‘ఒక కులం కోసం రాజకీయాల్లోకి రాలేదంటూ కాపుల గురించి ఎందుకు అడిగావు?’ - పవన్ కళ్యాణ్‌కు పోసాని కృష్ణ మురళి ప్రశ్న : ప్రెస్ రివ్యూ

పోసాని కృష్ణమురళి

ఫొటో సోర్స్, UGC

సినీనటుడు పవన్‌కల్యాణ్‌.. ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

పవన్‌ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు. పవన్‌.. మీరు జగన్‌తో పోల్చుకోవద్దు. జగన్‌ రాకముందు గవర్నమెంట్‌ స్కూళ్ల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి. పవన్‌ ఏ పార్టీతో సరిగ్గా ఉన్నావు. ఏ పార్టీని మిగిల్చావు. చిరంజీవి సంస్కారవంతుడు, గొప్ప మానవతావాది. ఆయన నోట ఎప్పుడైనా బ్యాడ్‌ మాట విన్నారా? చిరంజీవిగారి ఇంట్లో ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు? నీకు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలియదు. పవన్‌ తనే ప్రశ్నిస్తాడు, తానే జవాబు చెబుతాడు.

రిపబ్లిక్‌ ఫంక్షన్‌కు వచ్చి సీఎం జగన్‌ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నీకు ఏ క్వాలిటీస్‌ ఉన్నాయని జగన్‌ను తిడుతున్నావు? ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకంతో నీకేంటి సంబంధం. జగన్‌కు మత, కుల పిచ్చి ఉందని నిరూపించగలవా? ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లకపోయినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడి గెలిచారా?

చంద్రబాబు పరిపాలనలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా? ఎస్సీలుగా ఎవరూ పుట్టాలనుకోరు.. నాయీబ్రాహ్మణుల తోకలు కట్‌చేస్తా.. అని అన్న చంద్రబాబును నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌కల్యాణ్‌. ఎమ్మార్వో వనజాక్షిని అవమానించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు..’అని పోసాని కృష్ణమురళి నిలదీశారు.

చంద్రబాబు మంచి చేస్తే చేశాడని, చెడు చేస్తే చెడు అని తాను చెప్పానన్నారు. మోదీని కూడా మిమిక్రీ చేసిన పవన్‌కల్యాణ్‌ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ బీజేపీతో కలిశాడని చెప్పారు. ఒక కులం గురించి రాజకీయాలకు రాలేదన్న పవన్‌ మొన్న కాపుల గురించి ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ నువ్వు మారవని తెలుసు.. బాధ్యతతో మెలుగు.. అని పేర్కొన్నారని ఈ వార్తలో రాశారు.

బుల్లెట్ ట్రైన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బుల్లెట్ ట్రైన్

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్, ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ప్రతిపాదించిందని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.

నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ ఖేర్‌ తెలిపారు. అదే నెల 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు.

ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకోవచ్చు. దాంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినా 14 గంటల సమయం పడుతున్నది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తారు.

ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ నిర్మించాలని అనుకున్నారు. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై-పుణె-జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు అలైన్‌మెంట్‌ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది.

ముంబైలో భారీ రైల్వే టెర్మినల్‌ నిర్మాణానికి స్థలం లేనందున నవీముంబైలో నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడి విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్‌ నిర్మించాలని ఆలోచిస్తున్నామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ అధికారులు తెలిపారు. డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనేదానిపై స్పష్టత రానున్నది.

ప్రాజెక్టుకోసం కొత్తగా రైల్వే ట్రాక్‌ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ బుల్లెట్‌ రైలు వేగాన్ని తట్టుకోలేదు.

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 బుల్లెట్‌ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉన్నది. ముంబై-అహ్మదాబాద్‌ కారిడార్‌ను 2028లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు లైన్‌ ఏర్పాటుకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ప్రభావిత అంశాల అంచనా (సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌) చేపట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే సాగుతున్నది.

గూగుల్‌ మ్యాపింగ్‌ చివరి దశకు చేరింది. గూగుల్‌ మ్యాపింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుతం హైస్పీడ్‌ కారిడార్‌ వేగం గంటకు గరిష్ఠంగా 350 కిలోమీటర్లుగా నిర్ధారించారని ఈ కథనంలో తెలిపారు.

జీవిత రాజశేఖర్

'ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి'.. జీవిత

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

సోమవారం ఉదయం తన ప్యానల్‌సభ్యులతో కలిసి నామినేషన్‌ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. మేము వాళ్ల ముందు నిలుచున్నాం. గెలిపిస్తారా? ఓడిస్తారా? అనేది వాళ్ల హక్కు. వాళ్ల బాధ్యత. అక్టోబరు 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తాం.

‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని మంచు విష్ణు మంచి మాట చెప్పారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఇది ‘మా’ సభ్యుల మధ్య జరిగే ఎన్నిక మాత్రమే. రాజకీయ జోక్యం వద్దు’’ అన్నారు.

ఈ సందర్భంగా ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు ప్రకాశ్‌ రాజ్‌. ‘‘పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ నాయకుడు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. దేశం కోసం పోరాడుతున్నారు. ఆయన కూడా ‘మా’ అసోసియేషన్‌ మెంబరే. ఎవరు ఏం చెప్పినా మంచి కోసమే మాట్లాడతారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. దానికి వచ్చే ప్రతిఫలం బట్టి ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ, ఆవేశం ఉంటాయి. వాళ్లని మాట్లాడనివ్వండి. రాజకీయ వ్యాఖ్యలపై ఎవరూ ప్రశ్నించవద్ద’’న్నారు ప్రకాశ్‌ రాజ్‌.

‘‘చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కు ఉందనడానికి మా దగ్గర ఆధారాలు లేవు. ఆయన మంచు విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు. అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయ’’న్నారు నటి జీవిత. సోమవారం ‘మా’ జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదన్నారు.

‘‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేశా. ప్రధానమంత్రి ఎన్నికల కంటే ‘మా’ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్ని వివాదాలొచ్చినా.. మేమంతా ఒక్కటే. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నా. వ్యక్తిగత ఆరోపణలతో పరిశ్రమ పరువు దిగజార్చొద్దు. పృథ్వీ ఆరోపణలు నన్ను బాధించాయి. ఆయన వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయి. ‘మా’ అనేది తలెత్తుకుని ఉండాలి. ఎన్నికలను తప్పుదారి పట్టించొద్దు’’ అన్నారు జీవిత.

త్వరలో బ్రాహ్మణ చైతన్య యాత్ర

వైసీపీ పాలనలో బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి, బ్రాహ్మణులకు భరోసా ఇచ్చేందుకు త్వరలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా చైతన్య యాత్ర తలపెట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షు డు కాశీభట్ల సత్యసాయినాథశర్మ వెల్లడించారని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది .

సోమవారం కడపలో మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో చేర్చడం దుర్మార్గమన్నారు.

ఎన్నికల ముందు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక పింఛన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం కార్పొరేషన్‌ ఏర్పా టు చేసి, బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబు కృషి చేశారన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)