నిరుద్యోగం: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేట్ మోర్గాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొత్తగా డిగ్రీలు పూర్తి చేసినవారు సంపాదనాపరులుగా మారడానికి ప్రవేశ స్థాయి(ఎంట్రీ లెవల్) ఉద్యోగాలు మార్గం అవుతుంటాయి. కానీ, చాలా మందికి వాటిలో చేరడానికి ముందు అనుభవం అవసరమవుతోంది.
ఇటీవల యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకుని మొదటి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నఎవరైనా, ఒక కొత్త, ఆందోళన కలిగించే విషయాన్ని గుర్తించవచ్చు. గతంలో వారి కోసమే ఉంటూ వచ్చిన ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి.
2017 చివర్ల నుంచి ఇప్పటివరకూ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసిన దాదాపు 40 లక్షల ఉద్యోగాల్లో 35 శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం ఆ పనికి సంబంధించి కొన్నేళ్ల అనుభవం ఉండాలని కోరినట్లు ఇటీవలి ఒక విశ్లేషణలో తేలింది.
కొన్ని పరిశ్రమల్లో ఇది మరింత మామూలైపోయింది. అలాంటి ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు లాంటివి ఉన్నాయి. ఉదాహరణకు ఆ ఉద్యోగాలకు మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల అనుభవం అడిగారు.
క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలనుకునేవారికి అందని ద్రాక్షలా మారాయి.
"మొదటి ఉద్యోగం పొందడం ఇప్పుడు గతంలో కంటే కష్టంగా ఉంది. ఉపాధి నిచ్చెనలో ఇది అత్యంత దిగువన ఉండచ్చు. కానీ, ఒక కార్మికుడి మొదటి ఉద్యోగం అతడి కెరీర్ దిశగా ఒక టోన్ సెట్ చేస్తుంది" అని ఆబమ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అలన్ సీల్స్ అన్నారు.
"మన కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయం మన మొదటి మూడేళ్లే. మన మొదటి యజమాని నాణ్యత చాలా ముఖ్యం. అందుకే అలాంటి ఉద్యోగం ఎలా పొందాలి" అంటారు సీల్స్.
దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చదువు పూర్తయినవారికి ఉద్యోగాల్లో చేరడానికి ప్రేరణ, కాలేజీ డిగ్రీ కంటే ఎక్కువగా ఏదో కావాలి.
అంటే, ఇంటర్న్‌షిప్స్ చేయడం లేదంటే అల్గోరిథం ఫిల్టర్ చేసేయకుండా క్లిష్టమైన అప్లికేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకోడానికి అవసరమైన సంబంధాలు కలిగి ఉండడం.
కానీ, ప్రతి ఒక్కరూ అలాంటి ప్రయోజనాలు పొందలేరు. ఫలితంగా అలాంటి వారు వెనకబడిపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న ఇంటర్న్‌షిప్‌లు
ఇంటర్న్‌షిప్ మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతుండడంతో చాలా మంది విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీలు వదిలేలోపే తమ రెజ్యూమేలు పంపుతున్నారని సీల్స్ చెప్పారు.
చాలా మంది విద్యార్థులు ఇప్పుడు మొదటి సంవత్సరం కాగానే మొదటి ఇంటర్న్‌షిప్ పొందుతున్నారని ఆయన గుర్తించారు.
"ఇప్పుడు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు అంటే అవి ఇంటర్న్‌షిప్‌లే. కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడం లేదా ఆ ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్‌లు చేయడం సర్వ సాధారణం" అని చెప్పారు.
ఈ వాస్తవం ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మార్కెట్ మీద రకరకాల ప్రభావం చూపిస్తోంది.
వీటిలో మొదటిది.. కంపెనీలు ఒక పని కోసం జూనియర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంటర్న్‌షిప్‌లు ఉపయోగించి డబ్బు మిగుల్చుకోవచ్చు.
"కంపెనీలకు ఎంత ఎక్కువగా ఇంటర్న్‌లు ఉంటే, ఆ కంపెనీ నుంచి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు అంత తక్కువగా ఉంటాయి" అంటారు సీల్స్.
