సూర్యుడి రంగు పసుపు కాకపోతే... మరేంటి?

A sunset

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధిక తరంగధైర్ఘ్యాన్ని కలిగి ఉన్న రంగులు సూర్యాస్తమయాన్ని ప్రభావితం చేస్తాయి.

సూర్యుని చిత్రాన్ని గీయడానికి మనం పసుపు రంగు పెన్సిల్‌నే ఎంచుకుంటాం. ఒకవేళ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాన్ని చిత్రీకరించాలంటే దానికి అదనంగా నారింజ రంగు లేదా ఎరుపు రంగు క్రేయాన్‌లతో రంగులద్దుతాం. చిన్నప్పటి నుంచి సూర్యుని బొమ్మ గీయడాన్ని మనం ఇలాగే నేర్చుకున్నాం.

కానీ సౌరవ్యవస్థకు మూలాధార నక్షత్రమైన సూర్యుని రంగు... నిజానికి పసుపు కాదు. అలాగే ఎరుపు, నారింజ కూడా కాదు.

ఇంకా చెప్పాలంటే సూర్యుడు, ఈ మూడు రంగుల మిశ్రమం. ఇవే కాకుండా ఇంకా వేరే రంగుల్ని కూడా కలిగి ఉంటాడు.

సూర్యుడు, వర్ణపటంలోని అన్ని కాంతిపుంజాలను నిరంతరం వెలువరిస్తూనే ఉంటాడు.

పట్టకం ద్వారా మీరు సూర్యకాంతిని పరిశీలించినట్లయితే... అందులో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా రంగులను గమనించవచ్చు.

ఇంద్రధనస్సు తరహాలోనే ఈ కాంతిలో అన్ని రకాల రంగులు ఉంటాయి.

నిజానికి, వాతావరణంలోని నీటి బిందువుల ద్వారా సూర్యకాంతి ఎలా ప్రసరిస్తుందో మనం ఇంద్రధనస్సు ద్వారా చూడొచ్చు. ఈ ఇంద్రధనస్సు చిన్న పట్టకంలాగా పనిచేస్తుంది.

A multi-coloured Sun

ఫొటో సోర్స్, Getty Images

సూర్యుని నుంచి విడుదలయ్యే అన్ని రంగుల కాంతి, మార్గమధ్యంలో కలిసిపోయి మనకు కేవలం ఒకే రంగుగా కనబడుతుంది.

మనం దీని గురించి తెలుసుకోవడానికి, ఆకాశంలో ఒక క్లూ కూడా ఉంది.

అదేంటంటే, సూర్యకాంతిని తమగుండా ప్రసరింపజేసే మేఘాలు కూడా పసుపు రంగును ప్రతిబింబించవు. వేరే ఏ ఇతర రంగులో కూడా కనిపించవు. అవి తెల్లగానే ఉంటాయి. ఎందుకంటే సూర్యుని నుంచి వెలువడే అసలైన కాంతి తెలుపు రంగులోనే ఉంటుంది.

వీడియో క్యాప్షన్, సూర్యుడి అసలు రంగు ఏమిటి?

మనకెందుకు సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు?

సౌర వర్ణపటంలోని ప్రతీ రంగుకు విభిన్న తరంగధైర్ఘ్యం ఉంటుంది. ఇందులో ఎరుపు రంగు అన్నింటికన్నా ఎక్కువ తరంగధైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది.

ఎరుపు నుంచి వరుసగా రంగుల తరంగధైర్ఘ్యం తగ్గిపోతుంటుంది. అంటే ఎరుపు కంటే నారింజ రంగు తక్కువ తరంగధైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. నారింజతో పోలిస్తే పసుపు, పసుపు కంటే ఆకుపచ్చ... ఆ తర్వాత నీలం, ఇండిగో ఇలా వీటి వరుసక్రమం ఉంటుంది. ఊదా రంగు అన్నింటికన్నా అత్యల్ప తరంగధైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది.

అధిక తరంగధైర్ఘ్యం ఉన్న రంగుల కంటే, తక్కువ తరంగధైర్ఘ్యం కలిగిన రంగుల్లోని ఫొటాన్లు వాతావరణంలో చెల్లాచెదురుగా ప్రయాణిస్తాయి.

అంతరిక్షంలో ఎటువంటి ప్రతిబంధకం లేకుండా కాంతి ప్రయాణించడం వల్ల ఫొటాన్లు వక్రీభవనానికి గురికావు. అందువల్లే సూర్యుడు ఒక తెల్లని కాంతి బంతిలా కనిపిస్తాడు. ఇదే సూర్యుని అసలైన రంగు.

సూర్యకిరణాలు, భూవాతావరణం నుంచి ప్రయాణించినప్పుడు... తక్కువ తరంగధైర్ఘ్యం కలిగిన రంగు ఫొటాన్లు గాలిలోని అణువుల వల్ల వక్రీభవనం చెందుతాయి.

అప్పుడు అధిక తరంగధైర్ఘ్యం కలిగిన రంగులు మాత్రమే మన కళ్లకు కనిపిస్తాయి. అందుకే ఎరుపు, పసుపు రంగుల్లో సూర్యుడు కనిపిస్తుంటాడు.

An image of the Sun captured in outer space

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్షంలో సూర్యుడు అసలైన రంగు తెలుపు వర్ణంలో ఉంటాడు

'' వర్ణపటలంలోని అత్యంత శక్తిమంతమైన భాగాన్ని భూ వాతావరణం అడ్డుకుంటుంది. అతినీలలోహిత, బ్లూ జోన్‌లకు సంబంధించిన కిరణాలు ఇందులో ఉంటాయి'' అని ఆస్ట్రానమర్స్ డైరీ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోన్న ఏంజెల్ మోలీనా వివరించారు.

