ఉత్తరాఖండ్: హిమాలయాల్లో ఈ మంటలు ఎందుకు.. ప్రపంచ శాస్త్రవేత్తల ఆందోళన ఏమిటి

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నవీన్‌ సింగ్‌ ఖడ్కా
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి.

నైనీ సరస్సు, దాని చుట్టూ ఉన్న పర్వతాలు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ పట్టణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ చెలరేగుతున్న మంటలు ఈ కొండలను కనిపించకుండా చేస్తున్నాయి. సరస్సు అందం కూడా ఇంతకు ముందులా లేదు.

"ఈ సరస్సు ప్రాంతంలో పొగ వాసన వస్తుండటాన్ని మీరూ గమనించవచ్చు" అన్నారు 'పీపుల్స్ అసోసియేషన్‌ ఫర్ హిమాలయ ఏరియా రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ శేఖర్‌ పాథక్‌.

"త్వరగా మండే గుణం ఉన్న దేవదారు వృక్షాలనే కాదు, ఓక్‌ చెట్లనూ ఈ మంటలు కాల్చేస్తున్నాయి. పరిస్థితి దారుణంగా మారుతోంది" అని పాథక్ ఆందోళన వ్యక్తం చేశారు.

అడవులు తగలబడి పోతుండటంతో భయంతో ప్రజలు రాత్రి పూట నిద్ర కూడా పోవడం లేదని ఆయన బీబీసీతో అన్నారు.

"అర్ధరాత్రి లేచి మంటలు మా ఇళ్లవైపు వస్తున్నాయేమో చూసి వస్తుంటాం" అని పిథోర్‌గర్‌ జిల్లా బన్నా గ్రామానికి చెందిన కేదార్ అవని అన్నారు.

"ఈ మంటలు మా పశువుల కోసం దాచిన గడ్డినంతా కాల్చేశాయి. మా ఇళ్లు కూడా తగలబడి పోతాయేమోనని భయపడుతున్నాం"అని కేదార్‌ బీబీసీతో అన్నారు.

మంటలు ఇరవై మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయని కేదార్‌ చెప్పారు. "ఈ మంటలను అదుపు చేయడానికి ఎలాంటి సాధనాలు లేవు" అన్నారాయన.

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, Getty Images

మంటలతో ప్రమాదమేంటి ?

యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపర్నికస్‌ అట్మాస్ఫియర్ మానిటరింగ్‌ సర్వీస్‌ (సీఏఎంఎస్‌) అంచనా ప్రకారం, గత నెలలో ఉత్తరాఖండ్‌ అడవులలో కార్చిచ్చుల కారణంగా 0.2 మెగా టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలో కలిశాయి.

2003 తర్వాత ఈ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదలు .

అదే గత నెలలో నేపాల్ 18 మెగా టన్నుల కార్బన్‌ను విడుదల చేసిందని ఉపగ్రహం నుంచి తీసిన ఫొటోలను విశ్లేషించడ ద్వారా తేలింది. 2016లో నేపాల్‌లో 27 మెగా టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయి.

"మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఆధారాలు మనకు చెబుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం" అని సీఏఎంఎస్‌కు చెందిన శాస్త్రవేత్త మార్క్‌ ప్యారింగ్టన్‌ అన్నారు.

నేపాల్‌, ఉత్తరాఖండ్‌లలో అటవీ అగ్ని ప్రమాదాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లు సమాచారం. లక్షలాది హెక్టార్ల అడవిని ఈ మంటలు నాశనం చేశాయని భావిస్తున్నారు.

అయితే దీనికి సంబంధించిన అధికారిక డేటా ఇప్పటి వరకు విడుదల కాలేదు.

గత నెలలో నేపాల్‌లో ఐదు వందలకు పైగా ప్రాంతాలలో ఈ అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. గత నెల రోజులుగా నేపాల్‌లో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది.

నేపాల్‌కు చెందిన అనేక నేషనల్‌ పార్కులు, అడవులు భారతదేశపు నేషనల్ పార్కులతో అనుసంధానమై ఉంటాయి. అక్కడ పుట్టిన అగ్ని భారతదేశంలోకి కూడా వ్యాపిస్తోంది.

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, Getty Images

పొడి వాతావరణం

గత కొన్ని నెలలుగా నేపాల్‌ తోపాటు, ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు లేవు. దీని వల్ల అడవులు పొడిబారి పోయాయి.

"వర్షాలు లేవు, మంచు లేదు. అందుకే అడవులు తగలబడి పోతున్నాయి. ఈ ప్రాంతం చాలా పొడిగా ఉంది." అని శేఖర్‌ పాథక్‌ వివరించారు.

ఇప్పుడు స్థానికులను భయపెడుతున్న మరో అంశం మే నెల. ఇక్కడ సాధారణంగా మేలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ మే రాక ముందే అనేకసార్లు మంటలంటుకున్నాయి.

ఇక వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణమని చెప్పలేకపోయినప్పటికీ, ఈ ప్రాంతంలో కరవు పరిస్థితులు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దీనికి తోడు సమీప పొలాల్లో రైతులు గడ్డి తగలబెట్టడం కూడా చాలాచోట్ల మంటలు అంటుకోవడానికి కారణమవుతోందని భారత్‌, నేపాల్‌లకు చెందిన అధికారులు చెబుతున్నారు.

