సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్‌లో ఆయన పేరు ఎందుకు ఉంది

సచిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ధనవంతులు, ప్రభుత్వ అధికారుల రహస్య సంపద, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టు చేశాయి పాండోరా పేపర్స్.

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ సహా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఈ పాండోరా పేపర్స్‌లో బయటపడ్డాయి.

ఈ లీకులపై దర్యాప్తు జరపాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్రా ఈ దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తారు. సీబీడీటీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) కూడా ఈ దర్యాప్తులో భాగస్వాములవుతాయి.

అనిల్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

అనిల్ అంబానీకి ఆఫ్‌షోర్ కంపెనీలు ఉన్నాయని..

రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ దగ్గర, ఆయన ప్రతినిధుల దగ్గర కలిపి కనీసం 18 ఆఫ్‌షోర్ కంపెనీలు ఉన్నట్లు లీకైన రికార్డులు చెబుతున్నాయి.

2007, 2010 మధ్య స్థాపించిన ఈ కంపెనీల్లో ఏడు కంపెనీలు కనీసం 130 కోట్ల డాలర్లు (రూ. 9,754 కోట్లు) అప్పులు చేసి పెట్టుబడి పెట్టాయి.

ఈ లీకులపై అనిల్ అంబానీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. కానీ, ఆయన తరపున పేరు వెల్లడించడానికి ఇష్టపడని న్యాయవాది ఒకరు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికతో మాట్లాడారు.

"మా క్లయింట్లు భారతదేశంలో పన్నులు సక్రమంగా చెల్లించే పౌరులు. చట్టానికి అనుగుణంగా భారతీయ అధికారులకు చెప్పవలసినవన్నీ చెప్పారు. లండన్ కోర్టులో విషయాలను వెల్లడించడానికి అవసరమైన అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తోంది. చట్టబద్ధమైన వ్యాపారం, నియంత్రణ కోసం కంపెనీలను వివిధ అధికార పరిధుల్లో చేర్చారు" అని చెప్పారా న్యాయవాది.

सचिन तेंदुलकर

ఫొటో సోర్స్, AFP

సచిన్ కూడా..

భారతదేశంలో క్లీన్ ఇమేజ్ ఉన్న సచిన్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా పాండోరా పేపర్స్‌లో కనిపించాయి.

బ్రిటిష్ వర్జిన్ దీవులలో 2016లో ఉనికిలోకి వచ్చిన ఒక సంస్థకు సచిన్ యజమాని అని ఈ లీకుల్లో బయటపడింది.

సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలి, మామ ఆనంద్ మెహతా పేర్లు కూడా బయటకొచ్చాయి. వీరు కూడా ఆ సంస్థకు యజమానులు, డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

అయితే ఈ లావాదేవీలన్నీ చట్టప్రకారం జరిగినవేనని చెప్తూ సచిన్ తెందూల్కర్ ఫౌండేషన్ సీఐఓ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు.

పాండోరా పేపర్స్

ఫొటో సోర్స్, Getty Images

పాండోరా పేపర్స్

117 దేశాలకు చెందిన 600 మందికి పైగా జర్నలిస్టులు, అనేక నెలలుగా 14 మూలాల నుంచి వచ్చిన వివిధ కథనాలను పరిశోధించి, ధ్రువీకరించారు. వీటి ఆధారంగా తయారుచేసిన పత్రాలను ఈ వారం మీడియాలో ప్రచురించారు. వీటినే పాండోరా పేపర్స్ అంటున్నారు.

ఈ మొత్తం డాటాను వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సేకరించింది.

ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా మీడియా సంస్థలు ఈ పరిశోధనలో పాల్గొన్నాయి. ఐసీఐజే నిర్వహించిన అతి పెద్ద అంతర్జాతీయ పరిశోధన ఇదే.

బీబీసీ పనోరమా, ది గార్డియన్ సంస్థలు సంయుక్తంగా బ్రిటన్‌లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించాయి.

90 దేశాలకు చెందిన 330 మందికి పైగా రాజకీయ నాయకులు సహా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు తమ సంపదను దాచిపెట్టడానికి రహస్య ఆఫ్‌షోర్ కంపెనీలను ఎలా ఉపయోగించారో ఈ లీకు పత్రాలు వెల్లడించాయి.

విచారణలో దోషులని తేలితే, వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఈ అంశంలో సమర్థవంతంగా దర్యాప్తు జరపడానికి పన్ను చెల్లింపుదారుల/సంస్థల సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైతే వివిధ దేశాల ప్రభుత్వాలు, న్యాయస్థానాలతో కలిసి పనిచేస్తాం" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పాండోరా పేపర్స్‌లో భారతదేశానికి చెందిన చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల పేర్లు కనిపించాయి.

అంతే కాకుండా పలువురు ప్రవాస భారతీయుల పేర్లు కూడా బయటపడ్డాయి. భారతీయ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకున్నవారు, అటాచ్మెంట్ చట్టం ఉన్నప్పటికీ ఆఫ్‌షోర్ కంపెనీలు తెరిచినవాళ్లు, ప్రస్తుత ఆస్తి వివరాలు వెల్లడించిన ప్రవాస భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో కనిపించాయి.

