Sam Manekshaw :1971 యుద్ధానికి ముందు భారత ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా పాకిస్తాన్ రాయబారిని ఎందుకు కౌగిలించుకున్నారు..

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా ఒక పార్సీ.
పార్సీలకు ఆయన "ఆప్రో సామ్".
గూర్ఖాలకు, భారతీయ సైన్యానికి ఆయన "సామ్ బహదూర్".
మానెక్‌షా అమృత్‌సర్‌లో జన్మించారు. అందుకే సిక్కులు ఆయన్ను తమవాడిగా చూస్తారు.
పదవీ విరమణ తరువాత నీలగిరిలో నివాసం ఏర్పరచుకున్నారు మానెక్‌షా. దాంతో తమిళులు ఆయన్ను ప్రేమించారు.
తన వృత్తిని ప్రారంభించిన 4/12 ఎఫ్ఎఫ్ఆర్ దళానికి ఆయన "జంగీ లాట్".
భారత సైనికులకు ఆయన అత్యంత ప్రియమైన జనరల్.
తన సైన్యాన్నే కాక దేశంలోని సామాన్య ప్రజలను కూడా సామ్ ఎంతో ప్రేమించారు.
తమ జీవిత కాలంలో "లెజెండ్" గా గుర్తింపు పొందిన కొద్దిమందిలో సామ్ మానెక్‌షా ఒకరు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
మానెక్షాను గుమ్మం దగ్గరే ఆపిన గూర్ఖా సెంట్రీ
సామ్ మానెక్‌షా సైన్యాధ్యక్షుడి (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) పదవిని చేపట్టడానికి ముందు ఈస్టర్న్ కమాండ్‌కు అధిపతిగా వ్యవహరించారు.
ఆయనకు "సన్‌బీమ్ రాపియర్" కారు ఉండేది. దాన్ని తరచూ ఆయన భార్య సీలూ నడిపేవారు.
ఒకరోజు సామ్ కారు తీసుకుని తన కార్యాలయానికి వెళ్లారు. ఆ రోజు ఆయన షార్ట్స్, పెషావర్ చెప్పులు ధరించి ఉన్నారు.
పోర్ట్ విలియం వైపు గుమ్మం దగ్గరే ఒక గూర్ఖా సెంట్రీ ఆయన్ను ఆపి ఐడీ కార్డు చూపించమని అడిగారు.
మానెక్‌షా తన ఐడీ కార్డ్ ఇంట్లో మర్చిపోయారు. అప్పుడు ఆ గూర్ఖా సెంట్రీకి ఆయన భాషలోనే.. "మీరు నన్ను గుర్తించలేదా? నేను మీ ఆర్మీ కమాండర్" అని చెప్పారు.
దానికి ఆ సెంట్రీ జవాబిస్తూ.. "మీ దగ్గర ఐడీ కార్డు లేదు, మీ బట్టలపై ర్యాంక్ బ్యాడ్జ్ లేదు, మీ కారుపై భారత జెండా లేదు. మీరు ఆర్మీ కమాండర్ అంటే ఎలా నమ్ముతాను?" అని అడిగారు.
అప్పుడు మానెక్‌షా "మీ ఫోన్ నుంచి ఒక కాల్ చేసుకుంటానని" చెప్పి, వాళ్ల కమాండింగ్ ఆఫీసర్‌కు ఫోన్ చేశారు.
"మీ సిబ్బందిలో ఒకరు నన్ను గేటు దగ్గరే ఆపేశారు. అందులో ఆయన తప్పేం లేదు. నేను యూనిఫాం వేసుకోలేదు. ఐడీ కార్డు కూడా ఇంటి దగ్గర మర్చిపోయాను. మీరొకసారి వచ్చి నన్ను లోపలికి అనుమతించమని చెబుతారా?" అని అడిగారు.
మరుక్షణమే కమాండింగ్ ఆఫీసర్ గేటు దగ్గరకు వచ్చి మానెక్‌షాను లోపలికి తీసుకు వెళ్లారు.
తన విధిని నిజాయితీగా, కచ్చితంగా నిర్వర్తించినందుకు ఆ గూర్ఖా సెంట్రీని మానెక్‌షా ఎంతో ప్రశంసించారు.
మాస్కోలో పాకిస్తాన్ రాయబారితో సమావేశం
1971 నవంబర్‌లో మానెక్‌షా సోవియట్ యూనియన్ సందర్శించారు.
