స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో కొండచరియ ప్రమాదాలు గుర్తిస్తున్న ఐఐటీ శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, IIT Mandi
దేశంలోని గ్రామీణ, పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపోవడం తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా భారీ వర్షాల తరువాత కొండచరియలు విరిగిపోవడం సర్వసాధారణం.
అయితే, కొండచరియ ప్రమాదాలు గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణంగా కనిపించే మోషన్ సెన్సార్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం ఈ పరికరాన్ని హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని 20కి పైగా ప్రదేశాలలో పరీక్షిస్తున్నారు.
ఇక్కడ ఏటా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుంది.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా తగ్గించేందుకు ఈ పరికరం సహాయపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యాక్సిలెరోమీటర్ అనేది ఒక రకమైన మోషన్ సెన్సార్‌లాంటిది. ఇది వేగంలో మార్పులను కొలుస్తుంది. మనం వాడే స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఇది.. దిక్సూచి, మ్యాప్‌లను ఉపయోగించడానికి, స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా తిప్పడానికి సహాపడుతుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ యాక్సిలెరోమీటర్‌లో కొన్ని మార్పులు చేసి విరిగిపడే కొండచరియలను గుర్తించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు. ఈ పరికరం తయారీకి రూ.20 వేలు ఖర్చు అవుతుందని వారు 'బీబీసీ క్లిక్' ప్రతినిధి శుభం కిషోర్‌కు చెప్పారు.
రహదారుల అనుసంధానం పెరగడం, రోడ్లపై ప్రయాణించే వాహనాల సంఖ్య ఎక్కువవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రాణనష్టం భారీగా జరుగుతోందని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన పర్యావరణ సమాచార కేంద్రం (ఈఎన్‌వీఐఎస్) ఒక నివేదికలో పేర్కొంది.
కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు కొట్టుకుపోతాయి, గృహాలు ధ్వంసమవుతాయి. ఈ ఇళ్లన్నీ ఎక్కువగా మట్టి, ఇటుకలతో నిర్మించినవే.

ఫొటో సోర్స్, Reuters
ముందస్తు హెచ్చరికలు
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కంప్యూటర్ ఇంజినీర్ డాక్టర్ వరుణ్ దత్, అతని సహోద్యోగి డాక్టర్ కేవీ ఉదయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి కదలికలను కొలవడానికి మోషన్ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నట్లు వారు చెప్పారు.
''మేము దానిని మట్టిలో పూడ్చినప్పుడు నేల కదలికలనుబట్టి యాక్సిలెరోమీటర్ కదులుతుంది. దానిపై కొంత బలప్రయోగం జరిగినప్పుడు అది తప్పనిసరిగా కదులుతుంది. నేల కదలిక పరిధిని రికార్డ్ చేయడానికి ఈ సెన్సార్ మాకు ఉపయోగపడుతుంది. కొండచరియ ప్రమాదాలకు కారణమయ్యే మట్టిలోని చిన్న స్థానభ్రంశాలను కూడా దీని ద్వారా సేకరించవచ్చు'' అని డాక్టర్ దత్ బీబీసీ ప్రతినిధి అయేషా పెరెరాతో అన్నారు.
చిన్న మట్టి కదలికలను సైతం గుర్తించి ముందస్తు హెచ్చరికలను అందించడంలో ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు.
''కొండచరియ ప్రమాదాలకు దారితీసే భూ స్థానభ్రంశాన్ని గుర్తించినప్పుడు ఇది పెద్ద శబ్దాలను విడుదల చేస్తుంది. అధికారులకు సందేశాలను పంపుతుంది. అప్పుడు అధికారులు ఆ ప్రాంతంలో తక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ పరికరం ఇప్పటికే కొంత విజయాన్ని సాధించింది'' అని ఆయన తెలిపారు.
మండి జిల్లాలోని కుట్రోపిలో కొండచరియలు విరిగిపడటం గురించి ఈ పరికరం అధికారులను అప్రమత్తం చేయగలిగింది. దీంతో పోలీసులు ఆ దారిని మూసివేసి వాహనాలను మళ్లించారు.

ఫొటో సోర్స్, AFP
ముందే పసిగట్టే సాంకేతికత
ఈ పరికరం ప్రభుత్వం నుంచి ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకుంది.
ప్రస్తుతానికైతే, కొండచరియలు విరిగిపడటానికంటే కొద్ది సమయం ముందు అధికారులను అప్రమత్తం చేసి నివాసితులను హెచ్చరించే వ్యవస్థ ఈ పరికరం వల్ల కలిగింది.
అయితే, డాక్టర్ దత్ బృందం దీన్ని మరింత అభివృద్ధిపర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ద్వారా దీన్ని మరింత మెరుగ్గా తయారు చేయాలనుకుంటున్నారు.
ఇలా చేస్తే 24 గంటలు ముందు లేదా వారం ముందుగానే కొండచరియ ప్రమాదాలను అంచనా వేయడానికి వీలుకలుగుతుంది.
2020నాటికి మరింత ఖచ్చితత్వంతో పనిచేసేలా వీటిని పరీక్షించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
''మేం సంతోషంగానే ఉన్నాం. అయితే, ఇది మరింత కచ్చితత్వంతో సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పుడు హెచ్చరికలు వీలైనంత తగ్గాలి. ప్రభుత్వం కూడా దీన్ని అర్ధం చేసుకోవడం మంచి విషయం. ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది. విస్తృతస్థాయిలో డాటా సేకరించడం వల్ల దీని పనితీరు మెరుగవుతుంది. అనుకున్నవిధంగా అన్ని జరిగితే ఇది మనకెంతో ఉపయోగపడుతుంది'' అని డాక్టర్ దత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








