ఉత్తరాఖండ్‌ పనీర్‌ విలేజ్: సంపాదన కోసం ఈ ఊరి వాళ్లు పట్నం వెళ్లరు

ఉత్తరాఖండ్ గ్రామం

ఫొటో సోర్స్, Dhruva Mishra/BBC

    • రచయిత, ధ్రువ్‌ మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉపాధి అవకాశాలు దొరక్క ఉత్తరాఖండ్‌ కొండప్రాంతాలలో నివసించే చాలామంది పట్టణాలకు వలస వెళుతుంటారు. గ్రామాలకు గ్రామాలే సిటీలకు తరలి పోయిన పరిస్థితులు ఉత్తరాఖండ్‌లో కనిపిస్తాయి.

చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీగా మారాయి. అయితే అదే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఓ గ్రామం మాత్రం అందుకు భిన్నం. అక్కడి నుంచి ఈ రోజుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉపాధి కోసం పట్నంబాట పట్టలేదు.

ముస్సోరికి 20కి.మీ. దూరంలో 'రౌతు కి బెలీ' అనే ఊరు ఉంది. ఇది తెహ్రీ జిల్లా జౌన్‌పూర్‌ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఉంటుంది. పనీర్ విలేజ్‌గా ఈ గ్రామం రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందింది.

సుమారు 1500మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో 250 కుటుంబాలుంటాయి. వీరిలో చాలా కుటుంబాలకు ఉపాధి పనీర్‌(పాలతో తయారు చేసే ఆహార పదార్థం) అమ్మకమే.

40 ఏళ్ల కిందట కున్వర్‌ సింగ్‌ పన్వార్‌ అనే గ్రామ సమితి నేత ఒకరు ఇక్కడ పనీర్‌ తయారు చేయడం ప్రారంభించారు."1980లో కిలో పనీర్ ఐదు రూపాయలు ఉండేది. ఇక్కడి నుంచి ముస్సోరీలోని ఓ స్కూల్‌కు సరఫరా చేసేవాడిని. అప్పట్లో దీనికి బాగా డిమాండ్‌ ఉంది’’ అని కున్వర్‌ సింగ్‌ గుర్తు చేసుకున్నారు.

1975-76 సంవత్సరంలో ఈ ప్రాంతానికి వాహనాలు రావడం మొదలైందని కున్వార్‌ చెప్పారు. బస్సులు, జీపుల ద్వారా ముస్సోరీకి ఆయన పనీర్‌ పంపించేవారట.

పనీర్‌ గురించి చుట్టు పక్కల ప్రజలకు ఎక్కువగా తెలియకపోవడంతో కున్వర్‌ సింగ్‌ స్థానికంగా దానిని అమ్మలేదు.

మొదట్లో పనీర్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉండేదని, రోజుకు 40 కిలోల పనీర్‌ తయారు చేసేవారని, తర్వాత కొన్నాళ్లు తయారీ తగ్గుముఖం పట్టినా 2003 నుంచి మళ్లీ పుంజుకుందని కున్వర్‌ సింగ్‌ వెల్లడించారు.

ఆ ఊరు వెళితే చాలామంది జున్ను తయారు చేస్తూ కనిపిస్తారు

ఫొటో సోర్స్, Dhruva Mishra

ఫొటో క్యాప్షన్, ఈ ఊరు వెళితే చాలామంది పనీర్‌ తయారు చేస్తూ కనిపిస్తారు

డెహ్రడూన్‌ వరకు చేరిన ఈ ఊరి పనీర్‌

"2003లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత, రౌతు కి బెలీ గ్రామం పక్కన ఉత్తరకాశీ జిల్లా-డెహ్రాడూన్‌ను కలిపే రోడ్డు పడింది. ఇది ఇక్కడి ప్రజలకు బాగా ఉపయోగపడింది. ఈ ప్రాంతానికి డెహ్రాడూన్‌ నుంచి ఉత్తర కాశీకి వెళ్లే వారు రావడం పెరిగింది. దీంతో ఇక్కడ పనీర్‌ కూడా అందరికీ పరిచయమైంది. ఈ రోడ్డుగుండా వెళ్లే వారు ఇక్కడి పనీర్‌ కొనుక్కుని వెళ్లడం ప్రారంభించారు. కల్తీలేని చౌకైన పనీర్‌ దొరకడంతో దీనికి మంచి పేరు వచ్చింది’’ అని కున్వర్ సింగ్‌ వివరించారు.

గేదెలు

ఫొటో సోర్స్, Dhruva Mishra

రౌతు కి బెలీలో తగ్గిన వలసలు

ఉత్తరాఖండ్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తెహ్రీ జిల్లా మొత్తంలో తక్కువ వలసలు ఉన్న గ్రామం ఇదేనని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో 40-50మంది యువకులు ఉపాధి కోసం గ్రామం వదిలి పట్నానికి వెళ్లినా కరోనా మహమ్మారి కారణంగా తిరిగి వచ్చేశారు.

