హరిద్వార్ కుంభమేళా: కరోనా భయాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలిన విషయాలేంటి?

ఫొటో సోర్స్, DIP UTTARAKHAND
- రచయిత, రాజేశ్ డోబ్రియాల్
- హోదా, ఉత్తరాఖండ్ నుండి, బీబీసీ కోసం
హరిద్వార్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఏప్రిల్ 14న జరిగిన మూడవ 'షాహిస్నాన్'(పుణ్య స్నానం) తర్వాత కరోనా కలకలం చెలరేగింది. మహా నిర్వాణి అఖాడాకు చెందిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్‌దాస్ ఏప్రిల్ 15న కరోనాతో మరణించడంతో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది.
మరోవైపు అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి మహరాజ్ అప్పటికే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరిన ఆయన షాహిస్నాన్‌కు హాజరు కాలేదు.
వీరు కాకుండా ఇప్పటి వరకు మరో 49మంది సాధువులకు కరోనా సోకినట్లు తేలింది. అంతకు ముందు, బుధవారం జరిగిన షాహిస్నాన్ కార్యక్రమంలో 13.50 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని తేలింది.
ఏప్రిల్ 12న జరిగిన షాహిస్నాన్‌లో సుమారు 35 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. కుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజూ 50 వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే ఆరోగ్య శాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం టెస్టింగ్ సామర్థ్యం రోజుకు 25 వేలు మాత్రమేనని వెల్లడించింది.

ఫొటో సోర్స్, DIP UTTARAKHAND
అఖాడాలలో శాంపిల్స్ సేకరణ
గురువారం నిర్వాణ అఖాడాకు చెందిన కపిల్ దేవ్‌దాస్ మరణించిన తరువాత, ఆరోగ్య శాఖకు మత్తు వదిలింది. అఖాడాలలో ర్యాండమ్ శాంపిల్ టెస్టులు చేయడం మొదలు పెట్టింది. జునా అఖాడాలో 200 మంది సాధువులకు స్వాబ్ టెస్టులు నిర్వహించింది.
అఖాడా పరిషత్ ప్రధాన కార్యదర్శి హరి గిరి మహారాజ్ సహా జునా అఖాడా లోని పలువురు సాధువుల నుంచి శాంపిళ్లు తీసుకున్నారు. నమూనాలు ఇచ్చిన సాధువులంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
దీనిని బట్టి ఇంతకు ముందు అఖాడా లలో ఆరోగ్య శాఖ ర్యాండమ్ టెస్టులు కూడా చేయలేదని అర్ధం చేసుకోవచ్చు. బహుశా దీని ఫలితంగానే అఖాడాలలో కరోనా వేగంగా వ్యాపించింది.
మరోవైపు, తాము కుంభమేళాను ముగిస్తున్నట్లు నిరంజనీ అఖాడా ప్రకటించింది. ఈ కుంభమేళాలో పాల్గొంటున్న 13 అఖాడాలలో నిరంజనీ అఖాడా ఒకటి. కీలకమైన షాహిస్నాన్ పూర్తయిందని, కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్ 17న కుంభమేళాను ముగించాలని నిర్ణయించినట్లు అఖాడా కార్యదర్శి రవీంద్ర పురి మహరాజ్ అన్నారు.
అయితే ఇది అఖాడా కౌన్సిల్ నిర్ణయం కాదని, తమ అఖాడా వ్యక్తిగత నిర్ణయమని ఆయన అన్నారు. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని మిగిలిన అఖాడాలు కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, DIP UTTARAKHAND
ఎన్ని టెస్టులు చేశారు.
కరోనా కారణంగా జిల్లా ఆరోగ్య శాఖ, కుంభమేళా నిర్వహణలో ఉన్న ఇతర ఏజెన్సీల ద్వారా రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కుంభమేళా అధికారి దీపక్ రావత్ బుధవారం మీడియాకు చెప్పారు.
కానీ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ నేగి తరఫున కోర్టుకు దాఖలు చేసిన విజ్ఞప్తిలో రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలంటూ మార్చి 31న ఇచ్చిన ఆదేశాలను పాటించడం సాధ్యం కాదని, వాటిని తగ్గించాలని కోరారు.
ప్రభుత్వం కుంభమేళాలో కేవలం రోజుకు 25 వేల పరీక్షలు మాత్రమే చేయగలదని, కాబట్టి టెస్టుల సంఖ్యను తగ్గించి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం కోరింది.
కుంభమేళాలో నిబంధనలు పాటించడం సాధ్యమేనా ?
కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో కోవిడ్ సర్టిఫికెట్ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ నెగెటివ్ రిజల్ట్ చూపలేకపోయిన 56 వేలమందిని ఏప్రిల్ 1న తిప్పి పంపినట్లు చెప్పారు.
అయితే స్నాన ఘాట్లు, కుంభమేళా ప్రాంతంలోని ప్రతి ఒక్కరి నుంచి కోవిడ్ -19 పరీక్ష రిపోర్టును తనిఖీ చేయడం సాధ్యం కాదని కుంభమేళాకు ఐజీగా వ్యవహరిస్తున్న సంజయ్ గుంజాల్ బీబీసీకి చెప్పారు.
అయితే భద్రతా చర్యల్లో, జాగ్రత్తలు పాటించడంలో సక్సెస్ అయ్యామని అధికారులు చెబుతున్నారు. 18,000 మంది పోలీసు బలగాలలో ఇప్పటి వరకు 20 మంది పోలీసులకు మాత్రమే కరోనా సోకిందని కుంభమేళా ఐజీ వెల్లడించారు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించడం వల్లే సాధ్యమైందని అన్నారు.

