"మా నాన్నే హంతకుడు.. ఎంతమందిని చంపాడో లెక్కలేదు"

ఫొటో సోర్స్, Analía Kalinec
- రచయిత, వలేరియా పెరాసో
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నాన్నా! మీరు నిజంగానే కొన్ని వందల మందిని చంపేశారా?’’
..ఇలాంటి ప్రశ్నలను ఏ పిల్లలూ తమ తల్లితండ్రులను అడగాలని అనుకోరు. కానీ, అర్జెంటీనాలో కొందరు పిల్లలు వారి తండ్రులను ఈ ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నారు.
ఆగస్టు నెలలో ఒక మధ్యాహ్నం అనాలియా కాలినెక్ ఇంట్లో ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ తన కుటుంబాన్ని చెల్లాచెదురు చేసే సందేశం తెస్తుందని ఆమె ఊహించలేదు.
"నాన్న జైలులో ఉన్నారు. కానీ, నువ్వేమీ ఆందోళన చెందకు. ఇవన్నీ రాజకీయాలు" అంటూ మా అమ్మ ఫోన్ చేశారు.
అప్పటి వరకు నా తల్లితండ్రులకు దేశపు నియంతృత్వ అధికార కేంద్రంతో సంబంధాలున్నాయని నాకు తెలియదు".
అర్జెంటీనాను 1976 - 1983 వరకు ఉన్న క్రూరమైన సైనిక పాలనలో అనాలియా తండ్రి ఎడుయెర్డో ఎమీలియో కాలినెక్ పోలీసు అధికారిగా పనిచేసేవారు.
సైనిక పాలకులు నిర్వహించిన రహస్య నిర్బంధ శిబిరాలలో 180కి హత్యలు, అపహరణలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
ఏడేళ్ల పాటు అధికారంలో ఉన్న సైన్యం రాజకీయ అసమ్మతివాదులను, కమ్యూనిస్టులను, సోషలిస్టులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, కళాకారులను లక్ష్యంగా చేసుకుంది. కాలినెక్ లాంటి అధికారులు చాలా మందిని అపహరించి చట్టవ్యతిరేకంగా జైళ్లలో పెట్టిన తర్వాత 30,000 మందికి పైగా కనిపించకుండాపోయారు.
కానీ, అనాలియాకి 25 ఏళ్లు వచ్చేవరకు అంటే 2005 వరకు తండ్రికి సంబంధించిన రహస్యాలేవీ తెలియదు.

ఫొటో సోర్స్, Analía Kalinec
కాలినెక్‌ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయనను విడుదల చేయలేదు. 2010లో ఆయనకు జీవిత ఖైదు విధించారు.
"నేను రాక్షసుడినని అనుకుంటున్నావా? అని ఆయన నన్నడిగారు. ఆయన నేను ప్రేమించిన తండ్రి. నేను ఆయనకు చాలా సన్నిహితంగా ఉండేదానిని. నేను స్థాణువులా ఉండిపోయాను" అని చెప్పారు.
పౌలా (పేరు మార్చాం) కూడా ఆమె తండ్రి గురించి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.
ఆమెకు 14 ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి ఆమెను, ఆమె సోదరుడిని ఒక కాఫీ షాప్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన తాను ఒక అండర్ కవర్ పోలీసునని చెప్పారు.
ఆ తర్వాత ఆయన లెఫ్ట్ వింగ్‌కి చెందినచొరబాటుదారులను, సైన్యం బంధించాల్సిన వారిని గుర్తించే గూఢచారి అని అర్థమైంది.
"ఆయన చేసిన పని తెలిసినప్పటి నుంచి నాకు చాలా సిగ్గుగా అనిపించి న్యూనతా భావంతో బాధపడుతున్నాను" అని పౌలా చెప్పారు.
ఇలాంటి ఎంతో మంది అమ్మాయిలకు వారి కుటుంబ చరిత్రలు తెలుసుకుని దానిని జీర్ణం చేసుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. కానీ, దీని గురించి బయటకు చెప్పాలని వారు అనుకున్నారు.
