IMD: ఉత్తర ఆంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాల హెచ్చరిక.. తీరం దాటిన గులాబ్ తుపాను

ఫొటో సోర్స్, IMD
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.
శ్రీకాకుళం జిల్లాపై గులాబ్ తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. శ్రీకాకుళం సిటీతో పాటు తీరప్రాంత గ్రామాలపై గులాబ్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతవాసులను 1500 మందిని తరలించామని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. తుపాను ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబరు 08942-240557, 6309990933లను సంప్రదించాలని తెలిపారు.
విశాఖపై కూడా గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని కాలనీల ఇళ్లల్లోకి నీరు చేరింది. పెదగంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ, నాయుడు తోట దుర్గానగర్ కాలనీల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. డంతో అక్కడ ప్రజలు విశాఖ నగరం, గాజువాక, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెందుర్తి, సుజాతనగర్, సప్తగిరి నగర్లలోని పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది. అలాగే పారిశ్రామిక ప్రాంతం గాజువాకలోని తో పాటు కొండవాలు ప్రాంతాలలో జారిన మట్టి పలకలతో కొండవాలు ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో మేఘాద్రిగెడ్డ, తాటిపూడి, రైవాడ, కోనాం రిజర్వాయర్లలోకి భారీగా వర్షం నీరు చేరింది. దీంతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి వేశారు. ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
తీరం దాటిన గులాబ్ తుపాను
గులాబ్ తుపాను సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.
"ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో ఎక్కువ నష్టం జరగలేదు. పలుచోట్ల చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరిగింది. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి. జాతీయ విపత్తు నివారణ బృందాలు, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి" అని కలెక్టర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాల హెచ్చరిక
గులాబ్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో 27వ తేదీ సోమవారం ఉత్తరాంధ్ర, దక్షిణ చత్తీశ్‌గఢ్, తెలంగాణ, విదర్భల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ కోస్తా ప్రాంతాలు, ఉత్తర చత్తీశ్‌గఢ్‌ల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
సోమవారం మధ్యాహ్నం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర తీరం వెంబడి సముద్రంలో అలజడి ఉధృతంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఐదుగురు మత్స్యకారులు క్షేమం...
"వజ్రపుకొత్తూరుకు చెందిన ఆరుగురు మత్స్యకారులలో ప్రస్తుతానికి ఐదుగురు మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. ఒక మత్స్యకారుడి ఆచూకీ మాత్రమే ఇంకా తెలియాల్సి ఉంది. 30 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు 1500 మంది ప్రజలను తరలించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు ఉన్న కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి" అని శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.

సెల్ ఫోన్ లైట్ల వెలుగులో సహాయక చర్యలు
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీకాకుళం నగరంతో పాటు తీర ప్రాంత మండలాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు.

ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. నలుగురు క్షేమం
ఇవాళ మధ్యాహ్నం నుంచి సముద్రంలో అలల తీవ్రత ఎక్కవకావడంతో పలాస నియోజకవర్గం మంచినీళ్ల పేటకు చెందిన మత్సకారుల బోటు బోల్తాపడింది. రెండు రోజులు క్రితం కొత్త బోట్ కొనేందుకు ఆరుగురు మత్స్యకారులు ఒడిశా వెళ్లారు, అక్కడ బోట్ కొనుక్కొని సముద్ర మార్గం ద్వారా మంచినీళ్ళపేట వస్తుండగా ఈ రోజు మధ్యాహ్నం అక్కుపల్లి సముద్ర ప్రాంతంలో అలజడుల కారణంగా బోటు బోల్తాపడింది. ఆ సమయంలో బోటులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు బోటు నుండి సముద్రంలోకి పడిపోయారు. ఈ విషయాన్ని అదే బోటులో ఉన్న మరొక వ్యక్తి పిట్ట హేమారావు జరిగిన సంఘటనను గ్రామస్థులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు.
అయితే ప్రస్తుతం హేమరావు ఫోనుకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇదే సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో గల్లంతైన ఆరుగురులో ముగ్గురు మత్స్యకారులు తాము క్షేమంగా ఉన్నట్లు మంత్రి సిదిరి అప్పలరాజుకు ఫోను ద్వారా తెలియపర్చారు. అయితే మరో ఇద్దరు మరణించారు, ఒకరి అచూకీ తెలియడం లేదని చెప్పారు.
"పది మైళ్లు ఈదుకుంటూ వచ్చాం. ప్రమాదం జరిగినప్పుడు హేమరావు ఒక్కడే బోటులో ఉన్నాడు. మిగతా ఐదుగురం కింద పడిపోయాం. ఇప్పుడు హేమరావు ఎక్కడున్నాడో తెలియడం లేదు. దయచేసి అతడ్ని వెతికించండి." అని మంత్రి సిదిరి అప్పలరాజుతో క్షేమంగా బయటపడిన మత్స్యకారుడు వంక చిరంజీవి వేడుకున్నారు.
అయితే మరో గంటలోనే గల్లంతైన మరో మత్స్యకారుడు హేమరావు క్షేమంగా అక్కుపల్లి-బైపల్లి తీరం వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ అప్పలరాజుతో మట్లాడి హేమరావు తెలియపర్చారు.
తుపాను తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ ఆర్‌కే జెనమణి అన్నారు. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, అటు దక్షిణ ఒడిశా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

