'తిరుమల శ్రీవారి పూజల విషయంలో తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు' - సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారని ఆంధ్రజ్యోతి ఒక వార్తా కథనం ప్రచురించింది.
''ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్వయంగా వాదనలు వినిపించిన పిటిషనర్ ఏపీకి చెందినవారు కావడంతో జస్టిస్ రమణ కొద్దిసేపు తెలుగులో విచారణ జరిపారు.
'బాలాజీ భక్తులకు సహనం ఉంటుంది. కానీ, మీకు లేదు. కేసును జాబితాలో చేర్చకపోతే చనిపోతాను... అదీ ఇదీ అంటూ రిజిస్ట్రీని రోజూ బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదు. ఏంటిది? మేము కూడా వేంకటేశ్వరస్వామి భక్తులమే' అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. స్పందించిన శ్రీవారి దాదా అత్యవసర విచారణ కోసం అలా చేశానని వివరణ ఇచ్చారు.
దాంతో ప్రధాన న్యాయమూర్తి, 'ఇందులో అత్యవసరం ఏముంది? పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో నిర్వహించాలి, ఎంతమందిని అనుమతించాలి అనే విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలా?' అని ప్రశ్నించారు. ఈ అంశంపై టీటీడీకి వినతిపత్రాలు సమర్పించానని పిటిషనర్ పేర్కొన్నారు.
ఆ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీటీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి న్యాయవాది ఏదో చెప్పబోతుండగా అడ్డుకున్న జస్టిస్ రమణ.. ''కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని పిటిషనర్ అంటున్నారు. ప్రతీ ఒక్కరికి స్వామివారిపై విశ్వాసం ఉంది. వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి'' అని అడిగారు.
వివరాలు తెలుసుకొని చెప్పడానికి కొంత సమయం ఇవ్వాలని టీటీడీ న్యాయవాది కోరారు. దీంతో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజల నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని టీటీడీని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది'' అని అని కథనంలో ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, PTI
సివిల్స్ టాపర్ సాధించిన స్కోర్ ఎంతో తెలుసా?
ఇటీవల వెల్లడైన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఫలితాల్లో సివిల్స్ టాపర్ సాధించిన స్కోర్ వివరాలతో ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
''టాపర్‌గా శుభమ్ కుమార్ నిలవగా. . జగ్రతి అవాస్థి రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. శుభమ్ మొత్తంగా 52.04 శాతం మార్కులు సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన జగ్రతి 51.95 శాతం మార్కులు పొందినట్లు తెలిపింది.
సివిల్స్‌కు ఎంపికైన వారు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్‌సీ అందుబాటులో ఉంచింది. సివిల్స్ పరీక్షలో మొత్తం 2025 మార్కులు ఉండగా.. 1750 మార్కులు మెయిన్ పరీక్షకు, మరో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. వీటిలో ఈసారి సివిల్స్ టాపర్‌గా నిలిచిన శుభమ్ కుమార్ మొత్తం 1054 మార్కులు సాధించారు. రాత పరీక్షలో 878 మార్కులు పొందగా..! ఇంటర్వ్యూలో 176 మార్కులు సాధించినట్లు. యూపీఎస్‌సీ వెల్లడించింది. తొలి ఐదు ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
తొలి ర్యాంకు - శుభమ్ కుమార్ - 1054 మార్కులు (రాతపరీక్షలో 878, ఇంటర్వ్యూలో 176)
రెండో ర్యాంకు - జాగ్రతి అవాస్థి - 1052 మార్కులు (రాతపరీక్షలో 859, ఇంటర్వ్యూలో 193)
మూడో ర్యాంకు - అంకితా జైన్ - 1051 మార్కులు (రాతపరీక్షలో 839, ఇంటర్వ్యూలో 212)
నాలుగో ర్యాంకు - యాష్ జాలుకా 1046 మార్కులు (రాతపరీక్షలో 851, ఇంటర్వ్యూలో 195)
ఐదో ర్యాంకు - మమతా యాదవ్ 10 42 మార్కులు (రాతపరీక్షలో 855, ఇంటర్వ్యూలో 187) సాధించారు.
అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఫలితాల్లో మొత్తం 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీతో పాటు 86 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్ష మూడు విభాగాల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో మొత్తం 400 మార్కులు ఉండగా.. కేవలం వీటిని స్క్రీనింగ్ టెస్టుగానే పరిగణిస్తారు. వీటిలో సాధించిన మార్కులు మెరిట్ జాబితాలో పరిగణించరు. కేవలం మెయిన్, ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగానే యూపీఎస్‌సీ మెరిట్ జాబితాను రూపొందిస్తుంది'' అని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో రెండు రెట్లు పెరిగాయని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
''మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్టు అనరాక్ సంస్థ తెలిపింది. గృహ రుణాలపై తక్కువ రేట్లు, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు పెరగడం డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ విశ్లేషించింది. క్రితం ఏడాది సరిగ్గా ఇదే కాలంలో ఇళ్ల విక్రయాలు 29,520 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, క్రితం త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లో ఇళ్ల విక్రయాలు 24,560 యూనిట్లుగా ఉన్నాయి.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణే పట్టణాల్లోని విక్రయాలపై ఓ నివేదికను అనరాక్ బుధవారం విడుదల చేసింది. ఇళ్ల ధరలు ఈ పట్టణాల్లో సగటున 3 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు రూ.5,760గా ఉంది. 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,600గా ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచే కార్యాలయ పని విధానం (డబ్ల్యూఎఫ్‌హెచ్) నివాస గృహాల డిమాండ్‌ను నిర్ణయించనున్నట్టు అనరాక్ పేర్కొంది. టీకాలను పెద్ద మొత్తంలో వేస్తుండడంతో ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశానికి వచ్చి ఇళ్లను చూసే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపింది.
హైదరాబాద్‌లో నాలుగు రెట్లు అధికం
2021 జూలై-సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2020 జూలై సెప్టెంబర్‌లో 1,650 యూనిట్లే అమ్ముడు పోగా.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య 6,735 యూనిట్లు విక్రయమయ్యాయి.
చెన్నైలో విక్రయాలు రెట్టింపై 3,405 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 10,220 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 5,200 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలోనూ అమ్మకాలు నూరు శాతానికి పైగా పెరిగి 20,965 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 58 శాతం అధికంగా 8,550 యూనిట్లు అమ్ముడుపోయాయి.'' అని అని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారీ ఇంటర్‌లో 70% సిలబసే
2021-22 విద్యాసంవత్సరానికి కూడా ఇంటర్మీడియట్‌లో 70 శాతం సిలబస్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఖరారుచేసిందని, ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డుకు లేఖను పంపించిందని నమస్తే తెలంగాణ ఒక వార్తను ప్రచురించింది.
''70 శాతం సిలబస్ అమలుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 30 శాతం తగ్గించి, 70 శాతం సిలబస్‌ను ఖరారుచేశారు. ఈ విద్యాసంవత్సరం కూడా అదే అమలుచేయనున్నారు. గతేడాది సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచగా.. ఆ సిలబస్‌కే 2022 మార్చి/ ఏప్రిల్ నెలల్లో ఫస్టియర్, సెంకడియర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా..
కరోనా ఈ విద్యాసంవత్సరంపైనా తీవ్ర ప్రభావం చూపింది. జూన్ 1న ప్రారంభంకావాల్సిన ఇంటర్ కాలేజీలు సెప్టెంబర్ ఒకటి నుంచి తెరుచుకున్నాయి. 280 రోజులపాటు కాలేజీలు నడవాల్సి ఉండగా.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలుపుకొంటే 220 రోజులు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ విద్యాసంవత్సరం సైతం 70 శాతం సిలబస్‌నే కొనసాగించడం ఉత్తమమన్న వాదనలువచ్చాయి'' అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