మారణహోమానికి కారణమైన వారి పిల్లలంతా కలిసి వారి తండ్రుల చర్యను బహిరంగంగా వ్యతిరేకించారు.
దీంతో కొందరిని వారి కుటుంబాలు వెలేశాయి.

ఫొటో సోర్స్, Analía Kalinec
అనాలియా కాలినెక్ 1980లో జన్మించారు. ఆమె జన్మించే నాటికి సైన్యం లెఫ్ట్ మద్దతుదారులకు వ్యతిరేకంగా పోరాడుతోంది.
ఆమె మానసిక శాస్త్రవేత్త, ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు.
ఆమె తండ్రి వారికి వండి పెట్టడం, వారిని స్పోర్ట్స్ క్లబ్‌కి చేపల వేటకు తీసుకుని వెళ్లడం లాంటివి గుర్తున్నాయి.
ఆమె ముగ్గురు అక్కచెల్లెళ్లకు చిన్నప్పుడే పెళ్లయిపోయింది. వారికెవరికీ రాజకీయాలంటే ఆసక్తి లేదు.
తండ్రిని జైలులో పెట్టినట్లు తెలిసిన వెంటనే వారంతా ఆయన్ను చూడటానికి వెళ్లారు.
"అందరూ నా గురించి చెబుతున్న మాటలను నమ్మకండి. వారు అబద్ధాలు చెబుతున్నారు" అని ఆయన చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆయన ఒక యుద్ధంలో పోరాడానని, అక్కడ క్షమాపణ చెప్పేందుకు ఏమీ లేదని, లెఫ్ట్ ప్రభుత్వం ప్రతీకారంతో తనను వేధించాలని చూస్తోందని తన కుటుంబానికి చెప్పారు.
"నాకు ఆయన మాట్లాడిన ఒక్క పదం కూడా అర్థం కాలేదు" అని అనాలియా అన్నారు.
మా నాన్నకి ఆ విషయంతో ఏమీ సంబంధం లేదనే అనుకున్నాను. ఆయనను అన్యాయంగా బంధించారని అనుకున్నాను. అప్పుడే విచారణ మొదలైంది. మా నాన్న మాతో చెప్పిన విషయాల్లో నిజం లేదని అర్థమవసాగింది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తన తండ్రికి సంబంధించిన కేసు ఫైళ్లను ఆమె చూశారు. ఆయన ఎంత భయోత్పాతం సృష్టించారో తెలుసుకున్నారు. అలాంటి 800 ఘటనలలో ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులతో మాట్లాడి అప్పుడేం జరిగిందో ఆమె తెలుసుకున్నారు.
"సైన్యం అపహరించిన వారిని పెట్టిన కాన్సంట్రేషన్ క్యాంపులలో వారు చెప్పిన వివరాలను నేను చదివాను. అదొక మ్యాప్‌లా అనిపించింది. అందులో నేను మా నాన్నను ఊహించుకుని చూశాను. అది భరించలేనిదిగా అనిపించింది" అని ఆమె అన్నారు.
బాధితులెవరికీ కాలినెక్ అసలు పేరు తెలియదు. ఆయన పని చేసిన రహస్య జైళ్లన్నిటిలోనూ ఆయన మారు పేరు 'డాక్టర్ కె' అనే తెలుసు. వారి గుర్తింపును దాచి ఉంచేందుకు అలా చేసేవారు.
"ఆయన న్యాయవాదిలా ఉండటం వలన ఆయనను డాక్టర్ కె అని పిలుస్తారని ఒకసారి చెప్పడం నాకు గుర్తుంది" అని ఆమె చెప్పారు. ఈ దేశంలో న్యాయవాదులను డాక్టర్లు అని పిలుస్తారు.
అనాలియా చివరకు జైలుకు వెళ్లి ఆమె తండ్రిని కలిశారు.
