‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
1960ల్లో ప్రజాదరణ పొందిన 'టార్జాన్' టీవీ షోలో టార్జాన్ పాత్రధారి, అమెరికన్ నటుడు రాన్ ఎలీ భార్యను వారి కుమారుడు పొడిచి చంపేశాడు.
అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా బార్బరా నగరం శివారు హోప్ రాంచ్‌లోని రాన్ ఎలీ నివాసంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
రాన్ ఎలీ భార్య వలేరీ లుండీన్ ఎలీ వయసు 62 ఏళ్లు. ఆమె మాజీ మిస్ ఫ్లోరిడా.
వలేరీని చంపిన కుమారుడి పేరు కామెరాన్ ఎలీ. అతడికి 30 ఏళ్లు.
కామెరాన్ ఆచూకీ కోసం ఇంట్లో, పరిసరాల్లో పోలీసులు గాలింపు జరిపారని శాంటా బార్బరా కౌంటీ షెరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి వెలుపల అతడు కనిపించాడని, అప్పుడు పోలీసులు చుట్టుముట్టారని చెప్పారు.
కామెరాన్ నుంచి ముప్పు ఎదురైందని, దీంతో నలుగురు పోలీసులు వారి తుపాకులతో అతడిపై కాల్పులు జరిపారని, ఈ గాయాలతో చనిపోయాడని షెరిఫ్ వివరించారు.

ఫొటో సోర్స్, SILVER SCREEN COLLECTION
కామెరాన్ దాడిలో రాన్ ఎలీ గాయపడ్డారనే సమాచారమేదీ లేదు.
ఇంట్లో కదల్లేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుడిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన రాన్ ఎలీయేనా అనేది అధికారికంగా స్పష్టం కాలేదు.
రాన్ ఎలీ పూర్తి పేరు రొనాల్డ్ పియర్స్ ఎలీ. ఆయనకు 81 ఏళ్లు.

ఫొటో సోర్స్, SILVER SCREEN COLLECTION
1966 నుంచి 1968 మధ్య ఎన్‌బీసీలో ప్రసారమైన టార్జాన్ టీవీ సిరీస్‌లో రాన్ ఎలీ పోషించిన పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది.
టార్జాన్- ఎడ్గర్ రైస్ బరోస్ రాసిన 1914 నాటి పుస్తకంలోని ఓ కల్పిత పాత్ర. ఇందులోని కథనం ప్రకారం టార్జాన్‌ను ఆఫ్రికా అడవుల్లో ఏప్‌లు పెంచి పెద్ద చేస్తారు.
1975 నాటి చిత్రం 'డాస్ సావేజ్: ద మ్యాన్ ఆఫ్ బ్రోంజ్'లో రాన్ ఎలీ కథానాయకుడి పాత్ర పోషించారు.
రాన్ ఎలీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్ ఉన్నారు.

ఫొటో సోర్స్, TIBRINA HOBSON/GETTY IMAGES
న్యూ హాంప్‌షైర్‌లోని ప్రముఖ 'ఫిలిప్స్ ఎక్స్‌టర్ అకాడమీ' బోర్డింగ్ స్కూల్‌లో, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కామెరాన్ చదువుకున్నాడని అమెరికా మీడియా తెలిపింది.
2001-14 మధ్య రాన్ ఎలీ నటన నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. తర్వాత తిరిగి బుల్లితెరపైకి వచ్చారు. 'ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్' చిత్రంలో నటించారు.
పిల్లల పెంపకం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం కోసం తాను ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నానని ఈ చిత్రం విడుదల సమయంలో రాన్ ఎలీ 'షార్లెట్ అబ్జర్వర్' పత్రికతో చెప్పారు.
ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్లయ్యారని, కళాశాల విద్య కూడా పూర్తిచేసుకున్నారని ఆయన తెలిపారు.
రాన్ ఎలీ నవలాకారుడు కూడా. ఆయన రాసిన రెండు యాక్షన్ థ్రిల్లర్ నవలల్లో 'నైట్ షాడోష్' 1994లో, 'ఈస్ట్ బీచ్' 1995లో వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి:
- సౌరవ్ గంగూలీ: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’ - BBC exclusive
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ‘’బాలుడిని దత్తత తీసుకుని.. బీమా సొమ్ము కోసం చంపించారు’’
- టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ అరెస్ట్... ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








