నోబెల్ ప్రైజ్: కౌగిలింత అనుభూతి రహస్యాన్ని కనిపెట్టిన ఇద్దరు శాస్త్రవేత్తలకు అత్యున్నత పురస్కారం

ఫొటో సోర్స్, EPA / REUTERS
సూర్యుడి నుంచి వచ్చే వేడిని, ఇష్టమైన వాళ్లను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే వెచ్చదనాన్ని మన శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ లభించింది.
అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపూటియన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు స్పర్శ, ఉష్ణోగ్రతలను మానవ శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టినందుకు వైద్యరంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్నారు. వైద్య రంగంలో ఈసారి నోబెల్ అవార్డును వారిద్దరూ పంచుకోబోతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భౌతిక స్పర్శలను మానవ శరీరాలలోని నాడీ వ్యవస్థ విద్యుత్ సందేశాలుగా ఎలా మార్చుతుందోననే రహస్యాన్ని వారు ఛేదించారు. వీరి పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో నొప్పికి సంబంధించిన చికిత్సల తీరును మార్చేసే అవకాశాలున్నాయి.
నోబెల్ ప్రైజ్ కమిటీకి చెందిన థామస్ పెర్ల్‌మాన్, "ఇది చాలా ముఖ్యమైన, ఉత్తమమైన పరిశోధన" అని వ్యాఖ్యానించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ జూలియస్, మనిషి మిరపకాలు, మిరియాలు తిన్నప్పుడు నొప్పితో కూడిన మంటను ఎందుకు అనుభవిస్తాడో తేల్చి చెప్పారు. మిరపకాయలో వేడిని పుట్టించే కాప్సాయిసిన్ అనే రసాయనంతో ఆయన ప్రయోగాలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
మానవ శరీరంలో కాప్సాయిసిన్ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం కణ భాగాన్ని ఆయన కనుగొన్నారు. దాని మీదే మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత స్పందించే ఆ కణజాలంలోని పదార్థమే వేడికి, "నొప్పి"కారకమైన ఉష్ణోగ్రతలకు కూడా స్పందిస్తుందని వెల్లడైంది. ఉదాహరణకు, వేడి కాఫీ మీద పడి మీ చేయి కాలితే, ఆ ఉష్ణోగ్రతకు స్పందించి నొప్పి కలిగించేది ఆ ప్రత్యేక పదార్థమే.
ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణోగ్రతలకు స్పందించే ఇతర కణ భాగాలను గుర్తించేందుకు బాటలు వేశాయి. ప్రొఫెసర్ జూలియస్, ప్రొఫెసర్ ఆర్డెమ్ పటాపూటియన్‌లు ఇద్దరూ కలిసి చలిని గుర్తించే కణ పదార్థాలను కనుగొన్నారు. వీటినే రిసెప్టర్లు అనీ అంటారు. ప్రొఫెసర్ ఆర్డెమ్ ప్రస్తుతం స్క్రిప్స్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాంత్రిక బలాన్ని ప్రయోగించినప్పుడు లేదా ఎవరైనా స్పర్శించినప్పుడు చురుగ్గా స్పందించే రిసెప్టర్లను కనుగొనేందుకు కూడా వీరిద్దరి కృషి దోహదపడింది.
"వేడి, చల్లదనం, యాంత్రిక బలం మనిషిలోని నరాలను ఎలాంటి ప్రభావానికి గురి చేస్తాయన్నది అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధనలు ఉపయోగపడుతాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం స్పందించే విధానంలోని రహస్యాన్ని మనకు వివరించాయి. ఈ పరిశోధన ఫలితాల మూలంగా దీర్ఘకాలిక వ్యాధులు, వెంటాడే నొప్పి బాధల నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలను కనిపెట్టడం సాధ్యమవుతుంది" అని ప్రైజ్ కమిటీ వెల్లడించింది.
ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (దాదాపు రూ. 8.54 కోట్లు) పంచుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- తెలంగాణ: కరెంటు కనెక్షన్ లేకున్నా లక్షల్లో బిల్లులు - ప్రెస్ రివ్యూ
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- ‘13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











