చార్లెస్ శోభరాజ్: ఈ ‘బికినీ కిల్లర్’ నేపాల్ జైలు నుంచి విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వగలిగారు

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమల్ పరియార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'బికినీ కిల్లర్'గా పిలిచే చార్లెస్ శోభరాజ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.

దీనికి రెండు కారణలు ఉన్నాయి. ఒకటి.. బీబీసీ క్రైమ్ డ్రామా సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి "ది సర్పెంట్" పేరుతో శోభరాజ్ మీద తీసిన సీరియల్ కాగా మరో కారణం విదేశీ మీడియాకు కొత్తగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ.

నేపాల్ జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తి మీడియాతో ఎలా మాట్లాడగలిగారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంపై దర్యాపు చేయడానికి పది రోజుల గడువు ఇచ్చినట్లు నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని సుంధారా సెంట్రల్ జైలు హెడ్ తెలిపారు.

నాలుగు దశాబ్దాల క్రితం చార్లెస్ శోభరాజ్ చేసిన హత్యలకు నేపాల్ కోర్టు ఆయనకు జీవితఖైదు విధించింది.

ఒక అమెరికన్ మహిళను, ఒక కెనడా మహిళను హత్య చేసిన నేరాలు రుజువు కావడంతో సుమారు 17 సంవత్సరాలుగా ఆయన సుంధారా సెంట్రల్ జైల్లోనే బందీగా ఉన్నారు.

కాగా, ఇటీవలే రెండు బ్రిటన్ మ్యాగజీన్లలో శోభరాజ్ జైలు జీవితం, భవిష్యత్తు ప్రణాళిల గురించి ఇంటర్వ్యూ ప్రచురితమైంది.

దాంతో, జైల్లో ఉన్న వ్యక్తి ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారనే అంశం చర్చనీయమైంది.

'బికినీ కిల్లర్' చార్లెస్ శోభరాజ్
ఫొటో క్యాప్షన్, 'బికినీ కిల్లర్' చార్లెస్ శోభరాజ్

అనుమతి లేకుండా ఇంటర్వ్యూ ఎలా తీసుకున్నారు?

ఒక ఖైదీని మీడియా ఇంటర్వ్యూ చేయడం చట్ట విరుద్ధమని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

"శోభరాజ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ఏ మీడియా సంస్థకూ హోం శాఖ అనుమతి ఇవ్వలేదు" అని ఆ శాఖ ప్రతినిధి చక్ర బహాదుర్ బుధ తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు కోరినప్పటికీ శోభరాజ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇవ్వలేదని జైలు నిర్వహణ బృందం స్పష్టం చేసింది.

ఈ విషయంపై దర్యాప్తును "వేగవంతం చేయాలని" ప్రభుత్వం సెంట్రల్ జైలుని ఆదేశించింది.

"మీడియా శోభరాజ్‌తో సంప్రదింపులు జరపడం, ఈ విషయం జైలు నిర్వహణ బృందానికి తెలియకపోవడం విచారకరం. ఈ సంఘటన జైలు భద్రతలోని లోపాలను బయటపెడుతోంది" అని నేపాల్ మాజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హేమంత్ మల్ల్ అన్నారు.

సుమారు 17 ఏళ్లుగా శోభరాజ్ నేపాల్ జైల్లో ఖైదీగా ఉన్నారు
ఫొటో క్యాప్షన్, సుమారు 17 ఏళ్లుగా శోభరాజ్ నేపాల్ జైల్లో ఖైదీగా ఉన్నారు

శోభరాజ్ ఎవరెవరితో మాట్లాడారు?

"జైలు లోపలే ఉంటూ శోభరాజ్ ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారో తెలియాలి. ఈ విషయాన్ని కనిపెట్టడానికి మాకు పది రోజులు గడువు ఇచ్చారు. ఈలోగా వాస్తవాలు బయటపడతాయనే నమ్మకం మాకు ఉంది" అని సెంట్రల్ జైల్ జైలర్ లక్ష్మీ బాన్స్‌కోటా అన్నారు.

వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోను మాట్లాడే హక్కును శోభరాజ్ దుర్వినియోగం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

"తనను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇంటర్వ్యూ రికార్డ్ చేసి అందించి ఉండవచ్చు. కానీ ఇదే నిజమని కచ్చితంగా చెప్పలేం. జైల్లో ఫ్రెంచ్ భాష అనువాదకులు లేనందున ఇలాంటి సమస్యలు రావొచ్చు" అని బాన్స్‌కోటా చెప్పారు.

ఖైదీలు తమ బంధువులు కలుసుకునే చోటు, సమావేశ స్థలం సీసీ టీవీ ఫుటేజీలను జైలు అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇటీవల కాలంలో న్యాయవాది తప్ప శోభరాజ్‌ను కలిసేందుకు ఎవరూ రాలేదని వారు చెబుతున్నారు.

జైల్లో ఉంటూ మీడియాతో ఎలా మాట్లాడగలిగారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి
ఫొటో క్యాప్షన్, జైల్లో ఉంటూ మీడియాతో ఎలా మాట్లాడగలిగారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి

తప్పు ఎక్కడ, ఎలా జరిగింది?

నేపాల్‌లో ఖైదీలు వారానికి రెండుసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతిస్తారు.

అయితే, ఫోన్‌లో ఖైదీలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే షరతు ఉంది.

శోభరాజ్ ఇంగ్లిష్, ఫ్రెంచ్ కలిపి మాట్లాడి ఉండొచ్చని, అక్కడ ఉన్నవారికి ఫ్రెంచ్ తెలియకపోవడంతో దాన్ని గుర్తించి ఉండకపోవచ్చని.. ఈ అవకాశాన్ని శోభరాజ్ సద్వినియోగం చేసుకున్నారని జైలర్ బాన్స్‌కోటా తెలిపారు.

ఫోన్ సంభాషణ నిమిత్తం ఖైదీలు జైలు అధికారులకు మూడు టెలిఫోన్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇద్దరితో మాత్రమే ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతిస్తారు.

"ఈ సదుపాయాన్ని వినియోగించుకుని శోభరాజ్ ప్రతి వారం ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లోని తన బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారని" బాన్స్‌కోటా తెలిపారు.

ఈ వివరాలన్నిటినీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విభాగానికి సెంట్రల్ జైలు అందజేసింది. విచారణ, దర్యాప్తు లోతుగా, తీవ్రంగా సాగుతున్నాయి.

శోభరాజ్ ప్రవర్తన ఎలా ఉంటుంది?

శోభరాజ్ ప్రవర్తనతో ఏ సమస్యా లేదని, ఆయన ఇంతకు ముందెన్నడూ జైలు నిబంధనలను ఉల్లంఘించిన దాఖలాలు లేవని జైలు అధికారులు తెలిపారు.

అయితే, కొన్నేళ్ల క్రితం ఒక సమయంలో శోభరాజ్ విచక్షణారహితంగా ప్రవర్తించారని, తోటి ఖైదీలను రెచ్చగొట్టే చర్యలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

నేపాల్ జైలు నిబంధనల ప్రకారం.. ఖైదీలుగా ఉంటూ 70 ఏళ్లు దాటిన నేపాల్ పౌరులను వారి సత్ప్రవర్తన ఆధారంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ నిబంధనను నేపాల్ పౌరలకే కాకుండా విదేశీ పౌరులకు కూడా వర్తింపజేయాలని పేర్కొంటూ శోభరాజ్ తన విడుదల కోసం పదే పదే పిటీషన్లు వేస్తూ ఉన్నారు.

'బికినీ కిల్లర్', 'సీరియల్ కిల్లర్'‌గా పేరుపడిన శోభరాజ్ భారతదేశం, థాయిలాండ్, టర్కీ, ఇరాన్లలో 20 మందిని పైగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)