స్పెయిన్: మహిళల మూత్ర విసర్జనను రహస్యంగా వీడియో తీయడం నేరం కాదన్న జడ్జి -మండిపడుతున్న మహిళా సంఘాలు

ఫొటో సోర్స్, MUJERES EN IGUALDAD BURELA
- రచయిత, గై హెడ్జ్‌కో
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
మహిళలు మూత్ర విసర్జన చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి పోర్న్‌సైట్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడం ద్వారా ఒక స్పానిష్ న్యాయమూర్తి మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించారు.
పబ్లిక్ టాయిలెట్లలో, చాటుగా మూత్ర విసర్జన చేస్తుండగా దాదాపు 80 మహిళలను కొందరు వ్యక్తులు రహస్యంగా వీడియో తీశారు. స్పెయిన్‌లోని సెర్వో అనే పట్టణంలో జరిగిన ఒక ఉత్సవం సందర్భంగా మహిళలను ఇలా రహస్యంగా చిత్రించారు.
ఈ ఫుటేజ్‌లోని చాలా వీడియోలలో మహిళల జననేంద్రియాలు, ముఖాలు క్లోజప్‌లో రికార్డయ్యాయి. ఈ వీడియోలను కొన్ని పెయిడ్ పోర్న్ సైట్‌లలో అప్‌లోడ్ చేశారు.
2020లో ఈ విషయం బయటపడటంతో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. తమ గౌరవానికి, ప్రైవసీకి భంగం కలిగించారంటూ ఆరోపణలు చేశారు. వీటిని ఎవరు రికార్డు చేశారన్నది తేలలేదు. అయితే, స్థానిక జడ్జ్ పాబ్లో మునోజ్ వాజ్‌క్వెజ్ ఈ కేసును విచారించకుండా పక్కనపెట్టారు.

ఫొటో సోర్స్, MUJERES EN IGUALDAD BURELA
'నేను షాకయ్యాను'
న్యాయమూర్తి తీర్పుపై మరోసారి అప్పీల్ చేస్తూ ఈ కేసును విచారించాల్సిందేనంటూ మహిళాల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే, తాను గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు న్యాయమూర్తి
పబ్లిక్ ప్లేస్‌లలో ఇలా వీడియోలు తీయడాన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఈ రహస్య రికార్డింగ్ వెనక ఎవరికైనా మహిళల గౌరవాన్ని భంగపరిచే ఉద్దేశాలు ఉన్నాయని భావించలేమని జడ్జ్ తన తీర్పులో పేర్కొన్నారు.
''ఈ తీర్పు విని నేను భయంతో వణికపోయాను'' అని బాధితుల్లో ఒకరైన జెన్నీఫర్ వ్యాఖ్యానించారు. తన వీడియోలు పోర్న్‌సైట్‌లలో కనిపించినట్లు తన స్నేహితుడు ఒకరు చెప్పారని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
'' ఈ వీడియో చూసినప్పుడల్లా నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను నిజంగా సిగ్గుపడ్డాను. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు'' అన్నారామె.
తమ వీడియోలను రహస్యంగా చిత్రించారని తెలిసి మానసికంగా కుంగిపోయి చికిత్సలు తీసుకున్నవారిలో జెన్నీఫర్ కూడా ఒకరు. కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఆమె బాధను మరింత పెంచింది.
"ఇది నాకు నిస్పృహ కలిగించింది. వీధిలో మనల్ని ఎవరో రికార్డు చేసి దాన్ని పోర్న్ సైట్‌లలో పెట్టవచ్చని, డబ్బు సంపాదించుకోవచ్చని వారు ఈ తీర్పు ద్వారా చెబుతున్నారు''
''ఇలా రహస్యంగా రికార్టింగ్ చేసేవారికి ఎలాంటి శిక్షలు ఉండవని ఈ కేసు చెబుతోంది'' అని ‘బుమెయి’ అనే మహిళా సంఘానికి చెందిన అనా గార్సియా అన్నారు.
''పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నంత మాత్రాన మనల్ని ఎవరైనా చిత్రించడం, ఫొటోలు తీయడం చేయవచ్చని మీ ఉద్దేశమా? ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన'' అన్నారామె.
ఈ కేసు విచారణ అవసరం లేదన్న జడ్జి నిర్ణయాన్ని తప్పుబడుతూ స్పెయిన్‌లో మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. #XustizaMaruxaina అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవలి కాలంలో స్పెయిన్‌లో జెండర్ రైట్స్ గురించి రైటిస్ట్, లెఫ్టిస్ట్ గ్రూపుల మధ్య తీవ్ర వివాదం నడిచింది.
స్పెయిన్‌లో మహిళా సంఘాలకు ఎదురు దెబ్బ తగలడం ఇదే మొదటిసారి కాదు.
2018లో పంప్లోనా ప్రాంతంలో ఒక యువతిపై అయిదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా, స్థానిక న్యాయస్థానం దాన్ని అత్యాచారమని కాకుండా లైంగిక వేధింపుల కేసుగా పేర్కొనడం వివాదాస్పదమైంది.
అయితే, ఈ తీర్పును రద్దు చేస్తూ, నిందితులకు 9 ఏళ్ల జైలు శిక్షను 15 సంవత్సరాలకు పెంచుతూ అక్కడి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
తాజాగా రహస్య వీడియో చిత్రీకరణ కేసు బాధితులు కూడా పై కోర్టులో అప్పీలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఐస్‌క్రీం ఇడ్లీ: సోషల్ మీడియాలో వైరల్
- ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై వార్తలు నిజం కాదు: కేంద్రం
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








