ఆర్యన్ ఖాన్: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు ఎందుకు అంత త్వరగా బయటపడవు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇక్బాల్ పర్వేజ్
- హోదా, ఫిల్మ్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం
బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈసారి కేసులో ఏ హీరో లేకపోయినా, బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్యన్ ఖాన్ ముందు నిలిచారు.
శనివారం అర్థరాత్రి ముంబైలో ఓ క్రూయిజ్‌పై ఎన్‌సీబీ (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో )దాడి చేసింది. ఆర్యన్ ఖాన్‌తో సహా ఎనిమిది మందిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది.
ఇందులో ఆర్యన్‌తోపాటు ముగ్గురు అరెస్టు కూడా అయ్యారు. వారందరినీ ఎన్‌సీబీ రిమాండ్‌కు పంపారు.
ఆర్యన్ ఖాన్ దగ్గర అధికారులకు ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని ఆయన న్యాయవాది కోర్టులో చెప్పగా, ఆయన నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ పేర్కొంది.
ముంబై క్రూయిజ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పై ముంబై ఫోర్ట్ కోర్టులో విచారణ జరిగింది.
ఆర్యన్ ఖాన్ ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా ఆయనను అరెస్టు చేశారని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఆర్యన్ లాయర్లు కోర్టులో వాదించినట్లు బీబీసీ మరాఠీ విలేఖరి సుప్రియా సోగ్లే వెల్లడించారు.
''ఆర్యన్ స్వయంగా పార్టీకి వెళ్లలేదు. తనను పార్టీకి ఆహ్వానించారు. ఆయన వద్ద టికెట్ కూడా లేదు. ఆర్యన్ బ్యాగ్‌లో ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్‌ను గుర్తించ లేదు'' అని ఆర్యన్ లాయర్ మాన్ షిందే అన్నారు.
అయితే, మాదక ద్రవ్యాలను అమ్మేవారితో నిందితుడు ఫోన్ చాటింగ్‌లు చేశారని ఎన్‌సీబీ వాదించింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా వీరంతా మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంతో సంబంధాలున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.
వీరందరినీ అక్టోబర్ 5 వరకు రిమాండ్‌కు ఇవ్వాలని వారు కోర్టును కోరారు.

ఫొటో సోర్స్, SUJIT JAISWAL
ఆర్యన్ కంటే ముందు బాలీవుడ్‌లో డ్రగ్స్ కథ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు చివరకు డ్రగ్స్ మాఫియా వరకు వెళ్లింది. డ్రగ్స్ కేసులో మొదట రియా చక్రవర్తి సోదరుడు సౌవిక్ చక్రవర్తి, తర్వాత రియా చక్రవర్తి కేసును ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
ఇదే కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరో ఆరుగురిని అరెస్టు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ రియా చక్రవర్తి మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసు విచారణ విషయంలో బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
''కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీయడం తగదు'' అని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయ బచ్చన్ అన్నారు.
డ్రగ్స్ విషయంలో సినీ పరిశ్రమకు చెందిన వాడిగా సిగ్గుపడుతున్నానని బీజేపీ లోక్‌సభ సభ్యుడు రవి కిషన్ అన్నారు. డ్రగ్స్ తీసుకునే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బాలీవుడ్‌కు చెందిన వారిలో 99%మంది డ్రగ్స్ తీసుకుంటారని ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ నటి రవీనా టాండన్ ''కొన్ని చెడిపోయిన యాపిల్ పండ్లు, మిగతా పండ్లు అన్నింటిని చెడగొట్ట లేవు'' అని అన్నారు.

