అమెరికా: అర్థరాత్రి టెక్సస్‌లోని ఓ మహిళ ఇంటికి వెళ్ళి కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై మర్డర్ కేసు

ఫోర్త్ వర్త్
ఫొటో క్యాప్షన్, బెడ్ రూమ్ కిటికీ నుంచి మహిళ మీద కాల్పులు జరిపినట్లు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజి

అమెరికాలోని టెక్సస్, ఫోర్త్ వర్త్ ప్రాంతంలో శనివారం ఒక నల్లజాతి మహిళను ఆమె బెడ్‌ రూమ్‌లో షూట్ చేసిన పోలీసు అధికారిపై హత్యారోపణలతో కేసు నమోదైంది.

ఆ పోలీసు అధికారి పేరు ఆరోన్ డీన్. ఆయన టారంట్ కౌంటీ జైల్లో ఉన్నారని ఫోర్త్ వర్త్ పోలీసు శాఖ ట్వీట్ చేసింది. డీన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని పోలీసు ఉన్నతాధికారి ఎడ్ క్రౌస్ చెప్పారు.

ఆటిటాయనా జెఫర్సన్ అనే మహిళ తన ఇంట్లోనే పోలీసు కాల్పులకు చనిపోయారు. ఆమె పొరుగింటివారు చేసిన కాల్‌కు స్పందిస్తూ పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. నిజానికి, అత్యవసర కాల్ కూడా కాదు.

ఆ పోలీసు అధికారి ఆమె ఇంట్లోకి వెళ్ళిన క్షణాల్లోనే కాల్పులు జరిపినట్లు 'బాడీ కామ్' (పోలీసులు ధరించే కెమేరా) ఫుటేజి చూపించింది.

నల్లజాతి ప్రజలపై పోలీసుల క్రూరత్వం గురించి అమెరికాలో చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరన్ డీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నల్లజాతి మహిళను కాల్చి చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరన్ డీన్

మొదట తమ పోలీసు అధికారికి బెదిరింపులు వచ్చాయని, అందుకే ఆయన తన ఆయుధాన్ని తీయాల్సి వచ్చిందని ఫోర్త్ వర్త్ పోలీసు విభాగం ప్రకటించింది.

"డీన్ కనుక రాజీనామా చేయకపోయి ఉంటే ఆయనను భద్రత విధానాలు, వృత్తిపరమైన అనుచిత ప్రవర్తన వంటి కారణాల మీద ఉద్యోగం నుంచి తీసేసేవాడిని" అని పోలీసు ఉన్నతాధికారి క్రౌస్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

జెఫర్సన్ హత్య గురించి ఆమె సోదరి యాష్లీ కార్, "నిర్లక్ష్యంతో కూడిన చర్యకు ఆమె బలైంది" అని వ్యాఖ్యానించారు. దీనిపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో హతురాలి కుటుంబం తరఫున వాదిస్తున్న పౌరహక్కుల లాయర్ లీ మెరిట్, "ఈ కేసును ఫోర్త్ వర్త్ పోలీసులు కాకుండా వేరే వాళ్ళు దర్యాప్తు చేయాలి" అని కోరారు. ఇది అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన విభాగంగా మారుతోందని ఆయన అన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శన

జెఫర్సన్ ఇంటివద్ద ఆదివారంనాడు స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడికి చేరుకున్న వారంతా హత్యకు గురైన 28 ఏళ్ళ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

"న్యాయం లేకపోతే... శాంతి లేదు" అని వారు నినాదాలు చేశారు.

ప్రదర్శనకారుల్లో ఒకరైన మిచెల్లీ ఆండర్సన్, "ఇది శిక్షణకు సంబంధించిన విషయం కాదు. నల్లజాతి వారి మీద ప్రభుత్వ ప్రేరేపిత హింస ఒక దుష్ట సంస్కృతిగా కొనసాగుతోంది" అని అన్నారు.

పొరుగు వ్యక్తి
ఫొటో క్యాప్షన్, పోలీసులకు ఫోన్ చేసినందుకు చింతిస్తున్న హతురాలి పొరుగు వ్యక్తి

శనివారం నాడు ఏం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం కాల్పులు తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగాయి.

బాడీ కామ్‌లో ఉన్న వీడియో చూపించిన దృశ్యాల ప్రకారం సదరు పోలీసు అధికారి జెఫర్సన్ నివాసాన్ని తనిఖీ చేసే సమయంలో కిటికీ వద్దకు చేరుకుని ఆమెను చూసి హ్యాండ్సప్ అంటూనే కాల్పులు ప్రారంభించారు.

ఆ సమయంలో జెఫర్సన్ తన మేనల్లుడితో వీడియో గేమ్స్ ఆడుతున్నారని, బయట చప్పుడు విని ఏం జరుగుతుందో చూద్దామని కిటికీ వద్దకు వచ్చి కాల్పులకు బలయ్యారని వారి లాయర్ చెప్పారు.

ఆ ఘటనలో ప్రమేయం ఉన్న పోలీసులు తమ ప్రత్యేక వాహనాలను ఆ ఇంటి ముందు ఆపలేదు, తాము పోలీసులమని కూడా చెప్పుకోలేదని అధికారులు చెప్పారు.

పోలీసులను పిలిపించిన పొరుగింటి వ్యక్తి 62 ఏళ్ళ జేమ్స్ స్మిత్ తాను ఒక మంచి పొరుగువాడిగా ఉండే ప్రయత్నం చేశానని చెప్పారు.

"నేను అసలు పోలీసులకు ఫోన్ చేయకుండా ఉంటే, ఆమె చనిపోయేది కాదు. ఇది చూశాక ఇక ఎప్పుడూ పోలీసులకు ఫోన్ చేయకూడదనిపిస్తోంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)