‘నేనిక చనిపోతానని నా కవల పిల్లలకు తెలియాలి.. దయచేసి ఈ ఉత్తరం వారికి చేరనివ్వండి’

యూకెలో పిల్లల్ని దత్తతకు ఇచ్చిన తల్లితండ్రులకు వారి పిల్లలతో సంప్రదించేందుకు లెటర్ బాక్స్ కాంటాక్ట్ ఇస్తారు

ఫొటో సోర్స్, EMMA LYNCH

ఫొటో క్యాప్షన్, యూకెలో పిల్లల్ని దత్తతకు ఇచ్చిన తల్లితండ్రులకు వారి పిల్లలతో సంప్రదించేందుకు లెటర్ బాక్స్ కాంటాక్ట్ ఇస్తారు

హన్నాకు ఈ భూమిపై బతికేందుకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని డాక్టర్లు 2017లో చెప్పారు.

"ఈ విషయం తెలియగానే నేను సోషల్ సర్వీసెస్‌కి ఫోన్ చేశాను. నా పిల్లలు క్షేమంగానే ఉన్నారని నాకు తెలియాలి" అని ఆమె అనుకున్నారు.

అప్పటికి ఆమె పిల్లలను దత్తత ఇచ్చి 11 సంవత్సరాలు కావస్తోంది. కానీ, గత 7 సంవత్సరాలుగా హన్నాకు వారి వివరాలేవీ తెలియవు

టీనేజ్ లో పిల్లల్ని కన్న హన్నాకు ఎవరూ లేకపోవడంతో ఆమె పిల్లల సంరక్షణ బాధ్యతలను చేపట్టలేదని ఆ దేశ సోషల్ సర్వీసెస్ విభాగం భావించింది.

14 నెలల చిన్నారులను తన చేతుల్లోంచి వేరే వారు దత్తత కోసం తీసుకోవడాన్ని చూసిన క్షణమే తన జీవితంలో అత్యంత దారుణమైన రోజని హన్నా అంటారు.

ఆమెకప్పుడు 16 సంవత్సరాలు. ఒక అనాధ తల్లీపిల్లల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమె వాళ్ళని ఎలాగైనా తనతో ఉంచుకోవాలని ఒక ఏడాది పాటు తీవ్రంగా ప్రయత్నించారు.

బ్రిటన్‌లో పిల్లల్ని దత్తతకు ఇచ్చిన తల్లితండ్రులకు వారి పిల్లలతో సంప్రదించేందుకు లెటర్ బాక్స్ కాంటాక్ట్ ఇస్తారు. దీని ద్వారా తమ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉత్తరాలు రాయవచ్చు. ఈ ఉత్తరాలు పెంపుడు తల్లి తండ్రులకు లెటర్ బాక్స్ వారు అందచేస్తారు.

హన్నా విషయంలో మాత్రం ఆమె సంవత్సరంలో మూడు సార్లు ఆమె పిల్లలకు ఉత్తరాలు రాసేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు.

ఆమె వారి పుట్టినరోజుకు, క్రిస్మస్ పండుగకు కూడా అభినందనలు తెలుపుతూ కార్డులు పంపవచ్చని చెప్పారు. అలాగే, పెంపుడు తల్లి తండ్రుల నుంచి పిల్లల ఫోటోలను కూడా పొందవచ్చని చెప్పారు.

ఈ నిర్ణయాలు చేయడం సులభమే. కానీ, తర్వాత వాటిని అమలు చేయడమే కష్టమైన ప్రక్రియ.

ఆమె పిల్లలను దత్తతకిచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఆమెకు ఉత్తరాలు రావడం మొదలయింది. కానీ, అవి చదువుతుంటే ఆమెకు ఉత్సాహం వచ్చే బదులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టేసేవి.

"అవి, నా పిల్లలు రాసినట్లే రాసేవారు, అమ్మ నాన్న ఫలానా పని చేశారు. మేము ఏదో పని చేశాం అన్నట్లు ఉండేవి. నా పిల్లల బదులు ఎవరో రాస్తున్నట్లు అనిపించేది" అని హన్నా చెప్పారు.

