గుంజన్ సక్సేనా: కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మహిళా పైలట్ కథతో తీసిన సినిమాపై వివాదం

గుంజన్ సినిమాలో జాన్వీ కపూర్

ఫొటో సోర్స్, Netflix

యుద్ధక్షేత్రంలో ఫైటర్ విమానం నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ జీవిత కథ ఆధారంగా తీసిన బాలీవుడ్ సినిమా మీద వివాదాలు చెలరేగుతున్నాయి. భారత వాయుసేనను తప్పుగా చిత్రీకరించారనే విమర్శలు వస్తున్నాయి.

కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

1999 వేసవి కాలంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య తూటాలు, క్షిపణులు పేలిన సమయంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా నియంత్రణ రేఖ వెంబడి యుద్ధ విమానాలు నడిపారు.

పాకిస్తాన్ బలగాలు నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడి కశ్మీర్‌లోని కార్గిల్ మంచు పర్వతాన్ని ఆక్రమించిన తరువాత ఈ యుద్ధం జరిగింది.

''1999 జూన్‌లో సుమారు 20 రోజుల పాటు నేను హెలికాప్టర్లో తిరుగుతూ రెక్కీ చేశాను'' అని బీబీసీతో చెప్పారు ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా. ''శత్రు శిబిరాలు ఎక్కడున్నాయో గుర్తించడం నా ప్రధానమైన విధి. ఇండియన్ ఆర్మీకి జరిగిన యుద్ధ నష్టాన్ని అంచనా వేయడం.. యుద్ధంలో మరణించినవారి దేహాలను తరలించడం నా పని'' అన్నారామె.

1994లో భారత వాయుసేనలో చేరిన తొలి బ్యాచ్ మహిళల్లో ఆమె కూడా ఒకరు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన రవాణా విమానాలు, హెలికాప్టర్లకు పైలట్లుగా మహిళలను తీసుకోవడం ప్రారంభించింది ఆ ఏడాదిలోనే.

కార్గిల్ యుద్ధ సమయంలో నిఘా విమానాలు నడిపిన ఇద్దరు భారతీయ మహిళా పైలట్లలో ఒకరైన గుంజన్‌ను, యుద్ధ క్షేత్రంలో చుట్టూ క్షిపణులు, బుల్లెట్లు దూసుకెళ్తున్నప్పుడు భయం వేయలేదా అని 'బీబీసీ' అడిగినప్పుడు, "ఏ రోజు కూడా భయపడలేదు" అని చెప్పారు.

ఓ సందర్భంలో ఆమె నడుపుతున్న హెలికాప్టరుకు అంగుళాల దూరం నుంచి మిసైల్ దూసుకెళ్లింది.. ''ఇది ప్రమాదమే కానీ, మేం ఇష్టపూర్వకంగానే ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి వచ్చాం'' అన్నారామె.

గుంజన్ సక్సేనా

ఫొటో సోర్స్, FLT LT GUNJAN SAXENA

ఫొటో క్యాప్షన్, గుంజన్ సక్సేనా

ఎంతో ధైర్యం కావాలి

కార్గిల్ యుద్ధంలో స్ఫూర్తిదాయక రీతిలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆమెకు గాలంట్రీ అవార్డు ప్రదానం చేసింది.

అప్పటి వరకు ఉన్న అడ్డుగోడలను ఛేదించి మరెంతో మంది యువతులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరేలా స్ఫూర్తి కలిగించినందుకు ఆమె అంతటా ప్రశంసలు అందుకున్నారు.

''నేనెన్నడూ అడ్డుగోడలు చూడలేదు'' అంటూ బిగ్గరగా నవ్వారామె. ''నిజంగా నేనలాంటి అడ్డుగోడలను బద్ధలుగొడితే మంచిదే.. మిగతా మహిళలు అలాంటి అడ్డుగోడలను పగలుగొట్టేలా స్ఫూర్తి కలిగించాననుకుంటే అంతకంటే అదృష్టమా!'' అన్నారామె.

కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లయిన తరువాత 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో ఆమె బయోపిక్, ది కార్గిల్ గర్ల్ పేరిట జీవిత కథ విడుదలయ్యాయి.

''ఆమె నిజంగా స్ఫూర్తిదాయకమైన మహిళ'' అన్నారు ఆమె జీవిత కథ రాసినవారిలో ఒకరైన కిరణ్ దీప్ సింగ్.

''కాలం గడుస్తున్నకొద్దీ ప్రజలు ఆమె విజయాలను మర్చిపోతున్నారు. అందుకే, ఆమె కథను మళ్లీ గుర్తు చేయడానికి ఈ పుస్తకం రాశాం'' అన్నారు కిరణ్ దీప్ సింగ్.

''పాకిస్తాన్ స్వల్ప శ్రేణి ఆయుధాలకు కూడా అందగల దూరంలో నియంత్రణ రేఖకు అత్యంత సమీపంగా యుద్ధ క్షేత్రంలో ఉండడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో ధైర్యం కావాలి'' అన్నారు మరో రచయిత నిర్వాన్ సింగ్.

జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రగా వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తరువాత విమర్శకులు, వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

''ఇది ఒక స్త్రీవాది అయిన తండ్రి, ధైర్యవంతురాలైన ఆయన కుమార్తెలకు సంబంధించిన మనసును కదిలించే కథ'' అని ఓ పత్రిక రాసింది.