కంగనా మీదా విచారణ
బాలీవుడ్‌లో 99% శాతం మంది డ్రగ్స్ వాడతారని ఆరోపణలు చేసిన కంగనా రనౌత్ కూడా కేసును ఎదుర్కొంటున్నారు. గతంలో తనకు బలవంతంగా డ్రగ్స్ ఇప్పించేందుకు కంగనా ప్రయత్నించారని ఆమె స్నేహితుడు అధ్యయన్ సుమన్ ఆరోపించారు.
కంగనా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. తాను కూడా డ్రగ్స్ తీసుకుంటానని కంగనా అందులో ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ తారలపై ఎన్‌సీబీ నిఘా పెట్టిందని వార్తలు వచ్చాయి.
''కొంతమంది పేర్లు మా దృష్టికి వచ్చాయి. దర్యాప్తు చేస్తున్నాం. మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అవన్నీ ఊహాగానాలే. దర్యాప్తులో భాగంగా కొందరిని ప్రశ్నిస్తున్నాం. వారి పేర్లను బయటపెట్టలేం'' అని ఎన్‌సీబీ డిప్యూటీ డైరక్టర్ కె.పి.ఎస్.మల్హోత్రా అన్నారు.
ఈ డ్రగ్స్ రవాణ, వినియోగం విస్తరించకుండా ఉండేందుకు డీలర్లు, పెడ్లర్లు, సినిమా నటులను గుర్తించే ప్రయత్నం జరుగుతోందని మల్హోత్రా అన్నారు.
తాజా వ్యవహారాలపై బాలీవుడ్ ప్రముఖ స్టార్లంతా మౌనం వహిస్తున్నారు. చాలామంది స్పందించడానికి నిరాకరించారు.

ఫొటో సోర్స్, IQBAL PERWEZ/BBC
షెర్లిన్ చోప్రా ఆరోపణలు
నటి షెర్లిన్ చోప్రా కూడా కంగనా లాగానే ఆరోపణలు చేశారు. తాను కూడా డ్రగ్స్ వాడానని, బాలీవుడ్‌లో కేవలం 5% మంది మాత్రమే డ్రగ్స్ వాడటం లేదని ఆమె అన్నారు.
షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే ఇంత వరకు ఏ ఒక్క బాలీవుడ్ స్టార్ మీద కూడా అధికారికంగా డ్రగ్స్ కేసులో విచారణ జరగలేదు.
''మొదట్లో నిర్మాతలు నన్ను పార్టీలకు ఆహ్వానించేవారు. అయితే, నెట్‌వర్కింగ్, పరిచయాల కోసం అలా వెళ్లడం అవసరం అనుకునేదాన్ని. కానీ, అక్కడ నెట్‌వర్కింగ్ తక్కువ, మత్తు ఎక్కువ. అలాంటి పార్టీలకు వెళ్లడం మానేశాను'' అన్నారు షెర్లిన్
గతంలో తమకు డ్రగ్స్ విషయంలో అనేక ఫిర్యాదులు కూడా అందాయని మల్హోత్రా అంగీకరించారు. ''ఈ పేర్ల విషయంలో విచారణ జరుగుతోంది. డ్రగ్స్ దందాలో పాలు పంచుకున్నవారిపై చర్యలుంటాయి'' అని మల్హోత్రా స్పష్టం చేశారు.
''అయితే, ఈ దర్యాప్తులతో ఏమీ కాదు. కొందరు డీలర్లు, పెడ్లర్ల పేర్లు మాత్రమే బయటకు వస్తాయి. కొంతకాలం తర్వాత అంతా మరిచిపోతారు. తర్వాత వాళ్లు తమ పనులను యధావిధిగా కొనసాగిస్తారు'' అన్నారు షెర్లిన్ చోప్రా.

