డోనల్డ్ ట్రంప్: అమెరికా కుర్రాళ్లు అమ్మాయిలను చూసి భయపడుతున్నారా?

ఫొటో సోర్స్, AFP/getty
అమెరికా కుర్రాళ్లకిది కష్టకాలమని, వారెంతో భయపడుతున్నారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టుకు నామినేటైన కావెనాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న ట్రంప్ ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఏడాది కిందట #MeToo ఉద్యమం మొదలై హాలీవుడ్ నటీమణులు సహా వేలాది మంది తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెలిసిందే.
దీంతో ట్రంప్ మాటల్లో నిజమెంత? అక్కడి యువకులు నిజంగానే ఆందోళన చెందుతున్నారా? గత ఏడాది కాలంలో ఎవరైనా ఇలా తమ అభిప్రాయాలు మార్చుకున్నారా అన్నది చూద్దాం.

ఫొటో సోర్స్, DrakeKing
'మగవాడిగా నా తప్పేంటో తెలుసుకోవచ్చు'
టెన్నెసీకి చెందిన డ్రేక్ కింగ్ అనే పద్దెనిమిదేళ్ల విద్యార్థి దీనిపై 'బీబీసీ'తో మాట్లాడుతూ.. తానేమీ భయపడడం లేదని, ఒక యువకుడిగా కాలేజీలో ఇంతకుముందెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నానని చెప్పారు.
''సమాజంలో వచ్చిన ఈ మార్పు బాగుంది. ఒక పురుషుడిగా నేనేం తప్పు చేస్తున్నానో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది'' అని డ్రేక్ చెప్పారు.
గతంలో అమ్మాయిలతో గౌరవంగా వ్యవహరించేవాడిని కానని, కానీ, ఇప్పుడు ఏది తప్పు, ఏది తప్పు కాదన్న విషయంలో స్పష్టత వచ్చిందని.. మనం చేసేది తప్పని చెప్పేవారు ఉండడం మంచిదని అభిప్రాయపడ్డారు.
#MeToo అనేది యువతలో ఎంతో మార్పు తెచ్చిందని ఓహియోకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి పార్కర్ స్మిత్ అన్నారు.

ఫొటో సోర్స్, PArker smith
'మా జాగ్రత్తలో మేం ఉంటున్నాం'
అత్యాచార ఆరోపణల్లో 2 నుంచి 10 శాతం నిజం కావని తేలిందని 2010లో ఒక అధ్యయనం వెల్లడించింది.
కాగా... ఇప్పుడొస్తున్న ఆరోపణల్లోనూ చాలావరకు తప్పుడు ఆరోపణలు ఉంటాయని ఆరిజోనాకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఆడెన్ అభిప్రాయపడ్డారు.
మారిన పరిస్థితుల్లో తాను మరింత జాగ్రత్తగా ఉంటున్నానని..గ్రూపు ఫొటోలు దిగేటప్పుడు నా రెండు చేతులూ అందరికీ కనిపించేలా జాగ్రత్తపడుతున్నానని ఆడెన్ అన్నారు.
''పురుషుల లైంగిక దాడుల నుంచి మహిళలను కాపాడాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న సమాజంపై ఉన్నట్లే.. లైంగిక వేధింపుల పేరిట ఎదురవుతున్న తప్పుడు ఆరోపణల నుంచి మగవాళ్లను కాపాడాల్సిన బాధ్యతా సమాజానికి ఉంది'' అని ఆడెన్ అభిప్రాయపడ్డారు.
కాగా 2016 ప్రభుత్వ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురైనవారే.
ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసేవారిలో అత్యధికులు కుట్రపూరితంగా చేసేవారేనన్న అభిప్రాయం కూడా తప్పన్నారు ఆడెన్.
'మగవాళ్లలో ఇలాంటి భయం రావడం కూడా ఒకందుకు మంచిదే.. వారు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు' అని ఓహియోకు చెందిన పార్కర్ స్మిత్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- క్రిస్టియానో రోనాల్డోపై అత్యాచార ఆరోపణలు
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- #BollywoodSexism: బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- రేప్ కేసులో హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ అరెస్ట్
- ఆ గాయకుడు నన్ను లైంగికంగా వేధించాడు: ‘భాగ్ మిల్ఖా భాగ్’ నటి
- వేధించారంటే ఉద్యోగాల్లోంచి ఊస్టే!
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- ఎన్టీఆర్: సోలోపాటల్లో ‘సదా స్మరామి’
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- మహారాష్ట్ర: మనుషుల్ని చంపి తింటున్న పులి
- బిగ్ బాస్: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?
- జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








