Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి.

ఈ మార్పులతో మీ బిల్లు చెల్లింపులు ప్రభావితం అవుతాయి. ఈ అంశంపై వచ్చే అనేక సందేహాలకు హైదరాబాద్‌కి చెందిన ఆర్ధిక, పెట్టుబడుల నిపుణులు నాగేంద్ర సాయి బీబీసీ ప్రేక్షకులకు అందించిన సమాధానాలు చూద్దాం.

అసలేంటీ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే?

మన అవసరాల కోసం రకరకాల కంపెనీలకు బిల్లులు కడతాం. కరెంటు, ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ వీడియో సేవలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల చదువుల కోసం వివిధ యాప్‌లు.. ఇలా చాలా వాటికి డబ్బు చెల్లిస్తాం. కొన్నిటిని నెలకు, కొన్ని మూడు నెలలకూ, కొన్ని ఏడాదికి ఒకసారి చెల్లిస్తాం. మనం ఆ బిల్లు సమయానికి చెల్లించడం మర్చిపోతే ఆ సర్వీసు ఆగిపోతుంది. ఆలస్యం అయితే అదనపు చార్జీ పడుతుంది. అలా కాకుండా ఆ బిల్లు మనకు అందగానే, మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నుంచో లేదా మన వ్యాలెట్ నుంచో నేరుగా ఆ బిల్లు మొత్తం కట్ అయ్యేలా ఒక ఏర్పాటు చేయవచ్చు. దీన్నే స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. ఆటో డెబిట్ అనే పేరుతో ఇది పాపులర్.

ఆర్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు ఆర్బీఐ ఏం మారుస్తోంది?

ఆన్‌లైన్లో జరిగే ప్రతీ వాయిదాకీ అడిషినల్ ఫాక్టర్ అథెంటికేషన్ (రెండుసార్లు ఓకే చెప్పడం) (ఓటీపీ ద్వారా) ఉండాలనేది ఆర్బీఐ నిబంధన. కానీ, ఈ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్న సందర్భంలో బిల్లు వసూలు చేసే కంపెనీ వారు ఇలా డబుల్ ఓకే లేకుండానే నెలనెలా డబ్బు వసూలు చేసుకోవచ్చు.

ఇకపై ఆ పద్ధతి చెల్లదని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే మనం ఆన్‌లైన్లో చెల్లించే ప్రతీసారీ మనం ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తేనే డబ్బు మన కార్డ్ నుంచి కట్ అయ్యేలా ఉండాలనేది ఆర్బీఐ కొత్త రూల్. దీనివల్ల కష్టమర్లకు భరోసా, భద్రత ఉంటుందనేది ఆర్బీఐ విధానం.

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పటి నుంచి అమలు అవుతుంది?

వాస్తవానికి 2020వ సంత్సవరం నుంచీ ఆర్బీఐ ఇందు కోసం ప్రయత్నం చేస్తోంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు కావాల్సి ఉంది. కానీ అప్పటికి చాలా బ్యాంకులు ఈ విషయమై సాఫ్ట్‌వేర్ పరంగా సిద్ధం కాలేదు. దీంతో బ్యాంకుల సంఘం వారి విజ్ఞప్తి మేరకు అమలును వాయిదా వేసింది ఆర్బీఐ. తాజాగా 2021 అక్టోబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.

అన్ని బ్యాంకులూ ఈ విధానాన్ని అమలు చేయబోతున్నాయా?

ఇప్పటికే 75 శాతానికి పైగా బ్యాంకులు ఈ విధానానికి సన్నద్ధం అయ్యాయి. మిగిలిన చిన్నా చితకా బ్యాంకులు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఆ బ్యాంకుల ఖాతాదారులకు కాస్త ఇబ్బంది తప్పక పోవచ్చు.

అయితే అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతికి రెడీగా ఉన్నాయి. చాలా వరకూ బ్యాంకులు, కార్డ్ కంపెనీలు (మాస్టర్, వీసా, రూపే) వారు తమ సర్వర్లలో మార్పులు ఇప్పటికే చేశారు.

అంతేకాదు తమ కష్టమర్లకు ఈ విషయమై మెసేజీలు, మెయిల్స్ కూడా పంపారు. భారతదేశంలో సుమారు 90 కోట్ల వరకూ క్రెడిట్, డెబిట్ కార్డులుంటాయని అంచనా. వాటన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మొబైల్ వ్యాలెట్లు (పేటీఎం, మొబి క్విక్ మొదలైనవి) వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

డెబిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు నెలానెలా కడుతోన్న లోన్ ఈఎంఐలు కూడా ఆగిపోతాయా?

ఇప్పటికే మీరు చెల్లిస్తోన్న లోన్ వాయిదాలపై ఈ ప్రభావం ఉండదు. దీనికి కొత్త మార్పులతో సంబంధం లేదు. హౌసింగ్, పర్సనల్ సహా ఏ లోన్ పైనా ఈ ప్రభావం ఉండదు.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల కోసం అకౌంట్ నుంచి కట్ అయ్యే ఎమౌంట్లకు కూడా ఇది వర్తించదు. అవన్నీ యథాతథంగా జరుగుతాయి. (అలా ఎందుకంటే, లోన్ తీసుకునేప్పుడే మన అకౌంట్ నుంచి వాయిదా మొత్తం కట్ చేయడానికి అనుమతి ఇస్తూ బ్యాంకు వారికి కొన్ని పత్రాలు, చెక్కులు అందిస్తాం కాబట్టి అది భద్రంగా జరుగుతున్నట్టు లెక్క).