"చేసిన తప్పును సమర్థించుకునే ఒక కోపోద్రిక్తమైన వ్యక్తిని ఆయనలో చూశాను. దాంతో నా అనుమానాలన్నీ మరింత బలపడ్డాయి. ఆయన అన్ని నేరాల్లో వ్యక్తిగతంగా పాల్గొన్నారు. నాకు బుర్ర తిరిగిపోయింది" అని అన్నారు.
"ఆయనతో నాకు మంచి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఇలా చేయడం నాకు చాలా కష్టంగా అనిపించింది" అని అనాలియా చెప్పారు.
‘‘ముందు నేను వేరు కావాలని అనుకున్నాను. ఒక వైపు మా నాన్న, మరో వైపు హింసించిన వ్యక్తి. ఆ ఇద్దరూ ఒకటే" అని అన్నారు.

ఫొటో సోర్స్, conadep
విచారణలో మూడు నిర్బంధ క్యాంపులలో వేధించిన వ్యక్తుల్లో కాలినెక్ ఉన్నారని కొన్ని డజన్ల మంది సాక్ష్యం చెప్పారు.
అప్పటికి ఆయనకు 20 ఏళ్లు ఉంటాయని, పెద్ద గొంతుతో, పొట్టిగా, మీసంతో, దళసరి మెడతో ఉండేవారని చెప్పారు.
"ఆయన చాలా క్రూరమైన మనస్తత్వం కలిగి ఉండేవారు" అని కోర్టులో సాక్ష్యాలు ఇచ్చినవారు చెప్పారు.
బందీలయిన వారిలో నేటికీ చాలా మంది ఆచూకీ తెలియదు. కొందరిని హత్య చేసి ఉంటారని భావిస్తారు.
ఈ నిర్బంధంలోకి తీసుకుని వెళ్లే నాటికి అనా మరియా కరేగాకు 16 ఏళ్లు. అప్పటికి ఆమె 3 నెలల గర్భిణి.
తనను ‘డాక్టర్ కె’ తన్నినట్లు ఆమెకు గుర్తుంది. గర్భిణి అని చెప్పనందుకు ఆమెపై ఆగ్రహించినట్లు కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
"నీ కాళ్లు చాపి నీకు గర్భస్రావం చేయమంటావా" అని ఆయన ఆమెపై అరిచినట్లు చెప్పారు.
డాక్టర్ కె ఒక ఎలక్ట్రిక్ రాడ్ పొడిచి వరుసగా ఐదు రోజుల పాటు వేధించినట్లు మిగువెల్ డి అగాస్టినో చెప్పారు. ఆయన రహస్య జైలులో ఒక ఏడాది పాటు ఉన్నారు.
తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి పట్టుకుపోయే సమయానికి డెలియా బర్రెరాకి 22 ఏళ్లు. ఆమెను గన్ పాయింట్ దగ్గర బెదిరించి ఒక రహస్య జైలుకు తీసుకుని వెళ్లి బంధించారు. అక్కడ కాలినెక్ ఇంచార్జిగా ఉండేవారు.

ఫొటో సోర్స్, cij
"నాకు కళ్ళకు గంతలు కట్టేశారు. కానీ నా చుట్టూ గొంతులు వినబడుతూ ఉండేవి. నన్ను నగ్నంగా చేసి ఒక ఇనుప మంచానికి తాళ్లతో కట్టేసి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు".
"నేనొక పోలీసు స్టేషన్ లో బాంబు పెట్టానని ఆరోపించారు. నేను అలా చేయలేదు. నా తోటి వారి పేర్లను చెప్పమని అడిగేవారు. నన్ను హింసిస్తూనే ఉండేవారు" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆమె కళ్లకు కట్టిన గంతలు కాస్త వదులుతుగా ఉన్న ఒక రోజున ఆమె కాలినెక్‌ని చూశారు. ఆయన వైద్యుడేమో అని ఆమె అనుకున్నారు. ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని ఆయనకు చెప్పారు.
