ఇస్లామిక్ స్టేట్ మాజీ ‘జిహాదీ పెళ్లికూతురు’ షమీమా బేగం: 'మరో అవకాశం ఇస్తే... తీవ్రవాదంపై పోరాడడంలో సాయపడతాను'

ఇస్లామిక్ స్టేట్‌లో చేరినందుకు జీవితాంతం పశ్చాత్తాపపడతానని, తీవ్రవాదంపై పోరాటంలో బ్రిటన్‌కు సహాయపడతానని అంటున్నారు షమీమా బేగం.
"నేను సమాజానికి ఉపయోగకరంగా మారగలను. సిరియా సహాయక శిబిరాలలో కుళ్లి కృశించిపోవాలని లేదు" అని ఆమె బీబీసీతో అన్నారు.
ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చురుకైన పాత్ర పోషించారని 22 ఏళ్ల షమీమాపై ఆరోపణలు ఉన్నాయి.
ఆమె ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, జాతీయ భద్రత దృష్ట్యా షమీమా పౌరసత్వాన్ని రద్దు చేశారు అప్పటి బ్రిటన్ హోం మత్రి సాజిద్ జావిద్. ఇప్పటికీ జావిద్ తన నిర్ణయానికి కట్టుబడే ఉన్నారు.

ఫొటో సోర్స్, PA Media
ఎవరీ షమీమా బేగం?
బంగ్లాదేశ్ మూలాలు ఉన్న బ్రిటిష్ పౌరురాలు షమీమా బేగం, పదిహేనేళ్ల వయసులో తూర్పు లండన్ నుంచి మరో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో కలిసి బ్రిటన్ వదిలి సిరియా పారిపోయారు.
అక్కడకు వెళ్లి వారంతా ఐఎస్‌లో చేరారు.
షమీమా బేగం అక్కడే డచ్‌కు చెందిన ఒక తీవ్రవాదిని వివాహమాడారు. మూడేళ్లకు పైగా ఐఎస్‌లోనే గడిపారు.
అనంతరం, 2019లో సిరియా శరణార్థి శిబిరాల్లో ఆమె తొమ్మిది నెలల గర్భంతో కనిపించారు. ప్రసవం తరువాత, ఆమె బిడ్డ న్యుమోనియాతో మరణించింది. అంతకు ముందు కూడా ఇద్దరు పిల్లలను కోల్పోయానని షమీమా బేగం చెప్పారు.
మాంచెస్టర్ అరేనాపై 2017లో ఐఎస్ చేసిన దాడి గురించి చెబుతూ, అది మిలటరీ దళాలు, ఐఎస్ స్థావరాలపై చేసే దాడిలాంటిదేనని ఆమె అన్నారు. ఆ దాడిని ఐఎస్ "ప్రతీకార చర్య"గా ఆమె పేర్కొన్నారు.
'నన్ను నేను ద్వేషిస్తాను’
ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించి, అనేక హత్యలకు పాల్పడిన ఒక గుంపులో భాగం కావడం మీకు ఎలా అనిపిస్తుందని షమీమాను బీబీసీ కరస్పాండెంట్ జోష్ బేకర్ అడిగినప్పుడు, "ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. నా నిర్ణయానికి నన్ను నేనే ద్వేషించుకుంటాను" అని ఆమె సమాధానమిచ్చారు.
తన మనసులోని మాటలను నిర్భయంగా చెప్పగలగడం హాయిగా ఉందని ఆమె, 'బీబీసీ సౌండ్స్ అండ్ బీబీసీ 5 లైవ్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
ఖిలాఫత్ స్థాపించడంలో ఐఎస్ విఫలమైనందుకే ఆ సంస్థపై మీ అభిప్రాయం మారిందా అని బీబీసీ రిపోర్టర్ షమీమాను అడిగారు.
"ఐఎస్ పట్ల నాకు ఎప్పటినుంచో ఇలాంటి అభిప్రాయమే ఉంది. కానీ, ఇప్పుడే దాన్ని నిర్భయంగా బయటపెట్టగలుగుతున్నాను" అని ఆమె చెప్పారు.
తనను బ్రిటన్‌లోనికి తిరిగి అనుమతిస్తే, సిరియాకు వెళ్లేలా ప్రజలను ఒప్పించడానికి ఐఎస్ ఉపయోగించే వ్యూహాలపై సలహా ఇవ్వగలనని ఆమె అన్నారు. అలాగే, తీవ్రవాదానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉన్న వ్యక్తులతో మాట్లాడే పద్ధతుల గురించి సలహాలు ఇవ్వగలనని చెప్పారు.
అలా చేయడం తన "బాధ్యత" అని, తనలాగే మరి కొంతమంది అమ్మాయిలు ఈ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవడం తనకు ఇష్టం లేదని షమీమా అన్నారు.