మనం ఒక వెబ్ సైట్లో ఒక బిల్లు కట్టడం కోసం స్టాండిగ్ ఇన్‌స్ట్రక్షన్ (ఆటో డెబిట్) పెడితే, అక్టోబరు ఒకటి తరువాత ఏం జరుగుతుంది? మనం మాన్యువల్‌గా బిల్లు చెల్లించాలా?

డెబిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి

  • ఒకవేళ మీ బిల్లు 5 వేల రూపాయల లోపు అయితే, మీ బిల్లు చెల్లించడానికి ఒక రోజు ముందు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఆప్షన్లు ఉంటాయి. ‘‘బిల్లు చెల్లించండి, బిల్లు చెల్లించవద్దు, బిల్లు చెల్లింపు పద్ధతిలో మార్పులు చేయండి’’ వంటి మూడు ఆప్షన్లు అడుగుతుంది. మీరు మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదీ ఎంపిక చేయకపోతే అప్పుడు, 24 గంటల తరువాత ఆ బిల్లు చెల్లింపు ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. చెల్లింపు ఆగదు. కానీ గుర్తుంచుకోండి, ఇది 5 వేల రూపాయల లోపు మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఒకవేళ మీ బిల్లు 5 వేల రూపాయల కంటే ఎక్కువ అయితే, అప్పుడు కూడా మీకు 24 గంటల ముందు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తేనే ఆ బిల్లు పే అవుతుంది. లేదంటే ఆ బిల్లు పే అవదు. తరువాత మీరు వేరుగా చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం వ్యవహారంలో జరిగే అతి పెద్ద మార్పు ఏమిటంటే, మీరు నెల నెలా బిల్లు చెల్లింపులు గుర్తు పెట్టుకోనక్కర్లేదు. కాకపోతే, ఎమౌంట్ దానికదే కట్ అయితుందిలే అని అనుకోకూడదు. సదరు బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి పే చేయడమో లేదా వదిలేయడమో చేయాలి. అలాగని వెంటనే చేయనక్కర్లేదు. దానికి కొన్ని గంటల సమయం ఉంటుంది.

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ మార్పుతో మీరు బిల్లులు మిస్ అవకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

బ్యాంకులు, కార్డులు, వ్యాలెట్ల కంపెనీలకు మీరు రోజూ వాడే ఫోన్ నంబర్, మెయిల్ ఐడి ఇవ్వాలి. వాటికి ఆయా సంస్థలు పంపే మెయిల్స్ లేదా మెసేజీలు జాగ్రత్తగా చదవాలి. వారి సూచనలు ఫాలో అవ్వాలి.

ఉదాహరణకు మీరు పాత నంబర్ ఇచ్చి ఉంటే, పాత మెయిల్ ఐడి ఇచ్చి ఉంటే మీరు నోటిఫికేషన్ చూడకపోతే అప్పుడు ఆ బిల్లు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో మీరు ఆ బిల్లు ఇచ్చే సంస్థ వెబ్ సైట్లోకి వెళ్లి నేరుగా పే చేయడం ఉత్తమం.

కష్టమర్ కి వచ్చే అదనపు లాభం ఏంటి?

చాలా మంది తాత్కాలిక అవసరం కోసం కొన్ని వెబ్ సైట్లను సబ్ స్క్రైబ్ చేస్తారు. దీంతో అవి ప్రతీ నెలా లేదా నిర్ణీత సమయానికి కొంత మొత్తాన్ని కట్ చేసుకుంటూ పోతాయి. ఇకపై అలా అనవసర చెల్లింపులు ఉండవు. అలాగే కొంత మంది కొన్ని సర్వీసులు వదులుకోవాలనుకుంటే (అన్ సబ్ స్క్రైబ్ లేదా డిస్కంటిన్యూ చేయడానికి) , చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇకపై ఆ బాధ కూడా ఉండదు. పేమెంట్ డినై చేస్తే చాలు.

అదే సందర్భంలో తప్పనిసరి పేమెంట్ల విషయంలో కాస్త గుర్తుంచుకుని చెక్ చేసుకుంటుంటే ఏ సమస్యా ఉండదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం, కరెంటు బిల్లుల వంటి వాటి విషయంలో ఈ జాగ్రత్త అవసరం.

ఈ విషయమై మీ బ్యాంకు క్రెడిట్ కార్డుల నుంచి ఇప్పటికే ఏదైనా మెయిల్ లేదా మెసేజ్ వచ్చిందేమో చూసుకుంటే ఆ బ్యాంకు లేదా కార్డు కంపెనీ లేదా వ్యాలెట్ కంపెనీ పాలసీ ఏంటో అర్థమైపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)