రాజస్థాన్: రూ. 6 లక్షల బ్లూటూత్ చెప్పులు, టీచర్ల అర్హత పరీక్షలలో కాపీ కొడుతూ అరెస్ట్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
- రచయిత, మొహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ కోసం, జైపూర్ నుంచి
రాజస్థాన్‌లో దాదాపు 31 వేల టీచర్ పోస్టుల కోసం సెప్టెంబర్ 26న జరిగిన 'రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్(రీట్) పరీక్షను 13 లక్షల మంది అభ్యర్థులు రాశారు.
పరీక్షల్లో ఎలాంటి మోసాలూ జరగకుండా అడ్డుకోడానికి రాష్ట్ర వ్యాప్తంగా 12 గంటలపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
కానీ, ప్రభుత్వ ప్రయత్నాలను తలకిందులు చేయడానికి అభ్యర్థులు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేశారు.
ఈ ప్రయత్నాల్లో కొందరు చెవిలో బ్లూటూత్‌తో పాటూ, చెప్పుల్లో కూడా బ్లూటూత్ డివైస్ పెట్టుకున్న విషయం బయటపడింది.
భారీగా ఎత్తున కాపీయింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్‌ను ఈ పరీక్షకు ముందే అరెస్ట్ చేసిన బికనేర్ పోలీసులు ఆ ముఠా గురించి షాకింగ్ వివరాలు వెల్లడించారు.
బికనేర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రీతి చంద్ర ఆదేశాలతో గంగాషహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూటూత్ డివైస్‌లతో కాపీయింగ్‌కు ప్లాన్ చేస్తున్న గ్యాంగ్ సహా ఐదుగురు అభ్యర్థులను పరీక్షకు ముందే(సెప్టెంబర్ 25న) అరెస్ట్ చేశారు.
వీరిని విచారించిన బికనేర్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ప్రతాప్‌గఢ్, సీకర్, అజ్మేర్‌లో కూడా బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసే ప్రయత్నంలో ఉన్న కొందరు అభ్యర్థులను అరెస్ట్ చేశారు.
"సమాచారం అందడంతో వేరు వేరు టీమ్స్ ఏర్పాటు చేశాం. అనుమానితులు ఐదుగురినీ అరెస్ట్ చేశాం. వారు అభ్యర్థులతో బ్లూటూత్ ద్వారా పరీక్ష రాయించాలని చూశారు" అని బికనేర్ ఎస్పీ ప్రీతీ చంద్రా బీబీసీకి చెప్పారు.
"ఘటనాస్థలంలో ఇద్దరు అభ్యర్థులకు డివైస్ ఇచ్చారు. వాటిని ఉపయోగించడం గురించి చెబుతున్నారు. పేపర్ పాస్ చేయిస్తామంటూ ఈ గ్యాంగ్ 25 మంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తం తీసుకున్నారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
దిల్లీలో తయారైన బ్లూటూత్ చెప్పులు
రాష్ట్రంలో రీట్ పరీక్ష సమయంలో బయటపడిన ఈ కాపీయింగ్ టెక్నిక్స్ గురించి తెలిసి చాలామంది షాక్ అయ్యారు. ఈ చెప్పులు ప్రత్యేకంగా దిల్లీలో తయారు చేయించినట్లు బయటపడింది.
హవాయి చెప్పులను మధ్య నుంచి కట్ చేసి వాటిలో వాయిస్ కాలింగ్ డివైస్ బ్యాటరీ, సిమ్ సాకెట్ సహా మిగతా సంబంధిత పరికరాలు ఫిట్ చేశారు.
"దిల్లీ నుంచి చెప్పుల్లో ఈ బ్లూటూత్ డివైస్‌లు అమర్చి రాజస్థాన్ తీసుకొచ్చారు. ఒక చెప్పులో బ్లూటూత్ డివైస్ పెట్టించడానికి వాళ్లు రూ.30 వేల రూపాయలు ఇచ్చారు" అని బికనేర్ ఎస్పీ ప్రీతీ చంద్రా చెప్పారు.
రాష్ట్రంలో 25 మంది అభ్యర్థులకు పేపర్ పాస్ చేయిస్తామని చెప్పిన ఈ గ్యాంగ్ వారికి ఈ చెప్పులు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షలకు అమ్మింది.
అంటే, 30 వేల రూపాయలకు చెప్పులు తయారు చేయించిన గ్యాంగ్ ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు వాటిని ఏడు లక్షల రూపాయలకు విక్రయించారు. అలా దాదాపు వారు రూ. కోటిన్నర వరకూ సంపాదించారు.
కాపీయింగ్ గ్యాంగ్ పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి అడ్వాన్స్‌తోపాటూ ఖాళీ చెక్కులు కూడా తీసుకున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పరీక్షా కేంద్రంలో పోలీసులు, అధికారులకు సందేహం కలగకుండా ఉండడానికి ఇలా చెప్పుల్లో డివైస్‌లు అమర్చామని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
ప్రధాన నిందితుడు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు
ఈ కాపీయింగ్ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు, బికనేర్ వాసి అయిన తులసారామ్ కాలేర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శనివారం నుంచి అతడి ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది.
