Vicarious Menstruation: పీరియడ్స్ సమయంలో కొందరికి కంటి నుంచి కూడా రక్తం వస్తుంది ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డా. శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
రక్త కన్నీరు నాటకం గురించి విన్నాం. కొన్ని రోజుల క్రితం, చండీగఢ్‌లో ఒక యువతికి రక్త కన్నీరు వచ్చిన సంఘటన ఆమెనూ, ఆమె కుటుంబాన్నే కాదు వైద్యులను సైతం కలవర పెట్టింది.
అదొక అరుదైన కేసు. ఆ ప్రత్యేకమైన ఆ కేసులో ఎందుకలా జరిగిందని చూస్తే, ఆ సమయంలో ఆమె పీరియడ్స్‌లో ఉంది.
ఆ పరిస్థితిని ప్రత్యామ్నాయ రుతుస్రావం (Vicarious Menstruation) అంటారు.
ఇలా ఎందుకు జరిగింది. కారణమేమిటి?
దీనికి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి కారణం.

ఫొటో సోర్స్, Getty Images
Endometriosis అంటే ఏమిటి?
గర్భాశయం లోపల లైనింగ్‌ని ఎండోమెట్రియం (Endometrium) అంటారు. ఆ లైనింగ్‌లో ప్రత్యేకమైన కణజాలం, గ్రంధులు ఉంటాయి.
అవి స్త్రీ హార్మోన్లకు అనుగుణంగా స్పందిస్తూ, వృద్ధి చెందుతుంటాయి.
పీరియడ్స్ సమయంలో ఆ గర్భాశయపు లైనింగ్ (Endometrium) రుతుస్రావంలా బయటికి వెళ్లిపోతుంది. తర్వాత ఎండోమెట్రియం యొక్క కొత్త పొర ఏర్పడుతుంది.
కొన్ని సందర్భాలలో, ఈ ప్రత్యేక కణజాలం మరియు గ్రంధులు, గర్భాశయం బయట శరీరంలో వేర్వేరు ప్రదేశాల్లో ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు.
గర్భాశయం బయట ఉన్నా సరే, ఈ గ్రంధులు స్త్రీ హార్మోన్లకు స్పందిస్తూ గర్భాశయంలోని కణాలతో సమానంగా వృద్ధి చెందుతూ తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. పీరియడ్స్ సమయంలో సైతం చైతన్యవంతమవుతాయి.
చండిగఢ్ యువతికి ఆ కణజాలం కంటిలో వృద్ధి చెందింది. దాని ఫలితమే ఆమెకు పీరియడ్స్ సమయంలో రక్త కన్నీరు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీలలో ఎండోమెట్రియోసిస్ లక్షణాలేమిటి?
పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి కలగడం.
స్త్రీ పురుషుల కలయిక బాధాకరంగా ఉండడం.
పీరియడ్స్ లో వున్నపుడు, మలవిసర్జన సమయంలో బాధ.
సంతానం కలగడం లేటవడం.
ఏయే ప్రదేశాల్లో దీని ప్రభావం కనబడుతుంది.. శరీరంలో కలిగే మార్పులేమిటి?
ఎక్కువగా గర్భాశయం వెనుకభాగంలోనూ, అండాశయాలపైన ఎండోమెట్రియోసిస్ కనిపిస్తుంది.
ప్రతినెలా ఈ కణాలు వృద్ధి చెందడం ద్వారా శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి.
ఫేలోపియన్ ట్యూబులు గర్భాశయం వెనుక అతుక్కుంటాయి. అండం విడుదల సమయంలో ట్యూబులు తమ చివర్ల ద్వారా స్వీకరించే సహజ గుణాన్ని పోగొట్టుకుంటాయి.
Ovaries : అండాశయాలలో ఎండోమెట్రియోసిస్ వల్ల ఆ కణాలు, అండాల వుత్పత్తికి పనికిరాకుండా పోతాయి.
ఇలా శారీరిక అవయవాల్లో మార్పుల వల్ల, ఏర్పడిన అతుకుల వల్ల, కడుపులో నొప్పి, స్త్రీ పురుష సంయోగంలో బాధ, మల విసర్జన సమయంలో నొప్పి తో బాధపడతారు.
ఎండోమెట్రియోసిస్ రోగ నిర్థారణ ఎలా చేస్తారు?
రోగలక్షణాలు ఈ పరిస్థితిని సూచిస్తాయి.
శరీరావయవాలను పరీక్ష చేయడం ద్వారా వ్యాధిని కొంత అంచనా వేయగలం.
లాపరోస్కోపీ పరీక్ష ద్వారా వ్యాధి నిర్థారణ అవుతుంది.