అక్కడ బోల్షోయ్ థియేటర్‌కు వెళ్లినప్పుడు సోవియట్ యూనియన్‌లో పాకిస్తాన్ రాయబారి జమ్షీద్ మార్కర్, ఆయన భార్య డయానా ఎదురుపడ్డారు.
జమ్షీద్ క్వెట్టా నివాసి. ఆయనతో సామ్ మానెక్‌షాకు ఎంతోకాలంగా స్నేహం ఉంది.
1943లో సామ్ స్టాఫ్ కాలేజ్‌లో చదువుకుంటున్న రోజుల నుంచీ వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉంది.
అనుకోకుండా కలిసిన ఆప్త మిత్రుడిని మానెక్‌షా హృదయానికి హత్తుకున్నారు.
ఆయన భార్యను పార్సీ పద్ధతిలో పలకరించారు.
ఇద్దరూ కాసేపు గుజరాతీలో క్షేమసమాచారాలు మాట్లాడుకున్నారు.
ఇది చూసిన చుట్టూ ఉన్న రష్యా ప్రజలు ఆశ్చర్యపోయారు.
వారిద్దరినీ చూస్తుంటే.. మరికొద్ది రోజుల్లో భారత, పాకిస్తాన్‌లు యుద్ధం చేయబోతున్నాయన్న సూచన ఏ మాత్రం కనిపించకపోవడంతో వారంతా గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు.
నేపాల్ రాజును కలిసినప్పుడు..
1972లో సామ్ మానెక్‌షా నేపాల్ పర్యటనకు వెళ్లారు. సామ్‌ను, ఆయన భార్యను నేపాల్ రాజు సాదరంగా ఆహ్వానించారు.
అక్కడకు వెళ్లేముందు భారత్‌లో నేపాల్ రాయబారి.. మానెక్‌షాకు నేపాల్ రాజ్య పద్ధతులు, విధి విధానాల గురించి వివరించారు.
నేపాల్ రాజు స్వయంగా మీతో మాట్లాడినప్పుడు మాత్రమే మీరు పెదవి విప్పాలని హెచ్చరించారు.
అక్కడకు వెళ్లి నేపాల్ రాజును కలిసినప్పుడు సామ్ ఈ పద్ధతిని ఒక అరగంట పాటు పాటించారు.
అంతసేపూ నేపాల్ రాజు మాటలను మౌనంగా విన్న కొంటె సామ్‌కు ఇక అలా ఉండటం సాధ్యపడలేదు.
ఆయన వెంటనే నేపాల్ రాణి వైపు తిరిగి.. "రాజుగారు మంచి భర్తేనా? వంటింట్లో మీకు సహాయం చేస్తారా?" అని అడిగారు.
ఇది విన్న రాణి ఐశ్వర్య గట్టిగా అరిచారు. దాంతో రాజు వద్ద పాటించాల్సిన ప్రోటోకాల్‌కు తెర పడింది.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
షవర్ కింద స్నానం చేయడం మానెక్‌షాకు చాలా ఇష్టం
సామ్‌కు బాత్‌రూంలో షవర్ కింద స్నానం చెయ్యడం అంటే చెప్పలేనంత వ్యామోహం.
షవర్‌లోంచి నీళ్లు వేడిగా పొగలు కక్కుతూ రావాలి. జోరుగా కూడా పడాలి.
వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా సామ్ మూడ్ పాడైపోతుంది. ఇంక ఆ రోజు చెడుగా ప్రారంభమైనట్టే లెక్క.
సామ్ తెల్లవారక ముందే లేచి ఓ గంట పాటూ తోటపని చేసేవారు.
ఆయన దగ్గర గొప్ప ఆడియో కలక్షన్ ఉండేది. మంచి మ్యూజిక్ సిస్టం ఉండేది.
వంట మనిషితో సరదా సంభాషణ
సామ్ వంటమనిషి స్వామి 1959 నుంచి ఆయనతోపాటే ఉన్నారు.
రోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లేముందు ఏమేమి వండాలో చెప్పి వెళ్లేవారు.
ఇంటికి రాగానే నేరుగా వంటింట్లోకి వెళ్లి గిన్నెలపై మూతలు తీసి చెప్పినవి వండారో లేదో చూసేవారు.
