భారత్ బంద్: వ్యవసాయ చట్టాలపై వైసీపీ, టీడీపీల ద్వంద్వ వైఖరి.. పార్లమెంటులో అలా.. ఇప్పుడేమో ఇలా..

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గతేడాది సెప్టెంబర్‌లో వ్యవయసాయానికి సంబంధించిన మూడు కొత్త చట్టాలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ బిల్లులపై లోక్‌సభలో కంటే రాజ్యసభలో చర్చ - రచ్చ కూడా జరిగాయి. మొత్తానికి బిల్లులు పాస్ అయ్యాయి. దానిపై దేశవ్యాప్తంగా కొంత చర్చ జరిగినా, పంజాబ్ - హర్యానాల్లో మాత్రం తీవ్ర ఆందోళనలు జరిగాయి.
గతేడాది ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు భారత్ బంద్ జరిపారు.
సోమవారం కూడా భారత్ బంద్ జరుగుతోంది.
రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో, తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన పార్టీలు, టిఆర్ఎస్, వైయస్సార్సీపీ, తెలుగుదేశాలు బంద్’కు ఏదో రూపంలో మద్దతిచ్చాయి. కానీ వాళ్లు ముందు నుంచీ అదే స్టాండ్ లో ఉన్నారా? రాత్రికి రాత్రి మాట మార్చారా?
టీఆర్ఎస్: పార్లమెంటులో వ్యతిరేకించింది
టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ఈ మూడు బిల్లులనూ వ్యతిరేకించింది. రెండు సభల్లోనూ ఆ పార్టీ సభ్యులు ఈ సాగు బిల్లులకు వ్యతరేకంగా మాట్లాడారు. ఇవి రైతులకు నష్టం చేస్తాయని టీఆర్ఎస్ వాదించింది.
అదే విషయాన్ని బంద్‌కి మద్దతు ఇచ్చే క్రమంలో గుర్తు చేశారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు. బంద్‌కి మద్దతిస్తూ, తాము గతంలో ఈ చట్టాలను పార్లమెంటులో కూడా వ్యతిరేకించామని చెప్పారు.
టీఆర్ఎస్ వైఖరి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వైయస్సార్ కాంగ్రెస్: నాడు బిల్లులకు మద్దతు.. నేడు బంద్‌కు మద్దతు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఈ బిల్లులకు మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడారు.
''వైయస్సార్ కాంగ్రెస్ తరఫున ఈ బిల్లుకు మద్దతిస్తున్నాను. గతంలో (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) రైతులను దళారుల దయకు వదిలేశారు. దళారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఈ బిల్లుల్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి’’ అని ఆయన అప్పుడు చెప్పారు.
‘‘రేయింబవళ్లు కష్టపడే రైతులకు సరైన ధర దొరుకుతందా లేదా అనే సమస్య ఉంది. కాంట్రాక్టు ఫార్మింగ్ విధానం వల్ల ముందే నిర్ణయించిన ధర వారికి దక్కుతుంది. రిస్కు కొనేవారికి వెళుతుంది. ఏపీఎంసీ (మార్కెట్ కమిటీలు) ప్రాంతంలోనే అమ్మాలన్న నిబంధన తగ్గుతుంది. పక్క జిల్లాలో కూడా పంట అమ్ముకోలేని విధానాన్ని తప్పిస్తుంది’’ అని రాజ్యసభలో ప్రసంగించినపుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
అలాగే.. ‘‘(ఈ బిల్లుల్లో) కొన్ని సమస్యలు ఉన్నా, సమయాభావం వల్ల మీ దృష్టికి తీసుకురాలేకపోతున్నాను. ఒక ముఖ్యమైన అంశం ఇందులో పొగాకును కలపలేదు. పొగాకును కూడా ఈ బిల్లుల్లో చేర్చాలి'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, @VijayaSaiReddyOfficial
తరువాత రాష్ట్రంలో తమ పార్టీ రైతుల కోసం చేస్తోన్న కార్యక్రమాలు వివరించారు. తమ ప్రభుత్వం, రాష్ట్రంలో, ఆరు పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చిందనీ, ఇదే విధంగా కేంద్రం కూడా ''వీలైనన్ని పంటలను కనీస మద్దతు ధరలో చేర్చాలి'' అని విజయసాయి కేంద్ర మంత్రిని కోరారు.
అంతేకాదు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని సభలో చూపించిన ఆయన, ఆ పార్టీ ఈ బిల్లుల్లోని విధానాలకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టి, ఇప్పుడు (పార్లమెంటులో బిల్లులు వచ్చిన సమయంలో) హిపోక్రసీ ప్రదర్శిస్తోందనీ విమర్శించారు. కాంగ్రెస్ దళారులకు అనుకూల పార్టీయని ఆయన అన్నారు.
