రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?

ఫొటో సోర్స్, STUDIO WESSELS
- రచయిత, లారెన్స్ కౌలీ
- హోదా, బీబీసీ న్యూస్
ఎప్పుడైనా బీచ్‌కు వెళితే నీల్స్ పిటేరీకి తన తండ్రి హెన్రీ పిటేరీ జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. ఆయన ఎంగెలాండ్ వార్డర్స్ (ఇంగ్లాండ్ నావికులు)లో ఒకరు.
1941 సెప్టెంబర్ 21న, నాజీ ఆక్రమిత నెదర్లాండ్స్ నుంచి వారి కళ్లుగప్పి, ఉత్తర సముద్రం మీదుగా యునైటెడ్ కింగ్‌డమ్ చేరుకున్నారు.
ఉత్తర సముద్రం మీదుగా తన తండ్రి చేసిన 56 గంటల ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం గురించి వినేనాటికి నీల్స్ పిటేరీ టీనేజ్‌లో ఉన్నారు.
తన సమకాలీకుల్లో చాలామందిలాగే, రెండో ప్రపంచ యుద్ధం గురించి, దానిలో తన పాత్ర గురించి హెన్రీ పిటేరీ తన కొడుకు నీల్స్ పిటేరీకి చెప్పారు.
ఈ ఘటన జరిగిన ఎనభై సంవత్సరాల తరువాత, తనకు తన తండ్రి ఈ కథను ఎలా చెప్పారో గుర్తుచేసుకున్నారు నీల్స్ పిటేరీ.
'ఇదే సరైన రోజు అని ఆయన అనుకున్నారు'
తోటి డచ్ పౌరులు కొందరు ఫిషింగ్ బోట్ ద్వారా బ్రిటన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు 22 ఏళ్ల హెన్రీ పిటేరీ విన్నారు. అయితే, తీరానికి చేరుకునే ముందే చాలామంది పట్టుబడ్డారని, లేదంటే నాజీ తీర గస్తీ దళాల కంటపడటంతో పడవలను ముంచి వారిని చంపేశారని కూడా ఆయన తెలుసు.
స్కాండినేవియన్ దేశాల గుండా చిన్న పడవలో యూకేకి చేరుకోగలిగిన వ్యక్తుల గురించి కూడా హెన్రీ విన్నారు.
ఫిషింగ్ బోట్ కంటే చాలా చిన్న పడవ సహాయంతో ఉత్తర సముద్రాన్ని దాటగలరని తెలుసుకున్నప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటారని నీల్స్ అన్నారు.
హెన్రీ తన సోదరుడు విల్లెమ్‌తో ఇదే అంశంపై చర్చించారు. ఒకసారి ప్రయత్నించి చూద్దామని చెప్పారు.
ఇద్దరు సోదరులు కాట్విజ్క్ గ్రామంలోని గెస్ట్ హౌస్‌కి వెళ్లే ముందు, డచ్ తీర పట్టణం అయిన రోటర్‌డామ్‌లో మడత పెట్టడానికి వీలయ్యే జర్మన్ నిర్మిత కయాక్ (తెడ్డు సాయంతో నడిపే చిన్నపడవ)ను కొనుగోలు చేశారు.
కాట్విజ్క్ వీరికి బాగా తెలిసిన గ్రామం. ఇంతకు ముందు సెలవులకు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునే వారు.
రాత్రి కావడంతో, సోదరులు ఇద్దరు కలిసి కయాక్ విడిభాగాలను తీసుకొచ్చి కలపడం ప్రారంభించారు.

ఎంగెలాండ్ వార్డర్స్ అంటే ఎవరు?
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 2,000 మందికి పైగా మగవాళ్లు, మహిళలు నెదర్లాండ్స్ నుంచి బ్రిటన్‌కు వచ్చారు. ఇందులో 1,700 మంది సముద్ర మార్గంలో ప్రయాణించారు.
