ఈ అనంత విశ్వం ఎప్పుడు ముగిసిపోతుంది... 'ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ థింగ్'లో ఏం రాశారు?

సూపర్‌నోవా

ఫొటో సోర్స్, NASA Goddard

    • రచయిత, కెమారాన్ విర్క్
    • హోదా, న్యూస్‌బీట్ రిపోర్టర్

'హీట్ డెత్', 'బిగ్ రిప్', 'వాక్యూమ్ డికే' లాంటి పదాలు సంతోషాన్ని కలిగించవు. ఈ విశ్వం ఎలా అంతమైపోతుందో చెప్పే సిద్ధాంతాల పేర్లే ఇవన్నీ.

అయితే, విశ్వం ఎలా అంతమైపోతుందో తెలిసిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త కేటీ మ్యాక్.

కేటీ మ్యాక్ తన కొత్త పుస్తకం 'ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్' గురించి మాట్లాడుతూ…"ఉనికి అశాశ్వతం అని అంగీకరించగలగడం కొంత శాంతిని కలిగిస్తుంది" అని రేడియో 1 న్యూస్‌బీట్ ప్రోగ్రాంలో చెప్పారు.

అయితే, చాలామందికి ఆ విశ్వం అంతాన్ని జీర్ణం చేసుకోవడం కేటీ చెప్పినంత ఈజీగా ఉండకపోవచ్చు. నిజానికి కేటీకి కూడా ఇది పైకి కనిపిస్తున్నంత చిన్న విషయమేమీ కాదు.

బ్లాక్‌హోల్

ఫొటో సోర్స్, JPL Caltech/NASA

ఫొటో క్యాప్షన్, బ్లాక్‌హోల్

భయాన్ని పంచుకోవడం

ఏదో ఒకనాడు ఎక్కడో ఒకచోట ఈ అనంత విశ్వం ముగిసిపోతుందన్న విషయం తెలిసిన రోజు క్యాటీకి ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తన చుట్టూ తన తోటి విద్యార్థులు, వాళ్ల యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు.

"ఆరోజు మా ప్రొఫెసర్ ఫిన్నే ఇంట్లోని హాల్లో మేమంతా కూర్చుని ఉన్నాం. భోజనాలు అయ్యాక మా ప్రొఫెసర్ ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ) పాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నారు" అని కేటీ తన కొత్త పుస్తకం 'ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్' లో రాశారు.

మొదట్లో విశ్వం ఎలా విస్తరించింది? ఇప్పుడున్న ఈ స్థితికి ఎలా చేరింది? అనే విషయాలు శాస్త్రవేత్తలకు కచ్చితంగా తెలియవు.

దీన్నే కాస్మిక్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. అలాంటప్పుడు విశ్వం ముగిసిపోదు, వేగంగా విచ్ఛిన్నమయ్యే అవకాశం లేదు అని కూడా వారు కచ్చితంగా చెప్పలేరు అని కేటీకి అర్థమైంది.

"ఇది కొంత వ్యక్తిగతమైన విషయంగా తోచింది. విశ్వంలో ఏవేవో ప్రక్రియలు జరుగుతున్నాయి. అంటే అవన్నీ నాకు కూడా జరగొచ్చు. నేను కూడా ఈ విశ్వంలో ఒక భాగమే కదా. అంటే వీటన్నిటి నుంచీ నాకు రక్షణ లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు."

"ఈ పుస్తకంలో నేను చెప్పదలుచుకున్నవిషయాల్లో ఒకటి ఏమిటంటే 'భయాన్ని పంచుకోవ డం'. ఇది కొంచెం స్వార్థంలా అనిపించొచ్చు. కానీ ఈ అనంతమైన విశ్వంతో ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది సహాయ పడుతుందని భావిస్తున్నాను"అని కేటీ అన్నారు.

నక్షత్రాలను చూస్తున్న కేటీ

ఫొటో సోర్స్, Penguin

ఫొటో క్యాప్షన్, నక్షత్రాలను చూస్తున్న కేటీ

విశ్వంలో ఏం జరుగుతోంది? అంతరిక్షంలో భూ గ్రహాన్ని దాటి ఏం జరుగుతోంది? అనే విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కేటీకి చిన్నప్పటినుంచే మొదలైంది. కానీ లాస్ ఏంజెలిస్ రాష్ట్రంలో పెరగడంవల్ల ఆమెకు నక్షత్రాలను, పాలపుంతలను, అంతరిక్షాన్ని గమనించే అవకాశం చిక్కలేదు.

అయితే బ్లాక్ హోల్స్, స్పేస్ టైమ్ లాంటి మెదడుకు పదునుపెట్టే అంశాలు ఆమెకు చాలా ఆసక్తి కలిగించాయి.

స్టీఫెన్ హాకింగ్స్ తనని తాను ఒక ఖగోళ శాస్త్రవేత్తగా చెప్పుకున్నప్పుడు "నేను కూడా ఆయనలా కావాలనుకున్నాను" అని కేటీ చెప్పారు.