సిరియా శరణార్థి శిబిరం నుంచి మాట్లాడుతూ...
బుధవారం ఐటీవీ 'గుడ్ మార్నింగ్ బ్రిటన్' కార్యక్రమంలో షమీమా మాట్లాడుతూ, తీవ్రవాదంపై పోరాటంలో తాను దేశానికి ఒక కీలకమైన శక్తిగా మారగలనని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నేరుగా ప్రతిపాదన చేశారు.
సిరియా శరణార్థి శిబిరం నుంచి షమీమా మాట్లాడుతూ, తాను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు "ఎలాంటి ఆధారాలు లేవని", కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలనని అన్నారు.
"నేనేం చెప్పినా, ఏం చేసినా నమ్మరని నాకు తెలుసు. కానీ, నన్ను నమ్మండి నేను ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను. మనసులో ఏ కొంచెం జాలి, దయ, కరుణ మిగిలి ఉన్నవారికైనా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే... సిరియాలో అడుగు పెట్టిన దగ్గర నుంచీ నేను తీసుకున్న ప్రతీ నిర్ణయానికీ చింతిస్తున్నాను. అందుకు నా జీవితాంతం పశ్చాత్తాపపడుతూనే ఉంటాను" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SOPA Images via Getty Images
‘నాకు మరొక్క అవకాశం ఇవ్వండి’
"నన్ను నేను ఎంత అసహ్యించుకుంటున్నానో చెప్పలేను. నేను చేసిన పనులకు పశ్చాత్తపడుతున్నాను. నన్ను క్షమించండి. నాకు మరొక్క అవకాశం ఇవ్వండి" అంటూ షమీమా బేగం ప్రాథేయపడ్డారు.
మళ్లీ ఐఎస్‌లో అడుగు పెట్టడం కన్నా చావే మేలని ఆమె అన్నారు.
"ఐఎస్‌లో చేరడం ఒక్కటే నేను చేసిన మూర్ఖపు పని."
"కోర్టులో విచారణకు నేను సిద్ధం. నాపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పని నిరూపించాలనుకుంటున్నాను. ఐఎస్‌లో నేను ఏమీ చేయలేదు. ఒక భార్యగా, తల్లిగా నా పాత్ర పోషించాను తప్పితే ఎలాంటి నేరాలకూ పాల్పడలేదు" అని షమీమా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తిరిగి బ్రిటన్‌లో అడుగుపెట్టడానికి అనుమతి లేదు
షమీమా బేగంను బ్రిటన్‌లోకి మళ్లీ అనుమతించేది లేదని, పౌరసత్వం కేసులో ఆమెకు పోరాడే అవకాశం లేదని ప్రస్తుతం బ్రిటన్ ఆరోగ్య మంత్రిగా ఉన్న సాజిద్ జావిద్ అన్నారు.
"షమీమా పౌరసత్వాన్ని రద్దు చేయడం నైతికంగా, చట్టపరంగా కూడా సరైన చర్య. బ్రిటిష్ ప్రజలను కాపాడేందుకు తీసుకున్న సరైన నిర్ణయం" అని గుడ్ మార్నింగ్ బ్రిటన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.
"కేసు లోపలి వివరాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. కానీ, నాకు తెలిసిన నిజాలు మీకు తెలియవని మాత్రం చెప్పగలను. నేనేం చూశానో మీకు తెలిస్తే, బాధ్యతగల దేశ పౌరులుగా మీరు కూడా నా నిర్ణయాన్ని సమర్థిస్తారు. అందులో సందేహం లేదు" అని అన్నారు.
"జాతీయ భద్రత, దేశ పౌరుల రక్షణకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది" అని బ్రిటన్ హోం శాఖ ప్రతినిధి చెప్పారు.
షమీమా బేగం పౌరసత్వాన్ని రద్దు చేయడం ఒక "ప్రమాదకరమైన దృష్టాంతం"గా పేర్కొంటూ, కోర్టులో విచారణ పొందే హక్కును ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏకపక్షంగా తిరస్కరించకూడదని మానవ హక్కుల సంఘం 'లిబర్టీ' పేర్కొంది.
షమీమాతో పాటూ సిరియా వెళ్లిన ఇద్దరు అమ్మాయిలలో కడిజా సుల్తానా ఒక బాంబు దాడిలో మరణించారు. మరొక వ్యక్తి అమీరా అబాసే వివరాలు తెలీవు.
తన భర్తను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారని, తరువాత సిరియన్ మిలిటెంట్ల బృందానికి లొంగిపోయారని షమీమా గతంలో చెప్పారు.
('అయాం నాట్ ఎ మాన్‌స్టర్ ' పాడ్‌కాస్ట్ బృందానికి చెందిన జోష్ బేకర్, 'బీబీసీ సౌండ్స్ అండ్ బీబీసీ రేడియో లైవ్' పాడ్‌కాస్ట్ సీరీస్ కోసం షమీమా బేగంతో మాట్లాడారు.)
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు తాలిబాన్‌కు మధ్య తేడా ఏంటి?
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు మిగతా దేశాలకు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల మొదటి నెల పాలన ఎలా ఉంది?
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- ఉత్తర కొరియాలో గ్యాస్ మాస్క్‌లతో పరేడ్ ఎందుకు నిర్వహించారంటే...
- ‘మా పెళ్లి జరిపించడానికి పూజారి ఒప్పుకోలేదు, అందుకే...’
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ... అమెరికాకు 'మోస్ట్ వాంటెడ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










