పాకిస్తాన్ మిలటరీ జనరల్‌కు యావజ్జీవ కారాగారం, మరో ఇద్దరికి మరణ శిక్ష

ఫొటో సోర్స్, Reuters
గూఢచర్యం కేసులో పాకిస్తాన్ మాజీ ఆర్మీ జనరల్ ఒకరికి ఆ దేశ మిలిటరీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బ్రిగేడియర్, మరో ప్రభుత్వ ఉద్యోగికి మరణశిక్ష విధించింది.
విదేశీ సంస్థలకు 'సున్నిత సమాచారం చేరవేయడం, గూఢచర్యం' కేసుల్లో ఈ ముగ్గురు అధికారులపై కేసులు నమోదయ్యాయని పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. యావజ్జీవ శిక్ష తీర్పును ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బాజ్వా ఆమోదించారని పాక్ ఆర్మీ చెప్పింది. కానీ, వీరు ఎలాంటి సమాచారాన్ని, ఎవరికి చేరవేశారన్న విషయాన్ని మాత్రం సైనికాధికారులు గోప్యంగా ఉంచారు.
‘పాక్ అధికారులు గోప్యత పాటించినా, సదరు రహస్య సమాచారాన్ని సి.ఐ.ఎ.కు చేరవేసుంటారని సహజంగానే విశ్లేషకులు భావిస్తారు’ అని ఇస్లామాబాద్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి ఎం.ఇలియాజ్ అన్నారు. అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య సుదీర్ఘమైన సైనిక సహకార చరిత్ర ఉందని, ఇరు దేశాల సైనికాధికారులు తరచూ కలుస్తుంటారని ఇలియాజ్ అన్నారు.
పదవీ విరమణ చేసిన లెఫ్ట్‌నెంట్ జనరల్ జావెద్ ఇక్బాల్, పాకిస్తాన్ చట్టాల ప్రకారం 14 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అనుభవించనున్నారు. గూఢచర్యం కేసులో ఇక్బాల్ లాంటి ఉన్నతాధికారి దోషిగా తేలడం అరుదైన సంఘటన అని బీబీసీ ప్రతినిధులు అన్నారు.
పాకిస్తాన్ దేశం లోపల, బయట జరిగే మిలిటరీ కార్యకలాపాల ప్రణాళిక, నిర్వహణ బాధ్యతలను చూసే 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్', సైనికుల క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పర్యవేక్షించడం లాంటి కీలక పదవుల్లో జనరల్ ఇక్బాల్ పనిచేశారు.
రిటైర్డ్ బ్రిగేడియర్ రాజా రిజ్వాన్, ప్రభుత్వ వైద్యుడు వసీమ్ అక్రమ్ ఇద్దరికీ మరణ శిక్షను విధించారు. కానీ ఏ సంస్థ కోసమైతే వీరు పనిచేశారో, ఆ సంస్థ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు.
బ్రిగేడియర్‌కు పైస్థాయి అధికారులు గతంలో పరాయి దేశం కోసం గూఢచర్యం చేసిన కేసులో నేరం రుజువయ్యిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ, సైన్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించిన, మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలున్న కొందరు సీనియర్ అధికారులకు మాత్రం గతంలో శిక్ష పడింది.
పాకిస్తాన్ సైన్యానికి ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ ఉంది. శిక్ష పడినవారికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
- శ్లాబుపై తెల్ల రంగు వేస్తే ఇల్లు చల్లగా మారుతుందా
- ఒకప్పుడు ఆరోగ్యం కోసం చేసుకున్న అలవాటే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది
- ఆ గ్రహంపై వజ్రాల వర్షం
- ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
- ఎవరీ నెసమణి.. ఆయన కోలుకోవాలని ట్విటర్‌లో జనాలు ఎందుకు ప్రార్థిస్తున్నారు
- పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేస్తున్న పాతికేళ్ల కుర్రాడు
- ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