చాలా మంది సముద్రంలో మునిగిపోయారు. కొందరు బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు అరెస్టై జైలు పాలయ్యారు. కొందరు నాజీల చేతిలో హత్యకు గురయ్యారు.
అలా సముద్రం దాటి వచ్చిన వారిలో చాలామంది బ్రిటిష్, డచ్ సాయుధ దళాలలో, నావికా దళంలో చేరారు లేదా ప్రభుత్వం కోసం పని చేశారు.
ఎంగెలాండ్‌వార్డర్స్‌లో 100 కంటే ఎక్కువ మంది తిరిగి నాజీల ఆక్రమిత దేశానికి రహస్య ఏజెంట్లుగా వెళ్లారు. వీరిలో దాదాపు సగం మంది పట్టుబడ్డారు.
"నాన్న కిటికీలోంచి బయటకు చూసి, వెళ్లిపోవడానికి ఇదే సరైన రోజు అని అనుకున్నారు" అని నీల్స్ చెప్పారు.
"రాత్రి సమయంలో, తెల్లారక ముందే బయలుదేరాలని భావించారు. ఇదే చివరి అవకాశమని ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ సాధ్యపడదనుకున్నారు. కానీ ఊహించని సమస్య ఎదురైంది" అని నీల్స్ చెప్పారు.
"వారు తమ కయాక్ విడిభాగాలను కలపడం పూర్తి చేసిన తర్వాత, ఇంకా ఒక భాగం మిగిలే ఉందని గుర్తించారు. దీంతో మళ్లీ విడదీసి పునర్నిర్మించారు. ఈసారి, అన్ని భాగాలు సరిగ్గా అమరాయి"
"గాలి తూర్పుకి వీస్తోంది. నీరు నిలకడగా ప్రశాంతంగా ఉంది. అయినా వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు"
"వారు నెదర్లాండ్స్ నుంచి బయలుదేరినప్పుడు, కొద్దిసేపటికే కయాక్ తలక్రిందులయ్యింది. రెండు దిక్సూచీలలో ఒకటి నీటిలో పడిపోయింది''
ఈ రెండోసారి ఎదురుదెబ్బ తగిలినా, ప్రయాణం కొనసాగిద్దామని హెన్రీ, విల్లెంను ఒప్పించారు.

ఫొటో సోర్స్, PETERI FAMILY
'ఇక్కడ దిగొచ్చా అని, కానిస్టేబుల్‌తో గట్టిగా అరిచాడు'
యాభై ఆరు గంటల తరువాత, సోదరులు నీటిలో ఒక లంగరు గుర్తును గుర్తించారు. దానిపై వారు "సైజ్‌వెల్" అనే పదాన్ని చదివారు. సఫోల్క్ తీరంలోని ఒక చిన్న గ్రామం పేరు అది. ఆ సమయంలో వారు ఇంగ్లాండ్ చేరుకున్నారని వారికి తెలుసు. దీంతో తీరం వెంబడి తెడ్డు వేయడం కొనసాగించారు.
"వారు చూసిన మొదటి వ్యక్తి యూనిఫాంలో ఉన్న పోలీసు" అని నీల్స్ చెప్పారు.
"ఇక్కడ దిగొచ్చా అని కానిస్టేబుల్‌ని అడగడానికి విల్లెం గట్టిగా అరిచారని నాన్న చెప్పారు. కానిస్టేబుల్ 'నో ప్రాబ్లమ్' అని చెప్పడంతో, లీస్టన్‌లోని పోలీస్ స్టేషన్‌లో వారి కథ సుఖాంతమైంది" అని నీల్స్ చెప్పారు.
యుద్ధ సమయంలో నెదర్లాండ్స్ నుంచి ఇంగ్లాండ్ వరకు కయాక్ చేయడానికి ప్రయత్నించిన 32 మందిలో, పిటేరీ సోదరులతో కలుపుకుని కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ ఎనిమిది మందిలో, యుద్ధం ముగిసే సమయానికి ముగ్గురు మాత్రమే సజీవంగా ఉన్నారు.