ఏ బిల్లులకు అనుకూలంగా వైయస్సార్సీపీ రెండు సభల్లోనూ మాట్లాడిందో, ఇప్పుడు అవే చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతోన్న బందుకు సంఘీభావం ప్రకటించింది.
విజయసాయి ప్రసంగంలో చెప్పిన కనీస మద్దతు ధర అనే మాటను పట్టుకుని, తాము షరతులతో కూడిన మద్దతు ఇచ్చామని కొత్త వివరణ తీసుకువచ్చారు ఆ పార్టీ వ్యవసాయ మంత్రి కన్నబాబు. బంద్‌కి మద్దతు అంటే పార్టీ పరంగా కాదు, గతేడాది ఏకంగా ప్రభుత్వమే స్వయంగా బంద్ ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులూ మధ్యాహ్నం వరకూ ఆపేసింది.
''త్వరలో మద్దతు ధర విషయంలో రైతుల భయాలు పోగొట్టే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చిన వారి మనోభావాలు గౌరవిస్తున్నాం’’ అని కన్నబాబు చెప్పారు.

ఫొటో సోర్స్, @KurasalaKannababu
‘‘ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బంద్ నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు ఒంటి గంట తరువాతే తెరవాలి. ఆర్టీసీ బస్సులూ ఒంటి గంట తరువాతే నడపాలి. విద్యా సంస్థలు మూసివేయాలి. బంద్ శాంతియుతంగా జరగడానికి రైతు సంఘాలు మద్దతివ్వాలి'' అంటూ గతేడాది ఆయన బంద్‌కి మద్దతు ప్రకటించారు.
అంతేకాదు, ఈ విషయంలో టీడీపీ యూటర్న్ తీసుకుందని విమర్శించారు.
''ఇక్కడో విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు పార్లమెంటులో సాగు చట్టాలకు బేషరతు మద్దతిచ్చారు. కానీ వైయస్సార్సీపీ మాత్రం కనీస మద్దతు ధరకు భరోసా ఇవ్వాలనే షరతుపై మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు, కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అప్పుడు మద్దతిచ్చి, ఇప్పుడు కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వడం అంటేనే ఆయన ఎంత దూరం దిగజారారో తెలుస్తోంది. కేంద్ర బిల్లుతో కలెక్టర్లకు ఏం సంబంధం? ఈ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబరులో ఒక్క లేఖ కూడా రాయలేదు. దిల్లీలో ధర్నాలు చేస్తాననీ చెప్పలేదు. ఇదంతా డ్రామా’’ అంటూ విమర్శలు గుప్పించారు.
‘‘ఈ సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకుతుందని ఆశిస్తున్నాం. రైతు బావుంటేనే దేశం బావుంటంది. మాది రైతు అనుకూల ప్రభుత్వం'' అన్నారు కన్నబాబు.
మా మద్దతు బేషరతు కాదని స్పష్టంగా చెప్పాం: వైసీపీ ఎంపీ
''ఈ బిల్లులకు టీడీపీ కూడా మద్దతిచ్చింది. మేము మా సలహాలను స్పష్టంగా చెప్పాం. మా మద్దతు బేషరతు కాదు. నేను చాలా పాయింట్లు చెప్పాను'' అని బీబీసీతో చెప్పారు నరసరావుపేట వైయస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవ రాయలు.
''బిల్లుల్లో కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని కాపాడినట్టే, అదే స్థాయిలో రైతులనూ కాపాడాలి. రైతులకు స్వామినాథన్ కమిటీ ఫార్ములా ప్రకారం రేటు నిర్ధారించాలి. ఎగుమతులే కాకుండా, దేశీయ అవసరాల కోసం ఉత్పత్తులు ఉంచాలి. గుత్తాధిపపత్య ధోరణులను నివారించాలి. కార్పొరేట్లతో రైతులకు గొడవ వస్తే ఆర్డీవో దగ్గరకు వెళ్లాలన్నారు. వారికి ఇప్పటికే చాలా పని ఒత్తిడి ఉంది. వివాదాల పరిష్కారంలో రైతులు నష్టపోకుండా చూడాలి. మార్కెట్ కమిటీలు నిర్వీర్యం అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయలోటును కేంద్ర భర్తీ చేయాలి'' అని లోక్‌సభలో కేంద్రానికి చెప్పినట్టుగా బీబీసీకి వివరించారు కృష్ణదేవరాయలు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
టీడీపీ: మద్దతిస్తున్నామని చెప్పలేదు.. వ్యతిరేకిస్తున్నామనీ చెప్పలేదు
వైయస్సార్సీపీ కంటే టీడీపీ తెలివిగా వ్యవహరించింది. బిల్లుకు మద్దతిస్తున్నాం అని చెప్పి సభలో మాట్లాడారు విజయసాయి. కానీ టీడీపీ ఎంపీ కనకమేడల మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పలేదు. అలాగని వ్యతిరేకిస్తున్నట్టూ చెప్పలేదు. అనేక ప్రశ్నలు ప్రభుత్వం ముందుంచారు. రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఈ బిల్లులపై మాట్లాడారు.