పేపర్ పాస్ చేయిస్తానని, కాపీ కొట్టిస్తానని, పేపర్ ముందే తెప్పించి ఇస్తానని రకరకాల పద్ధతుల ద్వారా కాలేర్ అభ్యర్థుల నుంచి లక్షలు వసూలు చేసేవాడని పోలీసులు చెప్పారు.
పరీక్షకు రెండు రోజుల ముందే అభ్యర్థులను రహస్య ప్రాంతానికి పిలిపించిన కాలేర్, తన గ్యాంగ్ సభ్యులతో వారు పేపర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పించాడు. ఈ బ్లూటూత్ డివైస్ ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
ఇంటర్నెట్ ఆపేసినా డివైస్ పనిచేస్తుందా
చెప్పుల్లో ఉండే బ్లూటూత్ డివైస్, అభ్యర్థి చెవిలో ఉండే వాయిస్ డివైస్‌తో కనెక్ట్ అవుతుంది. అది నిరంతరం బయటున్న గ్యాంగ్ సభ్యుడి ఫోన్‌తో కనెక్టయి ఉంటుంది.
మాటలు వినడానికి చాలా చిన్నగా కనిపించే ఒక వాయిస్ డివైస్‌ను పరీక్ష రాసే అభ్యర్థి చెవిలో బయటకు కనిపించని విధంగా సెట్ చేశారు.
"ఇంటర్నెట్ ఆపివేయడంతో వీరు బ్లూటూత్ ద్వారా కాపీయింగ్ చేయించాలని ప్లాన్ వేశారు" అని ఎస్పీ ప్రీతీ చంద్రా చెప్పారు.
ఒకేసారి 25 మందితో ఫోన్లలో కనెక్టయ్యాక, వారితో పేపర్ సాల్వ్ చేయించాలని వీరు ప్లాన్ చేశారు. కానీ ఆ లోపలే బికనేర్ పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ ఎత్తులను చిత్తు చేసింది.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
చెప్పుల్లో డివైజ్‌తో పరీక్ష గది వరకూ చేరుకున్నాడు
పేపర్ పాస్ చేయిస్తామనే డీల్‌తో తాము రాష్ట్రంలోని 25 మంది దగ్గర డబ్బు తీసుకున్నామని అరెస్ట్ అయిన గ్యాంగ్ సభ్యులు బికనేర్ పోలీసుల విచారణలో అంగీకరించారు.
గ్యాంగ్ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డివైజ్‌లతో పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థుల సమాచారాన్ని అజ్మేర్, సీకర్, బికనేర్ జీన్‌విసీ ప్రాంతం పోలీసులకు ముందే అందించారు.
"ఏటీఎస్, ఎస్ఓజీ సమాచారంతో స్పెషల్ టీమ్, పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని కిషన్‌గఢ్ మదన్ గంజ్‌లోని ఒక పరీక్షా కేంద్రం నుంచి చురుకు చెందిన ఒక అభ్యర్థిని అరెస్ట్ చేశాం" అని అజ్మేర్ పోలీస్ సూపరింటెండెంట్ జగదీష్ చంద్ర శర్మ చెప్పారు.
"ఆ అభ్యర్థి కుడి కాలి చెప్పులో బ్లూటూత్ బ్యాటరీ, ఎయిర్ టెల్ 4జీ సిమ్ కార్డ్ ఉన్నాయి. సాకెట్ కూడా ఉంది. అతడిని అరెస్ట్ చేశాం" అని ఎస్పీ శర్మ చెప్పారు.
రీట్ పరీక్ష విజయవంతగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ చేపట్టింది. అయినా, కాపీయింగ్ గ్యాంగ్‌ల ద్వారా అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వరకూ చేరుకోగలిగారు. అయితే పోలీసు బృందాలు వారిని సమయానికి ముందే అరెస్ట్ చేయగలిగాయి.
కానీ, ఈ కాపీయింగ్ టెక్నాలజీలు వెలుగులోకి రావడంతో ఈ పరీక్ష రాసిన చాలా మంది అభ్యర్థులు నిరాశకు గురయ్యారు.
"ప్రభుత్వం తన స్థాయిలో పరీక్షలో కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టింది. అయినా, కాపీయింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాటి వల్ల కష్టపడి పరీక్ష రాసిన మాలాంటి వారికి కచ్చితంగా నిరాశ కలుగుతుంది" అని కరోలీకి చెందిన అభ్యర్థి ఆశా మీణా అన్నారు.
"ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జనం ఉద్యోగాల కోసం షార్ట్‌కట్స్ వెతుకుతున్నారు. ఇలాంటి వాటి వల్ల ఈ పరీక్ష కోసం రాత్రింబవళ్లూ కష్టపడిన యువతీయువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది" అని జైపూర్ అభ్యర్థి కెప్టెన్ సింగ్ కూడా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










