ఆకాశంలో ఉల్కాపాతం.... నేటి నుంచి గంటకు 100 ఉల్కలు చూడొచ్చు

ఉల్కాపాతం

ఫొటో సోర్స్, Getty Images

దుమ్ము, ధూళి మేఘాల్లోంచి నడవాలని ఎవరూ అనుకోరు.. కానీ, ఒక్కోసారి అలాంటి ధూళి మేఘాలు ఆశ్చర్యపరుస్తాయి.

అవును.. ఈ ఆగస్టు మధ్యలో భూమి అలాంటి విశ్వ ధూళీ మేఘాలలోంచి ప్రయాణిస్తోంది. ఆ ప్రయాణం భూమిపైన జీవులకు కన్నుల పండుగే. ఆకాశం మెరిసిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తుండిపోవచ్చు.

ఈ రాత్రికి ఆకాశంలో ఉల్కా ప్రవాహం చూడొచ్చు. అదృష్టం ఉంటే అగ్ని గోళాలూ మీ కంట పడొచ్చు.

ఉల్కలు

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ పెర్సీడ్స్

తోకచుక్క 'స్విఫ్ట్ టటిల్' సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో దాని కక్ష్యలోంచి భూమి వెళ్తున్నప్పుడు ఈ ఉల్కా ప్రవాహం భూమిపై కనిపిస్తుంది. దీన్నే పెర్సీడ్స్ అంటారు.

''ఏటా భూకక్ష్య, స్విఫ్ట్ టటిల్ కక్ష్య క్రాస్ అవుతుంది.. ఆ సమయంలో తోకచుక్క కక్ష్యలో అనుసరించే ఖగోళ శిథిలాల్లోంచి భూమి వెళ్తుంది'' రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్‌విచ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్లూమర్ చెప్పారు.

జులై చివరి నుంచే ఈ ఉల్కాపాతం కనిపిస్తుంది కానీ ఆగస్టు మధ్యలో మరింత ఎక్కువగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.

ఇది చూడడానికి ప్రత్యేకంగా ఎలాంటి ఉపకరణాలు అవసరం లేదని.. రాత్రి వేళ ఆకాశాన్ని పరిశీలిస్తే సాధారణ కంటికి కూడా కనిపిస్తుందని చెప్పారు.

అదే పనిగా చూస్తుంటే సాధారణ ఉల్కలే కాకుండా భారీ అగ్నిగోళాలు వంటివీ కనిపించే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఉల్కలు

ఫొటో సోర్స్, Getty Images

గంటకు 100 ఉల్కలు

ఈ ఉల్కా ప్రవాహం ఎక్కువగా ఉంటుందని.. పరిశీలనగా చూస్తే గంటకు 100కి పైగా ఉల్కలు కనిపిస్తాయని అన్నారు బ్లూమర్.

ఈ ఉల్కలు గంటకు 2,15,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వస్తాయని.. అయితే, వీటి వల్ల ఎలాంటి హాని ఉండదని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఉల్కా ప్రవాహాన్ని చూడొచ్చని చెప్పారు.

ఉల్కలు

ఫొటో సోర్స్, Getty Images

బాగా కనిపించాలంటే...

ఈ ఉల్కాపాతం మీకు బాగా కనిపించాలంటే ఆకాశం ఎక్కువ భాగం కనిపించే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి వీక్షించండి.

మీరుండే ప్రాంతంలో రాత్రివేళ బయట లైట్లు లేకుండా ఉంటే, ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే ఈ ఉల్కా ప్రవాహాన్ని మరింత బాగా చూడొచ్చని బ్లూమర్ చెప్పారు.

ఆరుబయట ఆకాశాన్ని చూస్తూ చేతిలో మొబైల్ ఫోన్ వెలుగు కూడా లేకుండా చూసుకుంటే ఈ ఉల్కా ప్రవాహాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

భారతదేశంలో...

భారత్‌లో ఈ రోజు రాత్రి నుంచి గురువారం వేకువ జామున వరకు ప్రతి రోజూ రాత్రి పూట ఈ ఉల్కా ప్రవాహాన్ని చూడొచ్చు.

అర్ధరాత్రి తరువాత వీటిని స్పష్టంగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)