పనీర్‌ తయారు చేసి అమ్ముకోవడం ఈ రౌతు కి బెలీ గ్రామంలో కుటీర పరిశ్రమగా మారింది. కొందరు వ్యవసాయం చేస్తుండగా, మిగిలిన వాళ్లు పనీర్‌ తయారు చేస్తుంటారు. ఇప్పుడు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

“పనీర్‌ తయరు చేస్తే అన్నిఖర్చులు పోగా ప్రతి ఇంట్లో నెలకు 6వేల నుంచి 7వేల రూపాయల వరకు మిగులుతాయి. ఆడవాళ్లు పొలంవెళ్లి గడ్డి తీసుకువస్తారు కాబట్టి దాణా ఖర్చు చాలా తక్కువ. కాకపోతే ఏప్రిల్ నెలలో గడ్డి దొరకదు కాబట్టి ఆ ఒక్క నెలలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది’’ అని భజేంద్ర సింగ్‌ అనే గ్రామస్తుడు వెల్లడించారు.

పనీర్ తయారీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుండటంతో రౌతు కి బెలీ గ్రామాస్తులు వలస వెళ్లాల్సిన అవసరం లేకపోయింది

ఫొటో సోర్స్, Dhruva Mishra

ఫొటో క్యాప్షన్, పనీర్ తయారీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుండటంతో రౌతు కి బెలీ గ్రామాస్తులు వలస వెళ్లాల్సిన అవసరం లేకపోయింది

పన్నీర్‌ తయారీ అంత ఈజీ కాదు

పర్వత ప్రాంతాలలో పనీర్‌ వ్యాపారం కష్టమైన పని అని కున్వర్‌ సింగ్‌ చెప్పారు. గేదెను పెంచుకుని ఆ పాలతో పనీర్‌ తయారు చేస్తేనే లాభదాయకం. కానీ ఈ కొండ ప్రాంతాలలో పశుగ్రాసం ఎక్కువగా దొరకదని ఆయన వెల్లడించారు.

గ్రామానికి చెందిన మహిళలు పశుగ్రాసం కోసం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి పక్క ఊరికి కూడా వెళ్లాల్సి వస్తుంది.

“పశువులకు గడ్డీ, ఇంట్లో వంటకు, పనీర్‌ తయారీకీ కట్టెలు తీసుకురావాలి. ఇది చాలా కష్టమైన పని. ఇక్కడ గడ్డి సరిగా దొరకదు’’ అని ఆ గ్రామానికి చెందిన మున్నీదేవి అనే మహిళ వెల్లడించారు.

“గడ్డి కోసం కొండ మీదకు వెళ్లాలి. ఉదయం 9గంటలకు వెళితే సాయంత్రం 4 గంటలకు గడ్డి, కట్టెలతో తిరిగొస్తాం. అప్పుడు పాలు పితికి పనీర్ తయారు చేయడం ప్రారంభించాలి ’’ అని ఆమె తెలిపారు.

గేదె కొనుక్కోడానికి రుణం, పశుగ్రాసాన్ని ఉచితంగా లేదంటే సబ్సిడీలో ఇస్తే ఇక్కడి ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని మున్నీదేవి అంటారు.

పనీర్

ఫొటో సోర్స్, Dhruva Mishra

పనీర్

ఫొటో సోర్స్, Dhruva Mishra

ప్రభుత్వం సాయం ఉండాలి

రౌతు కి బెలీ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. మా ఇళ్లు ఎక్కడో కొండల్లో ఉంటాయి. ఎక్కడికైనా వెళ్లాలన్నా, సరుకు తీసుకురావాలన్నా, తీసుకెళ్లాలన్నా గుర్రాలను నమ్ముకోవాలి. ఒక్క ట్రిప్‌కు రూ.150 అవుతుంది” అని ఆ గ్రామ పంచాయతీ పెద్ద బాగ్‌ సింగ్‌ భండారీ చెప్పారు.

"రోడ్డు నిర్మాణానికి గత 10 నుండి 15 సంవత్సరాలుగా మా గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ 2011లో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారికి పునాదిరాయి వేశారు. కానీ ఇంత వరకు పూర్తి కాలేదు" అని భండారీ అన్నారు.

“గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వాలు ప్రణాళికలు వేయాలి. గ్రామ పంచాయితీకి ప్రణాళికలు వేసుకునే అవకాశం కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు యోగేశ్‌ భట్‌ బీబీసీతో అన్నారు

“పనీర్‌ అమ్ముకోవడం వల్ల పెద్దగా లాభాలు రావు. కానీ ఇల్లు గడుస్తుంది. ఖర్చులకు సరిపోతుంది’’ అని మున్నీదేవి అన్నారు. శీతాకాలం వస్తే పశుగ్రాసం తీసుకురావడం చాలా కష్టమవుతుందని ఆమె తెలిపారు.

సవాళ్లు ఉన్నప్పటికీ ఈ గ్రామంలోని చాలా కుటుంబాలు పనీర్‌ తయారు చేసి మార్కెట్‌కు పంపుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)