ఇక రెండోది, రెజ్యూమేలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్‌లు ఉన్న దరఖాస్తుదారులకు ఉద్యోగం పొందడం పెద్ద కష్టం కాదు. కానీ, ఎలాంటి ఇంటర్న్ షిప్ అనుభవం లేనివారు వెనకబడిపోతారు. జీతాలు లేకుండా లేదా తక్కువ మొత్తం చెల్లించే ఇంటర్న్‌షిప్ భరించలేని విద్యార్థులకు, లేదా ఇంటర్న్‌షిప్ పొందలేని వారికి అలా జరగవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఇంటర్న్‌షిప్ పొందడానికికూడా ఇంటర్న్‌షిప్ చేయాల్సుంటుంది. మనం జాతి మైనారిటీ వర్గానికి చెందినవాళ్లమైతే అది కూడా కష్టమే అంటారు సీల్స్
2020 ఫిబ్రవరిలో ఆయన సహ రచయితగా చేసిన ఒక అధ్యయనంలో నల్లజాతి వారిలా అనిపించే పేర్లున్న ఇంటర్న్‌షిప్ దరఖాస్తుదారులకు యాజమాన్యాలు స్పందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, వారిలో ఎక్కువగా ఇంతకు ముందు ఇంటర్న్‌షిప్ చేసిన వారినే తీసుకోవచ్చని తేలింది..
దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఎక్కువగా ప్రధాన నగరాలకు దగ్గరే ఉన్నాయనేది మరో నిజం. అంటే అప్పటికే అక్కడ నివసించని వారికి, అక్కడికి మకాం మార్చలేని వారికి ఆ అదృష్టం లేనట్టే లెక్క.
అమెరికాలో ఇది ఒక సమస్యగా మారింది. ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ అన్నీ తీర ప్రాంతాల్లో ఉంటాయి. అవి సామాన్యులు నివసించలేని విధంగా దేశంలోనే ఖరీదైన ప్రాంతాలు. ఇంటర్న్‌షిప్స్ లేని ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో చదువుతుంటే, మీరు ఇప్పుడు ఖరీదైన ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్ సంపాదించడంతోపాటూ, ఒక వేసవిలో ఆ ప్రాంతంలో ఉండడానికి అయ్యే ఖర్చులు కూడా భరించగలగాలి.
వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాలకు చేరుకోవడం ఎలా అనే జ్ఞానం లేకపోతే.. మీరు వెనకబడిపోతారు అంటారు సీల్స్.

ఫొటో సోర్స్, Getty Images
ఆటోమేటెడ్ ఆఫీస్
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారింది ఇంటర్న్‌షిప్‌లు మాత్రమే కాదు. వేతనాల అవసరమే లేకుండా అదే పనిని చేసే టూల్స్, టెక్నాలజీలు పరిచయం చేయడంతో, ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో చాలావాటిని ఇటీవల కొన్ని దశాబ్దాలుగా తొలగిస్తూ వచ్చారు.
ఆటోమేషన్ వల్ల 30 ఏళ్ల క్రితం ఎంట్రీ లెవల్‌గా చెప్పిన వాటిలో చాలా ఉద్యోగాలు పోయాయని అమెరికాలో కొత్త గ్రాడ్యుయేట్ల కోసం ఉద్యోగాలు చూసిపెట్టే అవెనికా సీఈఓ స్కాట్ టెడ్‌మాన్ అన్నారు.
"ప్రొడక్ట్ రీసెర్చ్, షెడ్యూలింగ్, ఆఫీస్ వస్తువులు ఆర్డర్ ఇవ్వడం, ప్రెజెంటేషన్స్ లాంటి పనులన్నింటి గురించీ ఆలోచించండి. ఒకప్పుడు ఇవే పనులు కొన్ని బృందాలు చేస్తుండేవి. ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వచ్చింది. ఒకప్పుడు ఒక గ్రూప్ ఉద్యోగులు చేస్తూ వచ్చిన ప్రజెంటేషన్ పనిని ఇప్పుడు ఒక ఉద్యోగి కొన్ని గంటల్లో చేయగలుగుతున్నాడు. మనం చాలా తక్కువ మందితో ఎక్కువ పని చేయగలం అనే ఒక ఆశావాదాన్ని ఇది పెంచింది" అంటారు డెట్‌మాన్.