వీరిలో చివరి వాడు హెన్రీ. ఆయన 2007లో మరణించారు.
"మేము బీచ్‌కు వెళ్లినప్పుడల్లా నేను ఆయన చెప్పిన అనుభవాలను గుర్తు చేసుకుంటాను. ఆ సాహసం ఊహించడానికే భయానకంగా అనిపిస్తుంది" అన్నారు నీల్

ఫొటో సోర్స్, PETERI FAMILY
'నాన్న చాలా అదృష్టవంతుడు'
"బ్రిటిష్ జైలులో మొదటి రోజు రాత్రి ఉన్నంత స్వేచ్ఛను తాను ఎన్నడూ అనుభవించలేదని ఆయన ఒకసారి నాతో చెప్పారు" అని నీల్స్ అన్నారు.
బ్రిటీష్ అధికారులు పరీక్షించి విడుదల చేసిన తర్వాత, అయన నెదర్లాండ్స్ నుండి విజయవంతంగా పారిపోయిన వారికి ఇచ్చే డచ్ క్వీన్ విల్హెల్మినా బహుమానాన్ని అందుకున్నారు. యుద్ధ సమయంలో లండన్‌లో నివసిస్తూ ప్రవాసంలో డచ్ ప్రభుత్వం కోసం పని చేశారు.
తర్వాత కూడా కొనసాగిన యుద్ధంలో అయన అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలు, మధ్యధరా సముద్రంలో వ్యాపార నావికా దళ ఓడలను రక్షించే బాధ్యతను చేపట్టిన డచ్ మెరైన్స్ కంపెనీలో అధికారిగా కూడా పని చేశారు.
"ఆయన చాలా అదృష్టవంతుడు" అని నీల్స్ చెప్పారు. " చాలాసార్లు దాడులకు గురయ్యారు, ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో వారు జావా సముద్రపు యుద్ధానికి చేరుకోలేకపోయారు. ఆ యుద్ధంలో జపనీయులు మొత్తం డచ్ నౌకాదళాన్ని మట్టికరిపించారు"
"మా బాబాయ్ విల్లెం అంత అదృష్టవంతుడు కారు" అన్నారు నీల్స్.
విల్లెం, రాయల్ డచ్ నావికాదళంలో చేరడానికి వేచి ఉండగా, జర్మనీ జరిపిన కాల్పుల్లో ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో డచ్ తీరంలోని బ్రిటిష్ మోటార్ గన్ పడవలో ఒక రాత్రి గడిపారు.
"1942 అక్టోబర్ 3న, మా నాన్న ఒక టెలిగ్రామ్ అందుకున్నారు. 'ఎంజీబీ78 నౌక పెట్రోలింగ్‌కి వెళ్లి తిరిగి రాలేక పోయిందని ప్రకటించడానికి అడ్మిరల్ చింతిస్తున్నారు' అందులో ఉంది''
"తన సోదరుడిని కోల్పోయానని లేదా జర్మన్లు చంపేసి ఉంటారని హెన్రీ భావించారు" అని నీల్స్ చెప్పారు.
"మా నాన్న మా బాబాయి విల్లెం కోసం ఆందోళన చెందారు. ఎందుకంటే అయన పడవలో సివిల్ డ్రెస్సులో ఉన్నారు. కాబట్టి ఆయనను ఒక గూఢచారిగా పరిగణించే అవకాశం ఉంది" అన్నారు నీల్స్
అయితే బుల్లెట్ల వర్షం, పడవ మునక రెండింటి నుంచి విల్లెం బయటపడ్డారు. ఆయన జీలాండ్‌లోని డచ్ ప్రావిన్స్‌లో ఒడ్డుకు చేరుకున్నారు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌కు ఆయన్ని తరలించారు. తర్వాత మూడు వారాల పాటు డెత్ సెల్‌లో ఉంచారు. అనంతరం విల్లెంను లూబెక్ సమీపంలోని జర్మన్ శిబిరానికి పంపారు.