'' అందువల్లే వెచ్చని కాంతి బల్బ్‌లా సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తుంటాడు. సూర్యునిలోని ఇతర రంగులు భూవాతావరణం కారణంగా తొలిగించబడతాయి.''

ఎరుపు, నారింజ, పసుపు రంగులు అధిక తరంగధైర్ఘ్యాలు కలిగి ఉన్నప్పటికీ సూర్యుడు ఎందుకు పసుపు రంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు?

''తక్కువ తరంగధైర్ఘ్యం కారణంగా ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా రంగులు ఇతర రంగుల్లో కలిసిపోయాక... వర్ణపటలంలోని మధ్య రంగును సూర్యకాంతి శోషించుకుంటుంది. అందుకే పసుపు రంగులో కనిపిస్తుంది'' అని ఉరుగ్వేలోని రిపబ్లిక్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ సబ్జెక్టు టీచర్ గొంజాలో టాంక్రెడి, బీబీసీతో చెప్పారు.

ఆకుపచ్చ సూర్యుడు ఉన్నాడా?

సూర్యుడు ఆకుపచ్చ రంగులో ఉన్నాడని పేర్కొనే కథనాలను సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్ సైట్‌లలో మీరు గమనించి ఉండొచ్చు.

ఆకుపచ్చ రంగులో సూర్యుడు ఉంటాడనే భావన ఎలా వృద్ధి చెందిందో గొంజాలో వివరించారు. సౌర వర్ణపటంలోని రంగులను గ్రాఫ్‌పై గీస్తే, అందులో గ్రీన్ రంగు శిఖరం మాదిరిగా కనిపిస్తుంటుంది.

ఈ సౌర వర్ణపటం రంగుల్లోని తేడాలను మన కళ్లు గుర్తించలేవు. కానీ వాటిని నిశితంగా గుర్తించే సాధనాలు ఉన్నాయి. వాటి ద్వారా పరిశీలించగా వర్ణపటంలో ఆకుపచ్చ రంగు అత్యంత తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. అందుకే ఆకుపచ్చ సూర్యుడు లాంటి కథనాలు కనిపిస్తుంటాయి.

''కానీ గ్రాఫ్ నుంచి తక్కువ తరంగధైర్ఘ్యం ఉన్న రంగులను తొలిగించినట్లయితే, పసుపు రంగు అత్యధికంగా కనిపిస్తుంటుంది. అందుకే మనం భూమిపై నుంచి పసుపు రంగులో ఉన్న సూర్యున్ని చూస్తుంటాం'' అని గొంజాలో చెప్పారు.

A collage of solar images from Nasa's Solar Dynamics Observatory

ఫొటో సోర్స్, NASA/SDO/Goddard Space Flight Center

ఫొటో క్యాప్షన్, వివిధ తరంగధైర్ఘ్యాల వద్ద సూర్యుని చిత్రాలను సంగ్రహించి నాసా ఈ చిత్రాన్ని ప్రచురించింది.

సూర్యాస్తమయం ఎరుపు రంగులో ఎందుకుంటుంది?

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించే సమయంలో క్షితిజసమాంతరంగా ఉంటాడు. అందువల్ల వాతావరణంలోని ఎక్కువ అణువుల ద్వారా సూర్యకిరణాలు ప్రసారం అవుతాయి.

దీనివల్ల నీలం రంగు కిరణాలు ఎక్కువగా వక్రీకరణకు గురవుతాయి. ఆ సమయంలో అధిక తరంగధైర్ఘ్యం ఉన్న ఎరుపు లేదా నారింజ రంగు కిరణాలు ఆకర్షణీయంగా కనిపించి సూర్యునిలో ఎరుపు రంగుకు కారణమవుతాయి.

ఈ ప్రభావాన్నే రేలీ స్కాటరింగ్‌ అని అంటారు. 19వ శతాబ్ధానికి చెందిన బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త లార్డ్ రేలీ పేరు మీదుగా ఈ దృగ్విషయాన్ని రేలీ స్కాటరింగ్‌గా పిలుస్తారు.

సూర్యుడు, ఆకాశంలో ప్రయాణిస్తున్నకొద్దీ భూమిపై సూర్యకిరణాలు పడే కోణం మారుతుంటుంది. అందుకే రోజులోని వివిధ సమయాల్లో సూర్యుడు వివిధ రంగుల్లో కనిపిస్తాడు. సూర్యాస్తమయానికి ఎరుపు రంగుకు చేరుకుంటాడు.

వీడియో క్యాప్షన్, ఎన్నడూ చూడనంత స్పష్టంగా సూర్యుడు

ఈ ఆర్టికల్ ద్వారా మీరు అంతరిక్షంలోని అత్యద్భుత నక్షత్రమైన సూర్యుని గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని మేం భావిస్తున్నాం. కానీ దయచేసి సూర్యుడిని మన కళ్లతో నేరుగా చూడకూడదనే విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. టెలీస్కోప్ లేదా బైనాక్యులర్స్ ద్వారా కూడా సూర్యుడిని చేసే ప్రయత్నం చేయకండి. దీనివల్ల మీ కళ్లు పాడైపోయే అవకాశముంది. అంధత్వం కూడా రావొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)