భారత రక్షణ రంగంలో 'ఆత్మ నిర్భరత' సాధ్యమా?

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Twitter/Rajnath Singh

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదంలో భాగంగా రక్షణ రంగంలో స్యయం సమృద్ధి సాధించడం కోసమంటూ భారత్ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఆంక్షలు విధించిన దిగుమతుల జాబితాలో ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎల్‌సీహెచ్‌ఎస్ రాడార్ల లాంటి కొన్ని ఆధునిక సాంకేతికత కలిగిన సామగ్రి, వస్తువులు కూడా ఉన్నాయి.

దిగుమతులపై ఆంక్షలు వెంటనే కాకుండా... 2020 నుంచి 2024 మధ్యలో దశలవారీగా అమల్లోకి వస్తాయని రాజ్‌నాథ్ వివరించారు.

రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఆంక్షలు విధించే ఉత్పత్తుల జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

భవిష్యతులో దేశీయంగా యుద్ధ సామగ్రి తయారీ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు సాయుధ బలగాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పరిశ్రమలతోనూ చర్చించినట్లు చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, TWITTER / RAJNATHSINGH

రక్షణపై భారత్ చేస్తున్న వ్యయం

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం సైనిక రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనా వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఎస్‌ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం భారత్ 2019లో రక్షణ రంగంలో 71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2018లో చేసిన వ్యయంతో పోల్చితే ఇది 6.9 శాతం ఎక్కువ.

రక్షణ రంగంలో 2019లో చైనా 261 బిలియన్ డాలర్లు, అమెరికా 732 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.

ఇప్పటివరకూ భారత్ అత్యధికంగా రష్యా నుంచి రక్షణ సామగ్రి కొనుగోలు చేస్తూ వస్తోంది. ఆ తర్వాత భారత్‌కు ఎక్కువ దిగుమతులు చేస్తున్న దేశాలో జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వరుసగా ఉన్నాయి.

పాకిస్తాన్, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ రక్షణ వ్యయం పెరిగినట్లు ఎస్‌ఐపీఆర్ఐ అభిప్రాయపడింది.

కానీ, రక్షణ శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే ఐదేళ్లలో భారీ మార్పులేమైనా వస్తాయా? రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందా?

రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారు?

రాజ్‌నాథ్ సింగ్ తాజా ప్రకటనలో కొత్త విషయమేదీ లేదని, ఈ నిర్ణయం ‘కొత్త సీసాలో పాత సారా’ లాంటిదని రక్షణ రంగ నిపుణుడు రాహుల్ బేదీ అన్నారు.

‘‘భారత్‌లో ఇప్పుడు తయారవుతున్న రక్షణ పరికరాల విడిభాగాలు చాలా వరకూ విదేశాల నుంచే వస్తున్నాయి. విదేశీ సంస్థల నుంచి లైసెన్స్ తీసుకుని, చాలా పరికరాలను మన దేశంలో తయారు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

ఇలా విదేశీ సంస్థలు ఇచ్చే లైసెన్స్‌ల కింద దేశీయంగా తయారయ్యే పరికరాలు కూడా ‘ఆత్మ నిర్భర భారత్’ కిందకి వస్తాయా అన్నది రక్షణ శాఖ ప్రకటనలో స్పష్టం చేయలేదు.

రక్షణ ఒప్పందాల్లో విదేశీ సంస్థల జోక్యం ఉన్నంతవరకూ, రక్షణ పరికరాల విషయంలో ‘ఆత్మ నిర్భరత’ నినాదం సఫలం కాదని రాహుల్ బేది అభిప్రాయపడ్డారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Twitter/Rajnath Singh

లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్

లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైన ఇంజిన్, ఇతర విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని భారత్ తయారు చేస్తోంది.

‘ఆత్మ నిర్భరత’ అంటే, ఈ ఇంజిన్ భారత్‌లో తయారవ్వాల్సి ఉంటుందా? లేక విదేశీ ఇంజిన్‌నే ఉపయోగిస్తారా?

ప్రభుత్వ ఆదేశాల్లో దీనిపై స్పష్టత లేదు.

భారత్‌లో లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ దాదాపుగా 1983లో మొదలైంది. 37 ఏళ్లుగా దాని బేసిక్ మోడల్‌ను మాత్రమే భారత్ తయారుచేసుకోగలుగుతోంది. అదే మార్క్ 1.

‘‘మార్క్ 1ఏ దాని ఫైటర్ మోడల్. దాని ప్రొటోటైప్‌ను కూడా ఇప్పటివరకూ అభివృద్ధి చేసుకోలేదు. అది సిద్ధం కావడానికి నాలుగైదేళ్లు పట్టొచ్చు’’ అని రాహుల్ బేదీ అంటున్నారు.

