న్యూమెక్సికో: ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు

ఫొటో సోర్స్, BOURNEMOUTH UNIVERSITY
- రచయిత, పాల్ రింకాన్
- హోదా, సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్
శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నమ్మినదానికి ఇంకా 7 వేల సంవత్సరాల ముందే అమెరికా ఖండంలో మనుషులు సంచరించారని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో బైటపడింది.
ఆసియా నుండి ఖండం నుంచి మనుషులు ఇక్కడికి ఎప్పుడు వచ్చి స్థిరపడ్డారనే అంశం అనేక దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది.
16 వేల సంవత్సరాల కంటే ముందే ఉత్తర అమెరికా భూభాగంలో మనుషులు అడుగు పెట్టి ఉంటారన్న వాదనపై చాలామంది పరిశోధకులు సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే, తాజాగా న్యూ మెక్సికోలో పనిచేస్తున్న బృందం 23 వేల సంవత్సరాలు లేదా 21వేల సంవత్సరాల నాటివిగా భావిస్తున్న మనిషి పాదముద్రలను కనుగొంది.
కొత్తగా లభించిన ఆధారాలు అమెరికా ఖండంలో మనుషులు కదలికలు ఎప్పటి నుంచి ఉన్నాయన్నదానిపై ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంది.
ఇక్కడికి అంతకు ముందే పెద్ద ఎత్తున వలసలు జరిగి ఉండొచ్చని, ఆ జనాభా అంతరించి పోయి ఉండవచ్చని కూడా భావించేందుకు ఆస్కారం ఏర్పడింది.
ఈ పాదముద్రలు ఓ సరస్సుకు చెందిన మెత్తటి మట్టిలో కనిపించాయి. ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
అమెరికా జియాలాజికల్ సర్వే బృందం ఈ పాదముద్రలు కనుగొన్న ప్రాంతంలోని మట్టి పొరల్లోని విత్తనాలపై రేడియో కార్బన్ డేటింగ్ టెస్టులు నిర్వహించింది.
దీని నుంచి వచ్చిన వివరాలు ఈ పాదముద్రలకు సంబంధించిన కాలానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇచ్చాయి.
పాదముద్రల సైజులను బట్టి చూస్తే ఈ పాద ముద్రలు చిన్న పిల్లలు, టీనేజర్లు అటు ఇటు తిరుగుతున్నప్పుడు పడినవిగా గుర్తించారు. అక్కడక్కడా పెద్ద వాళ్ల పాదాల గుర్తులు కూడా కనిపించాయి.

ఫొటో సోర్స్, BOURNEMOUTH UNIVERSITY
పాదముద్రలు ఏం చెబుతున్నాయి?
ఈ పాదముద్రల ఆధారాలు అమెరికాలో తొలితరం నివాసితుల జీవితానికి సంబంధించిన అనేక వివరాలను అందిస్తాయి.
ఇక్కడ కనిపించే పాదముద్రలను గమనించినప్పుడు ఆ టీనేజర్లు ఏం చేస్తున్నారన్నది స్పష్టంగా తెలియరాలేదు.
అయితే, అమెరికా ప్రాచీన సంస్కృతిలో కనిపించే ఒక రకమైన వేటలో వారు పెద్ద వాళ్లు పెద్దవాళ్లకు సహాయ పడుతున్న సందర్భంలో వేసిన అడుగులుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వేట ఆటను అమెరికా సంస్కృతిలో 'బఫెలో జంప్' అని పిలుస్తారు.
ఈ పరిణామాలు జరిగిన కాలం చాలా కీలకమైనది. ఎందుకంటే అమెరికా ఖండంలో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడు అన్నదానిపై అనేక అభిప్రాయాలు, వివాదాలు ఉన్నాయి.
అమెరికాలో కనిపించే పురాతన రాతి పనిముట్ల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అవి ఎవరైనా తయారు చేసిన శిలాయుధాలా లేక ఏదో ఒక కొండపై నుంచి రాళ్లు జారిపడినప్పుడు విరిగి పడిన ఒట్టి రాతి ముక్కలా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
అమెరికాలో తొలి మానవులు ఉపయోగించిన ఈటెల్లాంటి వస్తువులు కొన్ని 13,000 సంవత్సరాల కిందట ఉత్తర అమెరికాలో తిరిగిన మనుషులు ఉపయోగించిన ఈటెలకన్నా తక్కువ మొనదేలి ఉన్నాయి.
ఈ తేడాల కారణంగా ఇక్కడి ప్రాచీన మానవులు ఎవరు అన్న సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
''ఇంత చర్చ జరగడానికి కారణం, సరైన ఆధారాలు లేకపోవడమే'' అని బోర్న్‌మౌత్ యూనివర్సిటికి చెందిన ప్రొఫెసర్ మాథ్యూ బెన్నెట్ బీబీసీతో అన్నారు.
"పాదముద్రలు రాతి పనిముట్ల లాంటివి కావు. ఒక పాదముద్ర నేల పొరలలో కదలకుండా ఉండిపోతుంది'' అన్నారాయన.