క్రమేపీ హన్నా ఆ ఉత్తరాలను చదవడం మానేశారు. "ఒక మూస పద్దతిలో రాస్తున్నట్లు అనిపించేది. మేం సెలవులకు బయటకు వెళ్లాం.. మేము గుర్రపు స్వారీ చేశాం వంటివేమీ అందులో ఉండేవి కావు. నాకేమి కావాలో ఎవరూ రాయలేదు. వారెలా పెరుగుతున్నారు. వారి ఆసక్తులేమిటి అనే విషయాలు ఎవరూ రాయలేదు" అని ఆమె చెప్పారు.

"కొన్ని రోజులకు ఫోటోలు మాత్రం చూసుకుని, ఉత్తరాలు చదవడం ఆపేశాను".

హన్నా కూడా ఉత్తరాలు రాయడం మానేశారు. పిల్లలను కోల్పోయిన బాధ ఆమెకు చాలా ఎక్కువగా ఉండేది.

నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె వారికి తిరిగి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నారు.

"నా జీవితం గురించి రాశాను. నాకొక ప్రేమించే భాగస్వామి దొరికినట్లు రాశాను. నేను చేస్తున్న ఉద్యోగం, నేనెక్కడ ఉంటాను, నేను పిల్లల్ని ఎంత గుర్తు తెచ్చుకుంటున్నాను, వారిని వదులుకోవడం నాకెంత కష్టమైన విషయమో, వారి గురించి నేను ప్రతి రోజూ ఎలా ఆలోచిస్తూ ఉంటాను , వాళ్ళు నాతో ఉంటే ఎలా ఉండేదో వివరిస్తూ ఉత్తరం రాశాను" అని హన్నా చెప్పారు.

కానీ, ఆమె రాసిన ఉత్తరం నియమాలకు విరుద్ధంగా ఉండటంతో ఆ ఉత్తరాన్ని పిల్లలకు పంపలేనట్లు స్థానిక అధికారులు ఆమెకు తెలియచేశారు.

ఈ ఉత్తరాలు చేరవేసేందుకు మధ్యవర్తిగా స్థానిక అడాప్షన్ కేంద్రం వ్యవహరిస్తోంది.

ఇందులో ఎవరి పేర్లు, చిరునామాలు వెల్లడి చేయరు. కానీ, ఇరు వైపుల వాళ్లు రాసిన ఉత్తరాలలో సారాంశాన్ని పరిశీలించాకే ఉత్తరాలను సదరు వ్యక్తులకు అందచేస్తారు.

"నేనెక్కడ పని చేస్తున్నాననే విషయం, మీరు నాతో ఉండి ఉంటే బాగుండేది అని రాసిన లాంటి విషయాలు ఉత్తరంలో ఉండకూడదని సోషల్ సర్వీసెస్ అధికారులు చెప్పినట్లు చెప్పారు.

లెటర్ బాక్స్ నిబంధనల ప్రకారం కొంత మంది ఉత్తరాలు మాత్రమే రాయనిస్తే, కొన్ని చోట్ల గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న బహుమతులు కూడా పంపనిస్తారు.
ఫొటో క్యాప్షన్, లెటర్ బాక్స్ నిబంధనల ప్రకారం కొంత మంది ఉత్తరాలు మాత్రమే రాయనిస్తే, కొన్ని చోట్ల గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న బహుమతులు కూడా పంపనిస్తారు.

"ఉత్తరంలోని సారాంశం అంతా సానుకూలంగా ఉండాలని చెబుతూ నాకు సందేశాలు పంపేవారు. అర్థం లేని ఆ సందేశాలు చూసి నేను విసిగిపోయాను. కొన్ని రోజులకు పిల్లల దగ్గర నుంచి కూడా నాకు ఉత్తరాలు రావడం ఆగిపోయింది" అని ఆమె చెప్పారు.

మైక్ హాన్ కాక్ గత 10 ఏళ్లుగా ఇలాంటివారికి ఉత్తరం రాయడంలో సహకరించే ఉద్యోగంలో ఉన్నారు. ఆయన పీఏసీ ఫ్యామిలీ ఫస్ట్ సర్వీస్‌లో పని చేస్తున్నారు.

"ఆ ఉత్తరం ఎవరు అందుకుంటున్నారో తెలుసుకుని అది వారికి పంపాలో వద్దో, అలాగే పెంపుడు తల్లి తండ్రులు ఆ ఉత్తరాన్ని పిల్లలకు చూపించాలో లేదో మేం పరిశీలించాలి" అని చెప్పారు.