"నేను ఆయన ముఖం చూడగలిగాను. ఆ ముఖం నేనెప్పటికీ మర్చిపోలేను. నేను నిందితులను ఎవరినైనా గుర్తు పట్టగలనా అని జడ్జి అడిగారు. ఆమె ‘డాక్టర్ కె’ని గుర్తు పట్టినట్లు చెప్పారు.
ఒక సంవత్సరం పాటు సాగిన విచారణ తర్వాత కాలినెక్‌కి జీవిత ఖైదు విధించారు.
మానవ హక్కుల ఉల్లంఘన నేరాలకు పాల్పడినందుకు గాను 1000 మందికి పైగా మాజీ సైనిక, పోలీసు అధికారులకు భారీగా శిక్షలు పడ్డాయి. ఇంకా 370 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి.
కానీ, నియంతృత్వ పాలనలో అన్యాయం చేసిన వారందరికీ శిక్ష పడలేదు. చాలా కేసుల్లో వారిని బాధ్యులుగా చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదు.
పౌలా తండ్రితో అదే జరిగింది.

పౌలా తండ్రి ఎలాంటివాడంటే..
"ఆయన చేసిన పని నాకు చెప్పడం వలన ఆయనేమి చేశారో నాకు తెలుసు. ఆయన చేసిన పనిని ఆయన గర్వంగా ఒక హీరోలా భావిస్తూ చెప్పారు" అని పౌలా చెప్పారు.
అప్పటి వరకు ఆమె తండ్రి ఒక న్యాయవాది అని అనుకునేవారు. ఆమె ఆయనను ఎప్పుడూ పోలీసు యూనిఫాంలో చూడలేదు.
అప్పుడు ఆయనకు 20 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు పొడవైన జుట్టు ఉండేది. ఆయన పెద్ద కాలర్ ఉన్న షర్ట్ లు ధరించేవారు.
కానీ, కొన్ని రోజుల్లోనే ఆయన చేస్తున్న పనేమిటో పౌలాకి అర్థమైంది. ఆయన బందీలు కావల్సిన వారిని పట్టుకుని రహస్య కేంద్రాలకు తీసుకుని వెళుతున్నారని తెలిసింది. అనాలియాలాగే పౌలా కూడా తండ్రిని ప్రశ్నించారు.
"ప్రజలను వేధించవద్దు" అని ఆయనకు చెప్పినట్లు తెలిపారు.
"అధికారులు తీవ్రవాదులను అణిచివేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఎన్ని తప్పులు చేశారో తెలియదు కానీ, ఆయనెప్పుడూ పశ్చాత్తాప పడలేదని చెప్పారు. ఆయన నేరాలను కేవలం చర్యలగానే చూశారు" అని ఆమె చెప్పారు.
పౌలా తల్లి మరణించిన తర్వాత ఆమె తండ్రితో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నారు.
2019 చివర్లో ఆయనకు గుండె పోటు వచ్చినట్లు తెలిసినా ఆమె ఆయన్ను చూడటానికి వెళ్లలేదదు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆమె వెళ్లలేదు.
"ప్రేమించిన వారి అంతిమ సంస్కారాలకు వెళ్లకపోవడం వారిని అగౌరవపరిచినట్లే. కానీ, అప్పటికే మా తండ్రి నాతో లేని లోటును అనుభవించి ఉన్నాను. అందుకే వెళ్లాలనిపించలేదు" అని ఆమె అన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అనాలియా, పౌలా కలుసుకున్నారు. వీరి లాగే నేరాలు చేసిన మరి కొంత మంది పోలీసు, సైనికాధికారుల పిల్లలు కూడా వీరిని కలిశారు. వీరంతా వారి తండ్రులు చేసిన చర్యలను ఖండించారు.
ఇదంతా అనుకోకుండా జరగలేదు.

