వర్జీనియా బీచ్ కాల్పులు: ప్రభుత్వ భవనంలో ఫైరింగ్, 12 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని వర్జీనియాలో ఒక ప్రభుత్వ భవనంలో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు, చాలా కాలం నుంచి వర్జీనియా బీచ్ సిటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రజా ప్రయోజనాల భవనంలో అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని చెప్పారు.
పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు మరణించాడు. అతడెవరన్నది పోలీసులు బయటపెట్టలేదు.
శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల తర్వాత కాల్పులు మొదలైనట్లు చెబుతున్నారు. నిందితుడు తమపై కాల్పులు జరపడంతో అతడిని కాల్చి చంపినట్లు స్థానిక పోలీస్ చీఫ్ జేమ్స్ కెర్వెరా తెలిపారు.
గాయపడ్డ ఆరుగురిలో ఒక పోలీస్ కూడా ఉన్నాడని చెప్పారు.
నిందితుడు ఒంటరిగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి కాల్పుల వెనక ఉద్దేశం ఏంటో ఇంకా తెలీలేదు.
"ఇది వర్జీనియా బీచ్ చరిత్రలో అత్యంత దారుణమైన రోజు" అని మేయర్ రాబర్ట్ డేయర్ మీడియా సమావేశంలో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
చుట్టూ ఉన్న మిగతా ప్రభుత్వ భవనాలన్నీ మూసివేసి, ఉద్యోగులను ఖాళీ చేయించారు.
భవనాల్లోంచి దిగుతున్నప్పుడు జనం అరవడం, గట్టిగా ఏడవడం వినిపించిందని ఒక భవనంలోని ఉద్యోగి చెప్పారు.
ఏపీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన మరో ఉద్యోగి తమకు కాల్పుల శబ్దం వినిపించిందని, కానీ అవి అంత దగ్గరగా జరుగుతున్నాయని అనుకోలేదని చెప్పారు.
బాధితులు ఎవరు
ఈ కాల్పుల్లో 12 మంది మృతుల గురించి అధికారులు ఏ వివరాలూ విడుదల చేయలేదు.
వైట్ హౌస్ అధికారులు ఈ ఘటన గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సమాచారం అందించారు.

'నగరానికి, రాష్ట్రానికి 'విషాదకరమైన రోజు'గా వర్జీనియా గవర్నర్ రాల్ఫ్ నార్తామ్ ఈ ఘటనను వర్ణించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్‌బీఐ కాల్పుల ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తోందని అమెరికా మీడియా చెప్పింది.
తుపాకీ కాల్పుల గణాంకాలను నమోదు చేస్తున్న ఒక వెబ్‌సైట్ వివరాల ప్రకారం అమెరికాలో ఈ ఏడాది కాల్పులు జరగడం ఇది 150వ సారి.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో హత్యకూ అదే, ఆత్మహత్యకూ అదే
- అమెరికాలో తుపాకుల మోతను ఆపలేరా?
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- పాకిస్తాన్ మిలటరీ జనరల్‌కు యావజ్జీవం, మరో ఇద్దరికి మరణ శిక్ష
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- ఆస్ట్రియా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన రహస్య వీడియో
- మోదీ విజయంతో పాక్, అమెరికా, ఇంగ్లండ్‌లో సంబరాలు చేసుకున్నారా?
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?
- మోదీ వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