"ఈ ఉత్తరాలలో భావోద్వేగాలు ఉండకూడదు. కన్న తల్లి పిల్లల గురించి బెంగ పడుతున్నట్లు రాస్తే అది ఆ పిల్లలకు మానసిక క్షోభ కలిగించవచ్చు. మొదటి ఉత్తరం చాలా కష్టంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

"కొన్ని సార్లు చాలా మంది తల్లితండ్రులు బాధతో ఉత్తరం రాయరు. వారి సొంత అనుభవాల వలన చాలా వేదనతో ఉంటారు. వారి పిల్లలని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఉత్తరాలు రాయడానికి నిరక్షరాస్యత అడ్డు వస్తూ ఉంటుంది" అని చెప్పారు.

కన్న తల్లితండ్రులు, పెంచుకున్న వారు కూడా ఉత్తరాలు రాసేందుకు సహాయం తీసుకోవచ్చు.

కానీ, ఇదంతా ఎలా ఉంటుందనేది చెప్పలేం అని రాయల్ హాలోవే యూనివర్సిటీ లో సోషల్ వర్క్ ప్రొఫెసర్ అనా గుప్తా అన్నారు.

"కొన్ని చోట్ల ప్రత్యేకంగా లెటర్ బాక్స్ కోఆర్డినేటర్లు ఉంటారు. వారు ఈ ఉత్తరాలు రాసేందుకు సహాయం అందిస్తారు. కొన్ని చోట్ల అసలు అలాంటి సహాయమే లభించకపోవచ్చు" అని చెప్పారు.

హన్నాకు మైక్ మద్దతు లభించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆమె పిల్లలకు ఉత్తరాలు విజయవంతంగా పంపించగలిగి ఉండేవారు. అలాగే వారి దగ్గర నుంచి సమాధానం కూడా లభిస్తూ ఉండేది.

హన్నా ఆమె భర్తతో కలిసి తన పిల్లల పుట్టిన రోజు నాడు పుట్టిన రోజు పాట పాడతారు. కానీ, ఆ విషయం ఆ పిల్లలకు తెలిసే అవకాశం లేదు.

"కొన్ని సంవత్సరాల పాటు నేను వారి గురించి విచారిస్తూనే ఉన్నాను. వారినెవరైనా చంపేశారేమోననే పీడకలలు వచ్చేవి".

కానీ, ఇక తనకే ఈ భూమి పై ఎక్కువ రోజులు గడిపే అవకాశం లేదని తెలిసిన వార్త విన్న వెంటనే ఈ విషయాన్ని తన పిల్లలకు చెప్పాలా వద్దా అనే ప్రశ్న ఆమెను వెంటాడింది.

ఆమె వెంటనే ఆమె నాలుగవ దశ మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నట్లు , ఆమె మరో 6 నెలలు మాత్రమే బతుకుతారని డాక్టర్లు చెప్పారని ఆమె కవల పిల్లలను ఒక సారి చూడాలని అధికారుల ద్వారా అభ్యర్ధించారు. కానీ, ఎటువంటి ఫలితం లేదు.

రెండు నెలల తర్వాతా హన్నాకు ఆమె పిల్లల పెంపుడు తల్లితండ్రుల నుంచి 12 ఉత్తరాలు వచ్చాయి.

ఒక సంవత్సరం తర్వాత అధికారులు ఆమెను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె పిల్లల పెంపుడు తల్లి తండ్రులకు తెలియచేసినట్లు చెప్పారు.

హన్నాకు ఉత్తరం రాసేందుకు స్థానిక అధికారులు సహాయం చేశారు. చివరకు ఆ ఉత్తరం 2020కి అధికారులకు చేరింది.

ఆమె చనిపోతారని డాక్టర్లు చెప్పి అప్పటికి మూడేళ్లు కావస్తోంది.

"నా మనసులో ఉన్న ఎన్నో విషయాలను నా పిల్లలకు రాయగలిగాను. వాళ్ళ గురించి ప్రతి రోజూ ఆలోచిస్తానని, వాళ్ళ చిన్నప్పటి వస్తువులను ఒక పెట్టెలో పెట్టి భద్రపరిచానని, వాళ్ళ ఫొటోలన్నీ ఇంటి గోడపై అలంకరించాను" అని ఆమె ఆ ఉత్తరంలో రాశారు.

