వైఎస్ షర్మిల: ‘జగన్‌ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - ప్రెస్ రివ్యూ

వైఎస్ జగన్‌తో వైఎస్ షర్మిల (పాత చిత్రం)

ఫొటో సోర్స్, facebook/ysjagan

ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్‌తో వైఎస్ షర్మిల (పాత ఫొటో)

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు ప్రాంతాలను సమానంగా చూశారని ఆయన ఆశయాల కోసం తెలంగాణలో పని చేస్తామని వైఎస్ షర్మిల చెప్పారని ''ఆంధ్రజ్యోతి'' వెల్లడించింది.

''వైఎస్ జగన్‌తో వ్యక్తిగత విభేదాలు లేవు. అక్టోబర్‌లో తెలంగాణలో పాదయాత్ర చేపడతా. ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటాం. కేటీఆర్ ఎవరు అనడం ఎటకారం మాత్రమే అని వైఎస్ షర్మిల తెలిపారు.

ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌... పార్టీగా కాకుండా 'కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ'గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్‌ గారేమో కేసీఆర్‌ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు.

ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం.

కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... రామకృష్ణారెడ్డి అన్న 'సంబంధంలేదు' అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున 'సంబంధం లేదు' అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను.

పాదయాత్రతో సహా. ఏ సంబంధం ఉందని చేశాను? రక్తసంబంధం ఉందని, నా బాధ్యత అనుకుని చేశాను. అలాంటిది ఒక్క మాటలో 'సంబంధం లేదు' అనేశారు. విభేదాలు ఎవరికి ఉండవన్నా! మీరు పది మందిని పిలిచి 'మీ తోబుట్టువులతో విభేదాలున్నాయా' అని అడగండి. పదికి పదిమంది విభేదాలు ఉన్నాయనే చెబుతారు. కానీ విభేదాలున్నాయి కదా అని 'సంబంధాలు లేవు' అనుకోవడం నాకు నచ్చలేదు. బాధేసింది’’ అని షర్మిల చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

పెళ్లైన నెలకే భార్య గొంతుకోసి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అనుమానంతో భార్య మెడ కోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు 'సాక్షి' తెలిపింది.

'' పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్‌ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన నాటి నుంచి భర్త అనుమానాలతో సుధారాణి ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులకు విషయం చెప్పగా బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్‌ సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌ రావాలని కిరణ్‌ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది.

సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్‌ కు వచ్చారు. కాలింగ్‌ బెల్‌ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్‌రూమ్‌ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్‌ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు.

కిరణ్‌కుమార్‌ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిందని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని 'సాక్షి' పేర్కొంది.

పవన్ కళ్యాణ్

ఫొటో సోర్స్, facebook/ShreyasGroup

అది వారి ఆక్రోశం, సినీ పరిశ్రమకు సంబంధం లేదు: ఫిల్మ్ ఛాంబర్

తెలుగు చలనచిత్ర రంగంలో వాడీవేడీ కామెంట్స్.. ఏపీ ప్రభుత్వ మంత్రుల విమర్శల నేపథ్యంలో... వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించినట్లు 'వెలుగు' తెలిపింది.

'' కొందరు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారని, వారి వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.

కొంతమంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారు, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా చూడకూడదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేమని తెలిపారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కొనసాగించాలని కోరుకుంటున్నామని నారాయణదాస్ నారంగ్ స్పష్టం చేసినట్లు'' వెలుగు కథనంలో రాసింది.

getty images

ఫొటో సోర్స్, Getty Images

ఆకాశం నుంచి రాలిపడ్డ స్వర్ణశిల

మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లాలో ఆకాశం నుంచి స్వర్ణశిల రాలిపడినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.

''వశి మండలానికి చెందిన ప్రభు నివతి అనే రైతు దీనికి సాక్ష్యంగా నిలిచాడు. శుక్రవారం ఉదయం నివతి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఈదురు గాలులు మొదలయ్యాయి. వర్షం పడుతుందేమోనని అనుకున్నాడు.

ఇంతలో కొద్దిదూరంలోనే భారీ శబ్దంతో ఓ రాయి పడింది. బంగారపు రంగులో మెరుస్తున్న ఆ రాయిని చూసి నివతి ఆశ్చర్యపోయాడు.

ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ రాయిని పరీక్షల కోసం అధికారులు తీసుకెళ్లారు. గ్రామస్థులు దాన్ని 'స్వర్ణశిల'గా అభివర్ణించినట్లు'' నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)