ఎంట్రీ లెవల్లో మిగిలిన ఉద్యోగాలకు తరచూ మరింత వ్యక్తిగత సంప్రదింపులు, ఉన్నత స్థాయి బాధ్యతలు లేదా వినియోగదారులతో మాట్లాడ్డం లాంటివి అవసరం. అందుకే అలాంటి ఉద్యోగాలకు కొత్తగా వచ్చిన గ్రాడ్యుయేట్లను కంపెనీలు నమ్మలేవు.
ఇప్పుడు కస్టమర్ సర్వీస్, క్లెయిమ్స్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లాంటి ఉద్యోగాలే ఉన్నాయి అంటారు డెట్‌మెన్.
"కానీ ఆ పనులకు కూడా వేరే కష్టాలు ఉన్నాయి. అలాంటి పనుల్లో చేరే ముందు వారికి ఆ రంగం గురించి కొంత పరిజ్ఞానం ఉండాలి. అందుకే, కాలేజీల నుంచి అప్పుడే బయటికొచ్చేవారిని తీసుకోడానికి కంపెనీలు వెనకాడడం పెరుగుతోంది. రెండేళ్ల అనుభవం ఉంటే చాలు, మేం వారిని సంతోషంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం అని చెప్పిన ఎగ్జిక్యూటివ్‌లతో నేను మాట్లాడాను" అన్నారు
ఉద్యోగ నియమాకాల జాబ్ అప్లికేషన్ కూడా ఆటోమేటెడ్ అయ్యింది. దానివల్ల అభ్యర్థులు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తగినవారే అయినప్పటికీ, వారు తమ రెజ్యూమేలో సరైన పదాలు ఉపయోగించలేకపోతే, ఆ ఉద్యోగం పొందడం మరింత కష్టం అవుతోంది.
నియామకాల ప్రక్రియల్లోనే చాలా సమస్యలున్నాయి అంటారు డెట్‌మాన్
"మనం దీనిని చాలా ఈజీ చేసేశాం. అప్లికెంట్స్ ఈజీ అప్లై నొక్కుతారు. గంటలో 200 ఉద్యోగాలకు అప్లై చేసేస్తారు. ఇలా వేల అప్లికేషన్లు ఆయా కంపెనీలను ముంచెత్తుతున్నాయి. అందుకే చాలా కంపెనీలు అభ్యర్థులను ఏరివేయడానికి కంపెనీలు అల్గారిథమ్స్ మీద ఆధారపడుతున్నారు. అలా వారు కీలకమైన విషయాలు, కీలక నైపుణ్యాలు, అవసరమైన వాటినే గుర్తించడం ప్రారంభిస్తారు" అన్నారు.
ఇలాంటి వాటివల్ల కొందరికే దొరకడం, లేదంటే అసలు ఇంటర్న్‌షిప్ లేకుండా చేస్తుంది. పెద్దగా పేరున్న విద్యా సంస్థల్లో డిగ్రీ చేయకపోవడం కూడా అభ్యర్థులకు ప్రతికూలతగా మారుతుంది. దానికి తోడు సగటు మార్కులతో పాసైన అభ్యర్థుల రెజ్యూమేలో ఆ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, అనుభవాలు ఉండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వచ్చేవారి నైపుణ్యాల స్థాయి కూడా యాజమాన్యాలను అసంతృప్తికి గురిచేస్తోంది అంటారు డెట్‌మాన్.