స్వామి వచ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడేవారు. స్వామిని ఏడిపించడానికి సామ్ కూడా ఆయనతో అలాగే వచ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడేవారు.
"మేడం కమింగ్ బ్యాక్ టునైట్. అయాం టెల్లింగ్ మేడం.. యూ లౌజీ కుక్ నాట్ ఫీడింగ్ మి వెల్ (ఇవాళ రాత్రికి మేడం వచ్చేస్తున్నారు. మీరు నాకు సరిగ్గా వండిపెట్టలేదని మేడంకు చెప్తాను)" అనేవారు.
స్వామి కూడా అందుకు దీటుగా జవాబు ఇస్తూ.. "యెస్, మేడం కమింగ్ బ్యాక్ హోం టునైట్. అయాం టెల్లింగ్ మేడం యూ ఆర్ నాట్ ఈటింగ్ అట్ హోం ఫర్ మంత్ గోయింగ్ అవుట్ ఎవ్రీ నైట్ అండ్ కమింగ్ హోం అట్ వన్ ఇన్ ది మార్నింగ్" అనేవారు.
"యూ డాం కుక్, సైన్యాధ్యక్షుడితో ఎలా మాట్లాడాలో తెలీదా?" అని సామ్ ఊరికే బెదిరించేవారు.
వెంటనే స్వామి కూడా.. "అవును మీరు సైన్యాధ్యక్షులే, మీ సైన్యాన్ని మీరు చూకోండి. నా వంట గదిని నాకు వదిలేయండి" అని చమత్కారంగా బదులిచ్చేవారు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
పాకిస్తాన్ లొంగుబాటు - జనరల్ జాకబ్ ఢాకా వెళ్లడంపై వివాదం
1971లో పాకిస్తాన్ లొంగిపోయిన సమయంలో సామ్ మానెక్‌షా స్వయంగా ఢాకా వెళ్లి వారి లొంగుబాటును స్వీకరించాలని ఇందిరా గాంధీ భావించారు.
పాకిస్తాన్ సైన్యం మొత్తం లొంగిపోయి ఉంటే నేను సంతోషంగా వెళ్లేవాడిని అని చెప్తూ మానెక్ షా ఢాకా వెళ్లేందుకు నిరాకరించారు.
అప్పుడు మరొక సీనియర్ అధికారిని ఢాకా పంపించాల్సి వచ్చింది.
ఈ విధిని నిర్వర్తించేందుకు మానెక్ షా ఈస్టర్న్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ జాకబ్‌ను ఎంపిక చేశారు.
"రక్షణ శాఖకు ఆ విషయం తెలిసి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం సైన్యం లొంగుబాటును స్వీకరించడానికి ఒక యూదు అధికారిని పంపించడంపై ఇతర మిత్ర ముస్లిం దేశాలు ఎలా స్పందిస్తాయోనని కంగారు పడ్దారు" అని సామ్ ఏడీసీ బ్రిగేడర్ పంతకి రాసిన 'ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా - ది మ్యాన్ అండ్ హిజ్ టైమ్స్' పుస్తకంలో వివరించారు.
ఇది విన్న మానెక్ షా మండిపడ్డారు.
"ముప్పై ఏళ్లుగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి జాకబ్ దేశం కోసం పోరాడినప్పుడు ఇలాంటి అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదు? కులం, మతం కన్నా ఆర్మీ చాలా ఎత్తులో ఉంది అని ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత, జాకబ్‌కు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పారు. ఇది విన్న తరువాత జాకబ్ చాలా బాధపడి, తన పదవికి రాజీనామా ఇచ్చేస్తానని అన్నారు. ఆ మాట విన్న సామ్ కోపంగా.. రాజీనామా పేరుతో నన్ను బెదిరించొద్దు. ఒకవేళ మీరు రాజీనామా ఇస్తే అంగీకరించడానికి నేను వెనుకాడను అని అన్నారు" అని ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
1971 యుద్ధం తరువాత, సైనిక ప్రతినిధి బృందంతో కలిసి మానెక్‌షా పాకిస్తాన్ వెళ్లారు.
అక్కడి పంజాబ్ గవర్నర్ మానెక్‌షాను విందుకు ఆహ్వానించారు.
భోజనం అయిన తరువాత, మా సిబ్బంది మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారని గవర్నర్ మానెక్‌షాకు చెప్పారు.