అవన్నీ ఆమె నుంచి దూరం చేసేటప్పుడు ఆమెకు మత్తు ఇవ్వకపోతే ఆమె ఆ క్షణాన్ని తట్టుకోలేనని రాశారు.

ఈ ఉత్తరాన్ని కూడా అధికారులు పిల్లలకు చేరవేయలేదు. కానీ, ఆ ఉత్తరాన్ని ఆ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చూసుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంటే, దానికి మరో రెండేళ్ల సమయం ఉంది.

దాని బదులు ఆమె మరొక చిన్న ఉత్తరం రాశారు. ఆమె పిల్లలను ఎంత ప్రేమించారో వివరిస్తూ ఆమెకి అనారోగ్య సమస్యలున్నట్లు రాశారు. కానీ, ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు రాయలేదు.

"నా అనారోగ్యం విషయం రాయడానికి లెటర్ బాక్స్ అధికారులు ఒప్పుకోలేదు. నా ఉత్తరం చూసి నా పిల్లలు కుంగిపోకూడదని చెప్పారు. కానీ, అప్పటికే నేను నాలుగు సార్లు చావు ముఖం చూసాననే విషయం వారికి తెలియదు" అని హన్నా అన్నారు.

లెటర్ బాక్స్ నిబంధనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లెటర్ బాక్స్ నిబంధనలు

ఈ లెటర్ బాక్స్ పని చేసే విధానం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది అని నఫీల్డ్ ఫ్యామిలీ జస్టిస్ అబ్సర్వేటరీ పరిశోధన తెలిపింది.

కొంత మంది ఉత్తరాలు మాత్రమే రాయనిస్తే, కొన్ని చోట్ల గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న బహుమతులు కూడా పంపనిస్తారు. కొన్ని చోట్ల కేవలం పెద్దవారి మధ్యే ఉత్తరాలు రాయనిస్తారు. కొన్ని చోట్ల పిల్లలు నేరుగా తల్లితండ్రులను సంప్రదిస్తారు.

"తగిన సమాచారం" అంటే ఏమిటో అనే అంశం పై స్థానిక అధికారులకందరికీ ఒక ఏకాభిప్రాయం లేదు.

కొంత మంది అడాప్షన్ ఉద్యోగులు ఉత్తరాలన్నింటినీ చదివి ఏదైనా మార్పులు చేయాలంటే చేయమని సూచించిన తర్వాతే ఉత్తరాలు పంపిస్తారు.

ఒక పెంపకానికి వెళ్లిన ఒక వ్యక్తికి వచ్చిన అన్ని ఉత్తరాలు నలుపు రంగులో ఉండేవని, కానీ, ఆ రంగు వెనక తన కన్న తల్లి తనను ఎంత ప్రేమించారో తెలుస్తూ ఉండేదని 2018లో అనా గుప్త నిర్వహించిన ఒక అధ్యయనం కోసం చేసిన ఇంటర్వ్యూలో ఒకరు వెల్లడించారు.

హన్నా ఈ ఉత్తరం పంపగానే ఆమెకు వెంటనే పిల్లల ఫోటోలు అందాయి.

"నేను అదే రోజు ఒక శస్త్ర చికిత్సకు వెళుతున్నాను. నాకు చాలా భయం వేసింది. నేను దృఢ చిత్తంతో ఉన్నాను".

"అప్పటి నుంచి ఆమెకు ఆమె పిల్లల నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. వారి చదువు, ఆసక్తుల గురించి ఉత్తరాల ద్వారా తెలియచేస్తున్నారు. కానీ, ఆమె అనారోగ్యం గురించి వారేమీ రాయడం లేదు.

ఆ విషయం వారికి తెలుసో తెలియదో ఆమెకు తెలియదు.

లెటర్ బాక్స్ నియమాలు

లెటర్ బాక్స్ విధానంలో పెంపుడు తల్లి తండ్రులు ముందు ఉత్తరం తీసుకుని పిల్లలకు ఇవ్వాలో వద్దో నిర్ణయించుకుంటారు.

హన్నా అనారోగ్యం గురించి ఆమె పిల్లలకు తెలియచేయాలని అనా గుప్తా అంటారు.

ఆమె చనిపోయే లోపు ఆమె పిల్లలకు ఆమెను కలిసే అవకాశం ఇవ్వాలని ఆమె అన్నారు. లేని పక్షంలో పిల్లలు గాయపడే ప్రమాదం ఉందని అన్నారు.