ఆఫ్‌షోర్ కంపెనీలు చట్టవిరుద్ధం కాదుగానీ ఆస్తులు దాచడానికి ఆఫ్‌షోర్ కంపెనీలు ప్రారంభించే అవకాశం లేకపోలేదు.

విదేశీ కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఆఫ్‌షోర్ కంపెనీల్లో పెట్టుబడి అంటే ఏంటి?

దేశ సరిహద్దుల వెలుపల నడుస్తున్న సంస్థల సంక్లిష్టమైన నెట్వర్క్ గురించి పాండోరా పేపర్స్ తెలుపుతున్నాయి.

చాలా సంస్థలను అజ్ఞాతంగా ఉంచుతారు. వాటి యజమానులు ఎవరు? పెట్టుబడిదారులు ఎవరు? సంస్థలు ఎవరి పేరు మీద ఉన్నాయి? మొదలైన విషయాలన్నింటినీ రహస్యంగా ఉంచుతారు.

ఆఫ్‌షోర్ కంపెనీ అంటే స్వదేశంలో కాకుండా విదేశాల్లో చట్టబద్ధంగా స్థాపించే/పొందే సంస్థ. ఉదాహరణకు భారతదేశానికి చెందిన వ్యక్తి వేరే దేశంలో పెట్టుబడి పెట్టి కొత్త కంపెనీని ఏర్పాటుచేస్తే అది ఆ వ్యక్తికి ఆఫ్‌షోర్ కంపెనీ అవుతుంది.

ఆఫ్‌షోర్ దేశాలు అంటే?

ఎక్కడ సంస్థలు ఏర్పాటు చేయడం సులభమో, ఎక్కడ కంపెనీ యజమాని వివరాలు ఇతరులు కనిపెట్టడం కష్టమో, ఎక్కడ కార్పొరేట్ పన్ను చాలా తక్కువగా ఉంటుందో... అసలు ఉండదో.. అలాంటి ప్రదేశాలను 'టాక్స్ హేవెన్' అంటారు.

ఈ టాక్స్ హేవెన్ ప్రదేశాల మొత్తం జాబితా స్పష్టంగా లేదుగానీ కొన్ని ప్రదేశాలు పన్ను ఎగవేతదారులకు, నల్లధనం నిల్వలకు ప్రాచుర్యం పొందాయి.

చట్టంలో లొసుగుల కారణంగా టాక్స్ హెవెన్ ప్రాంతాల్లో కంపెనీలు పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటాయి. కానీ, దీన్ని అనైతికంగా పరిగణిస్తారు.

ప్రజలు విదేశాల్లో తమ ఆస్తిని, సంపదను దాచిపెట్టాలని అనుకోవడానికి కొన్ని సరైన కారణాలూ ఉన్నాయి. క్రిమినల్ దాడుల నుంచి, అస్థిర ప్రభుత్వాల నుంచి రక్షణ కోసం వేరే దేశంలో డబ్బు దాచుకోవాలని అనుకోవచ్చు.

బ్రిటన్‌లో రహస్య ఆఫ్‌షోర్ కంపెనీలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం కాదు.

నల్లధనాన్ని దాచడానికి వివిరిగా ఉపయోగించే సాధనం ఈ రహస్య కంపెనీల నెట్వర్క్.

గతంలో పనామా పేపర్స్ లీక్ తరువాత, రాజకీయ నాయకులకు పన్నుల ఎగవేత, ఆస్తులను దాచిపెట్టడం సులభం కాకుండా చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌లో పిలుపునిచ్చారు.

విదేశాల్లో డబ్బు దాచడం సులభమేనా

ఫొటో సోర్స్, Getty Images

విదేశాల్లో డబ్బు దాచడం సులభమేనా

దీని కోసం టాక్స్ హెవెన్ దేశాల్లో ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, యజమాని ఎవరు లాంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఇలాంటి కంపెనీలు కాగితాలపైనే ఉంటాయి. భౌతికంగా కార్యాలయాలు, సిబ్బంది ఉండరు.

ఈ పనిలో నైపుణ్యం కలిగిన కొన్ని సంస్థలు మీ పేరుతో మీ షెల్ కంపెనీలను నిర్వహిస్తుంటాయి. ఈ సంస్థలు డబ్బుకు బదులు షెల్ కంపెనీలకు పేరు, చిరునామా, పెయిడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పేరు ఇస్తాయి.

కంపెనీకి నిజమైన యజమాని ఎవరో ఎప్పటికీ బయటపడకుండా జాగ్రత్తపడతాయి.

ఎంత డబ్బు దాచారు?

ఐసీఐజే అంచనాల ప్రకారం, 5.6 లక్షల కోట్ల డాలర్ల నుంచి 32 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారం, టాక్స్ హెవెన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 60,000 కోట్ల డాలర్ల (రూ. 44, 96,100 కోట్లు) పన్నును కోల్పోతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)