మారుతూ వచ్చాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.

ఫిన్‌సెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మజాకా జనరల్ ట్రేడింగ్ సంస్థకు 2013 మార్చి నుంచి 2016 అక్టోబర్ వరకూ మాస్కో మిర్రర్ నెట్‌వర్క్ సంస్థల ద్వారా 49.78 మిలియన్ల డాలర్లు అందాయి. దీనితోపాటు సింగపూర్‌కు చెందిన 'ఆస్క్ ట్రేడింగ్ పీటీఈ' అనే సంస్థతోనూ మజాకా జనరల్ ట్రేడింగ్ లావాదేవీలు జరిపింది.

ఖనానీ మనీ లాండరింగ్ ఆర్గనైజనేషన్‌కు సహకరించిందుకు మజాకా సంస్థపైనా ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది.

ఖనానీ, మజాకా వ్యవహారంతో భారత్‌లోనూ కొన్ని సంస్థలకు సంబంధాలు కనిపిస్తున్నాయి. లీకైన పత్రాల ప్రకారం న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్, సింగపూర్‌కు చెందిన ఓవర్సీస్ బ్యాంకులతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా దుబయి శాఖల ద్వారానూ మజాకా జనరల్ ట్రేడింగ్, ఆస్క్ ట్రేడింగ్ పీటీఈల మధ్య లావాదేవీలు జరిగాయి.

మజాకా జనరల్ ట్రేడింగ్ ఖాతాలను పరిశీలిస్తే దిల్లీలోని 'రంగోలీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ పేరు కూడా కనిపిస్తోంది. దుస్తుల హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థను 2009లో నెలకొల్పారు.

ఫిన్‌సెన్ ఫైల్స్‌లో రంగోలీ ఇంటర్నేషనల్‌కు సంబంధించిన 70 లావాదేవీల ప్రస్తావన ఉంది. ఈ లావాదేవీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ లాంటి భారతీయ బ్యాంకుల ద్వారా జరిగాయి.

17 చోట్ల ద్వారా 10.65 మిలియన్ డాలర్ల వరకూ చేతులు మారాయి. 2014, జూన్ 18న మజాకా జనరల్ ట్రేడింగ్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా 1,36,254 డాలర్లు అందాయి.

మనీ లాండరింగ్

ఫొటో సోర్స్, Getty Images

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) పత్రాల ప్రకారం 2014 మార్చిలో రంగోలీ ఇంటర్నేషనల్ లాభాలు భారీగా పడిపోయినట్లు ఉంది. రెవెన్యూ రూ.339.19 కోట్లు ఉండగా, సంస్థకు వచ్చిన నష్టం రూ.74.87 కోట్లుగా చూపించారు. 2015 తర్వాత నుంచి ఆ సంస్థ ఇప్పటివరకూ వాటాదారులతో వార్షిక సమావేశం నిర్వహించలేదు. వార్షిక బ్యాలెన్స్ షీట్‌ను కూడా చూపలేదు.

రంగోలీ సంస్థ లోపాలపై కొన్ని బ్యాంకులు నోటీసులు కూడా ఇచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ రంగోలీ ఇంటర్నేషనల్ సంస్థ స్థిరాస్తుల వేలం వేసేందుకు నోటీసులు జారీ చేశాయి.

అలహాబాద్ బ్యాంకు 2015లో వెల్లడించిన నిరర్థక ఆస్తుల జాబితాలోని మొదటి 50 స్థానాల్లో రంగోలీ సంస్థ కూడా ఉంది.

రంగోలీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ లవ్ భరద్వాజ్ ఫిన్‌సెన్ ఫైల్స్‌లో తమ సంస్థ ద్వారా జరిగినట్లుగా వచ్చిన లావాదేవీల గురించి స్పందించారు.

''2013 నుంచి 2014 వరకూ జరిగినట్లుగా చెబుతున్న ఆ 70 లావాదేవీల గురించి మా దగ్గర ఏ రికార్డులూ లేవు. వాటి గురించి మేమేమీ చెప్పలేం. మాది దుస్తుల వ్యాపారం. మేం మా ఉత్పత్తులు అమ్మిన తర్వాత, వాటి తాలూకు డబ్బులు రావడం సహజం. 2014 సెప్టెంబర్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా జరిగినట్లుగా మీరు చెబుతున్న ఆ లావాదేవీ గురించి ఏ రికార్డూ మా దగ్గర లేదు. మజాకా జనరల్ ట్రేడింగ్ సంస్థతోగానీ, అల్తాఫ్ ఖనానీతోగానీ మాకు ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవు. వారెవరో కూడా మాకు తెలియదు'' అని ఆయన వివరించారు.

ఇక అల్తాఫ్ ఖనానీ న్యాయవాది మేల్ బ్లేక్ కూడా ఐసీఐజేతో మాట్లాడారు.

''ఖనానీ తన తప్పు ఒప్పుకున్నారు. దానికి శిక్ష కూడా అనుభవించారు. ఇప్పుడు ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. ఆయన ఖాతాలన్నీ ఫ్రీజ్ అయ్యాయి. ఓఎఫ్‌ఏసీ ఆంక్షల కారణంగా ఆయన తిరిగి డబ్బు సంపాదించే అవకాశమూ లేకుండా పోయింది. గడిచిన ఐదేళ్లలో ఆయన ఎలాంటి వ్యాపార కార్యకలాపాలూ చేపట్టేలేదు. చట్టాలను గౌరవిస్తూ, ఇకపై ఓ సాధారణ పౌరుడిలా ఆయన బతకాలనుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)