ఫొటో సోర్స్, DIP UTTARAKHAND
భక్తులను ఎలా లెక్కిస్తున్నారు?
కుంభమేళాకు హాజరవుతున్న వారిని లెక్కించేందుకు వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కుంభమేళా ఐజీ సంజయ్ గుంజాల్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలను లెక్కిస్తున్నామని ఆయన వెల్లడించారు.
దీనితోపాటు ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒకసారి పార్కింగ్‌లో నిలిపిన వాహనాల ఆధారంగామేళాకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేస్తమని, ఉపగ్రహ డేటాతో ఇది సరిపోలుతోందని అధికారులు చెబుతున్నారు.
కోవిడ్ అసలు లెక్కలేంటి ?
డెహ్రాడూన్ కేంద్రంగా పని చేసే ఎన్జీవో సంస్థ సోషల్ డెవలప్‌మెంట్ ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ కోవిడ్-19 డేటాను అధ్యయనం చేస్తోంది.
కుంభమేళా నిర్వహణాధికారులు చెప్పినట్లు రోజుకు 50 వేల టెస్టులు అబద్ధమని, ఏప్రిల్ 1 నుంచి 13 వరకు సగటున రోజుకు 19,195 టెస్టులు మాత్రమే జరిగాయని సంస్థ వ్యవస్థాపకుడు అనూప్ నౌటియల్ చెప్పారు.
అయితే, ఈ సంఖ్య హరిద్వార్ జిల్లాకు మాత్రమే సంబంధించింది. డెహ్రడూన్, తెహ్రీ, పౌరి అనే మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే రిషికేశ్ ప్రాంతంలో కూడా కుంభ స్నానాలు జరుగుతాయి.

ఫొటో సోర్స్, DIP UTTARAKHAND
ఆరోగ్య సేవల దుస్థితి
కుంభమేళా సమయంలో ఆరోగ్య సేవల పరిస్థితి దారుణంగా ఉందని హరిద్వార్‌కు చెందిన రతన్‌మణి దోవల్ అనే స్థానిక జర్నలిస్ట్ చెప్పారు.
కరోనా పాజిటివ్ అయిన గర్భిణిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరిగి రావాల్సి వచ్చిందని దోవల్ వెల్లడించారు.
అయితే ఈ వాదనను వైద్య శాఖ అధికారులు ఖండించారు. కుంభమేళా జరిగే ప్రాంతంలోని ఆసుపత్రితోపాటు జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులలో ఎలాంటి బెడ్ల కొరతా లేదని వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న సదుపాయాలతోనే మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని, టెస్టులు మరిన్ని పెంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- లండన్: అంబేడ్కర్ నివసించిన ఇంటిని ప్రతిరోజూ సందర్శించే పనిమనిషి స్ఫూర్తి గాథ
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- కొందరికి పీరియడ్స్ సమయంలో కంటి నుంచి కూడా రక్తం వస్తుంది ఎందుకు
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- ‘ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