"అందుకే వారిని తీసుకుని దిద్దుబాటు చర్యలకు ప్రయత్నించడానికి బదులు, వాళ్లు అనుభవం, నైపుణ్యం ఉన్న వారినే తీసుకోవాలని అనుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఉద్యోగాల కోసం కంపెనీలు అడిగే నైపుణ్యాల సంఖ్య 20 శాతం పెరగడం మేం చూశాం" అని ఆయన చెప్పారు.
లోపాలతో నిండిన వ్యవస్థ
ఇవన్నీ కలిసి ఎంట్రీ లెవల్ జాబ్ మార్కెట్‌ను చాలా కష్టంగా మార్చేశాయి. ఒక విద్యార్థి కాలేజీ నుంచి బయటికి రాగానే, తాను కోరుకున్న రంగంలో కీలక పాత్ర పోషించేలా ఉండలేకపోవడం అనేది వారి కెరీర్ మీద సుదీర్ఘ కాలం చాలా ప్రభావితం చేస్తుంది.
"డేటా, గణాంకాల ద్వారా అది కచ్చితంగా కనిపిస్తోంది. చదువు పూర్తి చేసుకున్న 43 శాతం గ్రాడ్యుయేట్లు ప్రస్తుతం తమ అర్హతలకు తగిన ఉద్యోగం చేయడం లేదు" అంటారు డెట్‌మాన్.
రాబోయే ఐదేళ్లలో అలాంటి గ్రాడ్యుయేట్లలో మూడింట రెండు వంతుల మంది తమ చదువు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు చేయలేరని అదే అధ్యయనంలో తేలింది.
"అర్హతకు తగిన ఉద్యోగాలు చేసేవారిలో, తమ డిగ్రీలతో సంబంధం లేని పనులు చేస్తున్న వారిలో వేతనాల తేడా దాదాపు 22 శాతం ఉంది. ఉపాది మొదటి దశాబ్దంలో కోల్పోయిన సంపాదనలో ఇది లక్ష డాలర్లకు పైనే" " అని డెట్‌మాన్ అంటున్నారు.
ఇది ఆర్థిక అసమానతను శాశ్వతం చేస్తుంది. ఎందుకంటే ఇంటర్న్‌షిప్‌లు చేయని లేదా భరించలేని వారిని అది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు కనీస వేతనం లేదా సర్వీస్ జాబ్ లాంటివి చేసినవారికి, గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత వారి అర్హతకు తగిన ఉద్యోగం పొందలేకుండా చేస్తుంది.
దిగువ తరగతికి చెందిన వారు కావడం ఒక అడ్డంకి కావచ్చు అని సీల్స్ అంటున్నారు.
"కాంపస్‌లోనే ఫుడ్ సర్వీస్ లాంటి వాటిలో ఏదైనా ఉద్యోగం చేయడం అనేది మీకు నష్టం కలిగిస్తుందని మేం గుర్తించాం. అది వారి తరగతిని సూచిస్తుందని నాకు అనిపిస్తోంది. మనకు అసమానత కారణాల్లో ఇది ఒక భాగం. అలాంటి చాలా మందిని ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు దూరం పెట్టేస్తారు".

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏంటి?
ఇది చాలా లోపభూయిష్ట వ్యవస్థ అంటారు సీల్స్. కానీ అది మారేవరకూ, దాని చుట్టూనే పనిచేయడానికి మార్గాలు ఉన్నాయని చెప్పారు.
"మీరు కాలేజీ నుంచి బయటికొచ్చి, మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించలేకపోతే, ఒక రెస్టారెంట్, లేదా కెపేల్లో పని చేస్తే, దానిని మీ రెజ్యూమేలో పెట్టకండి" అంటారు సీల్స్.
తర్వాత వేరే ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేసినపుడు, అలాంటి సేవలు లేదా రిటైల్ ఉద్యోగాల గురించి రెజ్యూమేలో పెట్టడం వల్ల మీకు నష్టం కలగవచ్చు అని ఆయన చేసిన అధ్యయనంలో తేలింది.