''(ఈ బిల్లుపై) సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. రాష్ట్రాలకు మార్కెట్ ఫీజు చెల్లించక్కర్లేదు. కార్పొరేట్ ప్రమేయం వల్ల కనీస మద్దతు ధర వ్యవస్థ పోతోంది. రైతులు కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. మొత్తం స్టాక్ తీసుకుని కార్పొరేట్లు రైతులను కంట్రోల్ చేస్తారు. దీంతో రైతులకు తక్కువ లాభం, వినియోగదారులు ఎక్కువ ఖర్చు పెట్టాలి’’ అని ఆయన నాడు పేర్కొన్నారు.
‘‘రైతుల రక్షణకు ఏమీ చేయలేదు. రైతుల ఆత్మహత్యలు ఆపాలి. ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఈ అంశాలపై వివరణ ఇవ్వాలి'' అన్నారు కనకమేడల రవీంద్ర కుమార్ తన ప్రసంగంలో.

ఫొటో సోర్స్, Kanakamedala Ravindra Kumar/FB
రైతులకు అనుకూలంగా బిల్లులోని సమస్యలను లేవనెత్తిన ఆయన, తాను బిల్లుకు మద్దతిస్తున్నాను లేదా వ్యతిరేకిస్తున్నాను అనే మాట మాత్రం మాట్లాడకుండా తప్పించుకున్నారు.
గతేడాది జరిగిన దేశవ్యాప్త బంద్ విషయం వచ్చేసరికి టీడీపీ మళ్లీ కొత్త వైఖరి తీసుకుంది. ఈ బంద్‌కు మద్దతిస్తున్నట్టు కానీ, లేదా దూరంగా ఉంటున్నట్టు కానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.
''మేం సంస్కరణలకు వ్యతిరేకం కాదు. మానవతతో కూడిన సంస్కరణలే మా నినాదం. ఈ బిల్లులపై సభలో మేం స్పష్టంగా చెప్పాం. మద్దతు ధరపై నియంత్రణ పోతోంది. రైతును గాలికి వదిలేయకుండా రైతులకు రక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే రైతును ఆదుకుంటుందని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశాం’’ అని టీడీపీ మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు బీబీసీతో పేర్కొన్నారు.
పార్లమెంటులో చెప్పినదానికి కట్టుబడి ఉన్నాం: కాలువ శ్రీనివాసులు
‘‘రాజ్యసభలో విజయసాయి బీజేపీ సభ్యుల కంటే బలంగా ఆ బిల్లుకు మద్దతిచ్చారు. దీనిపై వైయస్సార్సీపీ అసెంబ్లీలో కూడా మిగతా పార్టీలతో చర్చించలేదు. మేం సంస్కరణలకు వ్యతిరేకం కాదు కాబట్టి చట్టాలను వ్యతిరేకించలేదు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులను స్పష్టంగా చెప్పాం. కానీ మా బలం తక్కువ. రైతుల సమస్యలపై మాకు కన్సర్న్ ఉంది. పార్లమెంటులో చెప్పినదానికి మేం వెనక్కుపోవడం లేదు. దానికి కట్టుబడి ఉన్నాం. రైతుల కోసం ముందుకు వెళ్తాం'' అని మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు వివరించారు.
అయితే ఈ బిల్లులపై రెండు సభల్లోనూ ఓటింగ్ జరగలేదు. కేవలం మూజువాణి ఓటుతో బిల్లులు పాస్ అయ్యాయి. ఓటింగ్ జరిగి ఉంటే ఎవరు వ్యతిరేకంగా ఓటు వేశారో, ఎవరు అనుకూలంగా ఓటు వేశారో తేలి ఉండేది. మూజువాణి ఓటు కాబట్టి వారి ప్రసంగాల ఆధారంగా వారి వైఖరి నిర్ణయించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