"జీవితంలో దొరికే ఒకే ఒక్క అవకాశాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. నేను సోషల్ వర్కర్ అయి ఉంటే నేను దత్తత తీసుకున్న తల్లితండ్రులతో మాట్లాడి ఆఖరు సారి వారి కన్న తల్లిని కలిసేలా చేయమని చెప్పి ఉండేదానిని" అని ఆమె అన్నారు.

చాలా మంది దత్తతకు వెళ్లిన పిల్లలు తమ కన్న తల్లితండ్రులు ఎవరో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాలని అనుకుంటారని ఆమె చేసిన అధ్యయనాల్లో తేలింది.

వారెక్కడివారో, వారెవరికి చెందిన వారో తెలియాల్సిన అవసరం ఉందని అంటారు.

రహస్య ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒక వ్యక్తి నాలుగేళ్లున్నప్పుడు దత్తతకు వెళ్లారు.

"ఆయనిప్పుడు ఒక సంస్థకు సిఇఓగా పని చేస్తున్నారు. ఆయనకు మంచి కుటుంబం ఉంది. కానీ, ప్రతి రోజూ నేనెవరు అనే ప్రశ్న వస్తుంది ఆయనకు. ఆయనను పోలీసులు తన తల్లి చేతుల నుంచి తీసుకోవడం ఆయనకు ఇంకా గుర్తు ఉంది. ఆమె ఆయనను వదిలేశారనే భావనతోనే ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆమెను ఒక్క సారి కలిసి ఉంటే ఆ భావన పోయి ఉండేది" అని ఆయన చెప్పినట్లు గుప్తా వివరించారు.

లెటర్ బాక్స్ కాంటాక్ట్ ని సరిగ్గా నిర్వహించగల్గితే పెంపకానికి వెళ్లిన పిల్లల స్వీయ గుర్తింపుకి, పిల్లల కుటుంబం గురించి తెలియచేసి వారిని ఎవరూ తిరస్కరించలేదనే భావన నుంచి బయట పడేస్తుందని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ బెత్ నీల్ చెప్పారు.

కానీ, లెటర్ బాక్స్ కాంటాక్ట్ మధ్యలో తెగిపోతూ ఉంటుందని చెప్పారు.

పిల్లలకు మధ్య వయసు వచ్చేసరికి సంప్రదింపులు ఆగిపోతాయని చెప్పారు. చాలా మంది పిల్లలకు ఉత్తరాల గురించే తెలియదు అని కొన్ని అధ్యయనాలు చెప్పినట్లు చెప్పారు.

కానీ, ఇటీవల కాలంలో చాలా సార్లు సోషల్ మీడియాలో చాలా మంది కలుస్తున్నట్లు ఒక సర్వే తెలిపింది.

దీంతో లెటర్ బాక్స్ కాంటాక్ట్ మెరుగు పరిచే విధానాల పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉత్తరాలు రాసుకోవడం తగ్గిపోయిన ఈ రోజుల్లో, ప్రత్యామ్నాయ సమాచార మార్గాలను మెరుగుపరచడమే ఉత్తమమని కొందరు అంటారు.

పెంపుడు పిల్లలకు తమ కన్న తల్లితండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, అక్క చెల్లెళ్ళతో బంధం కొనసాగాలని ప్రభుత్వ అధికారులు కూడా అంటున్నారు.

ఇదే జరిగితే భవిష్యత్తులో హన్నా లాంటి వారికి ఇదొక శుభవార్త అవుతుంది.

హన్నాకి ఇప్పుడు 32 సంవత్సరాలు. ఆమె పిల్లల్ని చూస్తాననే ఆశ ఆమెకుంది.

"నేనొక యోధురాలిని. నేను వెళ్లాలనుకునేవరకు నేనెక్కడికీ వెళ్ళను. నా పిల్లల్ని కలవడమే నేను వేసే తర్వాత అడుగు " అని ఆమె అన్నారు.

"నేను బతికుంటే వారు నన్ను కలుస్తారు. లేదంటే, నేను ప్రతి అడుగులో వాళ్ళని నాతో ఉంచుకునేందుకు ఎంత పోరాడానో కోర్టు పత్రాలు చూసి తెలుసుకుంటారు".

(ఇల్లస్ట్రేషన్స్ : ఎమ్మా లించ్ )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)