ఫొటో సోర్స్, valeria parasso
అర్జెంటీనాలో సైనిక పాలన సమయంలో మానవ హక్కుల వేధింపులకు పాల్పడిన వారిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు 2017లో తీర్పు ఇవ్వడంతో కొన్ని లక్షల మంది నిరసనకారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండు చేస్తూ వీధుల్లో కొచ్చారు.
"నాకు ఈ మౌనాన్ని ఛేదించాలని అనిపించింది. నేను వెనుతిరిగేది లేదు" అని అనుకున్నాను అని అనాలియా చెప్పారు.
మా తండ్రులంతా వారువారు చేసిన నేరాలకు తగిన శిక్ష అనుభవించాలని మేం నిర్ణయించుకున్నాం.
అనాలియా తన ఆలోచనలను మేనిఫెస్టో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. మిగిలిన వారి పిల్లలు కూడా ఆ పోస్టును చదివారు.
"ఇదంతా అక్కడ నుంచి మొదలైంది. మేం ఒకరిని ఒకరు సంప్రదించాం.. కలిసాం. ఈ కష్టాన్ని ఒంటరిగా భరించడం కష్టం. మేమంతా కలిసి ఈ నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో మేము నలుగురం ఉండేవాళ్ళం".
మేము మౌనంగా ఉండాలనే మా కుటుంబ నియమాలను ఉల్లంఘిస్తున్నాం కనుక మా సమూహానికి "డిస్ఒబీడియెంట్ స్టోరీస్" అనే పేరు పెట్టుకున్నాం.
చాలా మంది వారి తండ్రులను చూసి చాలా కాలం అయింది. అనాలియా అక్క చెల్లెల్లు కూడా ఆమెతో మాట్లాడరు.
"నా లాంటి వారిని కలవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎవరూ అర్థం చేసుకోలేని రీతిలో వారు నన్నర్థం చేసుకున్నారు" అని పౌలా అన్నారు.
"ఆమె తండ్రి గురించి ఆమె థెరపిస్టుతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేకపోయేవారు. 23 సంవత్సరాల తర్వాత మౌనాన్ని వీడడం చాలా ఉపశమనంగా ఉంది" అని ఆమె అన్నారు.
ఇప్పుడు ఈ గ్రూపులో 80 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారంతా కలిసి తింటారు. రాజకీయాలు చర్చించుకుంటారు. వారి భావాలను పంచుకుంటారు. బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనే ప్రణాళికలు కూడా చేసుకుంటారు.
వారి తండ్రులు వారు చేసిన నేరాలను ఒప్పుకునేలా చేయడం, మిగిలిన వారికి కూడా శిక్ష పడేటట్లు చూసేందుకు వారు ప్రచారం నిర్వహిస్తున్నారు.
"నేనింకా ఆయన నోరు విప్పుతారేమోనని ఎదురు చూస్తున్నాను. చాలా మంది బాధితుల గురించి సమాచారం ఆయన దగ్గర ఉంది. ఆయన మౌనంగా ఉండటం నన్ను మరింత బాధకు గురి చేస్తోంది" అని అనాలియా అన్నారు.
నేరస్థులు నోరు విప్పకపోవడంతో వాళ్ళ పిల్లలు తమ తండ్రులు చేసిన నేరాల గురించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేందుకు వీలుగా అర్జెంటీనా పీనల్ కోడ్ సవరించాలని ఈ గ్రూపు సభ్యులు డిమాండు చేస్తున్నారు.
"తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని పితృస్వామ్య సమాజం అంగీకరించదు. నీ తండ్రి, నీ రక్తం అని అంటుంది" అని అనాలియా అన్నారు.
"కానీ, మేం గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది" అని అనాలియా అంటారు.

ఫొటో సోర్స్, valeria parasso
2018లో ఈ గ్రూపు సభ్యులు మేము ఈ మారణహోమానికి కారకులయిన వారి బంధువులం" అని ఎరుపు రంగులో రాసిన అక్షరాలతో ఉన్న బ్యానర్ పట్టుకుని నేషనల్ మెమోరియల్ డే నాడు వీధుల్లో కొచ్చారు.
