9/11: మూడు వేల మందిని చంపిన నిందితులపై 20 ఏళ్లు గడిచినా అమెరికా చర్యలు ఎందుకు తీసుకోలేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీం మఖ్బూల్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడులకు(9/11 దాడులు)కి 20ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ దాడుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందులపై మీడియాలో చర్చ జరుగుతోంది.
ఖాలిద్ షేక్ మహమ్మద్‌తోపాటు నిందితులంతా ఇటీవల గ్వాంతానామో బే కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ 18 నెలల విరామం తర్వాత ఈ కేసు ట్రయల్స్ నిర్వహించారు.
కోర్టు గ్యాలరీలోని గాజు అద్దాల గుండా చూస్తే.. బాధితుల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కొంత మంది జర్నలిస్టులు కనిపిస్తున్నారు. వీరంతా విచారణను దగ్గరుండి చూసేందుకు వచ్చారు.

చాలా భావోద్వేగానికి గురయ్యాను..
‘‘ఈ కోర్టు గదిలోకి మొదటిసారి అడుగుపెట్టినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’’అని డాక్టర్ ఎలిజబత్ బెర్రీ చెప్పారు. ఆమె తమ్ముడు బెల్లీ బ్రూక్ నార్త్ టవర్‌లో ఫైర్‌మ్యాన్‌గా పనిచేసేవారు. దాడుల్లో మరణించిన వారిలో ఆయన కూడా ఒకరు.
‘‘పత్రికల్లో చాలా అంశాలు చదివిన తర్వాత, ఇప్పుడు ఏం జరుగుతుందా? అని అనిపించేది. నిజానికి పత్రికల్లో వచ్చే అంశాలకు ఇక్కడ జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది. మొదట్లో నాకు చాలా కష్టంగా అనిపించేది.’’
గ్వాంటనామో బేలో ఈ కేసుకు సంబంధించిన 42 ప్రీ ట్రయల్స్‌కు ఎలిజబెత్ హాజరయ్యారు. ‘‘దాడులు జరిగి 20ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో నేడు ఇక్కడకు రావాలని అనుకున్నాను. నా తమ్ముడితోపాటు మరణించిన 3000 మందికి న్యాయం జరిగేందుకు ఇక్కడ పోరాడుతున్న న్యాయాధికారులకు మద్దతు తెలపాలని అనుకున్నాను’’అని ఆమె చెప్పారు.
‘‘నా తమ్ముడిని స్మరించుకోవడానికి ఇంత కంటే మంచి చోటు ఏముంటుంది? అందుకే విచారణకర్తలకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను.’’

ఫొటో సోర్స్, Reuters
ఇది సాధారణ విచారణ కాదు..
ఇక్కడ విచారణ జరిగేటప్పుడు, గ్యాలరీలో కూర్చునే చాలా మంది నిందితులవైపు చూడటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
నిందితుల్లో ఒకరైన ఖాలిద్ షేక్ మహ్మద్ గడ్డానికి ఆరెంజ్ రంగు హెన్నా వేసుకొని వచ్చాడు. తన న్యాయ సేవల బృందం పక్కనే అతడు కూర్చున్నాడు.
విచారణ సమయంలో, అతడితోపాటు మరో నలుగురు నిందితులు వారితోవారు మాట్లాడుకుంటూ కనిపించారు. వీరిలో కొందరు వారి న్యాయ సేవల బృందంతోనూ మాట్లాడుతూ కనిపించారు.
తన వెనుక కూర్చున్న, 9/11 దాడులకు సూత్రధారిగా భావిస్తున్న వాలిద్ బిన్ అట్టాష్‌తో మాట్లాడేందుకు ఖాలిద్ చాలాసేపు వెనక్కి తిరుగుతూ కనిపించాడు.

