ఈక్వెడార్ జైలులో ఖైదీల బీభత్సం... డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణల్లో 116 మంది మృతి

ఈక్వెడార్ జైలులో ఘర్షణలు

ఫొటో సోర్స్, EPA

ఈక్వెడార్ జైలులో ఖైదీల ముఠాల మధ్య జరిగిన ఘర్షణల్లో 116 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. దేశ చరిత్రలో జైలులో జరిగిన అతి పెద్ద ఘర్షణలు ఇవే.

గ్వయాక్విల్ నగరంలో మంగళవారం జరిగిన ఈ ఘర్షణల్లో కనీసం ఐదుగురు ఖైదీల తలలు నరికేశారు. మరికొందరిని కాల్చి చంపారు.

ఖైదీలు గ్రెనేడ్లు కూడా విసురుకున్నారని పోలీసు కమాండర్ ఫౌస్టో బ్యూనానో చెప్పారు.

ప్రపంచ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న ఖైదీలను ఉంచిన ఈ జైలుపై తిరిగి నియంత్రణ పొందడానికి 400 మంది పోలీసు అధికారులు తీవ్రంగా కృషిచేయాల్సి వచ్చింది.

ఈక్వెడార్ జైలులో ఘర్షణలు

ఫొటో సోర్స్, Getty Images

ఈక్వెడార్‌లో క్రియాశీలంగా ఉన్న శక్తిమంతమైన మెక్సికన్ డ్రగ్స్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లు ఈ ఘర్షణలకు కారణమని స్థానిక మీడియా నివేదించింది.

ఈక్వెడార్ జైళ్ల సేవా డైరెక్టర్ బొలివర్ గార్జోన్ స్థానిక రేడియోతో మాట్లాడుతూ.. పరిస్థితి భయంకరంగా ఉందన్నారు.

జైలులోని ఒక విభాగంలోని ఖైదీలు వేరే విభాగంలోకి కన్నం చేసుకుని పాక్కుంటూ వెళ్లారని, అక్కడి ప్రత్యర్థి ముఠా సభ్యులపై దాడి చేశారని బ్యూనానో చెప్పారు.

గొడవ చెలరేగిన వింగ్‌లో చిక్కుకున్న ఆరుగురు వంట వారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు.

ఈక్వెడార్ జైలులో ఘర్షణలు

ఫొటో సోర్స్, AFP

ఇక్కడ జైళ్లపై ఆధిపత్యం కోసం ముఠాలు పోరాడుతుంటాయి. ఇలాంటి ఘర్షణల్లోనే ఫిబ్రవరిలో, 79 మంది ఖైదీలు మరణించారు.

ప్రెసిడెంట్ గిల్లెర్మో లాస్సో దేశంలోని జైళ్లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఈక్వెడార్ జైళ్లు సామర్థ్యం కంటే 30 శాతం ఎక్కువగా నిండి ఉన్నాయని జూలైలో, ప్రెసిడెంట్ లాస్సో చెప్పారు.

రద్దీని తగ్గించడానికి ఎక్కువ శిక్ష అనుభవించిన లేదా చిన్న నేరాలు చేసిన ఖైదీలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసే ప్రణాళికలను ఆయన ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)