Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

ఫొటో సోర్స్, Amazon
- రచయిత, డేవిడ్ మల్లోయ్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
తమ తొలి హోమ్ రోబో ''ఆస్ట్రో''ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. అలెక్సా స్మార్ట్ హోమ్ టెక్నాలజీతో ఈ రోబో పనిచేస్తుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో రిమోట్ ద్వారా పెంపుడు జంతువులు, వ్యక్తులు లేదా ఇంటి భద్రతపై ఓ కన్నేసి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని అమెజాన్ తెలిపింది.
ఇది ఇల్లంతా తిరుగుతూ ఏదైనా అసాధారణంగా అనిపిస్తే యజమానులకు వెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది.
"చక్రాలున్న అలెక్సా" కంటే ఇది మెరుగైనదని, సహజత్వం ఉట్టిపడేలా దీనికి కదలికలు, ఎక్స్‌ప్రెషన్‌లతో ప్రోగ్రామ్ చేశామని అమెజాన్ పేర్కొంది.
ఆవిష్కరణ కార్యక్రమంలో ఆస్ట్రోను "బీట్‌బాక్స్" ప్లే చేయమని అమెజాన్ కోరింది. అందుకు తలాడించిన రోబో, హిప్ హాప్ బీట్స్‌కు అనుగుణంగా భావాలు కూడా పలికించింది.
ప్రైవసీ విషయాలపై కూడా ప్రస్తుతం అమెజాన్ దృష్టిసారించింది.
ఆస్ట్రోను జోన్‌లతో సెట్ చేయవచ్చు, దాంతో అది కొన్ని ప్రాంతాలకు వెళ్లదు. లేదా "డిస్టర్బ్ చేయవద్దు" అని సెట్ చేయవచ్చు. కెమెరాలు, మైక్రోఫోన్‌లను ఆపివేయడానికి దీనికి బటన్లు కూడా ఉన్నాయి. వీటిని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, అది ఇల్లంతా కలియదిరగలేదు.
ఈ చిన్న రోబో తల నుండి పాప్‌అప్ అయ్యే పొడవైన "పెరిస్కోప్" కెమెరాను కలిగి ఉంటుంది. బయటకు వెళ్లిన తర్వాత, గ్యాస్ స్టవ్‌ను ఆపివేశారా లేదా అనే అనుమానం కలిగినప్పుడు ఆస్ట్రో ద్వారా ఈ కెమెరా సాయంతో చెక్ చేయొచ్చని అమెజాన్ వెల్లడించింది.
దాదాపు 999.99 డాలర్ల(దాదాపు 74 వేల రూపాయలు) విలువజేసే ఈ రోబో వృద్ధులకు సాయపడగలదని రిటైల్ దిగ్గజం అమెజాన్ వివరించింది.

ఫొటో సోర్స్, Amazon
ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది?
"ఆస్ట్రో ఆవిష్కరణ ఓ సాహసోపేతమైన చర్య. ఇలాంటి నైపుణ్యం ఉన్న రోబోలతో వినియోగదారుల రోజువారీ కార్యక్రమాల్లో మరింత భాగస్వామ్యం కావొచ్చు" అని సీసీఎస్ ఇన్‌సైట్ చీఫ్ అనలిస్ట్ బెన్ వుడ్ అన్నారు.
కొంత మంది ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా, అమెజాన్ "అత్యంత ప్రయోగాత్మక ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అయితే, వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి''అని ఆయన అన్నారు.
"ఒక సైన్స్ ఫిక్షన్ నవల నుండి వచ్చిన ఉత్పత్తులను అందించడం ద్వారా వినియోగదారులు, పెట్టుబడిదారుల దృష్టిలో అమెజాన్ ఒక వినూత్న కంపెనీగా నిలుస్తోంది" అని ఆయన చెప్పారు.
ఈ రోబో సంవత్సరం చివరలో మార్కెట్లోకి వస్తుందని అమెజాన్ చెప్పింది. కేవలం అమెరికాలో మాత్రమే లభ్యం కానుందని, కొద్దిరోజుల తర్వాత, దాని ధర 1,449.99 డాలర్ల (దాదాపు 1లక్షా 7వేల రూపాయలు)కి పెరుగుతుందని వెల్లడించింది.
"ఆస్ట్రో రోబో మార్కెట్లో అందుబాటులోకి వచ్చినప్పుడు నిమిషాల్లో అమ్ముడవుతాయని నేను నమ్ముతున్నాను" అని వుడ్ చెప్పారు. "ఇది యూకేలోకి వచ్చేందుకు ఆలస్యం అవుతుందని తెలిసి, నేను బాధపడ్డాను."