వారిని చూసి ప్రజలు అర్ధం కానీ చూపులు చూసారని చెప్పారు. కొంత మంది కన్నీటి పర్యంతమయ్యారు. కొంత మంది వీరిని ప్రశంసించారు.
ఇలా జరగడం ఇదే మొదటిసారి.
కానీ, అందరూ ఈ ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేరు.
ఇలా వీరంతా జత కట్టడం వీరిలో కొంత మంది కుటుంబాలకు, బంధువులకు ఇబ్బంది కలిగించే విషయం.
వీరందరూ గొంతు విప్పి మాట్లాడటానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, వీరంతా అప్పుడెందుకు మాట్లాడలేదు.
అని డెలియా బారెరా అనే బాధితురాలు ప్రశ్నించారు. ఆమెను బీబీసీ 2019లో ఇంటర్వ్యూ చేసింది.
ఆమె వారిని నమ్మనని చెప్పారు. ముఖ్యంగా వారిలో వారి తండ్రులు చేసిన నేరాలు తెలిసిన తర్వాత కూడా వారిని ప్రేమిస్తున్నానని చెప్పిన వారిని నమ్మనని చెప్పారు.
శిక్షలు పడిన వారి పిల్లలకు ఇది చాలా సంక్లిష్టమైన స్థితి.
"మేమెప్పుడూ మా గ్రూపులో చర్చిస్తూ ఉంటాం. మమకారాన్ని ఎలా చెరిపేయగలం? మంచి జ్ఞాపకాలను ఎలా తుడిచిపెట్టగలం? ప్రేమించాలా వద్దా అనేది ఇంకొకరు ఎలా నిర్ణయిస్తారు. నేనొకప్పుడు ప్రేమించిన తండ్రి పై ప్రేమను వదులుకోలేను, నేనీ వైరుధ్య భావాల మధ్యలో బ్రతుకుతూ ఉంటాను"అని అనాలియా అన్నారు.
కొంత మంది మాజీ కుమార్తె అని కూడా పెట్టుకోవడం మొదలుపెట్టి వారి ఇంటి పేరును మార్చమనే అభ్యర్ధనలు కూడా చేశారు.
"ఇది చాలా వ్యక్తిగతమైన నిర్ణయం. ఇలా మార్చడం వలన ఏదైనా జరుగుతుందని నేను నమ్మను. నా ఇంటి పేరు, నా కుటుంబం, నా చరిత్ర అంతే" అని అనాలియా అన్నారు.
పౌలా అనాలియా మాటలతో ఏకీభవించారు.
"మనం చాలా మంది వ్యక్తుల నుంచి చాలా రకాల విషయాలు నేర్చుకుంటాం. మా నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు ఆయనను నా పేరు తీసుకోవద్దని, ఆ పేరును ఆయన మచ్చ తెచ్చారని, నేను దానిని ప్రక్షాళన చేస్తానని చెప్పాను" అని పౌలా చెప్పారు.
ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆమె ఆ గ్రూపు నుంచి కాస్త తప్పుకున్నారు.
కానీ, దేశంలో నియంతృత్వ పాలన పట్ల ఆమెకున్న నైతిక వైఖరి , ఆయన తండ్రి చేసిన నేరాలలో మార్పేమీ ఉండదని చెప్పారు.
"నేరస్తులతో ఉన్న సంబంధం పక్కన పెట్టి ఈ విషయం గురించి అర్జెంటీనాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ మాట్లాడి ఇతరులను జాగృతి చేయవలసిన బాధ్యత ఉందని నేనింకా భావిస్తున్నాను. ఈ పోరాటం ఎప్పటికీ ముగియదు" అని అన్నారు.
ఫోటోలు: అనాలియా, పౌలా
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










