వరంగల్: చిన్నపాటి వర్షాలకే ఈ నగరం ఎందుకు ముంపు ప్రమాదంలో పడుతోంది?

ఫొటో సోర్స్, GWMC/TWITTER
- రచయిత, ఎస్.ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం...
భారీ వర్షాలు కురిస్తే వరద భయంతో వణికిపోయేది ఒక్క హైదరాబాద్ నగరమే కాదు. తెలంగాణలో అలాంటి నగరాలు మరికొన్ని ఉన్నాయి. అందులో వరంగల్ ఒకటి.
హన్మకొండ, కాజీపేట, వరంగల్‌లను 'ట్రై సిటీ' గా పిలుస్తారు. గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్దది. ఏడాది కాలంలో రెండు సార్లు వరంగల్ నగరం గతంలో ఎన్నడూ చూడని ముంపు పరిస్థితులను చూసింది.
నాలాలు, డ్రైనేజీలో పారాల్సిన వర్షం నీరు నగరాన్ని ముంచెత్తింది. గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 100 వరకు కాలనీలు ముంపు బారినపడితే , ఈ ఏడాది సెప్టెంబర్లో అదే పరిస్థితి పునరావృతం అయింది.
అనేక ఇళ్లల్లోకి నీరు చేరి ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. సామాగ్రి, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 3 వేల మంది నిరాశ్రయులయ్యారు.
వరంగల్‌ను హైదరాబాద్‌కు 'కౌంటర్ మాగ్నెట్ సిటి'గా భావిస్తారు. మరో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసి, ప్రధాన పట్టణం పై వలసల భారాన్ని తగ్గించడం కౌంటర్ మాగ్నెట్ సిటీల ఉద్దేశ్యం. హైదరాబాద్ తరహాలో అన్ని రకాలుగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్న ప్రాంతం వరంగల్.

ఫొటో సోర్స్, S.Praveen Kumar
నీటి వనరుల నిర్వహణ, ఇంజనీరింగ్‌లో కాకతీయుల నాటి సాంకేతికతను ఇప్పటికీ మెచ్చుకుంటుంటారు. గొలుసు కట్టు చెరువులే దీనికి సాక్ష్యం. తెలంగాణలో చిన్ననీటి పారుదల కోసం చేపట్టిన 'మిషన్ కాకతీయ'కు గొలుసుకట్టు చెరువులే స్పూర్తి.
నీటి నిర్వహణలో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ లో ఇప్పుడు భిన్నపరిస్థితులు ఉన్నాయి. పెద్ద వర్షాలతో ఇక్కడి డ్రైనేజీ, నాలా నిర్వహణల్లో లోపాలు బయట పడుతున్నాయి. ముంపు కాలనీల్లో తరచూ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాల్సి వస్తోంది.
డీఆర్ఎఫ్ (డీసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాల బలోపేతంలో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు రెస్క్యూ బోట్లను సమకూర్చుకోవడం పరిస్థితులకు అద్దం పడుతుంది.