ఫొటో సోర్స్, UGC
శ్రీకాకుళానికే ముప్పు ఎక్కువ
గులాబ్ తుపాను ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది. శ్రీకాకుళానికి 4 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుదని అంచనా వేస్తున్న గార, కవిటి, సోంపేట, కళింగపట్నం తదితర ప్రాంతాల్లో జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఇదే సమయంలో కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్... తుపాను సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని...లోతట్టు ప్రాంతాల ప్రజలను తుపాను రక్షిత భవనాలకు, ఇతర కార్యాలయాలకు తరలించి వారికి రక్షణ కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, మెరైన్, విద్యుత్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సెలవులు రద్దు చేశారు.
పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని 27 గ్రామాల్లో మత్స్యకారులు.. అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బారువ, పొగరు వద్ద సుమారు 100 బోట్లను లంగరు వేసి ఉంచుకున్నామని.. మహేంద్రతనయ నుంచి భారీగా వరద వస్తే.. ఆ బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన వలలు, బోట్లు పాడవకుండా అధికారులు ముందస్తు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తమ గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
అందోళనలో మత్స్యకారులు
తుపాను ప్రభావానికి ఎక్కువగా ప్రభావితమయ్యే శ్రీకాకుళంలో తీరప్రాంత మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. తమ పడవలు, బోట్లు ఏమైపోతాయోనని భయపడుతున్నారు. తీర ప్రాంత గ్రామాలైన ఇస్కలపాలెం, రామయ్య పట్నం, గొల్లగండి, బారువ కొత్తూరు, నడుమూరు, డొంకలూరు, ఎకూవురు, బట్టి గళ్ళూరు గ్రామాలకు చెందిన సుమారు 100 బోట్లును గులాబ్ తుపాన్ కారణంగా లంగరువేసి, బారువ పొగురు వద్ద ఉంచారు మహేంద్ర తనయా నుండి భారీ వర్షం నీరు బారువ పొగురుకు చేరితే సుమారు 100 బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోతాయని, ప్రమాదం జరిగితే కోట్లు రూపాయలు వలలు, బోట్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా తమ తెప్పలు కొన్ని సముద్ర ఒడ్డునే ఉన్నాయని చెప్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
వెనక్కిరండి....
వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా కొందరు తిరిగి రాలేదని...వారంతా వెనక్కి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ కోరారు. మత్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా నివారించాలలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించి అప్రమత్తం చేయాలని, ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎక్కడ అవసరమైన పంపించేందుకు అదనపు ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి సిద్దంగా ఉందని తెలిపారు.
విశాఖ జిల్లాలోనూ కొన్ని చోట్ల ప్రస్తుతం వర్షం కురుస్తోంది. సైక్లోన్ షెల్టర్లు, రోడ్డు బ్లాకేజీల సత్వర తొలగింపు కొరకు జేసీబీలను సిద్ధంగా ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్ జి. సృజన చెప్పారు.
ఒడిశాలోని పది జిల్లాలపై ప్రభావం..
గులాబ్ తుపాను ఒడిశాలోని పది జిల్లాలపై ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అత్యవసర చర్యలపై ఒడిశా సీఎం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
రైళ్లు రద్దు...
గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి చెప్పారు. అలాగే కొన్నింటిని దారి మళ్లీంచామని ఆయన తెలిపారు. విశాఖ- విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ- విజయనగరంవైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. రేపు (27న) విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా మళ్లించిచామని, రేపు విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్ నుంచి బయలు దేరుతుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు?
- ఇస్లామిక్ స్టేట్ మాజీ సభ్యురాలు షమీమా బేగం: 'నాకు మరో అవకాశం ఇవ్వండి... తీవ్రవాదంపై పోరాడడంలో సాయపడతాను'
- పవన్ కల్యాణ్: సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త
- పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టిగా జవాబిచ్చిన స్నేహ దుబే
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- ఇవి 23,000 ఏళ్ల కిందటి మానవుడి పాద ముద్రలు
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