సామ్ బయటికి వచ్చి చూసేసరికి.. తనను కలవడం కోసం అక్కడ చాలామంది క్యూ కట్టి నిలబడి ఉన్నారు.
మానెక్‌షా అక్కడ ఉన్న ఒక వ్యక్తిని సమీపించగానే ఆయన తన తలపాగా తీసి చేత్తో పట్టుకుని ఆయనకు గౌరవంగా అభివందనం చేశారు.
దానికి కారణం అడుగగా, ఆ వ్యక్తి బదులిస్తూ.. "సర్ ఈరోజు నేను బతికి ఉన్నానంటే అందుకు కారణం మీరు. నా ఐదుగురు కుమారులు మీ దగ్గర బందీలుగా ఉన్నారు. వాళ్లు నాకు ఉత్తరాలు రాస్తుంటారు. వాళ్లని మీరు బాగా చూసుకుంటున్నారని చెబుతుంటారు. మీ సైనికులు కింద నేల పడుకుంటున్నారని, ఖైదీలు మంచాలపై పడుకుంటున్నారని చెప్పారు. వాళ్లని బారకాసుల్లో ఉంచి మీ సైనికులు గుడారాల్లో ఉంటున్నారని చెప్పారు" అని వివరించారు.

ఫొటో సోర్స్, NIYOGI BOOKS
కూలింగ్ గ్లాసులు, గొడుగు, మైకులంటే చిరాకు
మానెక్‌షా కొన్ని విషయాల పట్ల చాలా చిరాకు పడేవారు.
దుర్బలులు, భయపడేవారు మాత్రమే గొడుగులు వాడతారని విశ్వసించేవారు.
సైనికుల మీద కొన్ని చుక్కల వర్షం పడితే ఏం తేడా వస్తుంది? అనేవారు.
కూలింగ్ గ్లాసులంటే కూడా ఆయన చిరాకు పడేవారు. దాని వెనుక ఒక చిన్న కథ ఉంది.
మానెక్ షా జూనియర్ ఆఫీసర్‌గా ఉండేటప్పుడు తన పై అధికారి తాను కొనుక్కున్న ఖరీదైన కళ్లజోడును కాళ్ల కింద నులిమేస్తూ అవి కళ్లను పాడు చేస్తాయని చెప్పారు.
అలాగే, సామ్‌కు మైకులన్నా చిరాకుగా ఉండేది. ఒకసారి ఆయన ఏటీ బెటాలియన్‌తో సైనిక సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడొక మైక్ ఉంచారు.
దాన్ని చూసి "ఈ మైకుని తీసేయండి. నేను నా వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదెందుకు?" అని మానెక్ షా చిరాకు పడ్డారు.
మానెక్‌షాకు ఉన్నమరొక ముఖ్య నియమం ఏమిటంటే.. ఆయన యూనిఫాంలో ఉన్నప్పుడు నలుగురి ఎదుట భోజనం చేసేవారు కాదు. విమానాలలో ప్రయాణిస్తున్నప్పుడూ, రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమాలలోగానీ ఆయన అందరి ముందూ తినడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు.
"ఆయనతో ఉన్నప్పుడు మేము కూడా ఆయన్ను అనుసరించాల్సి వచ్చేది. ఆయన తినకపోతే మేము కూడా తినేవాళ్లం కాదు. ఇది చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా మంచి రుచికరమైన ఆహార పదార్థాలు ఎదురుగా ఉన్నప్పుడు తినకుండా ఉండడం కష్టం" అని బ్రిగేడర్ పంతకి తన పుస్తకంలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీన్ని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- జనరల్ బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యాక సైన్యంలో వచ్చిన మార్పులేంటి?
- అఫ్గానిస్తాన్‌కు అమెరికా లేఖ: 90 రోజుల్లో హింసను అదుపు చేసి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- వెయ్యి మంది చైనా సైనికులతో 124 మంది భారత జవాన్ల పోరాటం
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- నెహ్రూకు ఆర్మీ చీఫ్లంటే అంత భయమెందుకు
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మహిళా పైలట్ ‘సెక్సిజం’ ఎదుర్కొన్నారా
- భారత రక్షణ రంగంలో 'ఆత్మ నిర్భరత' సాధ్యమా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








