జనాభా నియంత్రణ: మూడో బిడ్డ పుట్టడంతో పదవి కోల్పోయిన మహిళా బీజేపీ నేత, అసలు ఏమైంది?

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC
- రచయిత, షాబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ కోసం
"నేను మున్సిపల్ కౌన్సిలర్ పదవి కంటే నా బిడ్డే కావాలని అనుకున్నాను. పదవిపై ఆశతో నా గర్భం తీయించుకోలేదు. వాస్తవం ఏదో అదే చెప్పాను. నేను నా మూడో బిడ్డకు జన్మనిచ్చానని తెలిసి జులై 13న కౌన్సిలర్ పదవి రద్దు చేశారు. నేను రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయలేను. మహిళా సాధికారత అంటే ఇదేనా".
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని లక్సర్ మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్ నీతా పాంచాల్ మాటలివి.
ఆమె సభ్యత్వం ఈ నెలలోనే ముగిసింది. నీతా పాంచాల్ బీజేపీ నేత. ఆమె రెండోసారి శివపురి వార్డ్ నంబర్ 4 నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
జనాభా నియంత్రణ బిల్లు గురించి యూపీ సహా చాలా రాష్ట్రాల్లో చర్చలు మొదలైన తరుణంలో, మూడో బిడ్డకు జన్మనిచ్చిన నీతా పాంచాల్ కౌన్సిలర్ పదవిని రద్దు చేయాలనే ఆదేశాలు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదనే షరతు ఉత్తరాఖండ్‌లో దాదాపు రెండు దశాబ్దాల నుంచీ అమల్లో ఉంది.
"స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు గరిష్ఠంగా ఇద్దరు పిల్లల షరతు వర్తిస్తుంది. జులై 2002 నుంచి ఈ ఆదేశాలు అమల్లో ఉన్నాయి" అని ఉత్తరాఖండ్ హైకోర్టు లాయర్, నైనిటాల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దీపక్ రువాలీ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC
నీతాపై చర్యలు ఎందుకు చేపట్టారు
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఉత్తరాఖండ్‌లో 2002 నుంచి ఈ చట్టం అమల్లో ఉన్నప్పటికీ, నీతా పాంచాల్ మీద ఓ వ్యక్తి ఫిర్యాదు చేసేవరకూ ఆమెను ఆ పదవి నుంచి తొలగించకపోవడం విశేషం.
ముగ్గురు పిల్లలున్న ఆమె సభ్యత్వాన్ని సవాలు చేస్తూ శివపురికి చెందిన పంకజ్ కుమార్ బన్సల్ ఉత్తరాఖండ్ హైకోర్టులో 2020 ఆగస్టులో రిట్ పిటిషన్ వేశారు.
స్థానిక మీడియా 2020 ఆగస్టులో ప్రసారం చేసిన కథనాల ప్రకారం.. పంకజ్ కుమార్ బన్సల్‌కు శివపురిలో రేషన్ దుకాణం ఉంది. నీతా పంచాల్ ఆయనపై ఫిర్యాదు చేయడంతో అది రద్దైంది.
"బన్సల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నా భార్య ఆయనపై ఫిర్యాదు చేసింది. తర్వాత చర్యలు తీసుకున్నాం. అందుకే, అతడు మాపై ఫిర్యాదు చేశాడు" అని నీతా పాంచాల్ భర్త విజేంద్ర పాంచాల్ చెప్పారు.
ఆ తర్వాత దర్యాప్తు మొదలవడంతో 2021 జులై 13న పట్టణాభివృద్ధి డైరెక్టరేట్ పదవి నుంచి తప్పుకోవాలని నీతా పాంచాల్‌ను కోర్టు ఆదేశించింది.
"నాకంటే ముందు ఎస్డీఎంగా ఉన్న అధికారి ఈ కేసులో దర్యాప్తు చేశారు. నీతా పాంచాల్ సభ్యత్వం రద్దైన విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది" అని లక్సర్ ఎస్డీఎం శైలేంద్ర సింగ్ నేగీ చెప్పారు.
నీతా పాంచాల్ సభ్యత్వం రద్దు గురించి లక్సర్ మున్సిపాలిటీ చైర్మన్ అంబరీష్ గార్గ్ కూడా బీబీసీతో మాట్లాడారు.
"లక్సర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు 2018 నవంబర్‌లో జరిగాయి. నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసేవరకూ నీతాకు ఇద్దరు పిల్లలే ఉన్నారు. కానీ, మూడో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆమె పదవీకాలంలో ఇంకా సగం మిగిలే ఉంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం ఏం చెబుతోంది?
ఈ నిర్ణయం మహిళా సాధికారతకు విరుద్ధం అని నీతా పాంచాల్ చెబుతున్నారు.