యుద్ధం ముగిసే వరకు విల్లెం అక్కడే ఉన్నారు.
1946లో హెన్రీ నెదర్లాండ్స్‌కు తిరిగి వచ్చారు. 1970ల వరకు యునిలివర్ కోసం పనిచేశారు. ఆరుగురు పిల్లల తండ్రిగా, కార్పొరేట్ ఉద్యోగంతో విసిగిపోయి, ఆవిష్కర్తగా మారాలని నిర్ణయించుకున్నారు.
ప్రజలకు తక్షణమే వేడి నీటిని అందించే పరికరాన్ని కనిపెట్టడమే లక్ష్యంగా పని చేశారు. 10 ఏళ్ల వయసులో నీల్స్ తన తండ్రి ఇంటి బేస్‌మెంట్‌లో పని చేయడం మొదలు పెట్టారు. తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పట్ల నీల్స్ ఆసక్తిని పెంచుకున్నారు.
కొన్ని రోజుల్లోనే వేడి నీటిని సరఫరా చేసే ట్యాప్‌ను హెన్రీ కనుగొన్నారు.

ఆ ప్రాజెక్ట్ చాలా సంవత్సరాల తరువాత కూకర్ సంస్థగా రూపాంతరం చెందింది. 1992లో మొట్టమొదటి కూకర్ మార్కెట్‌లోకి వచ్చింది. 2000నాటికి నె దర్లాండ్స్‌లో ఒక ప్రముఖ ఉపకరణంగా మారింది.
కంపెనీ ఇప్పుడు ప్రతి సంవత్సరం 300,000 కూకర్ల( Quooker) ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకి యూరోప్, ఆసియాలో 10,000 కంటే ఎక్కువ డీలర్లు, అనుబంధ సంస్థల నెట్‌వర్క్ ఉంది.
తండ్రితో పని చేయడం ఎలా అనిపించేదని అడిగినప్పుడు, శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి తన తండ్రి ఎప్పుడూ ప్రోత్సహించేవారని నీల్స్ చెప్పారు. ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేసినా ఏ రోజు ఒకరిపై ఒకరం కసురుకోలేదని నీల్స్ చెప్పారు.
"నీల్స్, వాల్టర్ (1993లో వారితో చేరిన నీల్స్ తమ్ముడు) లతో కలిసి ఎలాంటి విభేదాలకు తావులేకుండా వ్యాపారంలో ఘన విజయం సాధించగలిగామని మా నాన్న అనే వారు. ఆయన ధైర్యవంతుడే కాదు, ఆయన గొప్ప వ్యక్తి కూడా" అన్నారు నీల్స్
80 సంవత్సరాల కిందట చేపట్టిన సముద్రయానం, ఆ సోదరులు దిగిన చిన్న సఫోల్క్ గ్రామం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఫొటో సోర్స్, STUDIO WESSELS
ఇక్కడ మూడు తెడ్లతో కూడిన చిన్న స్మారక చిహ్నం ఉంది. రెండు తెడ్లను హెన్రీ, విల్లెం సోదరులకు గుర్తుగా, మూడవ విరిగిన తెడ్డును ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకంగా ఉంచారు.
"పడవ తెడ్లు ఇంకా అక్కడే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత నాటి కయాక్ మొత్తాన్ని నేను మా నాన్న స్థాపించిన కంపెనీలో ప్రదర్శనకు పెట్టాము'' అన్నారు నీల్స్.
''వారు విజయం సాధించినా, సాధించకపోయినా, రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల నుంచి తప్పించుకోవడానికి ఈ కయాక్‌లతో ప్రయత్నించిన వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడమే మా లక్ష్యం" అన్నారు నీల్స్
ఇవి కూడా చదవండి:
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