ఫొటో సోర్స్, BOURNEMOUTH UNIVERSITY
ఈ ఆధారాలు సరిపోతాయా?
కేవలం కనిపించే భౌతిక ఆధారాలు సరిపోకపోవడంతో పరిశోధకులు కార్బన్ డేటింగ్ ద్వారా సాక్ష్యాల కోసం ప్రయత్నించారు. అందులో స్పష్టమైన ఆధారాలు దొరికాయి.
మొదట్లో శాస్త్రవేత్తలకు మరో అనుమానం కూడా వచ్చింది. పక్కనే ఉన్న నీరు కారణంగా కార్బన్ చర్యనొందితే, లభించిన ఆధారాలు ఇంకా ప్రాచీనమైనవిగా పరీక్షల్లో తేలే అవకాశం ఉంది. దీనినే 'రిజర్వాయర్ ఎఫెక్ట్' అంటారు.
అయితే, తర్వాత జరిగిన సమీక్షల్లో ఈ ముద్రలపై రిజర్వాయర్ ఎఫెక్ట్ పడే అవకాశం లేదని సైంటిస్టులు గుర్తించారు.
వియన్నా విశ్వవిద్యాలయంలో రేడియోకార్బన్ డేటింగ్ నిపుణుడు ప్రొఫెసర్ టామ్ హిగమ్ దీనిపై వ్యాఖ్యానించారు.
''పాదముద్రలకు సంబంధించిన మెటీరియల్‌పై సైంటిస్టులు క్షుణ్నంగా పరిశీలించారు. నీటి ప్రభావం లేని ప్రాంతంలో ఉన్న నమూనాల మాదిరిగానే అవి కూడా స్పష్టమైన ఆధారాలను అందించాయి'' అని ఆయన అన్నారు.
''వీటిని బట్టి చూస్తే ఇవి 21,000-23,000 సంవత్సరాల పురాతనమైనవి అని నేను అనుకుంటున్నాను " అని ప్రొఫెసర్ హిగమ్ బీబీసీతో అన్నారు.
ఈ ప్రాంతంలో చారిత్రక పరిణామాలపై అమెరికా పురావస్తు శాస్త్రవేత్తలలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అయితే 20వ శతాబ్దం రెండవ భాగంలో వీరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. క్లోవిస్ సంస్కృతికి చెందిన వ్యక్తులు అమెరికాకు మొదట వచ్చారని వారు అంగీకరించారు.
ఇలా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో క్లోవిస్ సంస్కృతికి చెందిన మానవులకన్నా ప్రాచీనమైన మానవులు ఉన్నారు అన్న అనుమానాలను కూడా అంతా మరిచిపోయారు.
కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్ సంస్కృతి ముందు మనుషులు ఎవరు అన్నదానిపై అన్వేషణ కూడా మానేశారు.

ఫొటో సోర్స్, BOURNEMOUTH UNIVERSITY
సవాళ్లు మొదలు
కానీ ఈ సిద్ధాంతానికి 1970లలో సవాళ్లు మొదలయ్యాయి. 1980లలో చిలీలోని మోంటె వెర్డేలో 14,500 సంవత్సరాల కిందటి పురాతన మానవ ఉనికికి బలమైన ఆధారాలు లభించాయి.
2000 సంవత్సరం నుంచి ఇతర క్లోవిస్ జాతి పూర్వపు మనుషులకు చెందిన అనేక ప్రాంతాలు బైటపడ్డాయి. సెంట్రల్ టెక్సాస్‌లోని 15,500 సంవత్సరాల పురాతన బట్టర్‌మిల్క్ క్రీక్ కాంప్లెక్స్, ఇడాహోలోని 16,000 సంవత్సరాల పురాతనమైన కూపర్స్ ఫెర్రీ సైట్ వంటివి బయటపడ్డాయి.
ఇప్పుడు, న్యూ మెక్సికోలో లభించిన పాదముద్రల సాక్ష్యాలు గత మంచు యుగం నాటికి ఉత్తర అమెరికా భూభాగంలోకి మనుషులు చేరుకున్నారని సూచిస్తున్నాయి.
భారీ మంచు పలకలు ఈనాటి కెనడాలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉన్నాయి. ఇవి ఆసియా నుంచి వచ్చిన వారికి అడ్డంకిగా మారి ఉండవచ్చు. అయితే, అంతకు ముందు ఈ దారులు దాటడానికి సులభంగా ఉన్నప్పుడు మానవులు ఇక్కడి వచ్చి ఉండవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది.
''ఈ పరిశోధనలో లోపాలున్నాయని నేను అనుకోను'' అని నెవాడా యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గ్యారీ హేన్స్ అన్నారు
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రియా మానికా మాత్రం అమెరికాలో తొలి మానవుల సంచారానికి సంబంధించి ఈ పరిశోధన కొత్త సందేహాలకు తావిచ్చిందని అన్నారు.
''ఈ కార్బన్ డేటింగ్ ఎంత విశ్వసనీయమైనది అనేదానిపై నేను వ్యాఖ్యానించలేను. కానీ 23,000 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో మనుషులున్నారన్న సాక్ష్యాలు జన్యుశాస్త్రంతో విభేదిస్తున్నాయి. 15000-16000 సంవత్సరాల కిందటే ఆసియన్ల నుంచి స్థానిక అమెరికన్ల విభజన స్పష్టంగా ఉంది'' అని బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పంట పొలాల్లో వ్యాక్సినేషన్: ఒకే ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్, విజయసాయిరెడ్డి, అసలు ఈ ఫొటో ఏ రాష్ట్రానిది?
- నరేంద్ర గిరి: అఖాడా అధిపతి ఆత్మహత్య కేసులో అంతుచిక్కని ఐదు అంశాలు
- అమెరికాలో మోదీ: చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్ సదస్సు భారత్‌కు సాయం చేస్తుందా
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- అమెరికాలో మోదీ కలవబోతున్న ఐదు కంపెనీల సీఈవోలు ఎవరు, ఈ సమావేశాలు ఎందుకంత కీలకం?
- ‘ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్మెనిస్తాన్, నిజమెంత?
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు
- 'కన్యాదానం' అమ్మాయిలకే ఎందుకు? భారతీయ సంప్రదాయాలను సవాలు చేస్తున్న ప్రకటనలు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