ఫొటో సోర్స్, Twitter/Minister for IT and industries
'అర్బన్ ఫ్లడ్స్'
ఆకస్మికంగా, ఊహకందని స్థాయిలో భారీ వర్షాల రూపంలో వరద నీరు పట్టణ ప్రాంతాలను ముంచెత్తడమే అర్బన్ ఫ్లడ్స్.
తక్కువ సమయంలో ఎక్కువ వర్షం వల్ల, నీరు బయటకు పంపడంలో అక్కడి డ్రైనేజీ వ్యవస్థ విఫలం అవుతుంది. లోతట్టు కాలనీలు, ఇతర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి.
ఇటీవల అనుభవాలను చూస్తే వరంగల్ సైతం అర్బన్ ఫ్లడ్స్ బాధిత నగరాల జాబితాలో చేరిపోయిందన్న అనుమానం కలుగుతుంది.
"గతేడాది మా కాలనీ వర్షానికి మునిగిపోయింది. ఇంట్లోకి నీరు వచ్చి బియ్యం, పప్పులు తడిసిపోయాయి. రూ.50 వేల నష్టం కలిగింది. ఇంట్లో నుండి సురక్షిత ప్రదేశాలకు వెళ్లే క్రమంలో వరదనీరు పెరగడంతో నా భర్త, నేను విడిగా వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది. ఓ సందర్బంలో నా భర్త నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయాడనుకున్నాను. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని మా కాలనీకి వచ్చిన నాయకులు,అధికారులు హామీ ఇచ్చారు. కోట్లల్లో నిధులు వచ్చాయన్నారు కానీ నష్టపరిహారం మాత్రం ఇవ్వలేదు'' అని అమరావతి కాలనీకి చెందిన ఏదులాపురం సుజాత బీబీసీతో చెప్పారు.
"పోయినసారిలాగే ఈసారి కూడా అయ్యింది. అప్పుడూ, ఇప్పుడూ మమ్మల్ని పట్టించుకోలేదు. మారుతుందని అన్నారుగానీ ఏమీ మారలేదు" అని టీవీ టవర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్న తిప్పని నారాయణ అన్నారు. ఆయన రోజు కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నిరుడు ఆగస్టులో వరద ముంచెత్తినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఇక్కడ పర్యటించింది. శాశ్వత వరద నివారణ చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, GWMC/TWITTER
'చెరువులు, కుంటలను ప్రభుత్వమే అమ్మేసింది'
2013 వ సంవత్సరంలో 'ట్రై సిటీ' చుట్టుపక్కల ఉన్న 43 గ్రామాల విలీనంతో 'గ్రేటర్ వరంగల్' ఏర్పాటయ్యింది. గ్రేటర్ పరిధిలో జనాభా సుమారు 15 లక్షలని అంచనా.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (జీడబ్లూఎంసీ) పరిధిలో గత పదేళ్ల కాలంలో ఏర్పడ్డ కొత్త కాలనీలు ఎక్కువగా చెరువులు, కుంటలు, శిఖం భూముల్లో నిర్మాణం అయ్యాయి.
"కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ" (కుడా) ఆధ్వర్యంలో గతంలో కుంటలు, చెరువు భూములను అమ్మారు. ఇలా గతంలో 'మాదిరెడ్డి కుంట, సౌడు చెరువు భూముల్లో లేఅవుట్లు చేసి అమ్మేశారు. వీటికి తోడుగా ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేసినవి, ఆక్రమణలకు గురైనవి ఉన్నాయి.
' 'కుడా' ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఇక్కడ చెరువు శిఖం భూములను అమ్మేసింది. తులసీ బార్ వద్ద ఉన్న నాలా ను మూసివేసారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే నీరు ఎలా పోతుందని కూడా ఆలోచించలేదు. ప్రభుత్వం భూములను అమ్మి వ్యాపారం చేసింది" అని వరద ముంపు ప్రభావిత సమ్మయ్య నగర్ కాలనీకి చెందిన 'తెలంగాణ గిరిజన సంఘం' జిల్లా కార్యదర్శి వీరన్న బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, S.Praveenkumar
ఆక్రమణలే ప్రధాన సమస్య
రెవెన్యూ రికార్డుల ప్రకారం వరంగల్ నగరంలో ఒకప్పుడు చెరువులు, కుంటలు కలిపి 250 వరకు ఉండేవి. వీటిలో చాలా వరకు ఇప్పుడు కనిపించవు. ఉన్నవి కబ్జాలు,ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాంటి వాటిలో బందం, గోపాల్‌పూర్, వడ్డేపల్లి, కోట, చిన్నవడ్డేపల్లి, బెస్తం చెరువులతో పాటు సాకరాశికుంట , పోచమ్మకుంట, బీరన్న కుంట, తుమ్మ కుంటలు ఉన్నాయి.
ప్రస్తుతం మిగిలి ఉన్న చెరువులకు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధారణ ఇంకా జరగకపోవడంతో ఆక్రమణలు కొనసాగుతున్నాయి.
వర్షం, వరద నీరు ప్రవాహానికి వీలుగా గ్రేటర్ వరంగల్ పరిధిలో 15 వరకు ప్రధాన నాలాలు ఉన్నాయి. ఇందులో బొందివాగు, నయూం నగర్, భద్రకాళీ, బంధం చెరువు, పన్నెండు మోరీల నాలాలు ప్రధానమైనవి. ఈ ప్రధాన నాలాలు పొడవు సుమారు 25 కిలోమీటర్లు.
నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరిగాయి. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 45 కాలనీలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు.
బొందివాగు నాలా కింద ఉన్న పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నయూం నగర్ నాలా పొంగి అంబేద్కర్ భవన్ కాలనీ, వికాస్ నగర్, సమ్మయ్య నగర్, నయూంనగర్ లు ఎఫెక్ట్ అవుతున్నాయి.
బంధం చెరువు నాలా కింద ప్రగతినగర్, ప్రశాంత్ నగర్, దర్గా రోడ్, రామకృష్ణ కాలనీలు మునుగుతున్నాయి. నాలాల్లో ఏళ్ల తరబడి పూడికతీత పనులు చేపట్టలేదు.

ఫొటో సోర్స్, BBCS.Praveenkumar
టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు
గత ఏడాది వరంగల్ అర్బన్ కలెక్టర్ ( ప్రస్తుతం హన్మకొండ కలెక్టర్) ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటైంది. నగరంలో వరద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్రత్యేక బృందం పనిచేస్తోంది.
రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ, పోలీస్, రోడ్లు-భవనాలుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బృందంలో సభ్యులు. చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ టీమ్ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించింది.
గతేడాది ముంపు సమయంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు, తీసుకున్న చర్యలపై బీబీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల వివరణ కోరింది.