దిగుమతులపై ఆంక్షలు విధించిన జాబితాలో లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా ఉంది. దీని స్వదేశీకరణ గురించి కూడా రక్షణశాఖ ప్రకటనలో ప్రస్తావించారు.

అంటే, ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇప్పుడు 50 శాతం పరికరాలు విదేశాల నుంచి వస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో వాటిని మరింత తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ దీనిలో ఇంజిన్, ఆయుధాలు విదేశాల నుంచి వచ్చేవే.

లైట్ కొంబాట్ హెలికాప్టర్ కథ కూడా ఇలాంటిదే. దాని ఇంజిన్ ఫ్రాన్స్ నుంచి వస్తోంది. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌లో మిగతా విడిభాగాలతో కలిపి దాన్ని తయారు చేస్తారు.

భారత సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

బులెట్ ప్రూఫ్ జాకెట్

రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించాలంటే భారత్ డిజైన్, డెవలెప్‌మెంట్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని రాహుల్ బేదీ అంటున్నారు.

బులెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ విషయానికి ఆయన ఉదాహరణగా చూపించారు.

‘‘1990ల నుంచి భారత్‌లో బులెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ప్రైవేట్ సంస్థ వీటిని తయారుచేస్తోంది. ఈ జాకెట్లలో ‘కెవ్లార్‌ అనే వస్తువును వాడతారు. ఇప్పటికీ దీన్ని విదేశాల నుంచే తెప్పించుకోవాల్సి వస్తోంది’’ అని రాహుల్ బేది అన్నారు.

రెండేళ్ల క్రితం దేశంలో కెవ్లార్ ఉత్పత్తి మొదలైంది. అయినా, బులెట్ ప్రూఫ్ జాకెట్ల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని చెప్పే పరిస్థితి లేదు.

రైఫిల్

అసాల్ట్ రైఫిళ్లను కూడా భారత్‌లో తయారుచేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.

1990ల్లో ఇంసాస్ రైఫిల్ అనే స్వదేశీ అసాల్ట్ రైఫిల్ తయారైందని రాహుల్ బేది చెప్పారు.

కానీ, ఆ రైఫిల్ విజయవంతం కాలేదు. దీనికి ఆపరేషన్ ఎఫీషియన్సీ లేదని, వాడటంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని 2010-11లో సైన్యం తెలిపింది. వీటికి బదులుగా వేరే రైఫిల్స్ కావాలని అంది. గత 8-9 ఏళ్లుగా కొత్త రైఫిల్ గురించి చర్చ జరుగుతూనే ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో 2019లో అసాల్ట్ రైఫిల్ తయారుచేసే ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీని కోసం రష్యాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది కూడా లెసెన్స్ ఆధారిత ఒప్పందమే. అయితే, రష్యాతో ఒప్పందం పూర్తి స్థాయిలో కుదరలేదు. దీంతో దీని కార్యకలాపాలు ఆగిపోయాయి. కరోనావైరస్ కారణంగా మరిన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.

భారత సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేటు సంస్థల వెనుకంజ

2001 వరకూ భారత రక్షణ రంగంలో డీఆర్‌డీఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి ప్రభుత్వ సంస్థల ఆధిపత్యమే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించింది.

కానీ, ఇప్పటికీ రక్షణ ఒప్పందాల్లో వాటి వాటా 8-9 శాతానికి మించట్లేదు. ఎల్‌ అండ్ టీ, మహీంద్రా, భారత్ ఫోర్స్ లాంటి కొన్ని ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలోకి వచ్చాయి.

గడిచిన 20 ఏళ్లలో పరిస్థితి పెద్దగా మారలేదు.

భారత రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

ఈ విషయం తెలుసుకునేందుకు అవనీశ్ పట్నాయక్‌తో బీబీసీ మాట్లాడింది. ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరర్స్ సొసైటీలో ఆయన సభ్యుడు.

‘‘పెట్టుబడులు పెట్టాక, చాలా కాలానికి ప్రతిఫలాలు వచ్చే రంగం ఇది. తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించలేకపోవడం మరో సమస్య. వీటిలో బాగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టినా, తప్పకుండా లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఇప్పటివరకూ లేదు. బయటి సంస్థలు మన కన్నా నాణ్యమైన పరికరాలు తయారుచేస్తాయి. అందుకే పోటీలో మనం వెనుకబడిపోయాం. విదేశాల్లో రక్షణ రంగంలో పేరు తెచ్చుకున్న సంస్థలు... 70-80 ఏళ్ల నుంచి ఈ పనిలో ఉన్నాయి. భారత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ తక్కువ ఉండటం మరో సమస్య’’ అని అవనీశ్ అన్నారు.

అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులకు కొంత భరోసా కలగవచ్చని అవనీశ్ అభిప్రాయపడ్డారు.

వచ్చే 6-7 ఏళ్లలో దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇస్తామని రాజ్‌నాథ్ అన్నారు.

ఈ నేపథ్యంలో రక్షణరంగంలో దేశీయ సంస్థల పెట్టుబడులు పెరగవచ్చని అవనీశ్ అన్నారు.

భారత్‌లో లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ దాదాపుగా 1983లో మొదలైంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లో లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ దాదాపుగా 1983లో మొదలైంది

విదేశాలకు ఎగుమతి చేయగలదా?

‘‘భారత్‌లో చాలా ఏళ్లుగా లైసెన్స్ మీద రక్షణ పరికరాల ఉత్పత్తి జరుగుతోంది. స్వయం సమృద్ధి సాధించాలంటే, . వీటికి సంబంధించిన పరిశోధనలు, డిజైన్‌లు భారత్‌లో జరిగేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఇది చాలా పెద్ద సవాలు’’ అని గజాలా వహాబ్ బీబీసీతో అన్నారు.

రక్షణ వ్యవహారాలపై కథనాలు అందించే ‘ఫోర్స్’ మ్యాగజైన్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

‘‘నేనొక వస్తువు తయారుచేస్తే, దాన్ని నా కుటుంబమే కొనుగోలు చేస్తే అది పెద్ద విషయం కాదు. అదే నేను దాన్ని మార్కెట్లో అమ్మగలిగితే, విజయం సాధించినట్లు. భారత్‌లో తయారయ్యే రక్షణ పరికరాలకు కూడా ఇదే వర్తిస్తుంది. భారత్ తయారుచేసే రక్షణ పరికరాలను ఎంతవరకూ ఎగుమతి చేయగలుగుతుందన్నది చూడాలి. ఇదే పెద్ద పరీక్ష. విదేశాలు మన ఉత్పత్తులను కొనాలి’’ అని గజాలా అన్నారు.

భారత్‌లో తయారైన అర్జున్ యుద్ధ ట్యాంకులపై... వాటి బరువు ఎక్కువున్న కారణంగా భారత సైన్యం ఆసక్తి చూపలేదని, చివరికైతే వాటిని కొనుగోలు చేసిందని ఆమె చెప్పారు.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ విషయంలోనూ వాయుసేన ఇలాగే చేసిందని, తేజస్ అడ్వాన్స్డ్ వెర్షన్ కోసం ఎదురుచూస్తామని చెప్పిందని అన్నారు.

‘‘తేజస్ తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందో అందరికీ తెలుసు. విదేశాల్లో ఇదెక్కడా వినియోగంలో లేదు. పూర్తి స్థాయిలో దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తులేవీ ప్రస్తుతానికి భారత్‌లో లేవు. అయితే, పెద్ద పెద్ద రక్షణ సంస్థల సప్లై చెయిన్‌లో భారత్ భాగంగా ఉంది’’ అని గజాలా చెప్పారు.

‘‘బోయింగ్ విదేశీ సంస్థ. కానీ, దాని చాలా విడి బాగాలు భారత్‌లో తయారవుతాయి. వాటిని భారత్ విదేశాల్లో విక్రయిస్తుంది. ఆ దేశాల్లో వాటి అసెంబ్లింగ్ జరుగుతుంది. భారత్ రక్షణ పరికరాల దిగుమతుల జాబితా కూడా ఇలాగే ఉంది’’ అని అన్నారు.

‘‘2009-12 మధ్యలో భారత్ ఎనిమిది ‘ధ్రువ్’ హెలికాప్టర్లను ఈక్వడార్‌కు అమ్మింది. వాటిలో నాలుగు కూలిపోయాయి. మిగిలిన నాలుగు హెలికాప్టర్లను ఆ దేశం వెనక్కిపంపింది. ఒప్పందం రద్దైంది. ఇంసాస్ రైఫిళ్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. పొరుగుదేశం నేపాల్‌కు భారత్ వాటిని ఇచ్చింది’’ అని రాహుల్ బేదీ చెప్పారు.

సంస్థలు డబ్బు, సమయం రెండింటినీ వెచ్చించేలా రక్షణ రంగంలో ప్రభుత్వం భరోసా కల్పించాల్సి ఉంటుందని ఈ విషయాలన్నీ సంకేతాలిస్తున్నాయి.

‘ఆత్మ నిర్భరత’ మార్గంలో ప్రయాణం అంత సులువేమీ కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)