ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు

ఫొటో సోర్స్, JASNA SALEEM
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
జాస్నా సలీమ్ తన అభిరుచి గురించి మాట్లాడుతుంటే చిన్నపిల్లలా ఎంతో సంబరపడిపోతారు.
వెన్న కుండలో చేయి పెట్టి, నోరంతా వెన్న పూసుకొని కనిపించే బాలకృష్ణుడిని చిత్రం వేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం.
28 ఏళ్ల జాస్నా సలీమ్ గత ఆరేళ్లుగా వరుసగా బాలకృష్ణుడి పెయింటింగ్సే వేస్తున్నారు. ఇప్పుడు ఆమె తాను వేసిన చిత్రాలను స్వయంగా శ్రీకృష్ణ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు.
స్వయంగా బాలకృష్ణుడిని చిత్రించి, ఆ పెయింటింగ్‌ను కానుకగా ఇవ్వాలనే తన కోరిక నెరవేరినందుకు జాస్నా చాలా సంతోషిస్తున్నారు.

ఫొటో సోర్స్, JASNA SALEEM
రెండు రోజుల క్రితం కేరళలోని 80 ఏళ్ల పురాతన ఉలనాడు శ్రీకృష్ణ స్వామి ఆలయానికి జాస్నా సలీమ్ తను వేసిన బాలకృష్ణుడి పెయింటింగ్‌ను కానుకగా ఇచ్చారు. ఈ ఆలయం పత్తనంతిట్ట జిల్లాలోని పందళం టౌన్‌లో ఉంది. ఈ ఆలయంలో చిన్నికృష్ణుడికి పూజలు నిర్వహిస్తారు.
గురువాయూర్‌లోని ప్రముఖ కృష్ణ ఆలయానికి జాస్నా ఒక బాలకృష్ణుడి పెయింటింగ్ కానుకగా ఇచ్చారని తెలుసుకున్న ఉలనాడు ఆలయ కమిటీ శ్రీకృష్ణ స్వాని ఆలయానికి కూడా ఒక చిత్రం వేసి ఇవ్వాలని ఆమెను కోరింది.
జాస్నా సలీమ్ చిత్రలేఖనం ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఆమె భర్త ఆమెకు శ్రీకృష్ణుడి గురించి చెప్పారు. ఆయన ఆమెకు శ్రీకృష్ణ లీలలు కూడా వినిపించారు.

ఫొటో సోర్స్, JASNA SALEEM
పెయింటింగ్ వేయడం ఎలా మొదలైంది
కోజికోడ్‌లోని తన ఇంటి నుంచి బీబీసీతో ఫోన్లో మాట్లాడిన జాస్నా తనకు ఈ ఆసక్తి ఎలా మొదలైందో చెప్పారు.
"నేను కృష్ణుడి కథలు విన్న తర్వాత నాకు బాలకృష్ణుడి అందం, ఆ ఆకర్షణ గురించి తెలిసింది. ఒక రోజు నేను కృష్ణుడి చిత్రం చూశాను. అలా బొమ్మలు వేయడం మొదలెట్టాను. నేను నా జీవితంలో మొదటిసారి ఒక బొమ్మ వేసింది అప్పుడే. నేను ఆ సమయంలో గర్భవతిని. బాలకృష్ణుడి గురించే ఆలోచించేదాన్ని, ఆ బొమ్మనే చూసుండేదాన్ని" అన్నారు.
కానీ తను వేసిన చిన్నికృష్ణుడి చిత్రాలను జాస్నా తన ఇంట్లో ఉంచేవారు కాదు. అవి చూస్తే మీ అమ్మ నాన్నలకు నీపై కోపం వస్తుంది అని భర్త ఆమెకు చెప్పేవారు.

ఫొటో సోర్స్, JASNA SALEEM
"నేను ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందినదాన్ని. కానీ, మా అత్తగారి ఇంట్లో మాత్రం నేను పెయింటింగ్ వేసినా, బాలకృష్ణుడి బొమ్మలు వేసినా ఏమీ అనేవారు కాదు" అని జాస్నా చెప్పారు.
తాను మొదటిసారి వేసిన పెయింటింగ్‌ను చించేయాలంటే జాస్నాకు చాలా బాధగా అనిపించింది. "నేను దాన్ని చించేయలేను. ఎందుకంటే అది నేను మొట్టమొదట వేసిన బాలకృష్ణుడి చిత్రం. అందుకే నేను దాన్ని నంబూద్రి కుటుంబానికి చెందిన నా స్నేహితురాలికి ఒకరికి ఇచ్చేశాను" అన్నారు.
"వాళ్లు నేను వేసిన ఆ పెయింటింగ్ చూసి… ఒక ముస్లిం యువతి శ్రీకృష్ణుడి చిత్రం వేసిందా అని ఆశ్చర్యపోయారు. ఆమె అన్ని కోరికలు నెరవేరుతాయి అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి నేను నాకు ఇష్టమైన బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను" అన్నారు జాస్నా.

ఫొటో సోర్స్, JASNA SALEEM
బాలకృష్ణుడి చిత్రాలే ఎందుకు వేశారు
చిన్నికృష్ణుడి ముఖం చూడగానే ఆ చిత్రాలు వేయాలని జాస్నాకు అనిపించింది. ఆ ముఖం ఆమెకు మనోహరంగా అనిపించింది.
ఆమె తన మొదటి చిత్రంలో చిన్నికృష్ణుడు వేణువు పట్టుకున్నట్లు వేశారు. తర్వాత బాలకృష్ణుడు వెన్న కుండ దగ్గర ఉన్న చిత్రం ఆమెను ఇంకా ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి జాస్నా కృష్ణుడి అలాంటి పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు.
"మీరు బాలకృష్ణుడు వెన్న తింటున్న చిత్రాన్నే ఎందుకు వేస్తారు" అని ఒకసారి కొందరు ఆమెను అడిగారు.
"కృష్ణుడు వెన్న కడవలో చెయ్యి పెట్టి ఉండడం చూస్తుంటే, దాన్ని ఎవరైనా తన దగ్గర్నుంచి తీసుకెళ్లిపోతారేమో అని భయపడుతున్నట్లు ఉంటుంది. కానీ, చేతిలో వెన్నతో కృష్ణయ్య ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాకు తనకిష్టమైన వెన్న తింటూ సంతృప్తి చెందే ఒక బాలుడు కనిపిస్తాడు" అని జాస్నా సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, JASNA SALEEM
ఆమె బాలకృష్ణుడి పెయింటింగ్ వేయడం మొదలుపెట్టినపుడు, దాన్ని చూసిన ఆమె మామగారు ఈ చిత్రాన్ని గురువాయూర్‌లోని ఆలయానికి ఇవ్వు అన్నారు. గురువాయూర్ నుంచి వచ్చిన చాలా మంది తాము ఆమె వేసిన చిత్రం చూశామని, అది చాలా బాగుందని చెప్పారు.
"ఆమె పెయింటింగ్స్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె బాలకృష్ణుడి అల్లరి చేష్టలను చిత్రీకరించారు. అందుకే మనకు ఆ చిత్రాలను చూడగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని పుణెలోని తత్వమసి సంస్థకు చెందిన జేపీకే నాయర్ అన్నారు.
తత్వమసి సంస్థ జాస్నా సలీమ్ వేసే బాలకృష్ణుడి పెయింటింగ్స్‌ను స్పాన్సర్ చేస్తోంది.
"నాకు ఆ చిత్రాలు వేయడం వల్ల లభించే మానసిక తృప్తి చాలు" అంటున్నారు జాస్నా.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