ఫొటో సోర్స్, GWMC/TWITTER
"శాశ్వత వరద నివారణ పనుల కోసం 250 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొన్ని పనులను చేపట్టాం. కరోనా వల్ల కొన్ని పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. నాలాల పై రిటేయినింగ్ వాల్స్ పూర్తిచేయడంవల్ల గతంతో పోలిస్తే ఈసారి వరద ప్రభావం తక్కువ ఉంది. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధరణ చేసి బౌండరీలను ఏర్పాటు చేస్తాం. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం" అని వరంగల్ (వెస్ట్) ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
"కాకతీయలు గొలుసు కట్టు చెరువులు ఎంత వర్షపాతం నమోదైనా ఎగువ చెరువుల నుండి ప్రవాహం దిగువ చెరువులకు చేరేలా చైన్ సిస్టంగా పని చేసాయి. వరంగల్ అతివేగంగా విస్తరిస్తున్న నగరం. చెరువులు, కుంటలు కబ్జాకు గురై బఫర్ జోన్ లు లేకుండా పోయాయి. వాటిలో కొత్త కాలనీలు వెలిశాయి. నాలాలు కుదించుకుపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. శాశ్వతంగా డ్రైన్ వాటర్ పోయే ఏర్పాట్లు చేస్తాం'' అని వినయ్ భాస్కర్ అన్నారు.

ఫొటో సోర్స్, Minister for IT and industries/TWITTER
నాలాల పై కబ్జాల తొలగింపు పూర్తిస్థాయిలో జరగలేదు. రాజకీయకక్ష సాధింపులు, ఆశ్రిత పక్షపాతం చూపారన్న విమర్శలు ఉన్నాయి.
''నాలాల పై 300 ఆక్రమణలను గుర్తించి వాటిలో 240 తొలగించాం. కోర్ట్ స్టేల వల్ల మరో 60 తొలగించలేకపోయాం. హైకోర్ట్ లో స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా పోరాటం చేస్తున్నాం. క్లియరెన్స్ వచ్చిన వెంటనే మిగిలిన ఆక్రమణలు తొలగిస్తాం'' అని హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బీబీసీ తో అన్నారు.
‘‘శివనగర్,మైసయ్య నగర్ ప్రాంతాల్లో 41 కోట్ల వ్యయంతో డక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వర్షం ముంపు తో ఎక్కువగా ప్రభావితం అవుతున్న సమ్మయ్ నగర్ లో 5 కోట్ల వ్యయంతో రిటేయినింగ్ వాల్స్ నిర్మాణం పూర్తిచేసాం. ఇక్కడ రూ.58 కోట్లతో డక్ట్ నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసాం. వర్షాలు తగ్గాకా ఈ పనులు మొదలుపెడతాం. కబ్జాలు తొలగించాక నాలాల వెంబడి 23 కోట్ల తో ప్రహరీలను నిర్మిస్తాం’’ అని హన్మకొండ కలెక్టర్ వెల్లడించారు. భద్రకాళీ చెరువు కట్ట వెంబడి వర్షం నీరు పోయేందుకు వీలుగా నాలా నిర్మాణం పూర్తికావొస్తుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Minister for IT and industries/TWITTER
పౌర సమాజం,నిపుణుల అభిప్రాయాలు
శాశ్వత వరద నివారణ కు మొక్కుబడిగా కాకుండా శాస్త్రీయంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనులు జరగాలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలంటున్నారు.
''గతంతో పోలిస్తే వాతవరణ మార్పులు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాపాతం తీరుతెన్నులు మారాయి. ఒకే రోజు 20-25 సెంటీమీటర్ల అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీనికి అనుగుణంగా ఆక్రమణలు తొలగించి ,నాలాలు, డ్రైనేజీ లను కలుపుతూ నిర్మాణం చేపట్టాలి'' అని నీటి వనరుల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన వరంగల్ ఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగా రావ్ బీబీసీతో అన్నారు.
''బయటి దేశాల్లో టెక్నాలజీని సిటీ డెవలప్‌మెంట్‌కు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అధ్యయనం చేయాలి. కానీ, ఆధునిక విధానాలు అవలంబించే ఆసక్తి మన మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగానికి లేదు. టౌన్ ప్లానింగ్ విభాగం కేవలం బిల్డింగ్ పర్మీషన్లకు మాత్రమే పరిమితం అవుతోంది'' అని 'ఫోరం ఫర్ బెటర్ వరంగల్' అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- చైనా: రేప్ ఆరోపణలు రావడంతో ‘బిజినెస్ డ్రింకింగ్’ కల్చర్‌ను దుమ్మెత్తిపోసిన సోషల్ మీడియా
- కోవిడ్: 24 కోట్ల వ్యాక్సీన్లు వృథా అయిపోతున్నాయా
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- లఖింపూర్ ఖేరీ ఘటన: కేంద్రం మంత్రి కొడుకుపై హత్యానేరం కేసు పెట్టాలని బాధితుల డిమాండ్
- కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్న నెలలోగా రూ. 50,000 పరిహారాన్ని ఇవ్వాలన్న సుప్రీం కోర్టు
- ఆర్యన్ ఖాన్: బాలీవుడ్లో డ్రగ్స్ కేసులు ఎందుకు అంత త్వరగా బయటపడవు?
- కౌగిలింత అనుభూతి రహస్యాన్ని కనిపెట్టిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








