వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా, ఇంకా ఏం చేయాలి?

వారంలో రెండు రోజులు పరిమితంగా ఆహారం తీసుకోవడం జ్ఞాపకశక్తి మెరుగుదలకు ఉపయోగపడుందని పరిశోధనలో తేలింది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వారంలో రెండు రోజులు పరిమితంగా ఆహారం తీసుకోవడం జ్ఞాపకశక్తి మెరుగుదలకు ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రక్రియను అడ్డుకోవచ్చని, జ్ఞాపక శక్తిని మరింత పెంచుకోవచ్చని కూడా తేల్చాయి.

అయితే, ఇది మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారన్న దానితో పాటు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ గిలెస్ యూ ఈ అంశంపై మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.

కేలరీల పరిమాణం తగ్గినప్పుడు, మెదడు కొత్త కణాలు లేదా న్యూరాన్‌లను ఉత్పత్తి చేస్తుందని ఎలుకలపై జరిపిన పరిశోధన వెల్లడించింది. ఈ ప్రక్రియను న్యూరోజెనిసిస్ అంటారు. ఇలాంటి పరిణామం జరిగిన ఎలుకలలో జ్ఞాపకశక్తి మెరుగుపడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మనుషులలో కూడా ఇది సాధ్యమేనా అని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ శాండ్రిన్ థురెట్, క్యూరీ కిమ్ అధ్యయనం చేస్తున్నారు.

వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గుదలను తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు

ఫొటో సోర్స్, YUICHIRO CHINO/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గకుండా చూడొచ్చని పరిశోధకులు అంటున్నారు.

ప్రయోగం

కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ గిలెస్‌తో సహా 43 మంది ఈ ప్రయోగానికి ఎంపికయ్యారు. వారి వయస్సు 45 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉంది.

నాలుగు వారాల పాటు వారందరికీ తక్కువ కేలరీల ఆహారం అందించారు. వారంలో రెండు రోజుల్లో వారికి 500-600 కేలరీలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన అయిదు రోజులు సాధారణ రోజుల్లో తీసుకునే పరిమాణంలో కేలరీలను అందించారు.

నాలుగు వారాల ప్రయోగం ప్రారంభంలో, ముగింపులో అందరి జ్ఞాపకశక్తిని పరీక్షించారు. దీనినే ప్యాటర్న్ సెపరేషన్ టెస్ట్ అంటారు. ఈ ప్రయోగంలో గతంలో చూసిన ఫొటోలను, తర్వాత అలాంటివే కొన్ని ఫొటోలు చూసి వాటిలో తేడాలను గుర్తించాల్సి ఉంటుంది.

ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి రక్త పరీక్ష చేసి అతని శరీరంలో ఉన్న ప్రొటీన్ల సంఖ్యను తెలుసుకున్నారు. వీటినే క్లోథో అంటారు. ఒక వ్యక్తి శరీరంలో అది వయస్సుతో పాటు తగ్గుతుంది. క్లోథో పెరుగుదల కారణంగా కొత్త కణాలు, న్యూరాన్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనలో తేలింది.

తక్కువ తినడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ప్రయోగ ఫలితాలు తేల్చాయి.

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, తక్కువ తినడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఈ ప్రయోగం చెబుతోంది.

ఫలితం

ఈ ప్రయోగంలో ఫలితాలు చాలా ఆశాజనకంగా కనిపించాయి. పరీక్షలో పాల్గొన్న వ్యక్తులందరి ప్యాటర్న్ సెపరేషన్ మెరుగుపడినట్లు గుర్తించారు. వారి శరీరంలోని క్లోథో స్థాయి కూడా పెరిగింది. ఈ ప్రయోగం తక్కువ తినడం ద్వారా, ఒక వ్యక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని స్పష్టం చేసింది.

క్లోథో లెవల్స్ పెరుగుదల కారణంగా న్యూరోజెనిసిస్ జరిగి ఉండవచ్చని చెబుతోంది.

అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. డాక్టర్ గిలెస్‌లోని ప్యాటర్న్ సెపరేషన్ మునుపటి కంటే తక్కువగా ఉంది. క్లోథో స్థాయి కూడా మారలేదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు, న్యూరోజెనిసిస్‌తో దగ్గరి సంబంధం ఉంది. కానీ నాలుగు వారాల అధ్యయనం సమయంలో డాక్టర్ గిల్లెస్‌కు సరైన నిద్ర లేదు. బహుశా ఆకలి కూడా దీనికి ఒక కారణం కావచ్చు.

మొత్తం గ్రూపులో గిలెస్ అతి పిన్న వయస్కుడు. ఆయన క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అంటే, తక్కువ వ్యవధిలో చేసే ఉపవాసం ప్రభావం తక్కువగా ఉంటుంది.

60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను అధ్యయనం చేయడం ద్వారా, వృద్ధులలో ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది.

ఈ ప్రయోగం ద్వారా వృద్ధుల మెమరీ పవర్‌ను పెంచవచ్చా అన్నదానిపై విస్తృత ప్రయోగాలు జరుపుతున్నారు

ఫొటో సోర్స్, CAROL YEPES/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, వృద్ధుల జ్ఞాపకశక్తిని పెంచవచ్చా అన్నదానిపై ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు.

మీరేం చేయాలి?

ఈ ప్రయోగ ఫలితాలను గమనించినప్పుడు మీరు ఎక్కువ వ్యాయామం చేసే వారు కాకపోతే, వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండటం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుందని అర్థమవుతోంది.

ఆ రెండు రోజుల్లో మహిళలు ఆహారం ద్వారా తీసుకునే కేలరీలను 500కు, పురుషులు 600కి పరిమితం చేయాలి. వారంలో మిగిలిన అయిదు రోజులు సాధారణంగా తినొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)