యువకులకు డిగ్రీ మీద తగ్గుతున్న మోజు.. ఇంటర్ కాగానే ఉద్యోగాల వేట - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువకులు డిగ్రీ లాంటి ఉన్నత చదువులపై ఆసక్తి చూపడంలేదని.. ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారిలో చాలామంది నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వేతనం వచ్చే ఉద్యోగాలు లేదా ఉపాధి చూసుకుంటున్నారని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపకుండా తక్షణ ఉపాధికి వీలుండే హోటల్ మేనేజ్‌మెంట్, హస్పిటాలిటీ లాంటి స్వల్పకాలిక కోర్సుల్లో చేరుతున్నారు.
అయితే యువతులు మాత్రం ఉన్నత చదువులపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంజనీరింగ్ లాంటి కోర్సులతోపాటు బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి సాధారణ డిగ్రీ కాలేజీల్లో కూడా భారీగానే చేరుతున్నారు.
దోస్త్ అధికారుల గత మూడేళ్ల అడ్మిషన్ నివేదికలు ఈ విషయాలను స్పష్టంచేస్తున్నాయి. 2017 విద్యాసంవత్సరంలో 90,696 మంది యువకులు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందితే.. యువతులు 1,10,109 మంది ప్రవేశాలు పొందారు.
2018లో యువకులు 94,483 మంది ప్రవేశాలు పొందితే.. యువతులు 1,07,384 మంది ప్రవేశాలు పొందారు. 2019లో ఇప్పటివరకు యువకులు 87,645 మంది ప్రవేశాలు పొందితే.. యువతులు 1,01,855 మంది ప్రవేశాలు పొందినట్లు దోస్త్ -2019 కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
సాధారణ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువగా బీకాంలో, ఆ తర్వాత బీఎస్సీలో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ కోర్సుల్లో కూడా యువకుల కంటే యువతులే ఎక్కువగా చేరుతున్నట్టు దోస్త్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఓటరు కార్డుకు ఆధార్ లింక్: కేంద్రాన్ని కోరిన ఈసీ
ఒక వ్యక్తికి ఒకటికి మించి ఉండే ఓటరు కార్డులకు చెక్ పెట్టే ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) కోరినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో సవరణలు చేయాలని కోరుతూ న్యాయ మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. ఇలా అధికారం కట్టబెడితే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారితో పాటు, ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ కార్డుల నంబర్లు తీసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంది.
నిజానికి ఈ ప్రతిపాదన గతంలోనే తెరపైకి వచ్చింది. అందుకోసం ఈసీ ప్రత్యేక కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే చట్టపరమైన అనుమతి లేకుండా ఏ సంస్థా ఎవరి ఆధార్ కార్డుల వివరాలూ సేకరించకూడదని 2015 ఆగస్టులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఆ ప్రతిపాదన మూలన పడింది.
దీనిని అధిగమించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో సవరణలు చేయాలని ఈసీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదన అమలైతే ఒక వ్యక్తి ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండకుండా నివారించే అవకాశం ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పల్లెకూ మానసిక వైద్యం: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
దేశంలో పల్లె ముంగిటకు మానసిక వైద్యాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. తాజాగా దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయి నుంచి మానసిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన పీహెచ్‌సీల్లో చికిత్సను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
వారానికి ఒకరోజు ప్రత్యేకంగా ఈ చికిత్సల కోసమే ఓపీ నిర్వహించాలని భావిస్తున్నారు. వీరికి అవసరమైన ఔషధాలను కూడా అందుబాటులోకి తేనున్నారు. మానసిక వైద్యనిపుణుడి సలహా అవసరమని భావిస్తే.. టెలీమెడిసిన్ విధానంలో సలహాలు, సూచనలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకవేళ ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే.. అప్పుడు ఉన్నతస్థాయి వైద్యశాలకు తరలిస్తారు. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించినట్లు వైద్యవర్గాలు చెప్పాయి. ఈ మేరకు పీహెచ్‌సీల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత పీహెచ్‌సీల్లో.. ఆ తర్వాత జిల్లా స్థాయిలో చేపట్టే ఈ చికిత్సలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చనుంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఆటో' రంగంలో కొలువుల కోత.. వచ్చే త్రైమాసికంలో ఐదు లక్షల ఉద్యోగాలకు ఎసరు!
ఉత్పత్తుల డిమాండ్ పడిపోవడం, కొనుగోలు శక్తి క్షీణించడం, ఉద్యోగాల కోతలాంటి అంశాలు ఆర్థిక మాంద్యం లక్షణాలనీ, ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో భారత ఆటోమొబైల్ రంగంలో కొలువుల కోత దడ పుట్టిస్తోందని.. 'నవ తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వాహనాల అమ్మకాలు భారీగా కుంటుపడటంతో వాహన తయారీ సంస్థలు రక్షణాత్మక చర్యలకు దిగుతున్నాయి. ఉద్యోగాల్లో కోతపెడుతున్నాయి. వాహనాల పరిశ్రమ వృద్ధి పడిపోయిందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) డైరెక్టర్ విన్నీ మెహెతా తెలిపారు. ఫలితంగా గతకొన్ని నెలల్లో దాదాపు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు.
ఈ ధోరణులు ఇలాగే మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే.. పది లక్షల ఉద్యోగాలపై వేటు పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వివరించారు. రిక్రూట్‌మెంట్ సంస్థ ఎక్స్‌ఫెనో, టీమ్ లీజ్ సంస్థలూ ఇదే తరహా అంచనాలను కలిగి ఉన్నాయి. వచ్చే త్రైమాసికంలో ఈ రంగంలో దాదాపు ఐదు లక్షల కొలువులు కొండెక్కనున్నాయని అంచనా వేశాయి.
వచ్చే త్రైమాసికంలో మరో 15 శాతం అంటే.. దాదాపు 7.5 లక్షల మంది కార్మికులను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడవచ్చని ఏసీఎంఏ అధ్యక్షులు రామ్ వెంకటరమణి హెచ్చరించారు.
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. ఈ కార్మికుల ఒప్పందాలను రెన్యువల్ చేయకపోవడంతో మూడు వేల మంది ఒప్పంద కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మెన్ ఆర్‌సీ భార్గవ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దాదాపు 1,500 మంది ఒప్పంద కార్మికులను తొలగించినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆదివారం తెలిపింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత మందిని తొలగించాల్సి వస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- పెహ్లూ ఖాన్‌పై మూక దాడి కేసు: నిందితులను కోర్టు ఎందుకు వదిలేసిందంటే..
- కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఏం జరిగింది...
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- మోదీ ప్రభుత్వానికి లక్ష కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