ఫొటో సోర్స్, SANJAY DUTT/INSTAGRAM
డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులు
బాలీవుడ్ తారలు డ్రగ్స్ సంబంధాలపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ, వాటిపై తీవ్రమైన దర్యాప్తు జరిగినట్లు కనిపించదు. కొందరు వ్యక్తులు జైలుకు వెళ్లారు. చాలామంది రీహాబిలిటేషన్ సెంటర్లలో చికిత్స పొందారు.
సంజయ్ దత్
నటుడు సంజయ్ దత్ డ్రగ్స్ వ్యవహారం ఒకప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆయన తండ్రి సునీల్ దత్ ఆయన్ను రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్చారు. తర్వాత సంజయ్ దాని నుంచి బయటపడ్డారు.
సంజయ్ దత్ జీవితంపై చిత్రించిన ‘సంజు’ చిత్రంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ప్రతీక్ బబ్బర్
రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్‌ల కుమారుడు ప్రతీక్ బబ్బర్ కూడా తాను 13 సంవత్సరాల వయస్సు నుంచే డ్రగ్స్ తీసుకునేందుకు అలవాటు పడ్డానని ఒప్పుకున్నారు. తర్వాత ఆయన కూడా చికిత్స తర్వాత వాటి నుంచి బైటపడ్డారు.
ఫర్దీన్ ఖాన్
ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ 2001లో ముంబై పోలీసులకు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఫర్దీన్ ఖాన్ కేసు కోర్టుకు కూడా వెళ్లింది. ఆయన కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్సకు అంగీకరించడంతో ఎలాంటి శిక్షా పడలేదు.
డీజే అకిల్
బాలీవుడ్ స్టార్ సంజయ్ ఖాన్ అల్లుడు డీజే అకీల్ 2007లో దుబాయ్‌లో నిషేధిత డ్రగ్స్ ఆరోపణలతో అరెస్టయ్యారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆయన ఈ కేసు నుంచి బయటపడ్డారు.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ రాజ్ 2005 లో డ్రగ్ వాడకం కేసులో దుబాయ్‌లో అరెస్టయ్యారు. అయితే, తాను నిర్దోషినని విజయ్‌రాజ్ చెప్పుకున్నారు.

ఫొటో సోర్స్, RAHUL MAHAJAN/FB
రాహుల్ మహాజన్
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి బడా నేత ప్రమోద్ మహాజన్ కుమారుడు, టీవీ సెలబ్రిటీ రాహుల్ మహాజన్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు.
మాదక ద్రవ్యాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం పాడైందని, ఆసుపత్రిలో కూడా చేర్చాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ రాహుల్ మహాజన్ ఖండించారు.
ముంబైలో రకరకాల పార్టీలు
ముంబైలో సినీతారలు వివిధ రకాల పార్టీలు నిర్వహిస్తుంటారు. సినిమా ముహుర్తాలు, సక్సెస్‌ల పేరుతోపాటు రకరకాల సందర్భాలలో పార్టీలు జరుగుతుంటాయి. ఇక్కడ మద్యం ఏరులై పారుతుంది. కాకపోతే, ఇలాంటి చోట్ల డ్రగ్స్ వాడరు.
సినిమా తారలు పబ్లిక్ ఫంక్షన్లతోపాటు ప్రైవేట్ పార్టీలను కూడా నిర్వహిస్తుంటారు. అక్కడ మీడియాకు ఆహ్వానం,అనుమతి ఉండదు. ఇవి కాకుండా, డిస్కోలు, పబ్‌లలో కూడా చాలా పార్టీలు జరుగుతుంటాయి. ముంబై అనేక రేవ్ పార్టీలకు కేంద్రం
బాలీవుడ్-మాదకద్రవ్యాల కనెక్షన్ చాలా తక్కువసార్లు మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. చాలాసార్లు ఇవి అత్యంత రహస్యంగా సాగిపోతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- కౌగిలింత అనుభూతి రహస్యాన్ని కనిపెట్టిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
- పండోరా పేపర్స్: దేశాధ్యక్షులు, రాజకీయ నాయకుల రహస్య సంపద గుట్టు రట్టు
- లఖింపూర్ ఖేరీ ఘటన: రైతులు, అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం, మృతిచెందిన ఒక్కో రైతు కుటుంబానికి 45 లక్షల పరిహారం
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీకి భారీ విజయం.. తదుపరి లక్ష్యం 2024 దిల్లీయేనా?
- పంజాబ్: సిద్ధూతో ఎవరికి నష్టం? పార్టీకా, ఆయనకా?
- ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్’
- ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









