ఆంధ్రప్రదేశ్: సాయి ధరమ్‌తేజ్ రిపబ్లిక్ చిత్రంపై ‘కొల్లేరు ప్రజల ఆగ్రహం’ - ప్రెస్‌రివ్యూ

సాయి ధరమ్ తేజ్

ఫొటో సోర్స్, facebook/ZeeStudios

'రిపబ్లిక్‌' చిత్ర ప్రదర్శనపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.

''తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు.

వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అసత్యాలతో సినిమా తీయడం దారుణమని రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి అన్నారు.

చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌ హెచ్చరించారు.

రాజన్న కొల్లేరు సంఘం చైర్మన్‌ మండల కొండలరావు, ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు, కలకుర్రు, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్‌ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్‌ వద్ద హైవేపై నిరసన తెలిపినట్లు'' సాక్షి వెల్లడించింది.

టీఎస్ ఆర్టీసీ

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

30 మంది ఉంటే మీ కాలనీకే బస్సు: టీఎస్‌ఆర్టీసీ

దసరా పండుగకు దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీలకు బస్సులు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ప్రకటించినట్లు 'ఈనాడు' పేర్కొంది.

''ఒకే ప్రాంతం లేదా కాలనీలోని 30 మంది ప్రయాణికులు దగ్గరిలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకుంటే బుధవారం నుంచి ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు.

దసరా ప్రత్యేక బస్సులు, టికెట్ ధరలు, సమయాల సమాచారం కోసం ఎంజీబీఎస్ (99592 26257), జూబ్లీ బస్‌స్టేషన్ (99592 26264), రెతిఫైల్ బస్‌స్టేషన్ (99592 26154), కోఠి బస్‌స్టేషన్ (99592 26160) సమాచార కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఇవి 24 గంటలూ పనిచేస్తాయన్నారు.

సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. దసరాకు హైదరాబాద్ నలుమూలల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని బాజిరెడ్డి వెల్లడించినట్లు'' ఈనాడు రాసుకొచ్చింది.

వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు

విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు దొరికినట్లు 'సాక్షి' కథనం వెల్లడించింది.

''విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు.

ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్‌ విచారించారు.

తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్‌ బయలుదేరానని ఆమె తెలిపారు.

గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు.

బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు'' సాక్షి పేర్కొంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANACMO/FB

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

రెండు, మూడు నెలల్లో తెలంగాణలో 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా 70 నుంచి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''రెండు మూడు నెలల్లో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన జోనల్‌ విధానం అమలుతో ఈ ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.

మంగళవారం శాసనసభలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పరిపాలనా కేంద్రాలను పెంచామని అన్నారు.

అందులో భాగంగానే 33 జిల్లాలతోపాటు మండలాలు, పోలీస్‌ కమిషనరేట్లు, ఇతర ఆఫీసుల సంఖ్యను పెంచామని వివరించారు.

కొత్త జోనల్‌ విధానం ప్రకారం ప్రస్తుత ఉద్యోగుల విభజన నెలలో పూర్తిచేస్తాం. ఆ తర్వాత ఏ జిల్లావారికి ఆ జిల్లా క్యాడర్‌ పోస్టులతో రిక్రూట్‌మెంట్‌ చేస్తాం. ఏ మండలానికి ఎంత సిబ్బంది ఉండాలో ఓ లెక్క ఉన్నది.

దీని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నయ్‌.. మొత్తం 33 జిల్లాలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అనేదానిపై స్పష్టత వస్తుంది.

నాకున్న అంచనా మేరకు కనీసం 70-80 వేల ఉద్యోగాలు కొత్తగా దొరుకుతయి. వాటన్నింటినీ నెల, రెండు నెలల్లో భర్తీ చేసేస్తం'' అని కేసీఆర్ అన్నట్లు నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)