తాలిబాన్‌లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ట్రంప్ ప్రభుత్వంతో వారు కుదుర్చుకున్న ఒప్పందమే కారణమని చెప్పవచ్చని అమెరికా అత్యున్నత డిఫెన్స్ అధికారులు అంటున్నారు.
అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి వైదొలగేలా 2020 ఫిబ్రవరిలో దోహా ఒప్పందంపై సంతకాలు జరిగాయి, సేనల ఉపసంహరణకు తేదీ కూడా నిర్ణయించుకున్నారు.
అఫ్గాన్ ప్రభుత్వం, సైన్యంపై ఈ ఒప్పందం వినాశకర ప్రభావాన్ని చూపిందని జనరల్ ఫ్రాంక్ మెకంజీ అన్నారు.
మెకంజీ వ్యాఖ్యలతో ఏకీభవించిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ‘‘ఈ ఒప్పందం తాలిబాన్లు మరింత బలపడేందుకు సహకరించింది" అన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా యూఎస్ సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగే తేదీని నిర్ణయించడంతో పాటు, అమెరికా, మిత్ర దేశాల భద్రతకు ముప్పు కలిగించే అల్ ఖైదా లాంటి గ్రూపుల కార్యకలాపాలను నివారించడానికి తాలిబాన్లు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత యూఎస్ బలగాలు వైదొలగడానికి తొలుత నిర్ణయించిన గడువును మార్చారు. ట్రంప్ ప్రభుత్వం అనుకున్నట్లుగా మే నెల కాకుండా ఆగస్టు 31ని గడువుగా నిర్ణయించారు.
అమెరికా డిఫెన్స్ అధికారులు బుధవారం హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఎదుట ఈ వివరాలు వెల్లడించారు.
కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణ సమయంలో నెలకొన్న అస్తవ్యస్తత నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
పౌరులు, సైనికులు దేశం నుంచి వైదొలుగుతున్న సమయంలో కాబుల్ ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో 182 మంది ప్రాణాలు కోల్పోయారు.
అఫ్గానిస్తాన్ నుంచి యూఎస్ దళాలు వైదొలిగిన ప్రక్రియను యూఎస్ సెంట్రల్ కమాండ్ అధినేత జనరల్ మెకంజీ పర్యవేక్షించారు.
ఈ ప్రక్రియతో అఫ్గానిస్తాన్‌లో 20 సంవత్సరాల పాటు అమెరికా చేసిన సుదీర్ఘమైన యుద్ధం ముగిసింది.
దోహా ఒప్పందం ద్వారా అఫ్గానిస్తాన్‌కు అమెరికా సహాయం ముగిసే తేదీని నిర్ణయించడంతో అది అఫ్గాన్ ప్రభుత్వం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందని మెకంజీ ఈ కమిటీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనల సంఖ్య 2,500 కంటే తగ్గితే అఫ్గాన్ ప్రభుత్వం, సైన్యం వెంటనే కూలిపోతాయని తనకు ముందే అనిపించిందని ఆయన చెప్పారు.
దోహా ఒప్పందం తర్వాత ఏప్రిల్‌లో సైన్యం సంఖ్యను తగ్గించాలని బైడెన్ ఆదేశించారు. ఇది మరో దెబ్బగా పరిణమించింది.
"తాలిబాన్లపై వైమానిక దాడులు చేయకుండా దోహా ఒప్పందం చేసుకోవడం అనేది ఇస్లామిస్ట్ గ్రూపులు మరింత బలం పుంజుకునేలా చేసింది. వారు అఫ్గాన్ భద్రతా దళాలపై దాడులను పెంచడంతో ఆ దేశం నుంచి ప్రజలు వెళ్లిపోవడం మరింత పెరిగింది" అని ఆస్టిన్ చెప్పారు.
మంగళవారం యూఎస్ డిఫెన్స్ అధికారులు సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీతో మాట్లాడారు. ఆగస్టులో సేనలు పూర్తిగా వైదొలిగే వరకూ అఫ్గానిస్తాన్ లో కనీసం 2,500 మంది సైనికులను ఉంచాలని సూచించినట్లు జనరల్ మిల్లీ, మెకంజీ చెప్పారు.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను వారి అధీనంలోకి తీసుకోవడంతో తీవ్రవాద దాడుల నుంచి అమెరికన్లను రక్షించడం కష్టం అని మిల్లీ చెప్పారు. ఈ బృందం ఆల్ ఖైదాతో ఇంకా సంబంధాలు తెంచుకోలేదని అన్నారు.
అఫ్గాన్ భూభాగం నుంచి అమెరికా సహా మరే ఇతర దేశానికీ ఎలాంటి ముప్పూ ఉండదని మిలిటెంట్లు హామీ ఇచ్చినట్లు తాలిబాన్ల ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ బుధవారం బీబీసీకి చెప్పారు.
"దోహాలో ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు అమెరికాకు జరిగిన ఒప్పందానికి మేం కట్టుబడి ఉంటాం. అలాగే, అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. వారు మా పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మానుకుని దౌత్యపరమైన మార్గాన్ని అవలంబించి సహకారం అందిస్తే బాగుంటుంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా? ఎవరేమంటున్నారు?
- మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలా?
- హిమాలయాల్లో నీళ్లు దొరకట్లేదు ఎందుకు?
- భారత్ బంద్: వైసీపీ, టీడీపీల ద్వంద్వ వైఖరి.. పార్లమెంటులో అలా.. ఇప్పుడేమో ఇలా..
- ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- IMD: ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాల హెచ్చరిక.. తీరం దాటిన గులాబ్ తుపాను
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








