కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్న నెలలోగా రూ. 50,000 పరిహారాన్ని ఇవ్వాలన్న సుప్రీం కోర్టు

ఇప్పటి వరకు భారతదేశంలో అధికారికంగా 4,47,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇప్పటి వరకు భారతదేశంలో అధికారికంగా 4,47,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు రూ. 50000 పరిహారంగా ఇవ్వాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది.

జాతీయ విపత్తు నిర్వహణ చట్టాలననుసరించి బాధితులకు పరిహారం ఇవ్వాలని న్యాయవాదులు వేసిన పిటిషన్‌కు సమాధానంగా సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడ్డాయి.

ఇప్పటివరకు భారతదేశంలో అధికారికంగా 4,47,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

కానీ, నిజానికి మరణాలు అధికారిక లెక్కల కంటే 10 రెట్లు అధికంగా ఉండి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అధికంగా చోటు చేసుకున్న మరణాలను పరిశీలించిన తర్వాత వారు అనేక అంచనాలకు వచ్చారు. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఊహించిన దాని కంటే ఎంత ఎక్కువ మంది మరణిస్తున్నారనే లెక్కలు చూసి పరిశీలించారు.

దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోగా మృతుల కుటుంబాలకు ఈ పరిహారం అందాలని జస్టిస్ ఎంఆర్ షా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే ఇతర లబ్ధి పథకాలతో సంబంధం లేకుండా ఈ పరిహారాన్ని ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

జూన్ నెలలో, కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో కోర్టు జోక్యం అవసరమని కొందరు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కోవిడ్‌ను కూడా ప్రత్యేకంగా చేర్చడంతో , బాధితులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

విపత్తులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు, విపత్తులను ఎదుర్కొనే వ్యూహాలను రచించేందుకు, సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు, ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడినవారికి, ఆస్తి నష్టం వాటిల్లిన వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు 2005లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

ఈ చట్టాన్ననుసరించి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 40,000 నష్ట పరిహారం అందచేయాలి.

ఇప్పటి వరకు భారతదేశంలో అధికారికంగా 447,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

"విపత్తు నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టిందని మాకు తెలుసు. కానీ, చట్టాన్ననుసరించి కోవిడ్ వల్ల ప్రభావితమయిన ప్రతీ కుటుంబానికీ ప్రభుత్వం రూ. 40,000 పరిహారం ఇవ్వాలని భావిస్తున్నాం. లేదా పేద కుటుంబాలకు అంత కంటే కాస్త ఎక్కువ పరిహారం, సంపన్న వర్గాలకు తక్కువ పరిహారం ఇచ్చి ఉండాల్సింది. ఈ విషయంలో వారు మరింత మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సింది" అని పిటిషన్ వేసిన న్యాయవాదుల్లో ఒకరైన గౌరవ్ కుమార్ బన్సల్ బీబీసీతో అన్నారు.

కోవిడ్ వల్ల మరణించినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.

ఈ పరిహారం కోసం ఇవ్వవలసిన నిధులు రాష్ట్రాల ఖజానాల పై భారాన్ని మోపుతాయని, ఈ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే ఇవ్వాలని కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే చెప్పాయి.

"మీరు తుఫానులు, వరదలు మొదలైన వాటికి నిధులను ఇస్తారు. ఆ జాబితాకు కోవిడ్-19ను కూడా చేర్చండి. దీని వల్ల కేవలం ఎదో ఒక రాష్ట్రం మాత్రమే ప్రభావితం కాలేదు. ఇదొక మహమ్మారి" అని రాజస్థాన్‌కు చెందిన మంత్రి గోవింద్ సింగ్ దోతాసారా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెప్పారు.

పరిహారం నిమిత్తం ప్రభుత్వాలు ఎంత మొత్తం వెచ్చించాలనే అంశం పై స్పష్టత లేదు.

మహమ్మారి ఇంకా పూర్తిగా ముగియకపోవడంతో ఈ పరిహారం కోసం ఎంత మొత్తాన్ని పక్కన పెట్టాలనే అంశం పై స్పష్టత లేదని ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆగస్టులో రాష్ట్రాలకు లేఖ రాసింది.

"ఒక వేళ మరణాలు పెరిగిన పక్షంలో ఎక్కువ మందికి పరిహారం అందించేందుకు వీలుగా ఆర్ధిక వనరులను విచక్షణతో ప్రణాళిక చేసుకోవాలి" అని కూడా లేఖలో పేర్కొన్నారు.

కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ సోకి మరణించిన పేద కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించాయి. ఇప్పటి వరకు 16 కుటుంబాలకు ఈ పరిహారం అందినట్లు ఒక నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)