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఇంటిలోనూ సభ్యుడిగా
''రోబోటిక్స్ మార్కెట్‌లో అమెజాన్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో ప్రతి ఇంట్లోనూ ఉంటామని నమ్ముతున్నట్లు సంస్థ చెబుతోంది''అని బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్ జేన్ వాక్‌ఫీల్డ్ విశ్లేషించారు.
''ప్రతి ఇంటిలో కొత్త సభ్యుడిగా ఆస్ట్రో కావాలని కోరుకుంటోంది. ఈ చిన్న చక్రాల రోబో చాలా అందంగా ఉంది. దానిలో నుంచి వచ్చే పెరిస్కోప్ కెమెరా కొంచెం గగుర్పాటును కలిగించేదిగా ఉన్నా, ఎవరూ దాన్ని ఖండించడం లేదు.
అయితే, పెప్పర్ వంటి ఇతర అందమైన హ్యూమనాయిడ్ రోబోలు ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయాయి. ధనవంతులకు ఈ ధరేమీ అంత పెద్దది కాదు. ఇది కొంత కాలం వారి ఇళ్లలో బొమ్మగా ఉంటుంది. ఇది "అలెక్సా ఆన్ వీల్స్" కంటే ఎక్కువ అని అమెజాన్ చెబుతోంది, కానీ నిజంగా దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? మీరు మీ ఓవెన్‌ను ఆఫ్ చేశారా లేదా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
కానీ రోబోలను తయారుచేయడం కష్టం. హోమ్ రోబోటిక్స్ మార్కెట్ విస్తృతి పెరగాలంటే, ప్రజలను ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ఒప్పించగలగాలి.
ఈ మొదటి ప్రయత్నం అమెజాన్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. నిస్సందేహంగా, అమెజాన్‌లా మన ఇళ్లల్లో దృఢంగా పాతుకుపోయిన కంపెనీ మరొకటి లేదు''అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Amazon
ఆ ప్రోడక్ట్స్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు..
2018లో అలెక్సా-నియంత్రిత మైక్రోవేవ్ వంటి అసాధారణమైన స్మార్ట్ హోమ్ టెక్‌ను తయారు చేయడంతో అమెజాన్ ప్రసిద్ధి చెందింది.
గత సంవత్సరం ఈవెంట్‌లో, ఎగిరే ఇండోర్ అలారం డ్రోన్‌తో అమెజాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని పేరు ది అల్వేస్ హోజ్ క్యామ్. ఇంట్లో చొరబాటు జరిగితే ఈ డ్రోన్ గాల్లోకి ఎగురుతుంది. దానికి ఉండే కెమెరా ఓపెన్ అవుతుంది. తనిఖీ చేయడానికి ఇల్లంతా ఎగురుతూ వీడియో తీస్తుంది. కానీ ఇది ఇంకా విడుదల కాలేదు. దీని వివరాలు బయటకు కూడా రాలేదు.
ఈ డ్రోన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులను అమెజాన్ ఆహ్వానించింది. కానీ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేసే తేదీలను ఇవ్వలేదు.
ఈవెంట్‌లో ఆవిష్కరించిన ఇతర పరికరాలలో అమెజాన్ గ్లో కూడా ఒకటి. ఇదో వీడియో కాలింగ్ పరికరం. దాని ముందున్న టేబుల్‌పై లేదా నేలపై కూడా ఇంటరాక్టివ్ "టచ్‌స్క్రీన్"ను ప్రొజెక్ట్ చేయగల సామర్థ్యం దీని సొంతం.
సుదీర్ఘ వీడియో కాల్స్‌లో పిల్లలను నిమగ్నం చేయడానికి ఉపయోగపడుతుంది. టాబ్లెట్ యాప్ ద్వారా మరో వైపు బంధువులు కూడా ప్రొజెక్షన్ సహకారంతో పరస్పరం చర్చించుకోవొచ్చు.

ఫొటో సోర్స్, Amazon
ఆవిష్కరించిన ఇతర ఉత్పత్తులు
- డిస్నీనేపథ్యమున్న అలెక్సా వెర్షన్. దీనిలో డిస్నీ పాత్రల స్వరాలు ఉంటాయి. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది
- అమెజాన్ హాలో వర్కౌట్ బ్యాండ్‌కు హాలో వ్యూ అనే కొత్త మోడల్ అప్‌డేట్
- అంతర్నిర్మిత వైఫై రౌటర్‌తో కొత్త మోడల్ రింగ్ స్మార్ట్ అలారం
- "వర్చువల్ సెక్యూరిటీ గార్డ్" రింగ్ సబ్ స్క్రిప్షన్. మోషన్ డిటెక్షన్ ద్వారా ప్రేరేపించి కెమెరాలకు తనిఖీ చేయడానికి రిమోట్ ఆపరేటర్‌ని ఇది అనుమతిస్తుంది.
- ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో గేమ్ ''న్యూ వరల్డ్''ను అమెజాన్ ఆవిష్కరించింది. గత సంవత్సరం షూటర్ క్రూసిబుల్ గేమ్ ఫెయిల్యూర్ తర్వాత ఇదే పెద్ద మొత్తం వెచ్చించి చేస్తున్న రెండో ప్రయత్నం.
అయితే, క్రూసిబుల్‌లా కాకుండా, న్యూ వరల్డ్ జూలైలో జరిగిన బీటా పరీక్షలో సానుకూలమైన ఫీడ్‌బ్యాక్‌లను పొందింది. ఇది వేల మంది ఆటగాళ్లను ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి:
- 'తిరుమల శ్రీవారి పూజల విషయంలో తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు' - సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