"భవిష్యత్తులో రాజకీయాల్లో మరింత ముందుకు వెళ్లాలని, ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్నాను. నన్ను రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నుకున్నారు. కానీ మూడో గర్భం నిలిచినట్లు తెలీలేదు. నేనేం చేయాలో మీరే చెప్పండి. నేను భ్రూణహత్య చేయలేను. పదవి మీద కూడా ఆశ పెట్టుకోలేదు. మూడో సంతానానికి జన్మనిచ్చాను. ఇప్పుడు నా సభ్యత్వం రద్దైంది. మహిళా సాధికారత అంటే ఇదేనా" అని ప్రశ్నించారు.
తన సభ్యత్వం రద్దవడం వల్ల ఒక్క నీతా పాంచాల్ మాత్రమే బాధ పడడం లేదు. ఆమె భర్త విజేంద్ర పాంచాల్ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు.
‘‘నా భార్య మొదటి నుంచీ ప్రజా సేవ చేస్తోంది. ఒక ఫిర్యాదు తర్వాత నీతా సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఒక వైపు గర్భంలో పెరుగుతున్న బిడ్డ, ఇంకోవైపు సభ్యత్వం రద్దు చేస్తారేమోననే భయం. తర్వాత మేం మా బిడ్డనే ఎంచుకున్నాం’’ అన్నారు.
"ఏ చట్టం కింద నా భార్య సభ్యత్వాన్ని రద్దు చేశారో, అదే చట్టంలోని ఒక సబ్ సెక్షన్‌లో ప్రభుత్వం వారిని హెచ్చరించి వదిలేయవచ్చు అని కూడా ఉంది. 2018 నవంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 2న నా భార్య కౌన్సిలర్‌గా ప్రమాణం చేసింది. ఆ తర్వాత 2019 నవంబర్ 15న మూడో బిడ్డకు జన్మనిచ్చింది. మేం ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం" అన్నారు.
ఉత్తరాఖండ్ స్థానిక సంస్థల, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులకు గరిష్ఠంగా ఇద్దరు పిల్లల షరతు అమలు చేశారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC
న్యాయ సలహా తీసుకోవచ్చు
ఈ కేసు గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయా బడథ్వాల్ కూడా మాట్లాడారు.
"ఏదైనా ఒక నిబంధన ఏర్పాటు చేసినప్పుడు మనం రిజర్వేషన్లు ఎలా అనుసరిస్తామో, దానిని కూడా అలాగే అనుసరించాలి. ఒక నిబంధనను ఏర్పాటు చేసి, దానిని చట్టం చేసినపుడు అది అందరికీ వర్తించాలి. ఇక ఈ కేసు విషయానికి వస్తే వాళ్లు న్యాయ సలహా తీసుకోవడం మంచిదని చెబుతాను" అన్నారు.
అయితే, "ఈ ఇద్దరు పిల్లల షరతు వల్ల రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయాలనునే నీతా లాంటి ఎంతోమంది మహిళలపై ప్రభావం పడవచ్చు" అని ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు అమీనా లోహానీ అభిప్రాయపడ్డారు.
నీతా పాంచాల్ కేసు గురించి మాట్లాడిన ఆమె "మనం ఒక వైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాం. మరోవైపు నీతా లాంటి మహిళల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం. ఇది చాలా తప్పు. పరిస్థితులను బట్టి న్యాయంగా నిర్ణయం తీసుకోవాల్సింది" అన్నారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR/BBC
జనాభా నియంత్రణ చట్టం సన్నాహాల గురించి కూడా అమీనా లోహానీ మాట్లాడారు.
"ఈ చట్టం బాగానే ఉంది. కానీ పరిస్థితుల ఆధారంగా దీనిని అమలు చేయాలి. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాలి" అని ఆమె అన్నారు.
"నీతా పాంచాల్ గర్భవతి అయినప్పుడు, మూడో సంతానం పుడితే, తన సభ్యత్వం ప్రమాదంలో పడవచ్చనే విషయం ఆమెకు తెలుసు. పదవికి బదులు బిడ్డనే ఎంచుకున్నానని ఆమె స్వయంగా చెప్పారు. కానీ అన్ని సందర్భాల్లో మహిళలు, పురుషుల ఆలోచన ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు" అని ఉత్తరాఖండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కమిటీ మాజీ ఛైర్మన్ కవితా శర్మ అన్నారు.
‘‘చాలా మంది మహిళలు, పురుషులు పదవులను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మూడో సంతానం తమ కోరికలకు, పురోగతికి అవరోధంగా కావచ్చనే భయంతో తప్పుడు మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ, ప్రస్తుత సమయంలో జనాభా నియంత్రణ చట్టం కూడా అవసరం. అవును, దానిలో మహిళల హక్కులను దృష్టిలో పెట్టుకుని కొన్ని షరతులు కూడా చేర్చుంటే మెరుగ్గా ఉండేది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- 1971 యుద్ధంలో భారత్ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