భారీగా పత్రాలు..
ఈ ఐదుగురు నిందితుల కాళ్ల దగ్గర పెద్ద ప్లాస్టిక్ టబ్బులు ఉన్నాయి. వీటిలో చాలా పత్రాలు కనిపిస్తున్నాయి.
‘‘వారికి కావాల్సిన అన్ని పత్రాలు ఈ టబ్బుల్లోనే ఉంటాయి’’అని 9/11 దాడులకు సదుపాయాలను సమకూర్చి పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మర్ అల్ బలూచీ న్యాయవాది ఆల్క ప్రధాన్ చెప్పారు.
‘‘వారు మాట్లాడాలని భావించే చట్టపరమైన అంశాలను ముందే పక్కాగా సిద్ధం చేసుకుంటారు. మానవ హక్కుల సంస్థల వెబ్‌సైట్ల నుంచి తీసుకొచ్చిన ప్రింట్ అవుట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తీసుకురావాలని వారు మాకు సూచిస్తుంటారు’’అని ప్రధాన్ చెప్పారు. ఈ కేసులో ఐదుగురు నిందితులూ ఎలా ముందుకు వెళ్తున్నారో చెప్పడానికి దీన్ని ఒక ఉదాహరణగా ఆమె వివరించారు.
9/11 దాడుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు మద్దతుగా వాదిస్తున్న న్యాయ సేవల బృందాల్లో చాలామంది ఆల్క ప్రధాన్‌లానే కోర్టులో హిజాబ్‌లు వేసుకుని కనిపిస్తున్నారు. కొందరైతే చేతులు కూడా కనపడకుండా బుర్ఖాలు వేసుకుంటున్నారు. నిందితులు లేని సమయంలో వీరు ఈ బుర్ఖాలను తొలగిస్తున్నారు.
‘‘మనం హిజాబ్ వేసుకుంటే, వారు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ తేడాను నేను స్పష్టంగా గమనించగలను. అందుకే నేను హిజాబ్ వేసుకుంటా. అది వేసుకోకపోతే, వారు నాతో మాట్లాడరని కాదు. హిజాబ్ తప్పనిసరిగా వేసుకోమని వారు నాకేమీ చెప్పలేదు. అయితే, వారి స్పందనల్లో మాత్రం తేడా ఉంటుంది’’అని ప్రధాన్ అన్నారు.
‘‘వారిని బాగా చూసుకుంటున్నారు..’’
9/11 దాడి నిందితులకు కోర్టులో ఎలాంటి సంకెళ్లూ వేయలేదు. మిగతా వారిలా మాస్కులు వేసుకోవాలని కూడా వారికి సూచించలేదు. వారి సంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు తీసుకొచ్చేందుకు వారి న్యాయ సేవల బృందానికి అనుమతి కూడా ఇచ్చారు. ఒకరైతే పారామిలిటరీ తరహాలో బట్టలు కూడా వేసుకున్నారు.
దాడుల్లో ఒక విభాగానికి నేతృత్వం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్జీ బిన్ అల్ షీభ్ అయితే, ఒసామా బిన్ లాడెన్ తరహాలో ఒక జాకెట్ వేసుకుని కనిపించాడు. ఇదివరకు ఖాలిద్ కూడా ఇలాంటి బట్టల్లో వచ్చాడు.
‘‘వారిని బాగా చూసుకుంటున్నారు. వారిని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది’’అని ఎలిజబెత్ వ్యాఖ్యానించారు.
‘‘వారిని చాలా బాగా చూసుకుంటున్నారు. నిజానికి మాలో చాలా మంది కంటే మెరుగైన వైద్య సదుపాయాలను వారికి అందిస్తున్నారు. ఇదంతా న్యాయ ప్రక్రియల్లో భాగమని తెలుసు. కేసులో తీర్పు వెల్లడించేవరకు మనం వీటిని అంగీకరించక తప్పదు.’’
అయితే, తుది తీర్పు వచ్చేందుకు మరింత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రధాన ట్రయల్స్ మొదలయ్యే తేదీని కూడా ప్రకటించలేదు.
ఇక్కడ న్యాయ ప్రక్రియలను నిందితుల తరఫున న్యాయవాదులు విచారణ సమయంలో ప్రశ్నిస్తూ కనిపించారు. వారేమీ యుద్ధ నేరాలు చేపట్టలేదని, అందుకే ప్రస్తుతమున్న మిలటరీ కోర్టుకు బదులు, సివిల్ కోర్టుల్లో విచారణ చేపట్టాలని సూచించారు.

ఫొటో సోర్స్, Reuters
చిత్రహింసలపై ప్రశ్నలు
నిందితులపై చిత్ర హింసల విషయంలో వస్తున్న ప్రశ్నలు, అధికారులు ఈ విషయంలో పాటిస్తున్న గోప్యత.. కేసు విచారణపై ప్రభావం చూపిస్తున్నాయి. నిందితులను ఏమైనా హింసించారా? అని అంశంపై పెద్దయెత్తన చర్చ కూడా జరుగుతోంది.
‘‘ఒకవేళ నిందులను హింసకు గురిచేస్తే, నిష్పాక్షిక విచారణ అనే మాటే ఉండదు కదా’’అని బలూచ్ తరఫున న్యాయవాది ప్రధాన్ వివరించారు.
‘‘వీరిని ఎక్కడ ఉంచుతున్నారు? వీరితో ఎవరు మాట్లాడుతున్నారు? వీరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? లాంటి అంశాలపై మేం వందల కొద్దీ అభ్యర్థనలు దాఖలుచేశాం. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు’’అని ఆమె అన్నారు.
దాడులు జరిగిన 20ఏళ్ల తర్వాత కూడా, ఇంత నెమ్మదిగా విచారణ కొనసాగడంపై చాలా మంది బాధితుల కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
‘‘నాకు కొన్నిసార్లు చిరాకుగా అనిపిస్తుంది. ఆప్తులను కోల్పోయిన వారు ఈ తీర్పును తమ జీవితంలో చూడలేరేమోనని అనిపించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ, నేను ఆశాభావంతో ఉన్నాను. కేసు ముందుకు వెళ్తోంది’’అని ఎలిజబెత్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









