శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?

చిత్రవేలాయుధర్ ఆలయంలో దొరికిన ఒక రాగి శాసనంలో తెలుగు వాక్యాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Nakuleswaran Praveen

ఫొటో క్యాప్షన్, చిత్రవేలాయుధర్ ఆలయంలో దొరికిన ఒక రాగి శాసనంలో తెలుగు వాక్యాలు కనిపించాయి.
    • రచయిత, రంజన్ అరుణ్‌ ప్రసాద్
    • హోదా, బీబీసీ కోసం

శ్రీలంకలో వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు, తమిళం భాషల్లో రాసిన ఓ రాగి శాసనం లభ్యమైందని జాఫ్నా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ పి. పుష్పరత్నం వెల్లడించారు.

తమిళ సంప్రదాయ మూలాలు శ్రీలంకలో ఉన్నాయనడానికి ఈ ప్రత్యేకమైన శాసనం ఆధారం అని ఆయన చెప్పారు.

రాగి శాసనం లభ్యమైన ప్రాంతం, పొలోన్నరువా, బట్టికలోవా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. ఇది చరిత్ర ప్రాముఖ్యం ఉన్న ప్రాంతం.

బ్రిటిష్ కాలం నుండే పాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతం పొలోన్నరువా జిల్లాలో అంతర్భాగంగా ఉంది. మన్నంపిటియాలోని హిందూ, బౌద్ధ దేవాలయాలు, దేవాలయాల అవశేషాలు, ఈ ప్రాంత చారిత్రక వారసత్వానికి నిదర్శనం.

తంబంకాడులోని చిత్రవేలాయుధర్ ఆలయంలో ఈ రాగి శాసనాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతకు ఇది మరొక సాక్ష్యం.

ఈ ఆలయ నిర్మాణ కాలంపై సరైన ఆధారాలు లేవు. ఇది మతాలతో సంబంధంలేని దేవాలయంగా ప్రజల చెబుతున్నారు. ప్రొఫెసర్ పి. పుష్పరత్నం చెబుతున్న ప్రకారం ఇది శూలం(సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం) చిహ్నాన్ని కలిగి ఉన్న ఆలయం.

ఆలయ పునరుద్ధరణ సమయంలో దొరికిన పాత ఆలయ అవశేషాలు, పూజా సామగ్రిలను, ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక స్థలంలో సురక్షిత ప్రాంతంలో ఉంచారు.

భద్రపరచిన స్తంభాల్లోని ఒకదానిలో ఈ కాంస్య శాసనం లభ్యమైంది. రాగి పూతతో అలంకరించిన ఆ స్తంభం ఆలయంలోని ప్రధాన మందిర గదిలోని భాగం.

ఈ 5 అడుగుల పొడవున్న స్తంభంపై రాగి పూత అమర్చి ఉంది. స్తంభం ప్రారంభంలో, చివరలో అర్ధ వృత్తాకార తామర పుష్పాలు చెక్కి ఉన్నాయి. మధ్యలో ఉన్న కమలానికి ఎడమ వైపు తెలుగులో, కుడి వైపు తమిళంలో రాసి ఉంది.

ఇక్కడ లభించిన తెలుగు శాసనాలను భాషా నిపుణులు నిర్ధారించారు

ఫొటో సోర్స్, Nakuleswaran Praveen

ఫొటో క్యాప్షన్, ఇక్కడ లభించిన తెలుగు శాసనాలను భాషా నిపుణులు నిర్ధారించారు

తమిళంలో చెక్కిన పద్యాలను ప్రొఫెసర్ పి. పుష్పరత్నం ధృవీకరించగా, తెలుగులో ఉన్న శాసనాలను భాషా నిపుణులు నిర్ధారించారు. తమిళంలో ఉన్న అంశాలు, తెలుగులో కూడా ప్రస్తావించారని ప్రొఫెసర్ పి. పుష్పరత్నం అన్నారు.

తంబంకాడులోని చిత్రవేలాయుధర్ దేవాలయ ప్రధాన మందిరానికి కాంస్య మెట్లు నిర్మించడానికి ప్రజల నుండి విరాళాలు ఎలా సేకరించారనే అంశాల గురించి రాగి శాసనం తెలుపుతుంది.

శాసనంలోని వివరాలను చదివినప్పుడు, అది 18 లేదా 19వ శతాబ్దాలకు చెందినదని అర్థం చేసుకోవచ్చని ప్రొఫెసర్ పుష్పరత్నం పేర్కొన్నారు.

బట్టికలోవా జిల్లాలో కనిపించే చాలా స్మారక చిహ్నాలలో తమిళ భాష ఉంది. చిత్రవేలాయుధర్ దేవాలయంలో చిత్రించిన రాగి పూత తమిళం, తెలుగు భాషల చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

15వ శతాబ్దంలో తూర్పు ప్రావిన్స్‌లోని బట్టికలోవా ప్రాంతాన్ని కాండీ రాజు పరిపాలించారు. పాలకులు తమిళులు అయితే, వారి అధికారుల మాతృభాష తెలుగు. ఈ పాలకులు భారతదేశంలోని మధురై నాయక వంశానికి చెందినవారు.

జాఫ్నా ప్రాంతంలో ఆదిమ మానవులు నివసించినట్లు కూడా ఆధారాలు లభించాయి.

ఫొటో సోర్స్, Nakuleswaran Praveen

ఫొటో క్యాప్షన్, జాఫ్నా ప్రాంతంలో ఆదిమ మానవులు నివసించినట్లు కూడా ఆధారాలు లభించాయి.

ఈ సమాచారాన్ని ఒక ప్రాతిపదికగా పరిగణించి, కాంస్య మెట్లు తెలుగు అధికారుల సహాయంతో రూపొందించినట్టు భావించవచ్చని ప్రొఫెసర్ పేర్కొన్నారు.

శ్రీలంకలో నివసిస్తూ తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తుల చరిత్ర ఇది. శ్రీలంకలో కాండీ పాలనకు ముందు, తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తులు అక్కడ నివసించినట్లు ఆధారాలు లభించాయని ప్రొఫెసర్ పుష్పరత్నం పేర్కొన్నారు.

జాఫ్నా రాజ్య కాలంలో తమిళం మాట్లాడే సైనికులే కాకుండా ఇతర భాషల సైనికులు కూడా రాజ్యానికి సేవ చేసినట్లు స్పష్టమవుతోంది. వారే తెలుగు, కన్నడ సైనికులుగా భావిస్తున్నారు.

రాజ్యం పతనం తర్వాత ఈ సైనికులలో కొంత మంది తమిళం మాట్లాడే ప్రజలతో దేశంలోనే ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)