భారత్ ప్రతిచర్య: బ్రిటిష్ ప్రయాణికులకు 10 రోజుల క్వారంటీన్‌

భారత విమానాశ్రయంలో RTPCR టెస్ట్ చేయించుకోవాలి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత విమానాశ్రయంలో RTPCR టెస్ట్ చేయించుకోవాలి

ఎట్టకేలకు భారతదేశం ప్రతిఘటించింది. దేశంలోకి అడుగు పెట్టే బ్రిటిష్ పౌరుల విషయంలో కోవిడ్ 19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్ణయించింది.

అక్టోబర్ 4 నుంచి భారతదేశాన్ని సందర్శించబోయే బ్రిటిష్ పౌరులందరూ కోవిడ్ టీకాలతో సంబంధం లేకుండా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

భారతదేశానికి బయలుదేరే 72 గంటల లోపల ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని దానికి సంబంధించిన నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది.

భారత విమానాశ్రయంలో దిగిన తరువాత మళ్లీ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు.

దేశంలోకి అడుగుపెట్టిన 8వ రోజున కూడా టెస్ట్ చేయించుకోవాలి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దేశంలోకి అడుగుపెట్టిన 8వ రోజున కూడా టెస్ట్ చేయించుకోవాలి

అలాగే, దేశంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి 8వ రోజున మరొకమారు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

కోవిడ్ టీకా వేసుకున్నప్పటికీ, దేశంలోకి ప్రవేశించిన తరువాత 10 రోజుల పాటూ క్వారంటీన్ పాటించాల్సి ఉంటుంది.

పైన పేర్కొన్న కొత్త నిబంధనలను అమలు చేసేందుకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు సమాయత్తమవుతున్నాయి.

అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్

బ్రిటన్ వెళ్తున్న భారతీయ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న తరువాత కూడా భారతదేశంతో సహా పలు దేశాల పౌరులను 'వాక్సినేటెడ్‌'గా బ్రిటన్ గుర్తించట్లేదు. ఈ వ్యవహారం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇది ఇలాగే కొనసాగితే బ్రిటన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి కూడా ఉంటుందని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా అన్నారు.

బ్రిటన్‌కు 50 లక్షల కోవిషీల్డ్ డోసులను భారతదేశం అందించింది. వాటిని వాళ్లు వినియోగించారు కూడా. అలాంటప్పుడు కోవిషీల్డ్‌ను గుర్తించకపోవడం వివక్షే అవుతుందని ఆయన అన్నారు.

భారత్ అసంతృప్తిని చూసి బ్రిటన్ టీకాను ఆమోదించిందిగానీ క్వారంటీన్ నిబంధనలను విధించింది. కోవిషీల్డ్ రెండు డోసులూ వేసుకున్న తరువాత కూడా బ్రిటన్ వెళ్లే భారత పౌరులు టెస్టులు చేయించుకోవాలి, పది రోజుల పాటు క్వారంటీన్‌లో ఉండాలి.

భారతదేశంతో సహా పలు దేశాల వ్యాక్సీన్లను బ్రిటన్ గుర్తించకపోవడం వివాదానికి దారి తీసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతదేశంతో సహా పలు దేశాల వ్యాక్సీన్లను బ్రిటన్ గుర్తించకపోవడం వివాదానికి దారి తీసింది

వివాదం ఏమిటి?

ఈ మొత్తం వ్యవహారంలో ఇరు దేశాలూ చర్చించుకుంటున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. బ్రిటన్‌లో భారత ప్రజలు ఎదుర్కొంటున్నది కచ్చితంగా వివక్ష అని ఆయన అన్నారు.

అక్టోబర్ 4 నుంచి బ్రిటన్‌లో అమలులోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి ఇంగ్లండ్‌లోకి ప్రవేశించే పౌరులకు వ్యాక్సీన్ డోసులు పూర్తయితే క్వారంటీన్ పాటించక్కర్లేదు.

ఇతర దేశాల పౌరులు మాత్రం వ్యాక్సీన్ వేయించుకున్నా సరే పది రోజులు క్వారంటీన్ పాటించాలి. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, థాయిలాండ్, జోర్డాన్, రష్యా లాంటి కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ వివక్ష వివాదానికి దారి తీసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)