Pak Vs NZ: పాక్ పర్యటనతో ముప్పుందని న్యూజీలాండ్‌కు ఎవరు నిఘా సమాచారం ఇచ్చారు?

న్యూజీలాండ్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, PCB

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజీలాండ్ క్రికెట్ జట్టు శుక్రవారం మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

భద్రతాపరమైన కారణాల వల్లే టోర్నీని రద్దు చేసుకుంటున్నట్లు న్యూజీలాండ్ జట్టు స్పష్టంచేసింది.

అయితే, న్యూజీలాండ్ జట్టుకు పొంచివున్న భద్రతా ముప్పులేంటి? పాక్ భద్రతా సంస్థలకు వీటి గురించి తెలియదా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.

క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని న్యూజీలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి కూడా చెప్పారు. అయినప్పటికీ జెసిండా ఈ టోర్నీకి అంగీకరించలేదు.

క్రికెటర్లకు ముప్పు పొంచి ఉందని ఐదు దేశాల నిఘా సంస్థల కూటమి నుంచి సమాచారం అందడంతోనే ఈ టోర్నీని రద్దు చేసుకోవాలని న్యూజీలాండ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్ నిఘా సంస్థల కూటమి ఈ సమాచారం ఇచ్చినట్లు వార్తల్లో పేర్కొన్నారు.

‘‘ఈ నిఘా సమాచారంపై న్యూజీలాండ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు దాదాపు 12 గంటలపాటు చర్చలు జరిపాయి. చివరగా టోర్నీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి’’

మరోవైపు వచ్చే నెలలో పాక్‌కు రాబోతున్న ఇంగ్లండ్ జట్టు పర్యటన కూడా రద్దు కావచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు కూడా పాక్‌ పర్యటనకు రావాల్సి ఉంది. తాజా పరిణామాల నడుమ ఆ పర్యటనపై కూడా అనిశ్చితి నెలకొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)