ఈ సినిమా చూసిన తరువాత ఎంతోమంది చిన్నారులు తనకు మెసేజ్‌లు పంపించారని.. తాము కూడా ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంటున్నామని చెప్పారని గుంజన్ సక్సేనా తెలిపారు.

అయితే, ఈ సినిమా చుట్టూ వివాదమూ ముసురుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సెక్సిజమ్, లింగ వివక్ష ఉన్నట్లుగా చూపించారన్న విమర్శలు వచ్చాయి.

జాన్వి కపూర్

ఫొటో సోర్స్, Netflix

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అసంతృప్తి

ఈ సినిమాలో 24 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ సక్సేనా ఒక వైమానిక స్థావరంలో దిగుతారు. అందులో మహిళల టాయిలెట్, దుస్తులు మార్చుకునే గదులేవీ లేవు. 'ఇది ఆడవాళ్ల కోసం ఉద్దేశించిన ప్రదేశం కాదు'' అని సీనియర్ అధికారి చెబుతారు. చుట్టూ మగవాళ్ల మధ్యే ఉన్న ఆమె వారి నుంచి అసభ్యకర రీతిలో లైంగిక పరమైన అవమానాల్ని ఎదుర్కొంటారు.

ఆమెను అవమానించడానికి దొరికిన ఏ అవకాశాన్నీ ఆమె పైఅధికారులు వదులుకోలేదు. తనతో ప్రయాణించడానికి ఇతర పురుష అధికారులు ఇష్టపడకపోవడంతో ఆమె శత్రువులపై దాడులు చేయడానికి సంబంధించి ప్రాక్టీస్ చేసే అవకాశాన్నీ కోల్పోయారు. ఏ పురుష అధికారీ ఆమెతో కలిసి తాగాలని అనుకోకపోవడంతో సాయంత్రాలు బార్‌లోనూ ఆమె ఒంటరిగానే ఉండేవారు.

ఈ సినిమాలో కొంత సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నామని, నాటకీయత జోడించామని నిర్మాతలు ఆదిలోనే చెప్పినప్పటికీ ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అసంతృప్తిగా ఉంది.

అయితే, దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ ''భారత వైమానిక దళంలోనే పెద్ద సంఖ్యలో మహిళా అధికారులు ఉన్నారన్నది అందరికీ తెలిసిన సత్యం'' అన్నారు.

''అన్ని విభాగాల్లో మహిళా అధికారులకు అవకాశం కల్పించిన మొట్టమొదటి వాయుసేన భారత వాయుసేన. 2005 నుంచి కంబాల్ రోల్స్‌లోనూ మహిళలను తీసుకుంటున్నారు. వివక్ష లేని విధానం లేకుండా ఇదంతా సాధ్యం కాదు. రక్షణ బలగాలలో ప్రతిదీ ప్రతిభ ఆధారంగా ఉంటుంది' అన్నారు.

తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ సినిమా నిర్మాణ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్, నెట్‌ఫ్లిక్స్‌లకు లేఖ రాసినట్లు ఐఏఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.

మరోవైపు ఇతరులూ కొందరు ఈ సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఈ సినిమా నిర్మాతలు క్షమాపణ చెప్పాలని.. సినిమా స్క్రీనింగ్ ఆపేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కోరారు. ఈ సినిమాను బహిష్కరించాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

''ఇది దేశానికి ఇబ్బందికరమైన సందర్భం. వాస్తవాలతో వ్యవహరించేటప్పుడు ఎంత స్వేచ్ఛ తీసుకోవాలనేదానికీ హద్దులుంటాయి'' అన్నారు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా.

గుంజన్ సక్సేనా

ఫొటో సోర్స్, FLT LT GUNJAN SAXENA

‘వాస్తవాలను వక్రీకరించారు’

గుంజన్ సక్సేనాకు సమకాలీనులైన కొందరు వైమానిక దళ మహిళా అధికారులూ దీనిపై మాట్లాడారు. సెక్సిజం, పక్షపాత వైఖరిని తాము ఎదుర్కొన్నామని కొందరు చెప్పారు. మరికొందరు మాత్రం ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని.. అవాస్తవాలను చూపించారని ఆరోపించారు.

మరోవైపు కార్గిల్ యుద్ధంలో పనిచేసిన తొలి మహిళను తానేనని మరో మాజీ మహిళా అధికారి చెప్పుకొన్నారు. అయితే, గుంజన్ ఆ వాదనను కొట్టిపారేస్తూ తనకు సంబంధించిన వివరాలన్నీ ఎయిర్‌ఫోర్స్ రికార్డుల్లో ఉన్నాయని చెప్పారు.

కాగా తనపై వచ్చిన సినిమా, తన జీవిత కథ పుస్తకం రెండూ భిన్నమైనవని గుంజన్ చెప్పారు.

''సినిమా నాకు నచ్చింది.. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కానీ, నాటకీయత జోడించారు అందులో. పుస్తకం వాస్తవమైనది'' అన్నారామె.

పాతికేళ్ల కిందట తాము ఎయిర్‌ఫోర్స్‌లో చేరినప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయని.. అప్పట్లో స్థావరంలో లేడీస్ టాయిలెట్ లేదు కానీ ఇప్పుడు అలాంటి సమస్యలన్నిటినీ పరిష్కరించారని గుంజన్ చెప్పారు.

అప్పట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ రానురాను మహిళల రాకను మిగతావారు స్వాగతిస్తున్నారని అన్నారు.

ఈ సినిమా, పుస్తకం ఉద్దేశం వివాదం సృష్టించడం కాదని.. భవిష్యత్తరాలకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమని గుంజన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)