"అడవుల పని కార్బన్‌ను ఆక్సిజన్‌గా మార్చడమేనని విధాన నిర్ణేతలు అనుకుంటుంటారు. ఇప్పుడు అడవులు కూడా కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయి. దాన్ని వారు పట్టించుకోవడం లేదు" అని ఆక్స్‌ఫామ్‌ సంస్థకు చెందిన విజేంద్ర అన్నారు.

"భారత దేశంలో అడవులు కాలిపోవడం ఎవరికీ పెద్ద సమస్య కాదు. అందుకే ఈ విషయాలను పార్లమెంటులో ఎప్పుడూ చర్చకు రావు" అన్నారాయన.

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎంఏ) ఈ కార్చిచ్చులను ప్రకృతి వైపరీత్యంగా (నేచురల్‌ కెలామిటీ) పరిగణించ లేదు.

వారి నిబంధనల ప్రకారం తుపానులు, సునామీలు, వడగాలులు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, భూకంపాలు మాత్రమే ప్రకృతి వైపరీత్యాల కింద లెక్క.

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2019 లో నిర్వహించిన ఓ సర్వేలో, దేశంలోని 36 శాతం అడవులు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదంలో ఉన్నాయని, వాటిలో మూడింట ఒక వంతు ప్రాంతంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని తేలింది.

" కార్చిచ్చులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించక పోవడానికి కారణం అవి చుట్టు పక్కల ప్రాంతాలలో మనుషులు పెట్టిన మంటల వల్ల జరిగినవి కావడమే" అని ఎన్‌డీఎంఏకు చెందిన అధికారి కృష్ణ వత్స వ్యాఖ్యానించారు.

"అయితే ఈ మంటలు పెను ముప్పుగానే మేం పరిగణిస్తాం. వాటిని కంట్రోల్‌ చేయడానికి ఇతర శాఖలతో కలిసి పని చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, Getty Images

అగ్నిమాపక సర్వీసుల్లో లోపాలు

స్టాండింగ్‌ ఫైర్‌ అడ్వైజరీ కమిటీ నివేదిక ఆధారంగా, దేశంలో అగ్నిమాపక సర్వీసుల్లో ఉన్న అనేక లోపాలను ఎన్‌డీఎంఏ గుర్తించింది.

ఈ సర్వీసుల్లో 80 శాతం లోపాలు కనిపించాయని, అవసరమైన దానికన్నా96 శాతం మంది తక్కువగా సిబ్బంది ఉన్నారని కమిటీ దర్యాప్తులో తేలింది.

"ఈ నివేదిక ఆధారంగా పరిస్థితిని మెరుగు పరచడానికి మేం అనేక సూచనలు చేశాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ సలహాదారు డీకే ధామి అన్నారు.

"గతంలో మా దగ్గర 55 వేల మంది సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు 75 వేల మంది ఉన్నారు." అన్నారాయన.

మునుపటితో పోలిస్తే ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచింది. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు.

"అడవుల్లో మంటలు మునుపటి కంటే తీవ్రంగా ఉంటున్నాయి. కానీ వాటిని ఎదుర్కొనేందుకు అధికారుల దగ్గర సరైన ప్రణాళికలు లేవని అనిపిస్తోంది" అని కుమావున్ జిల్లాకు చెందిన పర్యావరణ కార్యకర్త అనిరుధ్ జడేజా అన్నారు.

"మా అడవులు చాలా పెద్దవి, కానీ అటవీ శాఖ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. పెద్ద అగ్నిప్రమాదం జరిగినప్పుడు వారు ఏమీ చేయలేరు." అని జడేజా వ్యాఖ్యానించారు.

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌ నిపుణులదీ అదే మాట.

"నేపాల్‌ పర్యావరణం కోసం విదేశాల నుంచి లక్షల డాలర్లు వస్తున్నాయని మాకు తెలుసు. కానీ అడవులలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు వాటిని వినియోగించడం లేదు'' అని నేపాల్‌కు చెందిన కమ్యూనిటీ ఫారెస్ట్ యూజర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు భారతి పాథక్ అన్నారు.

అయితే ఈ అగ్ని ప్రమాదాలను అదుపు చేయడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని నేపాల్ అధికారులు చెబుతున్నారు.

"ఉన్న వనరులతోనే కృషి చేస్తున్నాం. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను చేరుకోవడం చాలా కష్టం. కావాలని అడవులలో నిప్పు రాజేస్తున్న వారు కూడా ఉన్నారు" అని నేపాల్ అటవీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకాశ్‌ లమ్సాల్‌ అన్నారు.

"అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలాంటి ప్రమాదాలను కట్టడి చేయలేకపోతున్నాయి" అని ఆయన అన్నారు.

ఉత్తరాఖండ్‌

ఫొటో సోర్స్, NASA FIRMS

స్థానిక సంఘాలకు సాయం కావాలి

అడవుల్లో నివసించే ప్రజలు మంటలను ఆర్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే వారి నుంచి సరైన సహకారం అందడం లేదు.

"అడవులలో నివసించే ప్రజలకు, అటవీ శాఖ అధికారుల మధ్య అప నమ్మకం ఉండటమే దీనికి కారణం" అని పాథక్ అన్నారు.

"అడవులలో ఉండే ప్రజలు, ప్రజా సంఘాలు అడవి మీద హక్కు తమదే అంటాయి. ఈ సందర్భంలో అటవీ శాఖతో వారికి విభేదాలు వస్తున్నాయి. అందుకే వారు సహకరించడం లేదు" విజేంద్ర అన్నారు.

"ఈ అటవీ ప్రమాదాలను నివారించడంలో అధికారులు స్థానికులతో కలిసి పని చేయాలి" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)