టెలిస్కోప్‌తో పొట్ట లోపలి భాగాలను పరీక్ష చేయడం ద్వారా, ఎండోమెట్రియోసిస్ యే యే ప్రదేశాల్లో ఎక్కవగా వున్నదో, ఎంత విస్తృతంగా వున్నదో, సంతానం కలగకపోవడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా, అదే సమయంలో చికిత్స కూడా చేసే అవకాశం వుంది.
ఎండోమెట్రియోసిస్ వున్నపుడు సంతానం కలగడం ఎందుకు లేటవుతుంది.
పొత్తి కడుపులో నొప్పి వల్ల, ఇంటర్ కోర్స్ సమయంలో నొప్పి వల్ల జంటల మధ్య దూరం పెరుగుతుంది.
ఫేలోపియన్ ట్యూబుల నిర్మాణాకృతిలో తేడాలు రావడం వల్ల కూడా అండాన్ని స్వీకరించడం సాఫీగా జరగదు. అండాశయాలలో ఎండోమెట్రియోసిస్ వల్ల ఆ కణాలన్నీ నాశనమై అండాల వుత్పత్తికి పనికిరాకుండా పోతాయి.
ఇమ్యూనీటీ లో కొన్ని మార్పుల వల్ల, అండానికీ, శుక్రకణానికీ, రెండూ కలిసి ఏర్పడిన పిండానికి సైతం ప్రతికూలమైన వాతావరణముంటుంది.
గర్భాశయపు గోడలలో పిండం ఎదగడానికి అవసరమైన ఎండోమెట్రియం పొర సిద్ధంగా వుండదు.

ఫొటో సోర్స్, Getty Images
సంతానం కలగడానికి చికిత్స ఎలా?
కొన్ని మందుల ద్వారా అండాలు ఎక్కువగా వుత్పత్తి అయేలా చూడడం.
IUI & IVF వంటి కృత్రిమ సంతానోత్పత్తి పద్ధతులనుపయోగించడంద్వారా వున్న స్త్రీలు గర్భం దాల్చవచ్చు.
శస్త్ర చికిత్స : ఎండోమెట్రియోసిస్ వల్ల గర్భాశయానికి ట్యూబులకు అతుకులు ఏర్పడతాయి. లాపరోస్కోపీ ద్వారా ఆ అతుకులను విడదీయడం వల్ల, నొప్పి తగ్గుతుంది. సంతానం కలగడానికి అవకాశాలూ మెరుగవుతాయి.
బాధలేకపోవడం వల్ల స్త్రీ పురుషుల సంయోగం తరచుగాజరగడానికి ఆస్కారం వుంటుంది..
ఎండోమెట్రియోసిస్ వల్ల కలిగే నొప్పికి చికిత్స ఎలా?
ఎండోమెట్రియోసిస్ స్వల్పంగా వున్నపుడు నొప్పి తగ్గించే మాత్రలు వాడడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
సమస్య తీవ్రంగా వున్నపుడు హార్మోన చికిత్స అవసరం. వేర్వేరు ప్రభావంతమైన హార్మోన్ల చికిత్సలు అందుబాటులో వున్నాయి.
శస్త్ర చికిత్స: ఎండోమెట్రియోసిస్ సమస్యను తగ్గించడానికి లాపరోస్కోపీ ద్వారా శస్త్ర చికిత్స వల్ల ప్రయోజనాలున్నాయి. సమస్యను తీవ్రతను అంచనా వేయడంతో బాటు , అదే సమయంలో చికిత్స కూడా సాధ్యమవుతుంది.
ఎండోమెట్రియోసిస్ స్థాయి తీవ్రంగా వున్న స్త్రీలలో గర్భకోశం తీసివేయాల్సిన అవసరం వుంటుంది.
స్కార్ ఎండోమెట్రియోసిస్
సిజేరియన్ జననాలు ఎక్కువైన నేపధ్యంలో ఈ పరిస్థితిని ఎక్కువగా చూస్తూ వున్నాం.
సిజేరియన్ జరిగే సమయంలో , గర్భాశయ కణజాలం ఉదరపు గోడలో, ఆపరేషన్ తాలూకు గాయం వద్ద చిక్కుకుంటుంది. గాయం మానిన తర్వాత కూడా గర్భాశయానికి చెందిన కణజాలం, స్త్రీ హార్మోన్లలు స్పందిస్తూ వృద్ధి చెందుతుంది. ప్రతినెలా పీరియడ్స్ సమయంలో సిజేరియన్ గాయం వద్ద నొప్పి వస్తూ వుంటుంది.
నొప్పి కలిగించే కణాలను తీసి వెయ్యడానికి కొన్ని సార్లు తేలికపాటి శస్త్ర చికిత్స అవసరమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