కేటీ మ్యాక్ క్యాల్టెక్, ప్రిన్స్‌టన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో పరిశోధకులుగా పనిచేశారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో పరిశోధకులుగా ఉన్నారు.

కేటీకి ట్విటర్‌లో 3,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. శాస్త్రవేత్తలు కానివారికి, సైన్స్ పెద్దగా చదువుకోనివారికి కూడా అర్థమయ్యేలా సైన్స్ విషయాలు వివరించి చెప్పడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది.

"ఈ పుస్తకాన్ని మీరు అలా పేజీలు తిప్పుతూ చదివేసి, మొత్తం అంతా ఒకేసారి అవగాహన చేసుకోడానికి ప్రయత్నించక్కర్లేదు" అని కేటీ తన పుస్తకం గురించి చెప్పారు.

సూపర్‌నోవా

ఫొటో సోర్స్, MSFC

'ఒక్క క్షణం ఆగి అర్థం చేసుకోవడం మంచిది'

"సైన్స్ పుస్తకాలు రాసేవాళ్లు చాలావరకు ప్రతీ చిన్న విషయాన్ని వివరించుకుంటూ పోతారు. ఎక్కడా ఆగి ఆలోచించుకుని, అర్థం చేసుకునే అవకాశం ఇవ్వరు. కానీ అది చాలా ముఖ్యం. ఒక్క క్షణం ఆగి అర్థం చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఇవ్వాలి" అని కేటీ అభిప్రాయపడ్డారు.

'హీట్ డెత్ ' లాంటి పదాలు అర్థం చేసుకోవడం తేలికే. చాలా మందికి సులభంగా అర్థమవుతుంది. అది మంచిదే ఎందుకంటే విశ్వం ఈ ప్రక్రియ ద్వారానే అంతమయ్యే అవకాశాలు ఎక్కువ.

"విశ్వం వ్యాకోచించి, వ్యాకోచించి సంకోచిస్తుంది. అన్నీ క్షీణిస్తాయి, కాంతిహీనమవుతాయి. కానీ ఇదేమంత సరదా కలిగించే ముగింపు కాదు" అంటున్నారు కేటీ.

"అన్నిటికన్నా సరదాగా ఉండేది వాక్యూం డికే. విశ్వం అంతమైపోతోంది అనే విషయం మాట్లాడుకుంటున్నప్పుడు సరదా లాంటి పదాలు వాడకూడదు కానీ ఈ ప్రక్రియ గురించి ఆలోచించడం సరదాగా ఉంటుంది."

"సమీకరణాల్లో ఎక్కడో ఒక చిన్న మార్పు చేసి చూస్తే...విశ్వంలో ఎక్కడో ఒకచోట 'వినాశనం' అనేది చిన్న బుడగలాగ మొదలై.. కాంతి వేగంతో మొత్తం ఆక్రమించుకుని విశ్వమంతా వినాశనం కావడమనేది సాధ్యమే అనే విషయం బోధపడుతుంది" అని కేటీ వివరించారు.

గేలక్సీ

ఫొటో సోర్స్, NASA Goddard

ఇలా జరిగే అవకాశం లేదని సైన్స్ చెప్పలేదు.

"ఒకే ఒక్క సందర్భంలో ఇలా జరిగే అవకాశం లేదని అనుకోవచ్చు. అదెప్పుడంటే అసలు మనం సిద్ధాంతాన్నే పరీక్షించలేనప్పుడు, సమీకరణాల్లో ఏమైనా మార్పు జరిగితే అది మనకు తెలియకపోవచ్చు. అప్పుడు ఈ వాక్యూం డికే జరుగుతుందో జరగదో మనకు తెలీదు."

"అయితే ఇది ఇప్పుడప్పుడే జరిగే విషయం కాదు. కోటానుకోట్ల సంవత్సరాల తరువాత ఎప్పుడో జరగొచ్చు. కానీ సిద్ధాంత పరంగా ఇది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది." అని కేటీ వివరించారు.

ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, ఆలోచనలు మనకు ఒక 'దృక్కోణాన్ని ' ఇవ్వగలవని కేటీ భావిస్తున్నారు.

"ఈ ఆధునిక జీవితంలో మనం సురక్షితమని, మన చుట్టూ రక్షణ కవచం ఉందని, అన్నీ మన నియంత్రణలో ఉన్నాయని నమ్మించే అనేక విషయాలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. కానీ అవేమీ నిజం కావు. మన నమ్మకాలన్నిటినీ వమ్ము చేసే అనేక విషయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మన కళ్ల ఎదుట అలాంటివి జరుగుతున్నాయి."

"ఈ అనంత విశ్వంలో మనం ఉన్నాం. అది మనకు ఏదిస్తుందో దాన్ని మనం అంగీకరించి తీరాలి" అని కేటీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)