భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీకి భారీ విజయం.. తదుపరి లక్ష్యం 2024 దిల్లీయేనా?

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

    • రచయిత, ప్రభాకర్ మణి తివారీ
    • హోదా, బీబీసీ కోసం

‘‘భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలుస్తారా? లేదా? అనే విషయంలో మాకు ఎలాంటి సందేహమూ లేదు. ఫలితాల్లో ఆమె ఆధిక్యాన్ని మరింత పెంచుతూ... దేశం మొత్తానికి ఒక సందేశం ఇవ్వాలని అనుకున్నాం. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే మా తదుపరి లక్ష్యం.’’

ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపు అనంతరం రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి, సీనియర్ తృణమూల్ నాయకుడు ఫిర్హాద్ హకీం చేసిన వ్యాఖ్యలు ఇవి. భవానీపూర్‌లో మమతా ప్రచారాన్ని ఈయనే దగ్గరుండి నడిపించారు.

మరోవైపు గెలుపు అనంతరం మమతా కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘నందిగ్రామ్‌లో జరిగిన కుట్రకు భవానీపూర్ ప్రజలు సమాధానం ఇచ్చారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

భవానీపూర్ ఉప ఎన్నికలో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించిన మమత, తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.

కేవలం 57 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబరేవాల్‌పై 59 వేల ఓట్ల తేడాతో మమత విజయం సాధించారు.

ప్రియాంకా టిబరేవాల్‌

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, ప్రియాంకా టిబరేవాల్‌

బీజేపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఇదీ..

భవానీపూర్ ఉపఎన్నికను తృణమూల్ కాంగ్రెస్ మొదట్నుంచీ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంది.

ఇక్కడ మమత గెలుస్తారా? లేదా అనే సందేహం మొదట్నుంచీ లేదు. ఆమె ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తారు? అనేదే ప్రశ్న.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు బీజేపీ కార్యాలయాన్ని నిశ్శబ్దం అలుముకొంది. ఇక్కడ ఉదయం నుంచి బీజేపీ నాయకులెవరూ కనిపించలేదు.

బీజేపీ కార్యాలయం బయట, భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అయితే, నాయకులెవరూ అక్కడ కనిపించలేదు. ‘‘ఫలితాలు మేము ఆశించినట్లే వచ్చాయి’’అని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు బీబీసీతో చెప్పారు.

2011లో ఇక్కడ జరిగిన ఉపఎన్నికలో మమతా బెనర్జీ 54వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రస్తుతం ఈ ఆధిక్యం 59 వేలకు పెరిగింది.

2016 ఎన్నికల్లో మమత 25వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 29 వేల ఓట్ల తేడాతో టీఎంసీ నాయకుడు శోభన్‌దేవ్ ఛటర్జీ గెలిచారు. అయితే, నేడు ఈ ఆధిక్యం రెండు రెట్లు పెరిగింది.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

మమత ఏం అంటున్నారు?

ఎన్నికల్లో విజయం అనంతరం కాళీఘాట్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మమతా బెనర్జీ మాట్లాడారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్ర ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

‘‘రాష్ట్రంలోని ప్రజలంతా భవానీపూర్ ఫలితాల కోసం ఎదురుచూశారు. ఓటర్లు నాకు అండగా నిలిచారు. కుట్ర సిద్ధాంతాలను ఓడించి నాకు విజయం అందించారు’’అని మమత అన్నారు.

గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమత ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలతో తనను ఓడించిందని మమతా ఆరోపించారు.

ఆ ఆరోపణలపై స్పందించేందుకు మమత నిరాకరించారు. ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. మరోవైపు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు ఇప్పుడు నిర్వహించబోనని తెలిపారు.

‘‘నేడు వరద బాధితులకు మనం అండగా నిలవాలి. అదే నా ముందున్న తొలి ప్రాధాన్యం’’అని ఆమె చెప్పారు. మరోవైపు అక్టోబరు 30న మరో నాలుగు స్థానాలకు జరగబోతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను మమత ప్రకటించారు.

రాష్ట్రంలో విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఓ లేఖ పంపింది. ఎలాంటి హింసా చెలరేగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో ఇక్కడ హింస చెలరేగింది. కొన్నిచోట్ల దోపిడీలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. ఈ హింసకు తృణమూల్ అభ్యర్థులే కారణమని బీజేపీ ఆరోపించింది.

తృణమూల్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఇప్పుడు 2024పై గురి

‘‘బీజేపీ అసలు పోటీలోనే లేదు. రేసు మొదలవ్వకముందే బీజేపీ పక్కకు తప్పుకుంది. ఈ ఫలితం తర్వాత మేం దిల్లీపై గురిపెడుతున్నాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేస్తాం. మోదీకి వ్యతిరేకంగా అందరూ మమతే నిలబడాలని కోరుకుంటున్నారు’’అని సీనియర్ టీఎంసీ నాయకుడు ఫిర్హాద్ హకీం అన్నారు.

మరోవైపు మమతకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరి అన్నారు.

‘‘ఆ నియోజకవర్గం మమతకు ఎప్పటినుంచో కంచుకోటగా ఉంది. అయినప్పటికీ ప్రజలు భారీగా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. అంటే మమతకు ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని అర్థం చేసుకోవాలి’’అని ఆయన అన్నారు.

‘‘మమత గెలుస్తారని అందరికీ తెలిసిందే. అయితే, ఓటింగ్ శాతం మాత్రం ప్రజల్లో ఉత్సాహాన్ని ప్రతిబింబించలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

టీఎంసీ నాయకుడు ఫిర్హాద్ హకీం

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, టీఎంసీ నాయకుడు ఫిర్హాద్ హకీం

భవానీపూర్‌తోపాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపుర్, షంషేర్‌గంజ్‌లలోనూ సెప్టెంబరు 30న ఉప ఎన్నికలు నిర్వహించారు. జంగీపుర్‌లో వామపక్ష అభ్యర్థి మృత్యువాత పడటంతో గత ఏప్రిల్‌లో ఓటింగ్‌ను వాయిదా వేశారు.

షంషేర్‌గంజ్‌లోనూ ఓటింగ్‌కు ముందే కాంగ్రెస్ అభ్యర్థి మరణించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తృణమూల్ అభ్యర్థులు భారీ విజయాలను నమోదుచేశారు.

జంగీపుర్ ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే 2016 ఎన్నికల్లో తృణమూల్‌కు చెందిన జకీర్ హుస్సేన్ ఇక్కడ విజయం సాధించారు.

మమత ప్రభుత్వంలో జకీర్‌కు మంత్రి పదవి కూడా దక్కింది. షంషేర్‌గంజ్‌లో 2011లో వామపక్షాలు గెలిచాయి. అయితే, 2016 ఎన్నికల్లో ఇక్కడ తృణమూల్ అభ్యర్థి విజయం సాధించారు.

భవానీపూర్‌లో మమత విజయంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యమేమీ వ్యక్తం చేయడంలేదు. ఆమె కచ్చితంగా గెలుస్తారని తాము ముందే ఊహించినట్లు వివరించారు.

‘‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా, కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వానికి మమత గట్టి సందేశం ఇవ్వాలని అనుకున్నారు. కేంద్రంలో విజయానికి భవానీపూర్ నుంచే అడుగులు పడతాయని ఆమె అన్నారు. అందుకే ఇక్కడి ఉప ఎన్నికకు మమతతోపాటు తృణమూల్ కాంగ్రెస్ అంత ప్రాధాన్యం ఇచ్చింది’’అని రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ సమీరన్ పాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)