ఇక, ఆటోమేటెడ్ జాబ్ సెర్చ్ సిస్టమ్ అల్గారిథంను హ్యాక్ చేసే విషయానికి వస్తే దాని ద్వారా వెళ్లడం కంటే దాన్ని తప్పించుకుని వెళ్లడమే మంచిదని డెట్‌మాన్ చెబుతున్నారు.
ఇప్పుడు ఆ జాబ్ ఎవరు చేస్తున్నారో చూడండి. వాళ్లతో మాట్లాడండి. ప్రతి కంపెనీ తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఆదే జాబ్ చేస్తున్న వారు రెఫర్ చేసేవారిని ఇంటర్వ్యూలు చేస్తుంటాయి. ఆటోమేటెడ్ వ్యవస్థ లోంచి వెళ్లకుండా దాన్ని తప్పించుకోడానికి ఇది ఒక మంచి దారి. మీ రెజ్యూమేను వాళ్ల మేనేజర్‌కు రెఫర్ చేయగలరేమో అలాంటి వారిని అడగండి. అప్పుడు కంపెనీకి నిజంగా మీ అర్హతలు, నైపుణ్యాలు ఏంటనేది తెలుస్తుంది".
మహమ్మారి తర్వాత ఈ వ్యవస్థ మారుతోందనే ఒక ఆశపెట్టుకోవచ్చు అనడానికి ఒక కారణం ఉంది. పవర్ పాయింట్ వల్ల పోయిన ఉద్యోగాలు మళ్లీ భర్తీ కావడం లేదు. కానీ, అంతటా రిమోట్ వర్క్ పెరుగుతోంది. అంటే, ఇంటర్న్‌షిప్‌లకు, మహానగరాల బయటకు విస్తరించే నియమాకాల కోసం యాక్సెస్ మరింత పెరిగింది.
కొనసాగుతున్న మహమ్మారి ఎంట్రీ లెవల్ జాబ్స్‌తోపాటూ నిజానికి ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, వాటి అవసరాలను, వేతనాలను కూడా కుదిపేసింది. అందుకే, మరిన్ని మార్పులు జరగాల్సి ఉంది.
డిగ్రీలు పూర్తి చేసిన వారు వారి అర్హత కంటే తక్కువ పనులు చేయకుండా దూరంగా ఉంచడానికి ఒక పెద్ద నమూనా మార్పు అవసరం అవుతుంది అంటారు డెట్‌మాన్.
అంటే, ఉద్యోగాలకు అప్లై చేసే వారందరినీ ఒకే గాటన కట్టే వ్యవస్థలన్నిటినీ దూరం చేయడం, ఆయా ఉద్యోగాలకు నిజంగా ఏ నైపుణ్యాలు అవసరమో వాటిని మళ్లీ పరిశీలించడం, సంబంధిత ఉద్యోగాలకు అనుభవం అనే మాట గురించి ఇంకా వివరంగా చెప్పడం లాంటివి ఉండాలి.
"నేను అల్గోరిథంకు వ్యతిరేకం కాదు. కానీ మనం ఉద్యోగాల వివరణలు పేలవంగా ఉన్నప్పుడు, మన రెజ్యూమేలు మన పూర్తి కథను చెప్పలేనప్పుడు మన దగ్గరున్న డేటా అసంపూర్తిగానే ఉంటుంది. మెరుగైన నియామక పద్ధతుల్లో ఒక వ్యక్తి రెజ్యూమేలో అతడికి ఎన్నేళ్ల అనుభవం, ఏమేం టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నాయో చూడ్డానికి బదులు, వారు ఏమేం విజాయలు సాధించారు, అతడి లక్షణాలు, సామర్థ్యం మీద ఫోకస్ పెట్టవచ్చు" అని చెప్పారు.
"ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పునర్నిర్మించడం, వాటిలో మళ్లీ నియమాకాలు కొనసాగడం అంటే రెజ్యూమేకు దూరంగా ఉండేలా చేయడం, నిజానికి ఆ సంభాషణను "అసలు ఇతడు ఎవరు" అనేలా మార్చడమే" అంటారు డెట్‌మాన్.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











